దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
(చెంచీతను వలచిన కథ, రాణులుపడ్డ బాధ - వారి మధ్య సాగిన చర్చ - వాదం - వినడానికి చాలా సొంపుగా వుంది. ఈ కథ వింటే భక్తి, చదివితే ముక్తి అనుకొనేవారు ఎందరో వున్నారు.)

014. చెంచిత

శ్రీ రమాధిపుడైన శ్రీకృష్ణమూర్తి యా
ద్వారకాపురిలోన నుండగా
ద్వారకాపురిలోన క్షీర నీరధికన్య
మొదలుగా గల యష్ట భార్యలెల్ల
సత్యభామా మొదలు భార్యలెల్లా!
మోదంబుతోనుండ యాదవాంబుధిసోము
డాదరంబున వారి నందరినీ!
చాల సొమ్ములు పెట్టి వేల చీరెలు ఇచ్చి
కేళి లోలుండయ్యు వారలానూ
సంతోషమున వారలానూ!
సంతోషపెట్టంగ సత్యభామా మొదలు
కాంత లెల్లను మదిని గర్వించీ శ్రీ
కాంతునితో మాటలూ చాలించీ!
గర్వించి యుండంగ కంజలోచను డపుడు
కాంతామణుల చూచి కోపామునా వారి
గర్వ మడపా దలచె కోపామునా!!

కృష్ణుడు అంటున్నాడు:
        మీరింత గర్వించ మీకంటె హెచ్చయిన
        వారిజాక్షుల కోరి తెచ్చేనే
        చాలసొమ్ములు చీర లిచ్చేనే!
        మేలైన సంపదలు నిచ్చేనే!!
రాణులు అంటున్నారు:
        మాకంటె హెచ్చయిన వారిజాక్షుల నీవు
        తేలేవు తేలేవు కృష్ణూడా నీవు
        తెస్తేను చూతాము కృష్ణూడా నీవు
        తేవోయి చూతాము నా సామీ!!
కృష్ణుడు అంటున్నాడు:
        చూడండి చూడండి సుదతులారా మీ
        సుందరము చూతాము భామలారా మీ
        సొంపైన చూతాము సుదతలారా!
రాణులు అంటున్నారు:
        మా కంటె సుందరులు లోకమ్ములో లేరు
        లోకేశ నీవెరుగ వటవోయీ
        సర్వేశ నీ వెరుగ వటవోయీ!

ఈరీతి వనితలా వారిజాక్షునితోడ
కోరి వేడుక వాద మాడుచుండ
మీరి సంవాదంబు చేయుచుండ
హరి తోడ సంవాద మాడుచుండ!

వారిజాక్షుం డపుడు వనవిహారము సేయ
కోరి ద్వారక వెడలి మోదామునా
చాల భార్యల తోడి వాదమునా

వేటాడు వేడుకను అడవికి బోగాను
బూటకము లేని మృగముల గాంచి - అట్టి -
వట్టి మృగముల వేట దాటించీ - వాటి -

యంగములు తూటులగ గావించీ
భల్లూకములమేన బల్లెములు నాల్గేసి
కొల్లగానాటించి త్రెళ్ళవైచీ వాటి
మేనెల్ల రక్తాము గ్రమ్మజేసి!

వనజాక్షు డీరీతి వనవిహారము సల్పి
కనె నొక్క పొదలోన కమలముఖినీ
దాని కన్నులా సొగసెల్ల గనె నప్పుడూ!

నెలబోలు నెమ్మోము తళుకైన చెక్కిళ్ళు
కులుకు గుబ్బల చెంచువెలది గాంచీ
దాని వలపుచేతను మేను పులకరించీ
దాని కాంతిచేతను మనము భ్రాంతిచెందీ
చెంచు వేషము బూని పొంచి పొంచీ డాసి
చెంచు మాటల దాన్నీ చేరదీసే
మంచి మాటల దాన్ని మనవిచేసె!

కృష్ణుడు అంటున్నాడు:
        ఎర్రనెల్లాకండ్ల, యేసాల వగలాడి
        నావంక జూడవే చెంచీతా
        మోమెత్తి ననుజూడు చెంచీతా
        మోమాట ముంచవే చెంచీతా!
        పచ్చ నల్లాటిండ్ల, పారుటాకులచీర
        పాపా యేవూరి దానవే
        పణతిరో యేవూరి దానవే
        చెంచితా యేవూరి దానవే
        చేడెరో యేవూరి దానవే!
చెంచిత అంటున్నది:
        ఏవూరు అయితేను, మా జోలి మీకేల
        ఏట కొచ్చీనాము పోవోయీ
        అడవేట కొచ్చీనాము పోవోయీ
        దుప్పేట కొచ్చీనాము పోవోయీ!
కృష్ణుడు అంటున్నాడు:
        ఏటకొచ్చీతేను, ఏమాయె చెంచీత
        మాటలాడితేను కోపామా
        పల్కు పల్కీతేను కోపమా!!
చెంచిత అంటున్నది:
        మాటలు మచ్చికలు మాకేమి సరిపడదు
        మరియేమిరా దగ్గరొచ్చేవు
        మగవాడయేమిరా వచ్చేవు
        అది యేమిరా దగ్గరొచ్చేవు!!
కృష్ణుడు అంటున్నాడు:
        శ్రీకృష్ణమూర్తినే చెంచీతా
        లోకాల కర్తనే చెంచీతా
        రాధ రుక్మిణీకన్న చెంచీతా
        చక్కని దానవని చెంచీతా
        కోరి వచ్చితినేను చెంచీతా
        నీ మక్కువలో పడ్డాను చెంచీతా
        స్త్రీలు లేకను నేను చెంచీతా
        చింతపడిరాలేదు చెంచీతా
        పదియారువేలేమి చెంచీతా
        గోపికాస్త్రీలేమి చెంచీతా
        ఇష్టముగనున్నారు చెంచీతా
        వారితోడనునేను చెంచీతా
        చేరి విహరిస్తాను చెంచీతా
        వాదాడి వస్తినే చెంచీతా
        భేదమెంచాబోకు చెంచీతా
        మ్రొక్కుచెల్లించవే చెంచీతా
        నీపుణ్యముంటుంది చెంచీతా
        నన్ను పెండ్లాడవే చెంచీతా
నన్ను పెండ్లాడమని కృష్ణుడు అడుగగా చెంచీత సమాధానం యిస్తుంది:
        పోవయ్య పోవయ్య కృష్ణుడా
        నీకు పొద్దేల పోదయ్య నాసామీ
        మాయన్న లొచ్చేరు కృష్ణూడా
        అంబులే తెచ్చేరు కృష్ణూడా
        అలుగులే వేసేరు నాసామీ!
అందుకు తిరిగి కృష్ణుడు ఏమంటున్నాడో చూడండి:
        ఏవూరికమ్మారి చేసినాడేభామ
        నీచేతిఅలుగులూ చూచేనే!
        నీచేతి అంబులూ చూచేనే!
చెంచితకు కొంచెం కోపంవచ్చి అంటూంది:
        గూడేముకమ్మరి చేసినాడుర నోరి
        గుండె లిప్పుడు తెగవైతునురా
        నీ కండాలు ఖండించి వైతూనురా
కృష్ణుడు కొంచెం సమాధాన పడుతూన్నాడు:
        గుండెలు వేసిన గుజ్జు చేతులాకు
        కమ్మాల్‌ కడియాల్‌ నిచ్చేనే
        కనకంబు బావిలీ లిచ్చేనే
        మేలైన సొమ్ము లిచ్చేనే
        మేడమీద నిన్ను వుంచేనే
        ఏడు కోట్లా ధనము లిస్తానే
చెంచిత కుటుంబ విషయం తెలియ చెబుతూంది:
        ఏడు గూడెమూలాలో యెన్నంగకొలమైన
        ఎలపోతురెడ్డీ కూతురినీ
        ఏడుగురు అన్నలూ గలదాన్ని
        ఏడుగురు వదినెలు గలదాన్నీ
కృష్ణుడు ఆమాటలకు బంధుత్వం కలుపుతున్నాడు:
        ఎలపోతురెడ్డి కూతురు వైతేను
        నాకు వెతుకనేలా మామగావలెనే
        మేనరికమున్నదే చెంచీతా
        బంధుత్వమున్నదే చెంచీతా
        చుట్టరికమున్నదే చెంచీతా
        కలసి మెలసుందాము చెంచీతా
చెంచిత శాపనార్ధాలు అందుకుంది:
        పాన్పుపై పవళింప కృష్ణూడా!
        నిన్ను పామైన పెరకదా నాసామీ
        నిన్ను తేలైన చెనకదా నాసామీ!
కృష్ణుడు వారిస్తున్నాడు:
        తిట్టకే తిట్టకే చెంచీతా
        నీవు తిట్టిన తిట్టెల్ల చెంచీతా
        అంబులై నాటేను చెంచీతా
        అలుగులై నాటేను చెంచీతా
        తల్లికీ ఒక్కడినే చెంచీతా
        తండ్రికీ ఒక్కడినే చెంచీతా
చెంచిత తిరిగి సమాధానం:
        నీవు పుట్టీనపుడు కృష్ణూడా
        నీకు సందైనకొట్టదా కృష్ణూడా
కృష్ణుడు ప్రాధేయ పూర్వకంగా చెబుతున్నాడు:
        మేనత్త కూతురవె చెంచీతా
        మేనరికమున్నదే చెంచీతా
        నీ పాదాలుపట్టేనే చెంచీతా
        అడవిలో కొచ్చేనే చెంచీతా
        నీకు పనులెల్ల చేసేనె చెంచీతా
        తడవేల చేసేవె చెంచీతా
        నాకు ఎవ్వరు లేరు చెంచీతా
        నీకు పుణ్యము కద్దు చెంచీతా
        ఈ కోనలో మనము చెంచీతా
        ఏకమై యుందాము చెంచీతా
చెంచీత కృష్ణుని సత్తాను నిలదీస్తూంది:
        పెద్ద పెద్ద పాములు పెంజేరి గున్నాలు
        కొండచిలువలు రెండు చూచీతివా
        గండికొచ్చిన జాడ లెరుగూదువా
        అనువులున్నాతావు లెరుగూదువా
        అనుమానముండేది యెరూగుదువా
కృష్ణుడు అందుకూ సిద్ధం అంటున్నాడు:
        పెద్ద పెద్ద పాములూ పెంజేరి గున్నాలు
        కొండ చిలువలు రెండు చూచితినే
        గండికొచ్చిన జాడ లెరుగూదునే
        అనువులున్నాతావు లెరుగూదునే
        అనుమాన మున్నది ఎరుగుదూనే
చెంచిత - అయితే ఈ పనో అంటూంది:
        నిమ్మలా గిరిమీద నమ్మగా తిరిగేటి
        కొమ్ములా గురుపోతు నేసేవా
        ఏదు పందుల నేయ నేరూతువా
        అడవి దుప్పుల నేయ నేరూతువా
        పుట్ట తేనెలుపట్ట నేరూతువా
ఆ పనులూ నేరుస్తానంటున్నాడు శ్రీకృష్ణుడు:
        నిమ్మాల గిరిమీద నమ్మాక తిరిగేటి
        కొమ్ములా గురుపోతు నే నేసేనే
        ఏదుపందుల నేయ నేరూతునే
        అడవి దుప్పుల నేయ నేరూతునే
        పుట్ట తేనెలపట్ట నేరూతునే
చెంచిత మరో ప్రశ్నకు దిగింది:
        గోరు నొవ్వాకుండా గొడ్డటేరీమీద
        జీడి పప్పుల సేయ నేరూతువా
        ఇప్ప పువ్వూ లేర నేరూతువా
        టెంకె పువ్వూలు చేయ నేరూతువా
        మల్లె పువ్వూలేర నేరూతువా
కృష్ణుడు సరేనంటున్నాడు:
        గోరు నొవ్వాకుండ గొడ్డటేరీమీద
        జీడి పప్పులు సేయ నేరూతునే
        టెంకె పువ్వులు సేయ నేరూతునే
        మల్లె పువ్వూ లేర నేరూతునే
చెంచిత మరో ప్రశ్న వేసింది:
        ఏటు తగిలీ మృగము ఎలమీద పోవంగ
        ఎదురు కోలా దొడిగి యేసేవా
        మారుకోలా దొడిగి యేసేవా
        మళ్ళి తిరిగీ మమ్ము కలిసేవా
        మాపటికి మాయింటి కొచ్చేవా
కృష్ణుడు అందుకూ ఏదో అనాలిగా మరి:
        ఏటు తగిలీ మృగము ఎలమీద పోవంగ
        ఎదురు కోలా దొడిగి యేసేనే
        మారు కోలా దొడిగి యేసేనే
        మళ్ళి తిరిగి నన్ను కలిసేనే
        మాపటికి మీయింటి కొచ్చేనే
చెంచిత మరో ప్రశ్న వేసింది:
        అడుగు దప్పాకుండా అంగు దప్పాకుండా
        అచ్యుత వరహా లిచ్చేవా
అందుకూ సరే నంటున్నాడు:
        అడుగు తప్పాకుండా అంగు తప్పాకుండ
        అడిగే వరహా లిచ్చేనే
చెంచిత మరో కొత్త ప్రశ్న వేస్తుంది:
        జోరునావానాలు బోరునా కురియంగ
        జారు బండాలెక్క నేరూతువా
        జరుగు బండాలెక్క నేరూతువా
కృష్ణుడు అందుకూ సరిపెట్టాడు:
        జోరునా వానాలు బోరునా కురియంగ
        జారు బండా లెక్క నేరూతునే
        జరుగు బందా లెక్క నేరూతునే
చెంచిత అన్నలు వచ్చారని, దాగమంటుంది:
        మాయన్న లొచ్చేరు కృష్ణూడా
        గోరింట పొదలోకి కృష్ణూడా
        పరుగుపరుగున వెళ్ళు కృష్ణూడా!
కృష్ణుడికి ఒంటరిగా పోవటానికి ఇష్టంలేదు:
        గోరింట పొదలోకి చెంచీత! నాకు
        పోను భయమేస్తుంది చెంచీతా
        నీవురా పోదాము చెంచీతా
        మన మిద్ద రుందాము చెంచీతా
చెంచితకు హడావిడి ఎక్కువైంది:
        వాదేల ఆడేవు కృష్ణూడా
        నేను వచ్చెదనయ్య నాసామీ
        నిన్ను గూడెదనయ్య నాసామీ
        మా యన్న లొచ్చేరు కృష్ణూడా
        నిన్ను కోపించేరు నాసామీ
        నిన్ను దండించేరు నాసామీ
కృష్ణుడు భయం లేదంటున్నాడు:
        వస్తేను బాగౌను చెంచీతా
        బంటు పంతముచెల్లు చెంచీతా
        నా భార్య మీడేరు చెంచీతా
చెంచిత లొంగుబాటుకు వచ్చింది:
        నీమీద మోహంబు కృష్ణుడా
        నేను పట్టలేకున్నాను కృష్ణుడా
        నేను తాళలేకున్నాను నాసామీ
        వట్టి మాటలచేత కృష్ణుడా
        ఇంతవాదాయె పోదాము నాసామి!
కృష్ణుడు దారి చూపుతున్నాడు:
        గరుడ వాహనమెక్కి చెంచీతా
        మనము గడియలో పోదాము చెంచీతా
        ద్వారకాపురిలోన చెంచీతా
        నిన్ను పెండ్లాడుదును చెంచీతా!

ఈరీతి కృష్ణుండు కోరి చెంచిత మనసు
నీరుగా కరగించి నేర్పుమీర
ద్వారకా పురిచేరి కూర్మితోడ
దీనజనులను బ్రోచు దానవాంతకు డొక్క
శుభదినంబున మహా విభవంబుగాను
చెంచితను పెండ్లాడి, మించు తనభామలను
వంచించు నా సతిని గొంచు జనెనంతన్‌
సత్యభామా మొదలు సవతులెల్లరు చెంచు
సతిజాడ వెరగందె సరసాముగా
సఖియలూ కోపించె విరసాముగా

రాణులు చెంచితను వెక్కిరించటం మొదలు:
        పులుల దుప్పుల వెంట పొలములో తిరిగేటి
        పొలతుకా మాతోడ సరియౌదువే
        ఓసి చెంచీత మాతోడ సరియౌదువే
        చేడెరో మాతోడ సరియౌదువే!
రుక్మిణి అందుకుంది - ఎలా సహిస్తుంది:
        తల్లిదండ్రుల మాట తలమీరి అన్నాకు
        తలవంపులు సేయ దగువాటవే!
చెంచిత అందుకు యిలా అంటూంది:
        పనిబూని మగనీని బతిమాలి గతిమాలి
        పిలిపించుకోలేదు రుక్మిణి
        అన్న తలవంపు సేయనే రుక్మిణి!
సత్యభామ అందుకుంది:
        చెంచీత నీ కింత వంచాన మాటలు
        మించ నాడేవేమె వేమారూ
        గర్వించి పల్కేదేమే పలుమారూ?
చెంచిత దెప్పుతూంది:
        చంచలాక్ష్మి పారిజాతామూకై మగని
        వంచనా చేసీన దెరుగానటే
రాణులు ఇద్దరూ కదిలారు:
        చాలించు మాటలు ప్రేలబోకే యింక
        ఆలించీ వినియేడి దెరుగావటే
        తగులుకో వచ్చినా దానావు మాతోడ
        తగు నాటె పంతాము లాడా నౌనే
        యింత తెంపూన మాటలు ఆడగానౌనే!
చెంచిత సమాధానం:
        వగలాడీ మదికిష్టమగు పురుషులు
        తన్ను వలచీ వచ్చిన గూడరాదటవే!
సత్యభామ గరవం ఏమంటున్నదో వినండి:
        రోసామున ఎన్ని వేసాము లేసినా
        నా సాటి వౌదువే చెంచుభామా!
చెంచిత ప్రత్యుత్తరం:
        వేషమంత నీదే సత్యభామా
        విర్రవీగి నిందించాకే మేలుకాదే!
        అనుచు వాదూలాడ, అతివలందరి గాంచి
        వనజాక్షుడు వాదు వారించీ
        చనువునా సఖ్యతా నొనరించీ
        చెంచీతను గూడి నగరు ప్రవేశించె!

వేమారు ఈ కథ ప్రేమతో చదివీన
కామితార్థములెల్లా నిచ్చేనే
కడు భక్తి వినువారి బ్రోచేనే
ఘనమైన సంపద లిచ్చేనే!
AndhraBharati AMdhra bhArati - cheMchita - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )