దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
(లక్ష్మీ- నరసింహస్వాముల మధ్య సాగే సంవాదం)

032. లక్ష్మీ -నరసింహస్వామి సంవాదం

తరుణీ నేనూ రాగాజూచీ
తలుపులూ మూసున్నావిధమూ
అరదుగా నీ మదికీ తోచేనా?
ఓ లక్ష్మీదేవీ
అతివ నీకూ అలుకా ఏలానే?

గాయకుడా నీవాగాలూ
కానావచ్చే నీతీలాలలూ నేడు
మాయసుద్దూ లెన్నా డేవోయీ
ఓ నారసింహా
మమ్మురవ్వలేలా చేశావు?

దుష్టా విగ్యాహామూతోనూ
దోరూకోనీ వేటాడితే
దుష్టనిగ్రాహమే ఆయెనే
ఓ లక్ష్మీదేవీ

సృష్టిపాలింపగనే వస్తీనే
వేటాబోయేననుచు పోయి
నీటుమీరా నీవందూయే
బోటూలాకూడకూ వస్తినీ
ఓ నారసింహా
బొంకులూ నాతోడి బొంకేవూ

కామూకో నీరాజువేటా
లాడేబో యే నాచోటానే
భామాముఖము నేనెరుగానే
ఓ లక్ష్మీదేవి
పడగ వేటాలాడేవస్తీ నే

పొద్దూరెండూ జాములాయే
నిద్రపోయేటి వేళాలో
సద్దూచేయా వచ్చీనావూరా
ఓనారసింహా
బుద్దులెట్లూ నీకూతోచెరా

కోమాలాంగీ శ్రీ గరుడాద్రీ
శ్రీ నారసింహుండనే నేనూ
కోరినిన్నూ కూడా వస్తీనే
ఓ లక్ష్మీదేవీ
చేరనిచ్చి తలుపూ తియ్యావే

అందామలరా నీ వెందెందూ
ఏ సుందరుల నెరుగా ననుచూ
గంధమేలా కలిగేరాజాణా
ఓ నారసింహా
కల్కి ఎవతో నీకూపూసేరా

తప్పాడ పొదలాలోనూ
తరచూ వేటలాడాబోతే
పుప్పొడే నామీదారాలేనే
ఓ లక్ష్మీదేవీ
పూసినట్లే గంధమాయెనే

సద్దూలు పల్కేవు చాలా
పరమాత్మపైయింగారూచాలు
వాసంతమేలా కలిగేరాజాణా
ఓ నారసింహా
వనితయెవతో నీకే పూసేరా

పూచినాముదూలా తరులా
పూలసరులా శృంగారములూ
చూసివస్తామనుచూ పోతేనే
ఓ లక్ష్మీదేవీ
సొంపొతేటే రసమూ చిందేనే

ప్రాకటముగా చెంచూవనితా
భామాకూడీనా వాకిటా
నాకు దత్తామియ్యారా స్వామీ
ఓ నారసింహా
వాకిలీ నే తీసేను గానీ

తరుణీ నేనూ శ్రీరూపము
దాల్చియున్నావాడినికనుకా
అరదుగా నీమదికే తోచేనే
ఓ లక్ష్మీదేవీ
అతివనీవూ అలుకామానావే

పద్దూలుపల్కేవూ చాలా
పరమాత్మా మీ వద్దనున్నా
ముద్దుగుమ్మ ఎవతే రా జాణా
ఓ నారసింహా
మొరసి మొరసి నిన్నేచూసేరా

సన్నుతాంగీ నీవిప్పుడూ
సఖియలా గుర్తెరుగా ననచు
నిన్ను ముట్టి భాషాచేసేనా
ఓ లక్ష్మీదేవీ
నీమమతాలీ నేనెరుగానే

వాసుదేవా మీరూ నాతో
భాషాలూ చేసేదానంటే
వాసువాదులెల్లా నమ్మరూ
ఓనారసింహా
దాసులైనావారూ నవ్వేరూ

భాసురామ రామాగుణమా
భాషాలూ చేసెదా మంటే
వారు మమ్మెందుకు నమ్మరే
ఓ లక్ష్మీదేవీ
వారు మమ్మెందుకు నమ్మరే

కంజనాభా మీరూ నాతో
ఘమకించీ మాటాలాడేరూ
ముంజేతి కంకణమే మెరసేరా
ఓ నారసింహా
మరచిచూడా అద్దమేలరా

గజరాజసింహములా నేనూ
ఘనమూగనే వేటాడితే
సురలు నాకు మురియూచూనిపుడు
ఓ లక్ష్మీదేవి
సొంపుతో కంకణముకట్టారే

సారసాక్షా నీవందూయా
సఖియానీ గూడీయుండాకా
సన్నిధికే ఎలావస్తీరా
ఓ నారసింహా
సరసమూ నీతో ఏలరా?

అండాజాగమన నా
దండీతప్పూలాకూ ఒక్క
దండము నీకూ నే పెట్టేనే
ఓ లక్ష్మీదేవి
దండమూ నేరామూ మమ్మేలూ

చిత్తాజాజాణా చెన్నూమీరగా నీ
నిత్య కొత్తపెళ్లికొడుకై వుండరా
ఓ నారసింహా
కోరిపుత్రులనూ ఎత్తారా.
AndhraBharati AMdhra bhArati - laxmii -narasiMhasvaami saMvaadaM - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )