దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
(పూర్వకాలపు యిటువంటి పాటలలో ఎన్నో చారిత్రక విషయాల ప్రాధాన్యం గోచరిస్తుంది)

077. జోల పాట

చిచ్చొ ళుళుళుళుళు హాయీ
హాయీ హాయీ ఆపదలుకాయి
చిన్నవాళ్ళనుగాయీ శ్రీ వెంకటేశ
శ్రీ వెంకటప్పయ్య దిక్కు నీవయ్య
శరణన్నవారిని చేకొనుమయ్య
తిరుపతికి బొయ్యేటి చిట్టి దాసరి
తిరువెంగళప్పనికి ఎందరే స్త్రీలూ
పెద్దాపె నాంచారు పేరు తులశమ్మ
అందరిలో చక్కనిది అలువేలుమంగ
చిలుకల్లు చెలరేగి జీడి కొమ్మెక్కు
అబ్బాయి చెలరేగి మామభుజమెక్కు
మామ భుజమెక్కి ఏమేమి యడుగు?
పాలుత్రాగ గిన్నడుగు పాలావునడుగు
ఎందుకూ ఏడ్చేవు? ఏల ఏడ్చేవు?
పాలకు ఏడ్చేవు పసిబిడ్డ నీవు
ఆడితే పాడితే అవ్వలకు ముద్దు
చప్పట్లు తట్టితే తాతలకు ముద్దు
చిన్ని నా అమ్మాయి చేమంతకద్దె
ఏడ్చేటి ఏడుపుకు కొండలదురును
చిట్టి ముత్యముపెట్టి సీత కడుపున
స్వాతివానకురిసె సముద్రము నిండంగ
చిన్ననా అమ్మాయి నవ్విపలికితె
మునిపండ్ల ముత్యాలు విగడ పొగడాలు
చెక్కుళ్ళు చామంతి రేకులు బోలు
తీరు తీరూ కొండ తీరైనకొండ
అందరి మామల్లు చందమామల్లు
అబ్బాయి మామల్లు రామలక్ష్మణులు
బూచివాడికి బువ్వపెట్టనీరాదు
పెట్టితే అబ్బాయిని పట్టుకొనిపోవు
నిద్రపో నిద్రపో నీలివచ్చిన
నీలిజంగము వెంట బూచి వచ్చినది
నిద్రకు వెయ్యేళ్ళు నీకు వెయ్యేళ్ళు
నీతోడి బాలురకు నిండు వెయ్యేండ్లు
నిద్రపో నిద్రపో భద్రశయనుడా
బలభద్రశయనుడ హరి నిద్రపోర
AndhraBharati AMdhra bhArati - joola paaTa - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )