దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
(చెమటకు తడిసిన గంధం ఘుమఘుమలాడిందట - చెమటలో శ్రమలో కూడా గంధం ఘుమఘుమలనే గుర్తించగలిగిన ఈ హృదయం - ఎంత నిర్మలమూ, నిండుతనమూ కలిగిందో)

089. ఓలాలా

కంచెల చెరిగే చేడి కురులపై
తుమ్మెద లాడిం దోలాలా
ఘన తుమ్మెద లాడిం దోలాలా
చెమటకు తడిసి చెదరిన గంధం
ఘుమఘుమ లాడిం దోలాలా
అది ఘుమఘుమ లాడిం దోలాలా
ముఖమున ఉండే కస్తూరి తిలకం
ముక్కున జారిం దోలాలా
కొన ముక్కున జారిం దోలాలా
చెరిగేటప్పుడు చేతిలో గాజులు
గల గల లాడిన వోలాలా
అవి గల గల లాడిన వోలాలా
గొప్పది రోకలి గుప్పున దంచంగ
జబ్బలు కదిలిం దోలాలా
ఘన జబ్బలు కదిలిం దోలాలా
హంస నడుపులు నడిచే భామకు
అందెలు కదిలిం దోలాలా
కాలందెలు కదిలిం దోలాలా
AndhraBharati AMdhra bhArati - oolaalaa - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )