దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
(భయంతో వణికించి - అధికారంతో హడలగొట్టి - కావాలని అడిగి - ఉపహారాలు అందుకొనే దేవతలు - గ్రామానికీ నగరానికీ తప్పనిసరి-

పాతనమ్మకాల బజారులో సరుకులు కొనుక్కునే అమాయకులకు పోలేరమ్మలూ - పెద్దమ్మలూ నిత్యం ఎదురయ్యే స్వరూపాలు -

ఆ పాతనమ్మకంలోని అమ్మవారి హడావిడికి ప్రాంసరీనోటు ఇది -

చదవండి - తోచిందా ఓ కొబ్బరిబొండం మీరూ కొట్టండి. ధైర్యం ఉంటే మీరే త్రాగేయండి)

114. పూనకం

నరుడ నరుడ నరుడోం వోం నరుడా

ఏటి తల్లీ ఏటపరాదం శేసాం?
ఏందోలె తల్లీ యీ కోపమూ?

కోకలిచ్చినావా? నరుడా
కోరిక తీర్చావా? నరుడా
కోళ్లు కోసినావా? నిరుడు
గొర్రెలిచ్చినావా? నరుడా
సున్నమేసినావా? గుడికి
కుంకమిచ్చినావా? నరుడా
ఓ నరుడా?

నేదు తల్లీ నేదు
యిప్పుడిత్తాం సెప్పు

గనవైనా బాగోతం
గట్టిగా కట్టించు
సద్ది నైవేద్దాలు
ముప్పూటా బెట్టించు
ముంగిటా దివ్వేలూ
ముచ్చటగ వెలిగించు
పందిట్లో బాజాలు
బాగుగా వాయించు
వేపా కొమ్మాలతో
ఎనుబోతూ పూజించు
పసుపుకుంకుమతోటీ
నలుగేమో పెట్టించు
గడప గడపలో నాకూ
గండాల మొక్కూలు
బొండాపు కాయాలు
మండిగల పారాణి
దండీగా పెట్టించు
నరుడ నరుడ నరుడోం
ఓ నరుడా

ఏటి కూళ్లా తల్లీ
అంకమ్మా మాతల్లి
పండగలు సేత్తాము
పబ్బాలు సేత్తాము
జనమంతా మీ ఓళ్లు
కాపాడు తల్లీ

నచ్చీ నావుర నరుడా
మెచ్చీ నానుర నేను
వూరు సుట్లోలదిరిగి
వూళ్లోనా కాలెడతా
మిమ్మల్ని దీవిత్తా
మాటాతప్పకు నరుడా
మంచీ దానిని కాను
నరుడ నరుడ నరుడోం
ఓ నరుడా
AndhraBharati AMdhra bhArati - puunakaM - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )