దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
(ఈనాటిమాట కాదులెండి! అరడజను కాఫీల కళ్యాణం అసలే కాదులెండి!! పాతకాలంనాటి పెళ్ళిళ్ళనాటి పాట మాట - పాతమాట!!!

ఐదురోజుల వివాహాలు - ఓయని మేళతాళాలు - సంతర్పణలు - విందులు - వినోదాలు - అటువంటి అలాంటి పెళ్ళిళ్ళలో భోజనాల సమయంలో పెళ్ళికొడుకు తాలూకు ఆడవారు పెళ్ళికూతురు వెంపునుంచి తమకు మర్యాద సరిగ జరగలేదనీ, కాఫీలో ఉప్పు, పప్పులో పంచదార తక్కువయిందని - ఏదో వంకతో వెటకారంగా - వెక్కిరింతగా - యింతకీ చెప్పొచ్చేది వినోదం - వెటకారాల సరదాలకోసం - పాడే విందుపాటలనబడే ఎన్నో వెటకారపు పాటలలో ఈ వదినపాట ఒకటి - అన్న పెళ్ళాన్ని పట్టుకుని మరదలు ఇలా అడిగేస్తుంటే - వింత కాకపోవచ్చు - విడ్డూరం కాదంటారా??)

069. వదిన మీద పాట

ఛీఛీ నీకు తగదే వదినా
సిగ్గేలను లేదే నీకు
ఫోఛీ కుర్రతనమేలనే
వాచిపోతివి పులిహోరకు

కొర్రన్నము గోంగూరయు
మీరు మీరున భోంచేసిరి
మర్రియాకుల విడుమే చెలి
మనసైనట్టి దెలిపీతివి

టింగురంగా రంగాయని
శృంగారము చేసుకొని
తొంగితొంగి చూచెదవే
నంగానీచిరలగదె

బట్టచెంగు చేతాబట్టి
బాజీ బొందు ఒకటిగట్టి
రోజమల్లె చీరాగట్టీ
బజారున తిరిగేదవు

రాగిడెలు మోటైనవి
రాణింపు తోకట్టే నీకు
నాగారములు అమరీనవి
నాగారి మారాలాగదె
AndhraBharati AMdhra bhArati - vadina miida paaTa - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )