దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
(ఈ పాట మద్రాసులో సుండలతాత పాతకాయితాలలో కంటబడింది. దీనిని పాఠకులకు అందివ్వడం భావ్యంగా యెంచి యిక్కడ యిస్తున్నాను.

"నాగమల్లదారిలో" పెద్ద కథతో కూడిన పాట! దోచుకుతినడానికి, వాంఛలు తీర్చుకోడానికి కులగోత్రాలు అడ్డురావనీ, మీసాలకు సంపెంగ నూనెలు పులుముకు ఇంటివద్ద పెద్దరికం వెలగబెట్టడానికి, అధికారాలు హస్తగతం చేసుకోడానికి మాత్రం పెద్దవారం అనే మోసం పనికివస్తుంటుందనీ ఈ పాట ఎలుగెత్తి చాటుతూంది.

ఇందులో పటేలు - మాదిగ నారమ్మను బలవంతం చేసి మోసం చేయడం, భర్త యెల్లొజి చూచి నారమ్మని చంపడం, తదుపరి ఏ భయంతోనో పటేలు తనభార్యనే యెల్లొజివెంట పంపడం, ఇలా సాగుతుంది కథ.

ఇది తెలంగాణా ప్రాంతానిది అనుకుంటాను - "పటేలు, పట్వారీ"లు అక్కడే కదా వున్నారు. ఆ మండలంలో ప్రచారంలో వున్నదే ఈ పాట!

ఈ గేయం నా సేకరణ కాదు - ఈ పాట పూర్తిగా వుందో లేదో, ఈ పాట సేకరణకర్తకు నా ధన్యవాదాలు)

112. నాగముల్ల దారిలో

పటేలూ పటేలూ నాగముల్ల దారిలో
పాపయ్య పటేలూ నాగముల్ల దారిలో
ఎల్లోజీ యింటికొచ్చి నాగముల్ల దారిలో
యేమాని అంటాడు నాగముల్ల దారిలో

నారమ్మ వో నారి నాగముల్ల దారిలో
మాది గోల్లా నారి నాగముల్ల దారిలో
నీ మొగు డెల్లోజి నాగముల్ల దారిలో
యాడీకి యెల్లిండె నాగముల్ల దారిలో

అప్పూడు నారమ్మ నాగముల్ల దారిలో
యేమాని అంటాదీ నాగముల్ల దారిలో

పటేల పటేల నాగముల్ల దారిలో
పాపయ్య పటేల నాగముల్ల దారిలో
యెన్నాడో నా మొగుడు నాగముల్ల దారిలో
వెట్టీకి యెల్లిండు నాగముల్ల దారిలో
రాను ఆరూనెల్లు నాగముల్ల దారిలో
పోనూ ఆరునెల్లూ నాగముల్ల దారిలో
పన్నెండు నెలలాకు నాగముల్ల దారిలో
పెనిమిటి వస్తాడు నాగముల్ల దారిలో

అప్పూడు పెటేలు నాగముల్ల దారిలో
యేమాని అంటాడు నాగముల్ల దారిలో

చెప్పూలు పోయినాయి నాగముల్ల దారిలో
చేశేది యెవ్వారె నాగముల్ల దారిలో

కూలివాండ్లా బెట్టీ నాగముల్ల దారిలో
కుట్టిస్తా పటేలా నాగముల్ల దారిలో

కచ్చీరు కాయితాలు నాగముల్ల దారిలో
కుప్పాబడి వుండేనె నాగముల్ల దారిలో

కూలీవాండ్లా బిలిశి నాగముల్ల దారిలో
ఖుద్దున తోలిస్త నాగముల్ల దారిలో

పగ్గాలు పోయినాయి నాగముల్ల దారిలో
పేనేది యెవ్వారె నాగముల్ల దారిలో

కూలీవాండ్ల బెట్టి నాగముల్ల దారిలో
ఖుద్దున పేనిస్తా నాగముల్ల దారిలో

వరాలు దియ్యాలె నాగముల్ల దారిలో
యెట్లానె నారమ్మ నాగముల్ల దారిలో

కూలివాండ్ల బెట్టి నాగముల్ల దారిలో
ఖుద్దున దీపిస్త నాగముల్ల దారిలో

అలుకూడు అలకాలి నాగముల్ల దారిలో
యెట్లానె నారమ్మ నాగముల్ల దారిలో

కూలివాండ్ల బెట్టి నాగముల్ల దారిలో
ఖుద్దూన అలికిస్త నాగముల్ల దారిలో

అప్పూడు పటేలు నాగముల్ల దారిలో
యేమీని జేశిండు నాగముల్ల దారిలో

నారి నారి అనుకుంట నాగముల్ల దారిలో
నాలిముచ్చు పటేలు నాగముల్ల దారిలో
యింటిలోకి వచ్చిండు నాగముల్ల దారిలో
యింకేమి జేశిండు నాగముల్ల దారిలో
పోరి పోరి అనుకుంట నాగముల్ల దారిలో
పొయ్యికాడి కొచ్చిండు నాగముల్ల దారిలో

అప్పూడు నారమ్మ నాగముల్ల దారిలో
యేమాని అంటాది నాగముల్ల దారిలో

పటేల పటేల నాగముల్ల దారిలో
పాపయ్య పటేల నాగముల్ల దారిలో
యెల్లోజి నా మొగుడు నాగముల్ల దారిలో
యాడకో బోయిండు నాగముల్ల దారిలో
అన్నల్లు గలదాన్ని నాగముల్ల దారిలో
అత్తల్లు గలదాన్ని నాగముల్ల దారిలో
గర్భీణి మణీసిని నాగముల్ల దారిలో
కాళ్ళుమొక్కుతానయ్య నాగముల్ల దారిలో
అంటాకు ముట్టాకు నాగముల్ల దారిలో
అన్న వవ్వు తావయ్య నాగముల్ల దారిలో
శెల్లెల్ని నారీని నాగముల్ల దారిలో
తప్పూ సేయకుమయ్య నాగముల్ల దారిలో

అప్పూడు పటేలు నాగముల్ల దారిలో
యెట్లవున్నాడయ్య నాగముల్ల దారిలో

దున్నపోతూ వోలె నాగముల్ల దారిలో
దగ్గీరి కొస్తాడే నాగముల్ల దారిలో
పొటేలు వోలెను నాగముల్ల దారిలో
పటేలు వస్తాడె నాగముల్ల దారిలో
పరిటెకొంగును బట్టి నాగముల్ల దారిలో
పడ గుంజె పటేలు నాగముల్ల దారిలో

అయ్యయ్యొ పటేల నాగముల్ల దారిలో
అన్యాయమేమయ్య నాగముల్ల దారిలో
కాల్లుమొక్కుతానయ్య నాగముల్ల దారిలో
కనికరించు పటేల నాగముల్ల దారిలో

అంటాది నారమ్మ నాగముల్ల దారిలో
అరిసి యేడ్పు పెడతాది నాగముల్ల దారిలో
కటికోడు పటేలు నాగముల్ల దారిలో
కాసింత వినలేదు నాగముల్ల దారిలో

పట్టేమంచము పైకి నాగముల్ల దారిలో
పడలాగే నారీని నాగముల్ల దారిలో
పటేలు నారమ్మ నాగముల్ల దారిలో
పవ్వలించారమ్మ నాగముల్ల దారిలో

అప్పూడు ఆయాల నాగముల్ల దారిలో
యేమి జరుగుతాదమ్మ నాగముల్ల దారిలో
వెట్టికి బోయీన నాగముల్ల దారిలో
ఎల్లోజి వచ్చిండే నాగముల్ల దారిలో

కడదర్వా వాజమ్మ నాగముల్ల దారిలో
కాడా నిలబడినాడు నాగముల్ల దారిలో

నారమ్మ వో నారి నాగముల్ల దారిలో
నా ముద్దులా నారి నాగముల్ల దారిలో

అని వేగిరము గాను నాగముల్ల దారిలో
ఎల్లోజి బిలిసిండె నాగముల్ల దారిలో

దిగులుపడి నారమ్మ నాగముల్ల దారిలో
దిగ్గునా లేసిందె నాగముల్ల దారిలో
బుగులుపడి నారమ్మ నాగముల్ల దారిలో
బుగ్గునా లేసిందె నాగముల్ల దారిలో

పటేల పటేల నాగముల్ల దారిలో
పాపయ్య పటేల నాగముల్ల దారిలో
వెట్టికెల్లి యెల్లోజి నాగముల్ల దారిలో
వేగిరా నొచ్చిండు నాగముల్ల దారిలో
వురుకయ్య వురుకయ్య నాగముల్ల దారిలో
వురకవయ్య పటేల నాగముల్ల దారిలో

అప్పూడు పటేలు నాగముల్ల దారిలో
యేమానీ అంటాడు నాగముల్ల దారిలో

నారమ్మ వో నారి నాగముల్ల దారిలో
నాలచ్చిమీ నారి నాగముల్ల దారిలో
యాడాకు వురికేది నాగముల్ల దారిలో
యెందూను బొయ్యేది నాగముల్ల దారిలో
అయ్యయ్యొ యియ్యాల నాగముల్ల దారిలో
అన్యాయ మైపోతి నాగముల్ల దారిలో

పటేలు గతిజూసి నాగముల్ల దారిలో
పొంగింది నారమ్మ నాగముల్ల దారిలో
అయినప్పటికి యమ్మ నాగముల్ల దారిలో
యెడ్డీన నారమ్మ నాగముల్ల దారిలో
జాలిదలిసీనాది నాగముల్ల దారిలో
సందు తలుపూ దీసె నాగముల్ల దారిలో

అప్పూడు పటేలు నాగముల్ల దారిలో
హమ్మయ్య అనుకుంటు నాగముల్ల దారిలో
సందులో కురికుండు నాగముల్ల దారిలో
మందిలో జేరిండు నాగముల్ల దారిలో

వురికేటి పటేలుని నాగముల్ల దారిలో
యెల్లోజి జూసిండు నాగముల్ల దారిలో

అప్పూడు యెల్లోజి నాగముల్ల దారిలో
యేమీటి జేసిండు నాగముల్ల దారిలో

యింటిలో కెల్లిండు నాగముల్ల దారిలో
యిల్లంత వెతికిండు నాగముల్ల దారిలో

కత్తినే దీసిండు నాగముల్ల దారిలో
గుడ్లెర్ర జేసిండు నాగముల్ల దారిలో
వుప్పునా ఆకత్తి నాగముల్ల దారిలో
మెప్పుగా నూరిండు నాగముల్ల దారిలో

పెల్లాము వద్దాకు నాగముల్ల దారిలో
పెల్లునా పోయిండు నాగముల్ల దారిలో

సరి సారి యనుకుంటు నాగముల్ల దారిలో
గుండెల్లొ బొడిసిండు నాగముల్ల దారిలో
మేలు మేలనుకుంటు నాగముల్ల దారిలో
మెడ వుత్తరించిండు నాగముల్ల దారిలో
యాడకో యెల్లోజి నాగముల్ల దారిలో
యెల్లిపోయిండమ్మ నాగముల్ల దారిలో

నారమ్మ జెల్లిపోయి నాగముల్ల దారిలో
నాల్గు దినాలాయే నాగముల్ల దారిలో

అప్పూడు పటేలు నాగముల్ల దారిలో
యేమీటి జేసిండు నాగముల్ల దారిలో

మాది గిండ్లా కొచ్చి నాగముల్ల దారిలో
మాటలేమంటాడె నాగముల్ల దారిలో

చినలచ్చి పెదలచ్చి నాగముల్ల దారిలో
చినసుబ్బి పెదసుబ్బి నాగముల్ల దారిలో
నారమ్మ లేదేమె నాగముల్ల దారిలో
నాతోటి జెప్పండె నాగముల్ల దారిలో

అప్పూడు వాల్లంత నాగముల్ల దారిలో
యేమాని అంటారు నాగముల్ల దారిలో

అయ్యయ్య పటేల నాగముల్ల దారిలో
అన్యాయ మేమయ్య నాగముల్ల దారిలో
వెట్టీకి బోయీన నాగముల్ల దారిలో
యెల్లోజి వచ్చిండు నాగముల్ల దారిలో

నాల్గురోజులాయె నాగముల్ల దారిలో
నారమ్మ లేదయ్యె నాగముల్ల దారిలో

సూడంగ ఆయింట నాగముల్ల దారిలో
సెడకంపు పొడకంపు నాగముల్ల దారిలో

అప్పూడు పటేలు నాగముల్ల దారిలో
ఆ యింటి కెల్లిండు నాగముల్ల దారిలో

పక్కునా తాళాలు నాగముల్ల దారిలో
పగలగొట్టిండమ్మ నాగముల్ల దారిలో

యింట్లోకి పటేలు నాగముల్ల దారిలో
యెల్లిపోయిండమ్మ నాగముల్ల దారిలో

పట్టెమంచంమీద నాగముల్ల దారిలో
పడివుండె నారమ్మ నాగముల్ల దారిలో

అప్పూడు పటేలు నాగముల్ల దారిలో
యేమీటి జేసిండు నాగముల్ల దారిలో

చినలచ్చి పెదలచ్చి నాగముల్ల దారిలో
చినసుబ్బి పెదసుబ్బి నాగముల్ల దారిలో
యిక్కాడకూ రండి నాగముల్ల దారిలో
యింట్లోనూ సూడండి నాగముల్ల దారిలో

పన్నెండు మందిని నాగముల్ల దారిలో
పటేలు బిలిసిండు నాగముల్ల దారిలో
వచ్చెను పన్నెండుగురు నాగముల్ల దారిలో
వలవేగిరము వాళ్లు నాగముల్ల దారిలో

సావు సామాగ్రీని నాగముల్ల దారిలో
సక్కాగ దెప్పించీ నాగముల్ల దారిలో
కాటీకి నారీని నాగముల్ల దారిలో
కట్టి తోలిండమ్మ నాగముల్ల దారిలో

అగ్గూలు బెట్టిన్రూ నాగముల్ల దారిలో
ఆ కాటికేయమ్మ నాగముల్ల దారిలో

దినాలు వారాలు నాగముల్ల దారిలో
తాజేసె పటేలు నాగముల్ల దారిలో

యీ కదలు యిట్లుండ నాగముల్ల దారిలో
యేమీని జరిగింది నాగముల్ల దారిలో

యెల్లిపో యెల్లోజి నాగముల్ల దారిలో
యేడేండ్లు అయ్యింది నాగముల్ల దారిలో
యేడేండ్లు యెల్లోజి నాగముల్ల దారిలో
యెంచాకా తిరిగిండు నాగముల్ల దారిలో
యేడేండ్ల కెల్లోజి నాగముల్ల దారిలో
యెట్లానె వస్తాడు నాగముల్ల దారిలో

పటేలుకు సెప్పులు నాగముల్ల దారిలో
బంగారి సెప్పులు నాగముల్ల దారిలో
యెట్లానె జేసిండు నాగముల్ల దారిలో
వెట్టివాండ్లెల్లోజి నాగముల్ల దారిలో
యెంచాక యేడేండ్లు నాగముల్ల దారిలో
యెల్లోజి గుట్టిండు నాగముల్ల దారిలో
అయిసెప్పులు బట్టి నాగముల్ల దారిలో
యాడికీ వచ్చిండు నాగముల్ల దారిలో
పటేలు బాబూకి నాగముల్ల దారిలో
పోయిండు యెల్లోజి నాగముల్ల దారిలో
శేతుల్లో శెప్పూలు నాగముల్ల దారిలో
చూసిండు పటేలు నాగముల్ల దారిలో

అప్పూడు పటేలు నాగముల్ల దారిలో
యేమాని అంటాడు నాగముల్ల దారిలో

అయ్యయ్యొ యెల్లోజి నాగముల్ల దారిలో
అన్యాయమేమీర నాగముల్ల దారిలో
వెట్టిబోయీనువ్వు నాగముల్ల దారిలో
యెన్నాడు వస్తివిర నాగముల్ల దారిలో
అంటాడు పటేలు నాగముల్ల దారిలో
యెరగ నట్టుంటాడు నాగముల్ల దారిలో

అప్పూడు యెల్లోజి నాగముల్ల దారిలో
యేమాని అంటాడు నాగముల్ల దారిలో

రాను ఆరునెల్లు నాగముల్ల దారిలో
పోనూ ఆరూ నెల్లు నాగముల్ల దారిలో
మల్లొచ్చి యేడేండ్లు నాగముల్ల దారిలో
మల్లీవచ్చానయ్య నాగముల్ల దారిలో
సెప్పూలు గుట్టీన నాగముల్ల దారిలో
సూడావు దొరనువ్వు నాగముల్ల దారిలో
సక్కని సెప్పూలు నాగముల్ల దారిలో
సూసిండు పటేలు నాగముల్ల దారిలో
యీ సెప్పులూలేని నాగముల్ల దారిలో
యేమి జన్మంబది నాగముల్ల దారిలో
అనుకోనీ పటేలు నాగముల్ల దారిలో

యేమానీ అంటాడు నాగముల్ల దారిలో
ఆసెప్పులను నువ్వు నాగముల్ల దారిలో
ఎంతాధర కిస్తవుర నాగముల్ల దారిలో

నీయిల్లు యిచ్చీన నాగముల్ల దారిలో
నేనియ్య సెప్పూల నాగముల్ల దారిలో
మానూలు యిచ్చీన నాగముల్ల దారిలో
మరి యియ్యానయ్య నాగముల్ల దారిలో

యెవసాయమిస్తాను నాగముల్ల దారిలో
యిస్తావ యెల్లోజి నాగముల్ల దారిలో

యెవసాయ మొద్దయ్య నాగముల్ల దారిలో
యియ్యాను పటేల నాగముల్ల దారిలో

యేడు దొడ్లకాడ నాగముల్ల దారిలో
కోడెద్దు లుండయ్యి నాగముల్ల దారిలో
వాటీని యిస్తార నాగముల్ల దారిలో
యివ్వార సెప్పూలు నాగముల్ల దారిలో

వద్దయ్య కోడెల్లు నాగముల్ల దారిలో
యియ్యాను సెప్పూలు నాగముల్ల దారిలో

చెల్లేల నిస్తార నాగముల్ల దారిలో
సెప్పూలు యిస్తావ నాగముల్ల దారిలో

వద్దయ్య నీసెల్లి నాగముల్ల దారిలో
యియ్యాను సెప్పూలు నాగముల్ల దారిలో

తల్లినే యిస్తాను నాగముల్ల దారిలో
తేరా నీ సెప్పులూ నాగముల్ల దారిలో

వద్దయ్య నీతల్లి నాగముల్ల దారిలో
యియ్యాను సెప్పూలు నాగముల్ల దారిలో

మరదండ్ల యిచ్చేద నాగముల్ల దారిలో
మరి యీర సెప్పూలు నాగముల్ల దారిలో

మరదండ్లు నాకొద్దు నాగముల్ల దారిలో
మరియియ్య సెప్పూలు నాగముల్ల దారిలో

పెండ్లాన్ని యిస్తార నాగముల్ల దారిలో
పడవెయ్యి సెప్పూలు నాగముల్ల దారిలో

ఆపలుకు విన్నాడు నాగముల్ల దారిలో
యెట్లుండు యెల్లోజి నాగముల్ల దారిలో
పకపక యెల్లోజి నాగముల్ల దారిలో
పక్కూన నవ్విండు నాగముల్ల దారిలో
పటేల పటేల నాగముల్ల దారిలో
పాపయ్య పటేల నాగముల్ల దారిలో
యింకేమి ఆలశ్యం నాగముల్ల దారిలో
యింటీకి తోలియ్యి నాగముల్ల దారిలో

పాపయ్య పెండ్లాన్ని నాగముల్ల దారిలో
బంగరి రెడ్డీసాన్ని నాగముల్ల దారిలో
పైనాము నమ్మాని నాగముల్ల దారిలో
పటేలు సెప్పంగ నాగముల్ల దారిలో

ఆరెడ్డీ సానమ్మ నాగముల్ల దారిలో
యేమాని అంటాది నాగముల్ల దారిలో

అయ్యయ్యొ యెల్లోజి నాగముల్ల దారిలో
అన్యాయ మేమీర నాగముల్ల దారిలో
మేమూ కాపులమూర నాగముల్ల దారిలో
మాదిగోడవు నువ్వు నాగముల్ల దారిలో
మంది పెండ్లామూల నాగముల్ల దారిలో
మరి గుత్త గొంటావ నాగముల్ల దారిలో

అప్పూడు యెల్లోజి నాగముల్ల దారిలో
యేమాని అంటాడు నాగముల్ల దారిలో

అయ్యో వో రెడ్డిసాని నాగముల్ల దారిలో
అన్యాయ మేమమ్మ నాగముల్ల దారిలో

మాదిగోల్ల పెండ్లాల నాగముల్ల దారిలో
మంచాలా మీదాను నాగముల్ల దారిలో
పటేలు పాపయ్య నాగముల్ల దారిలో
పన్యాడు సక్కంగ నాగముల్ల దారిలో
మీకు లేనీతప్పు నాగముల్ల దారిలో
మాకెందు కోయమ్మ నాగముల్ల దారిలో

ఆమాట లిన్నాది నాగముల్ల దారిలో
ఆ రెడ్డీసానమ్మ నాగముల్ల దారిలో

సిగ్గునా వంచింది నాగముల్ల దారిలో
శిరమూను ఆయమ్మ నాగముల్ల దారిలో

తగాద లేదాని నాగముల్ల దారిలో
తరలి రెడ్డీసాని నాగముల్ల దారిలో
మాదీగ వాడలకు నాగముల్ల దారిలో
మరి వచ్చినాదమ్మ నాగముల్ల దారిలో
AndhraBharati AMdhra bhArati - naagamulla daariloo - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )