దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
(పెళ్ళిళ్ళలో ఊరేగింపు, పాలకీలలో ఊరంతా తిరగడంతో సరిపోతుంది - తిరిగి రాగానే పెళ్ళికూతురినీ, పెళ్ళీకొడుకునీ వీధిగుమ్మం దగ్గరే ఆపి, ఆడవారంతా నిలుచుండి ఆ నూతన దంపతుల పేర్లను ఒకరివి ఒకరు చెప్పమని అడిగి చెప్పించి - మరీ లోనికి పోనిస్తారు - అది పూర్వకాలం మాట సుమండీ - ఆ పాట ఇది)

070. వరస పాట

రత్నాల వాన కురిసె
రమణీ మీ ఒదిన తడిసె
తలుపూ తియ్యి చెల్లెలుగారూ
తలుపూ తియ్యి చెల్లెలుగారూ.

రత్నాల వాన మెరుగు
రమణి మా వదిన మెరుగు
పేరూ చెప్పండన్నయగారూ
తలుపూ తీసెదమూ.

ముత్యాల వానా కురిసె
ముద్దూ మా ఒదినా కురిసే
తలుపూ తియ్యి చెల్లెలుగారూ
తలుపూ తియ్యి చెల్లెలుగారూ.

ముత్యాలా వానా మెరుగు
ముద్దూ మా వదినా మెరుగు
పేరూ చెప్పండన్నయగారూ
తలుపూ తీసెదమూ.

పాడీకి గేదె నిస్తా
వేడికే ఎద్దూ నిస్తా
తలుపూ తియ్యి చెల్లెలుగారూ
తలుపూ తియ్యి చెల్లెలుగారూ.

పాడీకి గేదే నొద్దూ
వేడికే నెద్దూ నొద్దూ
పేరూ చెప్పండన్నయగారూ
తలుపూ తీసెదమూ.

దండానా చీరలిస్తా
పెట్టేలో సొమ్ములిస్తా
తలుపూ తియ్యి చెల్లెలుగారూ
తలుపూ తియ్యి చెల్లెలుగారూ.

దండానా చీరలొద్దూ
పెట్టేలో సొమ్మూలొద్దూ
పేరూ చెప్పండన్నయగారూ
తలుపూ తీసెదమూ.

నాపేరూ రాములవారూ
మీ వదినా పేరు సీతాదేవి
తలుపూ తియ్యి చెల్లెలుగారూ
తలుపూ తియ్యండీ.

నా పేరు సీతాదేవి
మీ అన్నపేరు రాములవారు
తలుపూ తియ్యి ఆడుబిడ్డా
తలుపూ తియ్యమ్మా.
AndhraBharati AMdhra bhArati - varasa paaTa - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )