దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
(ఇద్దరు ప్రమదల మధ్య తమతమ భర్తల గొప్పదనం, అందచందంలను గురించి సాగే సంవాదానికి - ఈ గౌరీ-లక్ష్మీ సంవాదం - ఒక మచ్చుతునక)

046. గౌరీ - లక్ష్మీ సంవాదం

గౌరిదేవి నీ శంభుదేవునకు
గళమున నలుపేమమ్మా?
        నారీమణి నీ విష్ణుదేముడూ
        నలుపుకాదుటే కొమ్మా;
ఏమి లేక నీ కాంతుడు జగమున
ఎద్దు నెక్కెనే మమ్మా?
        పంతముతో నీ కాంతుడు
        పశులకాసెనె కొమ్మా;
హద్దులేక నీ వల్లభుడూ
సగమాడ రూపమేమమ్మా?
        ముద్దుగుమ్మ నీ మురహరి పెనిమిటి
        మోహిని కాదటే కొమ్మా;
పంకజాక్షి నీ శంకరు శిరమున
జింక వున్నదేమమ్మా?
        పంతముతో వనవాసముకేగి
        జింకను వేసెనె కొమ్మా;
చింతలేక నీ కాంతుడు బ్రహ్మను
శిరసు త్రుంచెనే మమ్మా?
        పంతముతో రావణబ్రహ్మను
        పదితలలు త్రుంచెనే కొమ్మా;
విశాలాక్షి నీ విభుని మాయలా
జంగము కులమే మమ్మా?
        పాలు పెరుగు లమ్మగను గొల్లవారి
        కులముకాదుటే కొమ్మా;
పార్వతిదేవి నీ విభునికి
నిలువున పాములున్న వేఁవమ్మా?
        అద్దులేక కాళంగి మడుగులో
        నాట్యము చేసెనే కొమ్మా;
పార్వతిదేవి వైదేహి పలికిన
పంతము వినరమ్మా!
        విన్నవారికే విష్ణులోకమూ
        కైలాసము కాదటె కొమ్మా.
AndhraBharati AMdhra bhArati - gaurii - laxmii saMvaadaM - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )