దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
(ఎంత ఆశవుందో - కోడి వండి పెడతానని, మాపటికి రమ్మనమంటూంటే - అది వద్దుట - కూతురు కావాలట)

021. గొబ్బియలో

(ప్రతి పాదం చివరనూ గొబ్బియ్యలో అని పాడుకోవాలి)

పెద్దది అక్కెమ్మ పెద్దబాల చుట్టు
పెద్దది అక్కెమ్మ నీళ్ళకుపోయె
ఎంచాక ఏడుమెట్లు ఎంత చక్కగా దిగె
చుట్టుప్రక్కాల చూచె యెవ్వరూ లేరు
గరగరన కడవ కడిగె, బుడబుడన ముంచె
కట్టమీద పోయేటి గిరిగట్ల రాజు
కడవ ఆటయెత్తుము రావయ్య రాజు
ఎత్తితే ఎత్తాను పేరేటు చెప్పు
పేరేమొ చెప్తాను పేదోళ్ల పిల్ల
పేదోళ్ల పిల్లైతె పేరు లేదేమి
నాపేరు ముత్యము కడవపేరు రత్నము
కడవెత్తుకొని అక్కెమ్మ నడిదోవకొచ్చె
తూరుపునుండి కాకమ్మ కావు కావునవచ్చె
కావున కొట్టుకొని కమ్మనేలవేసె
కమ్మనెత్తి అక్కెమ్మ కుచ్చిళ్ళ చెక్కె
బెమ్మయ్య బెమ్మయ్య ఓరి బెమ్మయ్య
కమ్మట్ల చదువురా ఓరి బెమ్మయ్య
దానేమి చదివేది అన్నికాదు అక్కి
కానుగులు పుట్నిల్లు అర్థమాయె నంటి
కానుగల పుట్నిల్లు హతమాయె నంట
మీ అమ్మ మీ అబ్బ చెల్లిపోయిరంట
చిన్నతోడబుట్టు కాలమాయెనంట
అట్లన్న అక్కమ్మ ఇంటికి వచ్చె
ఓ మామ ఓ మామ నను గన్న తండ్రి
కానుగులు పుట్టిల్లు హతమాయె నంట
మా అమ్మ మా అబ్బ చెల్లిపోయిరంట
అదేమొ కోడలా మీ అత్తనడుగు
అత్తమ్మ అత్తమ్మ ననుగన్నతల్లి
కానుగలు పుట్టిల్లు హతమాయె నంట
మా చిన్న తోడబుట్టు కాలమాయె నంట
అదేమొ కోడలా మీ మామనడుగు
చెరకు తోటలో సోగెల్ల నమిలె
వేటగాడు వస్తాడు వెళ్ళిరావె నెమిలి
వేటగాడు ఎవడమ్మ సన్యాసి వాడు
కట్టేయి సీతమ్మ కడప కంబానికి
పాలుపిండీ సీతమ్మ బళ్లదుత్తాకు
వేటు వేయరా శీనన్న ఏటు చూతాము
వేస్తాను సీతమ్మ ఏమి పందాము
మాపటికి రావన్న కోడి వండిపెడ్త
కూడొద్దు చెల్లమ్మ కూతురు కావాల.
AndhraBharati AMdhra bhArati - gobbiyaloo - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )