దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
(శ్రీకృష్ణుని శృంగార వికారాలక్రింద ఏ గోపిక పడే నలుగుల ప్రతిధ్వనో ఈ మేలుకొలుపు?)

111. మేలు కొలుపు

పోనిలె కృష్ణా ప్రొద్దుచాలా పోయె
నీ నీడనున్నానులేరా
మానరా నే నత్త మామలు కలదాన్ని
మాటాలు వచ్చును లేరా
కృష్ణా తెల్లవార వచ్చేను

యిరుగు పొరుగు సొమ్ము
ఎరువు తెచ్చుక నేను
విని చేర వస్తిని లేరా
బలువైన ముత్యాలు
బావిలి చెవిని లేదు
పాన్పు వెతకవలె లేరా
కృష్ణా తెల్లవార వచ్చేనూ

అగరు గంధములు వద్దన్న పూస్తివి
అవి నీళ్ల కడగాలి లేరా
చిగురాకు విడియమ్ము నేనెర్రనాయెను
అత్తుడుచుకోవాలి లేరా
కృష్ణా తెల్లవార వచ్చేనూ

పైయ్యాట చంగునా పక్క చిక్కున్నాది
వయ్యారి నా స్వామి లేరా
చదరిన కురులన్ని సొదార్చుకోవాలి
తగదు నందకుమార లేరా
కృష్ణా తెల్లవార వచ్చేనూ

మందలోకెల్ల తనమొగుడు పండితుడు
మహరాజపూజిత కారా
అందరిలోన అపకీర్తి పాలైతె
అతనికి అప్రదిష్ట లేరా
కృష్ణా తెల్లవార వచ్చేనూ

వనజాక్షిరొ మా వొదినగారు
వరలక్ష్మీ వ్రతమాత లేరా
పనులకు రమ్మని బ్రతిమాలినది
దాని పల్లెకు పోవలె లేరా
కృష్ణా తెల్లవార వచ్చేనూ

వావిలోనొకదుంప వదినెగారి కొంప
వదిన కిటనున్నాది లేరా
నీఆడబొడుచు వచ్చి చాడికోరు దాని
దాటికోర్వలేను లేరా
కృష్ణా తెల్లవార వచ్చేనూ

తెలియక నా స్వామి
మళ్లీ పరున్నావు లేరా
కాంత జనక నీకౌగిట బిగియించి
కదలనివ్వడేమి లేరా
కృష్ణా తెల్లవార వచ్చేనూ

తొలికోడి కూసింది
మళ్లీ పరున్నావు లేరా
కల్లగాదు నా ఇల్లు చేరువగాదు
వెళ్లవలెను వేగ లేరా
కృష్ణా తెల్లవార వచ్చేనూ
AndhraBharati AMdhra bhArati - meelu kolupu - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )