దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
(శ్రీకృష్ణ పరమాత్ముని లీలలు అత్యద్భుతాలనే కదూ పురాణాలన్నాయి, ఆ పరమాత్మకే గుమ్మంలో భార్యామణి ప్రశ్నలకు ఉబ్బితబ్బిబ్బై సమాధానాలు యిస్తున్నాడు - అనుకొనే వారికి పరమాత్ముడు గాని సత్యకి భర్తేకదూ!)

106. సత్యా కృష్ణుల సంవాదము

గోపికా రమణుడనే
కొమ్మారో నేనూ

        నీవు గోపాలో భూపాలో
        నీవు చేపావో నే నెరుగా

రంగు మీరీనట్టి లోకా
రక్షకుడనే నేనూ

        నీవు రంగడవో నరశింగడవో
        నీ సంగతి నే నెరుగా

గట్టీగా పాపామూలు
పోగొట్టూదునే నేను

        నీవు పట్టీవో పొట్టీవో
        నీగుట్టూ నే నెరుగా

శ్రీకాంత వల్లభుడనే
చేడెరో నేను

        నీ శ్రీకరమో వశీకరమో
        నీ సుకరామో నే నెరుగా

వింతాగా చూడకుమే
వెలదీరో నన్నూ

        నీ వెంతాటీ వాడావో
        నిన్నూ నే నెరుగా

నిగమాంత గోచరుడానె
నెలతారో నేను

        నీవు తగవరివో తెగవరివో
        నీభృగువూలూ నే నెరుగా

దండీగా బ్రహ్మాండములూ
నిండే వుందూ నేనూ

        నీ వుండరమో దండామో సామీ
        పొలతీ లక్ష్మీ నారాయణులకు

పుల గోపాలుడినే నేనూ
ఎలనీ నిన్నేలీ నట్టీ
యానందా నీ యడలా.
AndhraBharati AMdhra bhArati - satyaa kR^iShNula saMvaadamu - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )