దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
(మనపాత ఆటలను ఈనాడు మరచిపోయాము. కాని ఆ ఆటలను పాటల్లో గింగురుమనిపించి వినిపించే ఈపాటల్లాంటి ఆటలు వేవేలు)

018. దాగుడు మూత

అంబుజాక్షి వేగరావె
అతివ జానకీ
కంబుకంఠి పిలచినంత
కనులు మూయనూ
సీత రావె శ్రీరాముల
దేవి రాగదే
రమణి రావె రాముని
రాజ్యి రత్నమా
భూమిలో ఉద్భవించిన
పుణ్యవతి నీవు రాగదే
చక్రవర్తి పుత్రివనుచు
జనకునింట పెరిగినట్టి
మహలక్ష్మి నీవురావె
అనుచు శాంత పిలువగానె
వినుచు జానకీ
సీత కదిలి వచ్చె
ముత్యాల చవికెకు
మాళవి ఊర్మిళాది
మగువ జానకీ
శతకీర్తిని తోడి తెచ్చిరి
చేలులు వేగమూ
అనుచు శాంత పలుకగా
వినుచు చెలులూ
వారు ముగ్గురొచ్చి
వదిన చాటు నిల్చిరి
దాగుడు మూతలిడుదాము
తరుణి యనుచును
తల్లి యవరయనకు
కనులు మూయనెవ్వరు
ఓడిపోతె ధనము
తెచ్చి యియ్యనెవ్వరె
అనుచు శాంత పలుకగా
వినుచు జానకి
ఓడిపోతే వదినమేము
వద్దనుందుమూ
చెలియరో నీవు
జాకుతనమున
యిట్టిమాటలాడు
మూతలెట్లు గెలుతురు
సీతకనులు తానుమూసె
ఏడుమూతలు
చెలియలు శాంతకూడి
ఆడుచుండగా
రామచంద్రుడూ వచ్చి
రత్నాల చవికెకు
ఆటలాలించి లేచిరి
అతివలందరూ
చెదిరి చెదిరి పరుగు
లెత్తిరి శాంతచాటునకు
ఇచట రామచంద్ర
నీకు ఏమి పనులురా
తరుణి విడిచి నిముషమైన
తాళవేమిరా
అక్క నీ మరదళ్ళు
ఆడుచుండంగా
ఎక్కువైన ముద్దుచేత
చూడవస్తినే
అనుచు రామచంద్రుడు
పలుక అతివలప్పుడూ
తమకు సిగ్గుచేత
తలలు వాల్చుకొనిరి
చేడెలపుడు సిగ్గుపడగ
శాంత చూచియా
కాంతలను కనకంపు
మేడలకంపెనూ
రార రామచంద్రనీవు
రత్నాల చవికకూ
రంగమీరగాను
తరుణితోటి ఆడరా
సీతకు రామునికి
ఆడులిచ్చి యా
సతియు పతిని ఆడుమనుచూ
సఖియ నవ్వెనూ
రాముడు జానకి
ఆట చూచియు
కనుసౌజ్ఞ చేసి
పిలచె కమలాక్షిని.
AndhraBharati AMdhra bhArati - daaguDu muuta - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )