దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
(శ్రీకృష్ణుడు - అవతారమూర్తి! అని మన పురాణాలు నమ్మమని నాటినుంచి నేటిదాకా చెబుతున్న పాతవిషయం! గోపికల చీరలు దొంగిలించడం - వెన్న దొంగతనంగా ఆరగించడం - (ఈరోజు చేస్తే జబ్బలు విరగదీసి తన్నేవారేమో) కృష్ణపరమాత్మ లీలలు అని పాడుకుంటూ నమ్ముతూన్నాం - ఆ అల్లరిపనుల జాబితాలోని మరో పిర్యాదుకు నిదర్శనం లాంటిది యీ పాట)

022. కృష్ణ లీలలు

ఓ యశోదా ఏమి చెప్పుదుమే
నీ కొడూకు దుడుకూలు ...

నిన్నా సంధ్యావేళనూ మా
చిన్నారి జలకామూలాడా
వన్నేలాడూ చీరాలెత్తుకు
వెళ్లే గాదమ్మా
అయ్యయ్యో యీ యన్యాయమూ
ఎన్నాడూ మేమెరుగామైతిమి
పిలిచీ నీతో చెప్పాబోతే
వన్నేలెన్నో బలుకూచుంటివి ...

పల్లవా పాణులూ గూడి
చల్లాలమ్మా బోగా చూచి, వా
రిల్లూ చేరీ కొల్లా బుచ్చీ
వెళ్ళే గాదమ్మా
అయ్యయ్యో యీ యన్యాయమూ
ఎన్నడూ మేమెరుగామైతిమి
పిలిచీ నీతోచెప్పాబోతే
మా కృష్ణుడేమీ ఎరుగాడంటివి ...

యిట్లాగైతే కాపూరంబూ
ఎట్లాగూ వేగింతూమమ్మా
పట్టీనీ దండింపరాదా
పాపామేమమ్మా
వట్టీమాటా కాదమ్మా మా
చట్టీలోనీ వెన్నా చేతా
పట్టీ నేలనూ కొట్టీనాడూ
దుష్టూడై పరుగెత్తీనాడూ ...

అర్ధరాత్రి వేళానూ మా
మిద్దేలోకీ దూకీనాడూ
అడ్డుగోడా దిగీవచ్చి
బెదరించేనూ
దద్దరిలి వా రిద్దరూనూ
పట్టీమంచం వదలీ రాగా
యిద్దర్నీ పట్టుకు కృష్ణుడు
గుద్దీ గుద్దీ వెళ్ళీనాడు ...
AndhraBharati AMdhra bhArati - kR^iShNa liilalu - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )