దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
040. దంపు పదాలు

కాకర కాయకు కాడ సన్నము
కాశిలో భద్రన్న కురులు సన్నంబు
వంటింట సిరిచాప నామాలపెట్టి
నరసింహ దాసుడు నాకన్న వాడు
తూరుపిల్లు వంక దూలాలు వంక
దున్నొచ్చె మాయెడ్లు కొమ్ముల్లువంక
దక్షిణపిండ్లు వంక దర్వాజ వంక
దర్మరాజన్న తలపాగ వంక
కొబ్బెర చెట్టుకు వెయ్య రుయ్యాలా
గోపమ్మ మనమల్ని ఊప రుయ్యాలా
మామిడి చెట్టుకు వేయ రుయ్యాలా
మాయమ్మ మనమల్ని ఊపరుయ్యాలా
వెంకటేశ్వరుడి పెండ్లిండ్ల నాడు
వేల్పులు బట్టింత్రు వెండి సురటీలు
అక్క నాతమ్మయ్య పెండ్లిండనాడు
పరువుకు బట్టించు పమిడిసురటీలు.
కోటయ్య! నీవంటి కొమాళ్ళనిస్తే
కోటి ప్రభలాతోడి కొండనెక్కేము
అప్పన్న పెళ్ళాము అలివేలుమంగా
ఆవు పేడ బెట్టి అరుగు లలికింది
గోవు పేడ బెట్టి గోడ లలికింది
చిక్కుడు గాయల్లు సిరిభూషణాలు
చిలుక లొడ్డాణంబు చిన్నప్ప నడుము
కాకర కాయల కరిభూషణంబు
గంట లొడ్డాణంబు పెద్దప్ప నడుము
కలగంటి మాంచాల కలగంటి బాల
కలలోన కలగని కల మేలుకొంటి
నాతండ్రి సిరిజూచి రాజకళజూచి
రాజు లంపీనారు నిలువుటద్దాలు
చచ్చిపోయి మాతాత స్వర్గానవుంటె
గోవు దానము జేసు కొడుకు నాతండ్రి
పున్నెము కొందరిది పూజ కొందరిది
పునిస్త్రీ జన్మాన చావు కొందరిది
భాగ్యము కొందరిది బలము కొందరిది
బాల ప్రాయమునాడు పెండ్లికొందరిది
కాటికా చుక్కబొట్లు కడిగితేబోను
నొష్టవ్రాసినవ్రాత తుడిచినా బోదు.

ఆరునెల్లా బాల అడ్డవడి గట్టి
ఆమెనే సీతమ్మ అడవులకు పయనమ్ము
ఎట్లూంటావమ్మ నట్టడవిలోన
నా మరది లక్ష్మయ్య లంక లేలంగ
నాకేమి భయమమ్మ నట్టడవిలోన
ఏటొడ్డు పుచ్చల్లు యెఱ్ఱ తుమ్మలు
యెలమంచి తమ్మపూడి గంగపుట్టిల్లు
పాటొడ్డ పుచ్చల్లు పండు దోసల్లు
పంపాద్రి ధనికొండ పాపపుట్టిల్లు
అల నేరెడు పండ్లు పళ్లాన బోసి
అంపిస్తి ముత్తి పిల్లయ్య గురువులకు
ఇంతచక్కని పళ్ళు ఎవరంపినారు
నీ శిష్యు కూతురు వైదేహి సీత
వడ్లలో వరిపొట్టు కలపకే తల్లి!
వంశాన నీ కడుపు వర్ధిల్ల వలెను
నాతోడ బుట్టిన నలుగురన్నలకు
చదువు లెవరేతల్లి! చెప్పినావారు?
నీళ్ళల్లో బుట్టిన నీరుకాకులకు
నీతు లెవరే తల్లి! తెలిపినావారు?
AndhraBharati AMdhra bhArati - daMpu padaalu - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )