దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
("శూర్పణక అపురూపసౌందర్యవతి అని నా నమ్మకం - ఆ అందంలో - శ్రీరాముడు మాత్రం ఏం తీసిపోయాడు కనుక - (రాముడూనూ దేముడైతే కోతిసాయమెందుకు??) లీనమైపోయాడేమో - ప్రమాదం వస్తుందని గ్రహించి అందం లేకుండా వికారంగా చూపాలని లక్ష్మణుడు శూర్పణక ముక్కుచెవులూ కోసిపంపాడు - పాపం! అన్నవద్దకు గోడుగోడున వెళ్ళి తనకు జరిగిన అక్రమాన్ని అన్నకు మొరపెట్టుకుంది - ఏ అన్న తోబుట్టువును ఈలాటి బాధలో చూసి సహిస్తాడు - ఆ బాధతో తన చెల్లెలికి జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా (లక్ష్మణుడు యిలా తొందరపడకపోతే సీత అపహరణ - లంకాదహనం వుండేవేకావు-) సీతను చెరపట్టి బంధించాడు - లంకలో సీతను ఒక్క మాటకూడా అనకుండా ముక్కూచెవులూ కోయగలగడం రావణాసురునికి ఓ లెక్కలోనిది కాదు - అయినా లక్ష్మణుడిలా పాపకార్యానికి తలపెట్టలేదు" అన్న మహతి మాటలు నిజమా? అనిపించకమానదు - ఈ పాట లక్ష్మణుని తొందరపాటుపనిగా శూర్పణక చెవులూ ముక్కూ కోయడం - అన్నతో చెప్పుకోడంకు సంబంధించినది)

113. శూర్పణక గోడు

అన్నరోరి నాదు గతి
కన్నులార జూడు మన్న
కనులార గాంచి నన్ను
కన్నెత్తి గాంచుమన్న
అయోధ్య పురమట
దశరథ కొడుకులట
రామలక్ష్మణ పేరులట
రాముభార్య జానకట
నన్ను పెళ్లి చేసుకోమని
నేనుచెప్ప నంతలోనె
ముక్కు జెవులుకోసి రన్న
నన్నీ రీతిన జేసిరన్నా
వేగమె నీవు పోయి
వైదేహి తెచ్చి నీవు
లంకలోన పెట్టుమన్న
నా కసి తీర్పుమన్న
మారువేషమేసుకొని
మాయమాటలు పల్కినీవు
ధరణిజను తీసుకొచ్చి
లంకలోన దాచుమన్న
AndhraBharati AMdhra bhArati - shuurpaNaka gooDu - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )