దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
(అర్జునుడు - సుభద్రను అవి తేలేదు; యివి తేలేదు అని - నిలతీస్తున్నాడు - ఆడదైతే అన్నీ తేవాలనే హక్కుకు భాష్యకారులు ఎవరు!)

031. సుభద్రార్జునుల సంవాదం

పున్నెంబు నాడైన
బూరాలందుకొనీ
పుణ్యుడా రమ్మనీ
పిలచిర మీవాళ్ళూ.

అమావాశ్యానాడైనా
అట్లూ ఒండుకొనీ
అల్లుడా రమ్మనీ
పిలచిరా నీవాళ్ళూ.

మావాళ్ళూ పేదవాళ్ళు
మాకేమి కలదూ
పెట్టాగల పెద్దంట
పెళ్ళాడితాను.

అచ్చటలు ముచ్చటలూ
అన్నీ మాతేరూ.

అనగా విని పార్థుండు
అతికోపమునను
ఎడమా మీసం దువ్వి
పాంకోడుతో తన్నే
పాంకోడుతో తన్నే
పరమా పార్థుండూ.

మువ్వలా ముదృడ్ని
చంకా పెట్టుకొనీ
పున్నామా చంద్రుడ్నీ
వెంటా పెట్టుకొనీ
వెళ్ళేనే సుభద్ర
అన్నావాడలకూ.

ఏనుగులూ వుండగ
గుర్రా లుండగా
పల్లకీ లుండగా
బానిస లుండగా
కాలీనడకను రాను
కారణం బేమే?

అన్నారో వింటీవా
అన్నారో నీవూ?
ఎన్నీమాటలు నేను
పడతానావస్తీ.

పున్నెంబునాడైన
బూరాలందుకొనీ
పుణ్యుడా రమ్మనీ
పిలచిర మీవాళ్ళూ
అమావాశ్యనాడైనా
అట్లూ ఒండుకొనీ
అల్లుడా రమ్మనీ
పిలచిర మీవాళ్ళూ.

అటకమీదా వున్నాయి
అంచూ బిందెల్లూ
ఇదుగోనే చెల్లెమ్మా
నీకూ హరణమ్ము.

మందాలో వున్నాయీ
పాడి ఆవుల్లూ
ఇదిగోనే చెల్లెలా
నీకూ హరణమ్ము.

పసుపుకుంకుమ నీకూ
పళ్ళాలా పోస్తీ
ఇదిగోనే చెల్లెలా
నీకూ హరణమ్ము.

గౌరవమ్మున నీవూ
కలసీ మెలసుండూ
పార్థూనీ మాటాకూ
జవదాటకమ్మా.
AndhraBharati AMdhra bhArati - subhadraarjunula saMvaadaM - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )