దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
(తెలుగువారికి ఎన్నో ఆచారాలు - సంప్రదాయాలు - నమ్మకాలు - అనుమాయతలు వున్నాయి. చంటిపిల్లలకు భోగిపళ్ళు అని అందరినీ పిలచి చేయడం జరుగుతూంటుంది. పిల్లలకు 'పీడ', 'దిష్టి' వుండకుండా ఆ భోగిపళ్ళకు సంబంధించిన పాట యిది)

025. భోగిపళ్ళు ???? ( + గొబ్బిపాట)

శశిముఖులార రారే మా
పసిబాలులకు భోగిపళ్ళు పోయుదామూ
అద్దంపు చెక్కిళ్ళు ముద్దులొల్కూ చుండె
దిద్దిన కస్తూరి తిలకా మింపైయుండె
మంగళకారులు మదనా సుందరులు
రంగూగ పీటపై రాణింపుచున్నారు
బంగరువంటి మేలీ బదరి ఫలమూ లుంచి
రంగైన వరహాలు రవలు కెంపులు చేర్చి
మూడేసి దోసిళ్ళు మురియుచు శిరమూపై
వేడుకతో పోయుదము
నేడూ మన బాలులకు
వెంకట శివగురు కింకర వరదుడు
శంకలేకా మాశిశువూల కాపాడు
ఓ సుబ్బి గొబ్బెమ్మ ఓంకార రూపిణి
నీకు వందన మంచు నే మ్రొక్కెదా
లోకపావని నీవు లోలాక్షి వినవమ్మా
ముందూగ నీకు వందన మంటినమ్మా
యింటింటికి నీవు యిలవేల్పు వైతివి
యిహ పరంబుల జూపి బ్రోచీతివి
గోమాతకున్‌ మ్రొక్కి గోమయం దెచ్చీయో
గొబ్బెమ్మ యని నిన్నూ పూజింతు రమ్మా
పణతులందరు గూడి పసుపుకుంకుమదెచ్చి
పువ్వు ఫలములతో అర్పించిరీ
చేడెలందరు గూడి చేమంతులు దెచ్చీ
చేతులారా నిన్నూ పూజింతు రమ్మా
పాడి పంటలనిచ్చి భాగ్యరాసులనిచ్చి
బాలలతో వర్థిల్ల జేయుమమ్మా
ఆశ్రయించి నట్లే అబలలన్‌ దీవించి
ఆనంద మొందింప జేయుమా తల్లి
మగువ లందరుగూడి మంగళములుబాడి
ప్రార్థించి నిను వేడుచుందు రమ్మా
కన్యలందరి ఎడ కడుప్రేమ జూపించి
కాపాడుమో యమ్మ గౌరీశురాణీ!
AndhraBharati AMdhra bhArati - bhoogipaLLu ???? ( + gobbipaaTa) - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )