దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
109. సువ్వి పాట

సువ్వీ సువ్వీ సువ్వానీ
సుదములు దంచెద రో-లాల

వనితల మనసులు కుందెన చేసిటు
వలపులు తగనించో-ఓలాల

కనుసన్నలనెడి రోంకండ్లానూ
కన్నెలు దంచెద రో-లాల

బంగరు చెరగుల పట్టుపుట్టములు
కంగులు దూలగ నో-లాల

అంగనలందరు నతివేడుకతో
సంగడి దంచెద రో-లాల

కురులు దూలగమంచి చన్నూలపై
సరులు దూలాడంగ నో-లాల

అరవిరిబాగుల నతివలు ముద్దులు
గురియుచు దంచెద రో-లాల

ఘల్లుఘల్లుమని కంకణ రవములు
పల్లవ పాణుల కో-లాల

అల్లన నడుములు అలసియాడ సతు
లొల్లన దంచెద రో-లాల

కప్పుర గంధులు కమ్మని పువ్వుల
చప్పరంబులనే-ఓలాల

తెప్పలుగారతి దేలుచు గోనే
టప్పని బడెదరో-లాల.
AndhraBharati AMdhra bhArati - suvvi paaTa - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )