దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
(దంపుళ్ళపాటలు - దంపు పదాలు అనుపేర ఒకటా, రెండా లక్షలకొలది ప్రచారంలో వున్నాయి - ఈ దంపులలో వెటకారం వినిపిస్తుంది - శృంగారం పలకరిస్తుంది, ఆచారాలు ప్రత్యక్షమౌతాయి, అలసటలు తీరతాయి - నాటి ఎన్నో పాతవిషయాలు మనకు మరీవింతగా చెవులు మెలిపెట్టి వినిపించడం మరీ వింత.

ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క కథ, ఒక్కొక్క ఆచారం, ఒక్కొక్క పద్ధతి పాటలుగా ప్రచారంలో వినిపించినా - దంపుకు తాళం మాత్రం, మాత్రల నియమం మాత్రం మారదు - పోతే దంపు, విసురు లాటి పదాలు ఒకేలా వినిపిస్తాయి - చదవడానికి మరీను - కాని - తేడా వుంది)

039. దంపుళ్ళ పాట

దంపు దంపనగానె - దంపెంతసేపు
ధాన్య రాసులమీద చేయివేసి నట్లు
వంట వంటనగానె - వంటెంతసేపు
వదినె మరదళ్ళు - వాదించినట్లు
అత్త పోసినగంజి - సత్తూవలేదు
అల్లూడు సిరిపురపు - గట్టెక్కలేడు.

కొయ్యతోటకూర - కొయ్యకా చెడెను
కొండంత కాపురం - కొండేల చెడెను
కొడుకుల కననివాళ్ళ - కడుపేమి కడుపు
కులముద్ధరించని - కొడుకేమి కొడుకు
చిచ్చమ్మ చినగాలి - పెట్టు పెద గాలి
అయోధ్య వీధుల్లో - అణగనే గాలి
పిడికెడు విత్తనాలు - మడికెల్ల జాలు
ఒక్కడే కొడుకైన - వంశాన జాలు.

కొత్తచింతాపండు - గోనెల్ల చివుకు
గొడ్రాలి వస్త్రాలు - పెట్టెల్ల చివుకు
దేవదారూ చెక్క - చెట్టున్న చివుకు
దేవుడి వస్త్రాలు - గుళ్ళోన చివుకు
రావి చెట్టూ చెక్క - రంపాన చివుకు
రంభ చక్కాదనము - దుఃఖాన చివుకు

నాచేతి రోకళ్ళు - నల్లరోకళ్ళు
నేపాడిని అన్నల్లు - రామలక్ష్మణులు
రామలక్ష్మణులార - రక్షపతులార
మీరెక్కిన గుఱ్ఱాలు - నీలమేఘాలు
మీచేతి కత్తులూ - చంద్రాయుధాలు

సువ్వి సువ్వన్న - సొగసు మల్లన్న
దమ్మిడీ కాసన్న - ధగధగ మెఱుపన్న
మెఱుపున వలపన్న - వఱపున సలుపన్న

బీరపాదుకీ - పిందెలందమ్ము
మావారి ముక్కుకీ - పొక్కు లందమ్ము
కాకర పాదుకీ - కాయలందమ్ము
బిడ్డ లున్న వారికీ - ముద్దులందమ్ము
పొట్ల పాదుకీ - పువ్వులందమ్ము
కాట్లకుక్క మగడు - కాంత కందమ్ము
తోట కూరకంబమూ - దొడ్డికందమ్ము
మావారి శిగజుట్టూ - నాకు అందమ్ము
మాట్లాడ నేర్పుటే - మగువ కందమ్ము
వగలాడి మగువకు - ముసలివా డందమ్ము
పుట్టింటి యునికియే - పొలతి కందమ్ము
అత్త మామలు చస్తే - అతివ కందమ్ము
కాటుక యుంటేనె - కనుల కందమ్ము
వెనుక దిక్కు లేకుంటే - వెలది కందమ్ము
దొంగ దూడకు గుది - కఱ్ఱ యందమ్ము
దొంగ మగనికి పెంకి - పెండ్లా మందమ్ము
AndhraBharati AMdhra bhArati - daMpuLLa paaTa - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )