దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
068. సత్యభామ

ఒయ్యార మెందుకే ఓసత్యభామా
వద్ద కృష్ణుడు లేని వయ్యారమేలా?
చక్కదన మెందుకే ఓ సత్యభామా?
చంక బాలుడులేని చక్కదనమేలా
గోపాల కృష్ణమ్మ ఎవ్వరల్లుండు?
గోవులు కాచేటి గొల్ల లల్లుండు
అక్క నా తమ్మయ్య ఎవ్వరల్లుండు
మండలము యేలేటి మామ లల్లుండు
మానికెల్లనిండా మాడలు బోసికొని
మానవతి పుట్టిల్లు నేజెయ్యబోదు
ముంగట కలరోలు ముత్యాలవాయి
ముత్యాల వాయిబోసి మువ్వయని బాడు
వాకిట గలరోలు వజ్రాలవాయి
వజ్రాల వాయిబోసి వల్లభుల బాడు
పందిట్లో గలరోలు పగడాలవాయి
పగడాల వాయిబోసి భక్తితో బాడు
సీతమ్మ చెరబోయె ఓ లక్ష్మయ్య
చిత్రకూటాలన్ని చిన్న బోయినవి
రత్నకూటాలన్ని రవదూళిగమ్మి
అమ్మ తమ్ముల్లార అతిబోగులారా
అమ్ముండు వాడలకు తమ్ములైరండి
మేముండు వాడలకు మామలైరండి
నాచేతి రోకళ్ళు నల్లరోకళ్ళు
చేయించు పెద్దన్న చేవరోకళ్ళు
అంపించు అన్నయ్య అప్పవాడలకు
చిలకలాడే అమ్మ హంసలాడేను
పావురా లప్పయ్య ఆడుపందిళ్ళ
అప్పన్న పెళ్ళా ముండవలయును
మాయమ్మ మాతల్లి నీవు బుట్టబట్టి
మదన గోపాలుండు మాకల్లుడయ్యె.
AndhraBharati AMdhra bhArati - satyabhaama - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )