దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
(ఇది చదువుతూంటే ఆ ప్రాంతంలో జరిగి - పాట ప్రచారమైన గాథగా కనిపిస్తూంది)

033. గొబ్బిపాటలు

(ప్రతి పాదం చివరనూ గొబ్బియాలో అని పాడుకోవాలి)

        సిక్కురుడూ వాడిపేరు
        బహు సొగసైనవాడే
        పల్లెబోయి సిక్కురుడు
        వెంబడే దావచ్చె
సిక్కురుడు:
        తలంటవే తల్లి
        తలమాసెనే తల్లి
తల్లి:
        నిన్ననే తలలంటి
        నీళ్ళు బోస్తిమి కొడకా
        మళ్ళి నీళ్ళు ఏమి కొడకా
సిక్కురుడు:
        పందిట్లో వున్నవి
        పగడాల రాశులు
        పందిట్లో వున్నవి
        వజ్రాల రాశులూ
        పగడాల రాసులూ
        పట్టి కొలువంగా
        పయి మాసెనే తల్లీ
        ఎండీ తపలాతో
        వేన్నీళ్ళూ కాసింది
        పగడాల కలపతో
        మంటాలు బెట్టింది
        చీకాయ పొడి వేసి
        ఊటనూ కలిపిందీ
        కూసోని పోసుకుంటే
        గుమ్మళ్ళు బారిందీ
        ఊరు తిరిగీ పారీ
        ఉలవచేను పారిందీ
        తలనిండా తలంబ్రాలు
        వలేసి ఒళ్ళు నిండా
        వస్త్రాలు తొడిగిందీ
        వేలేసి ఏల్నిండ
        ఉంగరాలూ తొడిగిందీ
        తలేసి తల్నిండ
        పాగాలే జుట్టింది
        కూడు దీని సిక్కురుడు
        అక్కగారూరికీ
        పయనమైపోయినాడు
        పండున్న పరిగ చేనిలో
        పామడ్డమాయే
        కదిలెరా సిక్కురుడు
        కాలెట్టి దాటినాడు
        పోయెనో సిక్కురుడు
        అక్కవాడలకూ
        అక్కగారు చూచి
        మదిని మురిసింది
అక్క:
        నాకూతురో చంద్రమ్మ
        నీళ్ళియ్య రమ్మా!
సిక్కురుడు:
        అక్కయ్యో ఓ అక్క
        ఆకలవుతుందే!
అక్క:
        కూతురో చంద్రమ్మ
        కూడు బెట్టవమ్మ!
సిక్కురుడు:
        అక్కయ్యో ఓ అక్క
        నిద్దరొస్తుందే!
అక్క:
        కూతురో చంద్రమ్మ
        మంచమొంచమ్మా

        మామనూ చూడగా
        మంచమొంచాబోతే
        చీరచెరగూ పట్టినాడే!

చంద్రమ్మ:
        ఇడువరా అన్న విడువరా
        ధర్మమెరుగక నీవు
        విడిచేది లేదా?
        తల్లిదండ్రీ వుండగా
        నా చెరుగు లాగావే
        ధర్మమా మావా
        నా చెరుగు విడిచిపెట్టు
        తీరిగ్గ మల్లొస్త మావా!
సిక్కురుడు:
        నా మీద వొట్టెట్టి
        చెరగు విడిచాను
        మాట తప్పకే పిల్లా!
అక్క:
        నా ముద్దు కూతురికీ
        ఎవరేమి సేసిరీ?
చంద్రమ్మ:
        మాయమ్మ తమ్ముడట
        మా మేనమామ
        మంచమొంచాబోతే
        మలి చెరుగు బట్టాడే!
అక్క:
        ధర్మమెరుగము
        నీవు సెప్పొద్దు కొడకా
        నీ అన్నగారితో నీవు
        సెప్పొద్దు కొడకా!
తండ్రి:
        అన్నతో ఏమాట
        సెప్పొద్దు కొడకా!
అన్నయ్య:
        నీమింద అంతటీ
        అన్యాయమా చెల్లీ
        నువ్వుగట్టే సీరలూ
        నాకు కట్టు చెల్లి
        నువ్వు కట్టే రవికలూ
        నాకు కట్టు చెల్లీ

        సకలవేషాలు
        సరి జూసుకోని
        కడ్డీల పిడిబాకు
        మొలలోన సెక్కే
        పోయెనే సిక్కురుడు
        విడిది చేసిన సోటికీ

సిక్కురుడు:
        నువ్వు గనక మా యింటి
        ఇల్లాలివయితే
        బంగారుమేడలూ
        కావించుతాను
        ఇవేమి మట్టికుండలూ
        నువ్వు కనుక మా యింటి
        ఇల్లాలివయితే
        బంగారుకుండలూ
        కావించుతాను!
        నిద్దుర పొద్దునా
        మెడ వత్త జూచీ
        తిన్నగా కొంచేపు
        జూద మాడీనాడు
        పక్కనా కొంచేపు
        పొందు జూపీనాడు
        నిద్దురా పొద్దునా
        మెడ జూసినాడు
        సిక్కురుని మెడ మీద
        పిడిబాకు దింపినాడు
        నెత్తురూ కాలువై
        ఈదిలోకి పారినాది
        ఇంటి ముందర రక్తమడుగులో
        బాల లాడగానూ
        ఇంటిముందు మడుగులో
        కాకులాడంగాను
        సిక్కురుడి ఇంటిముందు
        పీనులెండగనూ
        సిక్కురుడూ బొందె
        విడచినాడు
AndhraBharati AMdhra bhArati - gobbipaaTalu - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )