దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
("హా - సువ్వి - హా - సువ్వి" - ఊతపదంతో రెండేసి చరణాలు పాడి - అడ్డెలకొలదీ బియ్యాన్ని సునాయాసంగా దంపుకుపోయే పడుచులు చాలామంది.

తమ శ్రమను ఆ పాటల మత్తులో - ఊతపదాల గమ్మత్తులో - తాళం ఎత్తులో మరచిపోతారు - ఎందుకు చెప్పడం బహు దొడ్డ పాటలు లెండి యివి.)

057. సువ్వీ సువ్వన్న పాటలు

దేవేంద్ర లోకాన దేవలోకానా
ఈ వూరి వీరమ్మ కెందరు కొడుకులే
ఎందరో ఎక్కడిది ఏడుగురె కాదా?
నలుగురేనప్పా సిరిగల్లవారే!
కడుగోటి అక్కమ్మ వొక్కటేకాదా
పోయెనే ఆపిల్ల అత్తోరి వాడా
నలుగురీ కొడుకులకు అరకులకుపోయే
కడగోటి కోడలు కాంత చక్కనిది
అడ్డెడూ తమిదల్లు అప్పుడె కొన్నాదీ
అంబల్లు కాసుకొని ఏమిచేసిందో
కాసినా అంబలీ దుత్తకేపోసి
చుట్ట చుట్టూకోని నెత్తినేపెట్టె
నలుగురూ బావలకు బువ్వెత్తికెళ్ళే
పోయేటి దారిలో పుట్టొకటుంది
పోతానే కాంత కాలెత్తితన్నే
బావలా దగ్గరకు త్వరగ వెళ్ళిందే
బావలకు అన్నాలు బాగపంచిందే
అక్కడుండీ కాంత వంటిగా వచ్చే
మళ్ళి వస్తా కాంత మడమలతో తన్నె
పుట్టలో నున్నాడె కోడి నాగన్న
పడమట వుచ్చేసి వర్షాలు కలిసే
పొలము వెళ్ళి బావలు తడిసివచ్చారే
పొయిమీద మంగళము పెట్టింది కాంత
మానెడూ జొన్నలు చాల ఏపితిరే
తీగ మండపరోలు చిన్నంగ దీసి
రోటిలో యిమిడాడె కోడి నాగన్న
నలుగురూ కోడలు వాయి పోశారే
నాగన్న నడుమున పిండీ మెదిగిందే
నాగన్న శిరశైన పిండి మెదిగిందే
బెల్లమేసి ఆ పిండి ముద్ద జేశారు
తల్లి కొక ముద్ద తండ్రి కొక ముద్ద
ఏడుగురు అన్నలకు ఏడు ముద్దల్లు
ఏడుగురు కోడళ్లు కేడుముద్దల్లు
కుక్కకొకముద్ద పిల్లికొకముద్ద
ఎవరిముద్దలు వారు ఆరగించేరు
ఎవరి గదిలో వారు పవ్వళించేరు
ఎర్రంగ పొద్దిడిసె ఏడు గడియలకు
ఒక్కరన్నా వారు లేవకున్నారు
అందరూ కలిసైన చనిపోయినారు
ఇరుగు పొరుగూవారు యింటికొచ్చేరు
ఎంత పిలిచినగాని పలుకరూవారు
కరణాలు మునసబులు చూడవచ్చేరు
తలుపులు గడియలూ ఎత్తేసినారు
పిల్లి కుక్కా రెండు చనిపోయినాయి
తల్లి దండ్రులుకూడ చనిపోయినారే
ఏడుగురు అన్నల్లు చనిపోయినారు
ఏడుగురు వదినల్లు చనిపోయినారు
ఆకాసానా బోయె కాకిని పిలిచారు
అంటరానీ చెట్టు ఆకు కోశారు
ముట్టరానీ చెట్టు ముల్లుకోశారు
అక్కమ్మకు జాబులు చాలా వ్రాసారు
కాకమ్మ కాలుకీ లేఖ కట్టారు
నీవుపోయే దారిలో చేప లంగళ్లే
చేప లంగళ్ళాకాడ చేరకే కాకీ
నీవుపోయే దారిలో కూటి రాసుళ్లు
కూటిరాసులకాడ కూడకే కాకీ
కాకికి చాలా బుద్ధులు చెప్పేరే
సందులో అక్కమ్మ జలక మాడేనే
కావు కావున అరిసి రేఖాడ దన్నే
అంటు రేఖాయని అంటదక్కమ్మ
ముట్టు రేఖాయని ముట్టదక్కమ్మ
నాది రేఖాయని చేతబట్టింది
ముత్యాల గోళ్ళతో ముడులు విప్పిందీ
ఆ లేఖ చదివింది దుఃఖపోయింది
తలార చన్నీలు జలకమాడింది
ఉత్తరాన దేవళంబునకు పోయి
నా తల్లి దండ్రులు బ్రతికి యుంటేను
పిల్లికుక్కా కూడ బ్రతికి యుంటేను
ఏడుగురు అన్నలు బ్రతికి యుంటేను
ఏడుగురు వదినల్లు బ్రతికి యుంటేను
పాచి వూడవ బంగారు చీపిరిని
పాచెత్త బంగారు పల్లకల్లిద్దూ
గుడిచుట్టు బంగారు తీగవేయిద్దూ
గుడితుడు బంగారు గుడ్డవేయిద్దూ
శిఖరానికి బంగారు కుంచె కట్టెదూ
ఇలాంటి మొక్కులు చాల మొక్కింది
దేవుణ్ణీ తన యాన తలుచుకున్నాది
భర్తతానూ కలిసి బయలుదేరారు
కాకులూ దూరని కారడవిదాటి
చీమలూ దూరని చిట్టడివిదాటి
భార్యాభర్తా కలిసి వెళ్ళిపోయారే
పుట్టింటి కక్కమ్మ వెళ్ళిపోయింది
దేవుణ్ణి మదియందు దలచుకున్నాది
తలుపులూ తాళాలు తెరవసాగినవి
తలి దండ్రులు తిరిగి తిరుగసాగారు
ఏడుగురు అన్నలూ తిరుగసాగారు
ఏడుగురు వదినలూ తిరుగసాగారు
కుక్కపిల్లికూడ తిరుగసాగాయి
AndhraBharati AMdhra bhArati - suvvii suvvanna paaTalu - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )