దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
082. జోల పాట

శ్రీరామ చంద్రుడూ
సీత వల్లభుడా
యిచ్చుమా అమ్మాయికి
యిచ్చు సంపదలు
చుక్కలలోను
చిన్న బాలుడున్నాడా
ఆబాల గోపాల
బాలుడున్నాడు
పంచదారకుప్ప
పాలపై తెప్ప
మా చిన్న అమ్మాయి
బంగారు కుప్ప
కోటకుర్చీమీద
రాజు కూర్చోని
కొమ్మ నిమ్మా పండు
తా తెమ్మనేనూ
కోటకుర్చీమీద
రాజు మీ తాత
కొమ్మనిమ్మాపండు
తాను అబ్బాయి
రత్న కంబళమీద
రాజు మీ మామా
పారాడు పంజరపు
చిలక అమ్మాయి
ఎందాక పోయినది
చిన్న అమ్మాయి
ఏ స్వామి యిచ్చెనే
ఎత్తి ముద్దాడీ
పరమేశ్వరుల రాణి
పార్వతీదేవి
పార్వతీ యిచ్చింది
పాప అమ్మాయిని
చామంతి పులిగోరు
చుట్రావిరేకు
చిన్నవాండ్లాడెడు
రేపల్లెలోనూ
మాడంత బంగారు
మద్దెకాయల్లు
మహరాజు మాతల్లి
మనుమరాలాయె
ఏరంత వెళుపమ్ము
యిసుక సన్నమ్ము
ఏరుదాటి వెళ్ళింది
ఎవరాడబడుచు
మూటనున్నది పసుపు
పొట్లాన కుంకం
వడినిండ పోకల్లు
పండుటాకుల్లు
భమిడి శ్రీ పిల్లమ్మ
సారె వెళ్ళింది
ఊరికి ఉయ్యాల
లమ్మ వచ్చాయి
కొమాళ్ళు గలవారు
కొనరె ఉయ్యాల
కొమాళ్ళు గలవాడు
తా వెంకటేశు
కొంగు మాడలు పోసి
కొనెను ఉయ్యాలా
సింహాద్రి అప్పన్న
చిరుతిళ్ళవాడు
లంచమిస్తేగాని
సంతానమీడు
లంచాలు యీయవే
నువ్వు రమణమ్మా
సంతానమిస్తాడు
సర్వేశ్వరుండు
యిక్కడికి సింహాద్రి
ఎంత దూరమ్ము
అల్లవిగో నేరెళ్ళు
తెల్లని గుళ్ళు
తెల్లని గుళ్ళలో
దేముడప్పన్న
నల్లని గుళ్ళలో
ఆది లక్ష్మమ్మ.
AndhraBharati AMdhra bhArati - joola paaTa - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )