దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
(నోచుకోవడానికి ఓపిక - తీరిక - ఉత్సాహం - కాదు నమ్మకం ఉండాలేగాని మన తెలుగు ఆడవారికి సంవత్సరం పొడుగునా - ఇంకా చెప్పాలంటే పగలూ - రాత్రీ కూడా జరుపుకోవడానికి కావలసిన నోములు - వ్రతాలు - పూజలు - పునస్కారాలు! బొమ్మలనోములు, మూగనోములు, అలా మరెన్నో వున్నాయి - మూగనోమని మన యువతులు పట్టే నోముకి సంబంధించిన చక్కని సాహితీ విలువ, భాషావిలువ, నడిచే నడక పటిమగలిగిన అత్యుత్తమ జానపద రచన యిది. ఈ నడకలో ఎన్నో బాల రచనలు వెలుగొందాయి కూడా!)

072. మూగి నోము పాట

మోచేటి పద్మము పెట్టేటి వేళా
మొగ్గల్లు తామరలు పూచేటి వేళా
కాకర పూవుల్లు పూచేటి వేళా
కడవలతో ఉదకము తెచ్చేటి వేళా
ఆనపా పూవుల్లు పూచేటి వేళా
అందాల ఉదకంబు తెచ్చేటి వేళా
బీరాయి పూవల్లు పూచేటి వేళా
బిందెలతో ఉదకము తెచ్చేటి వేళా
గుమ్మడీ పూవుల్లు పూచేటి వేళా
గుండిగలతో ఉదకము తెచ్చేటి వేళా
చిక్కుడూ పూవుల్లు పూచేటి వేళా
సీతమ్మ సురిటీలు విసిరేటి వేళా
అన్నల్లు అందలా లెక్కేటి వేళా
తమ్ముల్లు తాంబూలములు వేసేటి వేళా
బావలు పల్లకీ లెక్కేటి వేళా
మరదలు మరి జూదమాడేటి వేళా
చెల్లెళ్లు చేబంతు లాడేటి వేళా
కోడళ్లు కొట్టు పసుపు కొట్టేటి వేళా
సందివేళ దీపమ్ము పెట్టేటి వేళా
చాకింటి మడతలు తెచ్చేటి వేళా
ఆవుల్లు దూడల్లు వచ్చేటి వేళా
అంబోతు రంకెలు వేసేటి వేళా
పసిబిడ్డ పాలకు ఏడ్చేటి వేళా
జోకొట్టి ఉయ్యాల లూచేటి వేళా.
AndhraBharati AMdhra bhArati - muugi noomu paaTa - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )