దేశి సాహిత్యము యక్షగానములు సుగ్రీవ విజయము
కందుకూరి రుద్రకవి

మధురకవితలు
పీఠిక - శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి

సుగ్రీవ విజయము - కందుకూరి రుద్రకవి
ఉ. శ్రీవిభుగొల్చి శంకరు భజించి చతుర్ముఖునెంచి భార్గవీ
గ్రావసుతా సరస్వతులఁ బ్రార్థన సేసి గణేశపాదపూ
జావిధిసల్పి దేశికుల సంస్తవనం బొనరించి కావ్యవి
ద్యావిదులన్‌ నుతించి కవితాజడులన్‌ నిరసించి వేడుకన్‌.
వ. అని కవీశ్వరుండు కృతీశ్వరుండగు కందుకూరి జనార్దనస్వామి నేమని కొనియాడుచున్నాఁడు.
త్రిపుట. (ఆహిరి)
లలితగాత్రుఁడు శుభచరిత్రుఁడు దళితశత్రుఁడు సుజనమిత్రుఁడు
నళిన నేత్రుఁడు కందుకూరి జనార్దనుండు
ఇందిరార్యుఁడు సాధువర్యుఁడు పృథులశౌర్యుఁడు మేరుధైర్యుఁడు
నందితార్యుఁడు కందుకూరి జనార్దనుండు
ధృతివిశాలుఁడు గానలోలుఁడు దివిజపాలుఁడు ధర్మశీలుఁడు
నతదయాళుఁడు కందుకూరి జనార్దనుండు
వ. అని మఱియు నద్దేవతాసార్వభౌమునకు షష్ఠ్యంతంబులు సెప్పిన విధం బెటువలెను.
అర్ధచంద్రికలు. (సౌరాష్ట్ర)
చదువులు దెచ్చిన జలచరపతికిన్‌
కుధరము మోచిన కూర్మంబునకున్‌
మేదిని దాల్చిన యాదిమకిటికిన్‌
కనకకశిపుఁ దునిమిన నరహరికిన్‌
బలినణఁచిన మాయల వడుగునకున్‌
మనుజేశులఁ గొట్టిన రామునకున్‌
రావణుఁజంపిన రఘువర్యునకున్‌
భానుజుఁ గూల్చిన బలభద్రునకున్‌
దనుజ సతులఁ దగిలిన బుద్ధునకున్‌
ఖలు నణఁపంగల కల్క్యాకృతికిన్‌
సర్వము దానగు జన్నప్పనికిన్‌.
వ. అంకితంబుగా నా యొనర్పంబూనిన సుగ్రీవవిజయంబను యక్షగానంబునకుం గథాక్రమం బెట్టిదనిన.
సీ. శ్రీరామచంద్రుండు సీతామహాదేవిఁ
గాననంబున వెదకంగ వచ్చి
పంపాసరోవర ప్రాంత్యభూములయందు
సౌమిత్రియునుఁ దాను సంచరింప
నావేళ సుగ్రీవుఁడధిక సంభ్రమముతో
ఋష్యమూకమున వర్తించుచుండి
చూచి యా ఘనుల తేజోవిశేషములకు
వెఱఁగంది మంత్రికోవిదున కనియె
గీ. 'వీరు మనలను వధియింప వేషమొంది
వాలి పంపిన వచ్చినవారు గాను
నాకుఁ గాన్పించుచున్నది గాక యున్నఁ
దాపసులకేల శరచాపధారణంబు?'
వ. అని పలికి యచ్చోట నిలువంజాలక భయపడుచున్న సుగ్రీవునితో హనుమంతుండేమనుచున్నాఁడు.
త్రిపుట. 'కపికులోత్తమ! నాకుఁజూడఁగఁ గపటవేషము గానరాదిది
విపులపుణ్యులఁ బాపమతులని వెఱవనేలా?
ఏల ఇచటికి వచ్చిరో వీరెవ్వరో ఈ రూపవంతులు
చాల పరిశోధించి చూతము జడియవలదు.
రాజవంశ్యులు రాజతేజులు రాజపురుషులు రాజవీర్యులు
రాజసంబున నిటకు నేమిట రాఁగతంబో?
ఈ మనోహర రూపవైఖరు లిట్టి తేజముఁ గలుగు వారికి
భూమినెటు వలె దుష్టగుణములు వొడమునయ్యా?
ఏను నచటికిఁ బోయి వారల పూనికంతయుఁ దెలిసివచ్చెద
భానునందన! వెఱవనేటికిఁ బంపు నన్ను.
నేర్పునను జని వారి రాకయు నియతవృత్తియు నిజముఁ గల్లయు
నేర్పరించెద నుండుమిచ్చట నినతనూజ!'
వ. అని పలికిన 'నీవుపోయి వారల వృత్తాంతంబంతయుఁ దెలిసి ర'మ్మని హనుమంతుని బంపి సుగ్రీవుండు దా నచ్చోట నుండవెఱచి మలయాద్రికిఁ బోయె; నట హనుమంతుడు రామలక్ష్మణుల సన్నిధికి వచ్చి దండ ప్రణామంబులు సేసి యేమనుచున్నాఁడు.
త్రిపుట. 'అయ్య! మీరలు రాజసుతులో యతులో తెలియగరాదు సందియ
మయ్యె మునివేషములు నృపచిహ్నములు గలుగన్‌
ఏల నిచటికి వచ్చితిరి మీరెవ్వ రెప్పుడు నెచట నుందురు?
చాల మిము గనుఁగొన్న మాకాశ్చర్యమయ్యెన్‌
వెంట నెవ్వరులేక యీమునివేషములతో నడవిలోపల
నొంటిఁ దిరుగఁగ నేమి కార్యం బొదవె మీకున్‌?'
వ. అని పలికిన హనుమంతుని జూచి లక్ష్మణునితో శ్రీరామచంద్రుఁడేమనుచున్నాఁడు.
జంపె. వీని నమ్మగవచ్చు విశ్వాసపరుడౌట
వీని నమ్మగవచ్చు విశ్వంబులోను
పుట్టు బ్రహ్మచారి భుజబలోన్నతశాలి
ఘనవజ్ర పంజరముకంటె లక్ష్మణుఁడా!
మంచివాడగు వీడు మర్మజ్ఞు డితడౌను
మన జానకిని తెలియ మఱి యుత్తముండు.
వ. అనిన శ్రీరామచంద్రునితో హనుమంతుం డేమనుచున్నాఁడు.
ద్విపద. అని పల్కి వినయమొప్పారంగ నున్న
హనుమంతుఁ జూచి యిట్లనియె లక్ష్మణుండు
'వనచరవీర! యిక్ష్వాకువంశమున
జనియించి లోకప్రశస్తుఁడైనట్టి
దశరథేశ్వరుఁడు మాతండ్రి; యీ విమల
యశుఁడు రాముఁడు; లక్ష్మణాహ్వయుఁడేను
దండ్రి యానతి మీఁదఁ దాపసవృత్తి
దండకాటవి లోన ధరణిజ మేము
సంచరింపఁగ రామజనపాలు దేవి
నంచితచారిత్రయగు సీత నెత్తు
కొనిపోయె దుష్టమార్గుండు రావణుఁడు
మనమున నెంచక మము డాగురించి
వాని పోఁబడి ఘోరవనభూములందుఁ
బూనికఁ దెలియంగఁ బూని యేతెంచి
కమనీయ గుణ పుష్పకబరి యా శబరి
సుమహితాత్ముఁ డటంచు సుగ్రీవుఁ జెప్ప
దానిచే నతని వృత్తాంతమంతయును
వీనులకింపుగా విని యా కపీంద్రు
నాదరంబున నేలి యతని చిత్తంబు
ఖేదమంతయు మాన్పఁ గృపపుట్టి ఇటకు
వచ్చినవార; మెవ్వఁడవు? మా మదికి
వచ్చియున్నవి నీ ప్రవర్తనల్గొన్ని
దెలియజెప్పు' మటన్న దినకరవంశ
జలధీందునకుఁ గపిచంద్రుఁడిట్లనియె.
జంపె. (భైరవి)
'ఇనవంశతిలక! నే నినతనూభవు మంత్రి
ననిలజుఁడ నాపేరు హనుమంతుఁ డండ్రు
కపులకెల్లను రాజు కార్యఖడ్గములందు
నిపుణుండు సుగ్రీవుఁ డపరిమితబలుఁడు
మెలుపొందఁగా నతని మీకు బంటుగఁ జేయ
నలినాప్తకులవర్య! నాచేతనౌను'
వ. అనిన రాఘవేశ్వరుని చిత్తంబెఱిగి లక్ష్మణుఁడు హనుమంతునితో నేమనుచున్నాఁడు.
జంపె. (కళ్యాణి)
'శ్రీరామచంద్రుఁ డాశ్రితరక్షుఁడు మేరు
ధీరుండు శూరుండు దివ్యాస్త్రవిదుఁడు
ఈమహామహు సేవ యేప్రొద్దుఁ గావింతు
నేమఱక బంటనై యేను గపివర్య!
పూనుకొని రఘురామభూపతికి సాధింప
రాని కార్యము లేదు త్రైలోక్యమునను
ఐన రాజులు నొంటి నరుగ ధర్మముగాదు
కాన రాముఁడు మిమ్ము గైకొనఁగఁ దలఁచెన్‌'
వ. అని పలికి 'నీవు పోయి గొబ్బునఁ గార్యంబు సమకూర్చు'మని పంపిన హనుమంతుండు శ్రీరామలక్ష్మణులకు మ్రొక్కి వీడ్కొనిన పిమ్మట నెటువలెను.
ద్విపద. అనిలనందనుఁడేగి యర్కతనూజుఁ
గని మ్రొక్కి పలికె 'నో కపికులాధీశ!
ఆరూఢి నీకు ననాయాసమునను
శ్రీరాముఁడనెడి నిక్షేపంబు దొరకె
నింక నీయక్కఱలెల్లను దీఱెఁ
గొంకక రఘురాముఁ గొల్వు మేతెంచి'
యనిన సుగ్రీవుండు హనుమంతుతోడ
ననియె సంతసమంది 'యనఘ! నీ కతన
సలలితంబుగ రామచంద్రుని జూడఁ
గలిగె, నా శోకాంధకారంబు వాసె
నాలస్యమేల చయ్యన ఋష్యమూక
శైలంబునకు రామజనపాలు తోడి
తె'మ్మన్న నేఁగి ధాత్రీపాలసుతుల
సమ్మతిఁ దోడ్కొని సరగ నేతెంచి
నికట స్థలంబున నిలిపి సుగ్రీవు
నకు విన్నవించిన నయమొప్ప నతఁడు
వచ్చి యా రాఘవేశ్వరునకు మ్రొక్కి
మచ్చిక నతనిచే మన్ననల్‌ గాంచి
యమ్మహామహునిచే నగ్నిసాక్షిగను
నమ్మికల్గొని తాను నమ్మికలొసఁగి
గుహలోపలికి దోడుకొనిపోయి, మున్ను
మహిపుత్రి యాకాశమార్గంబునందు
దనుజాధముండైన దశకంఠుఁ డెత్తు
కొని పోవునప్పుడా కుధరంబు మీఁద
వడి మూటగాఁ గట్టివైచిన యట్టి
తొడవులం గడు భక్తితోఁ గొంచు వచ్చి
యవనీశునకు నిచ్చి యవి వచ్చినట్టి
వివరమంతయుఁ దెల్ప విని మూర్ఛవోయి
యల్లనఁ దెలివొంది యా భూషణముల
నెల్ల నేర్పడఁ జూచి యెద నొత్తుకొనుచు
వ. అప్పుడు దుఃఖావేశంబున రామచంద్రుఁ డేమని శోకించుచున్నాఁడు.
త్రిపుట. (ఆహిరి)
'హా సతీమణి! ధర్మచారిణి! హా గుణోన్నత! జనకసుత! నను
బాసిపోయితి వింతలోనె పద్మనయన!
ఎంత భయపడి తల్లడించితొ యెంతయడలితొ యెంతబడలితొ
యింతి! రావణుఁడెత్తికొని చన; నేమిసేతున్‌;
నన్ను విడిచియు నిలువఁజాలక నాతి! వచ్చితి వడవిఁ దిరుగను
నిన్ను విడి యేనెట్టులోర్తును నీలవేణి!
లేఁటి మాయలు మదిని దెలియగ లేక పాపపు రక్కసునిచే
బోటి! నిను గోల్పడితిని నిఁక నాకేటిబ్రతుకు;
ఇందుముఖి! నిను బాసినప్పుడె యేల పోకను నిలిచెఁ బ్రాణము?
నిందలకుఁ బాలైతి ధరలో నిన్నుఁ బాసి;
రమణిరో! నిను బాసినప్పుడె రాతిరే శివరాతిరాయెను
నిముసమైనను నాదుకంటికి నిదురరాదు;
పలుకు పలుకున నొలుక నమృతము పలుకనేర్చిన జాణ! ముద్దుల
కలికి! చిలుకలకొలికి! నిన్నెటం గందునొక్కొ!
కూడఁ జని యాపసిఁడిమృగమును గూల్చి చర్మముదెచ్చినాఁడను
వేడుకలుఁ గనుఁగొనఁగనేరక వెఱ్ఱినైతి;
లలన! నినుఁ గలనైనఁ బాయఁగఁగలన, నీవిటలేక యుండినఁ
జలనమొందెను నాదు హృదయము జలజనయనా!
నన్ను నీవెడఁబాయ వెన్నడు; నిన్ను నేనెడఁబాయఁజాలను;
గన్నెరో! యీవెతలు వచ్చెను గడవఁదగవే.'
వ. అని మఱియు నేమనుచున్నాఁడు.
జంపె. 'తరణి కులమున బుట్టి శరచాపములు బట్టి
తరుణిఁ గోల్పడు కంటె మరణమే మేలు!
నను శౌర్యవంతుఁడని తనపుత్రి నిడినట్టి
జనకవిభుఁ డీవార్త విని వగవకున్నె!
ఒకట నొచ్చము లేక యున్న రవివంశమున
కకట నాచే నింత యపకీర్తి వచ్చెన్‌'
వ. అని పలికి రాఘవేశ్వరుం డెటువలె నుండెను.
అర్ధచంద్రికలు. కన్నుల నశ్రులు గ్రమ్మగ వగచున్‌
ఔరా! విధివశమని తలయూఁచున్‌
ఏటికి ప్రాణము లిఁకనని తలఁచున్‌
క్రమ్మఱ సొమ్ములు రొమ్మున నొత్తున్‌
ఏగతి నోరుతు నిఁకనని పలుకున్‌
బాపురె విధియని ఫాలము ముట్టున్‌
వ. అని పలికి 'వగవ సమయంబిదిగాదు జానకిని సాధించుటకు మున్ను వీని పగదీర్తు'నని తలంచి సుగ్రీవునితో రామచంద్రుం డిట్లనుచున్నాఁడు.
గీ. 'నమ్ము సుగ్రీవ! ఇంద్రనందను వధించి
నిఖిల వానరరాజ్యంబు నీకు నిచ్చు
వాఁడ; మీలోన మీకును వైరమైన
కారణంబేమి?' యనఁ బల్కె కపివరుండు.
జంపె. (పాడి)
'అఘవర్తనుండు మాయావి యనియెడు వాఁడు
రఘువంశతిలక! యొక రక్కసుఁడు గలఁడు;
వాలితో ననిచేసి వాడు నిల్వఁగలేక
శైలగుహ చొఱఁబాఱె చని భీతితోడన్‌
చనినఁ బోవఁగనీక చనియె వెంబడిఁ దాను
వనచరేంద్రుఁడు నన్ను వాకిటనె యునిచి
చని వానితో నొక్క సంవత్సరము పోరె
ననిమిషాధిపసూనుఁడా బిలములోనన్‌'
అర్ధచంద్రికలు. (నాట)
'అంత నెత్తురు టేఱు లంతటనె వచ్చెన్‌
రక్కసుని ఘోషములు వెక్కసము లాయెన్‌
వినరాక పోయెఁ గపివీరవరు పలుకున్‌'
వ. 'అంత నేను చింతాక్రాంతుండనై రాక్షసుని చేత వాలి మృతుండాయెనని నిశ్చయించి యాగుహవాత నొక్క పాషాణంబుఁ ద్రోచి యింద్రజునకుఁ దిలోదకంబులు విడిచి కిష్కింధకు వచ్చునపు' డెటువలె నుండెను.
కుఱుచజంపె. (త్రిభంగులు)
'వనచరోత్తములెల్ల వచ్చి - మంచి
దినము చేకొని నన్నుఁ దెచ్చి
కపిరాజ్యంబు గట్టి- రెల్ల
కపులు చూడగ మూఁక గట్టి
మెఱయ నను దొరను గావించి - కొలిచి
రిరుగడల భక్తిచే మించి.'
ద్విపద. 'అంత నారాక్షసు ననిలోనఁ ద్రుంచి
సంతోషచిత్తుఁడై చనుదెంచి వాలి
యగ్గిరి గహ్వరం బంతయుఁ దిరిగి
యగ్గుహ నాశిల నుగ్గుగాఁ దన్ని
అచ్చోట నను గాన కాగ్రహం బొదవఁ
జెచ్చరఁగదలి కిష్కింధకు వచ్చి
వనచరకోటి కొల్వంగ నున్నట్టి
ననుఁ జూచి పలికె వానరులు భీతిల్ల

"ఓరి! దుష్టాత్మ! సహోదరుఁడనుచు
గూరిమి నిను నమ్మి గుహవాత నునిచి
పగఱపైఁ జనిన నాపాటు గన్గొనక
తెగి రాజ్యభారంబు దీర్పవచ్చితివి.
చేటు గోరుచునున్న చెనటివి నీవు
పాటించి నమ్మితి బంధుండ వనుచు
ద్రోహివి నినుఁబట్టి త్రుంపక రోష
దాహంబు తీఱదు తపనజ నాకు"
నని పల్కి నాపత్నియగు రుమాకాంత
గొని నాప్రధానులఁ గొట్టి నాతోడ
కదనంబు సేయ, నక్కడ నిల్వలేక
కొదుకుచు వచ్చి యీకొండ నెక్కితిని
ఈకొండ యవ్వానరేశ్వరుఁ డెక్క
రాకుండ శపియించె రఘురామ! తొల్లి
యనఘుఁడైన మతంగుఁడను మహామౌని'
యనిన సుగ్రీవున కనియె రాఘవుఁడు.
వ. 'ఏమికతంబున వాలి కీకొండనెక్కరాకుండ మతంగుండు శపియించె' నని యడిగిన రామచంద్రునకు కపిచంద్రుండేమనుచున్నాఁడు.
త్రిపుట. (ఆటతాళము)(గంభీరనాట)
'అసురవీరుండు గలఁడు దుందుభి యనఁగ నొకఁడు, నిర్జర
విసరమును బలుమాఱు గెలిచిన విజయశాలి;
అనఘ! వాఁడొకనాడు మహిషంబగుచు వచ్చి, వారిధి
ననికిఁ బిలిచినఁ జాల భయపడి యంబురాశి
ఘనతరంబగు రత్నజాలము కానుకిచ్చి పలికెను
"దనుజవల్లభ! వెఱతు నీతోఁ దలపడంగన్‌;
ఈ జగంబున వింధ్య పర్వతమేమొ కాని, నీతో
నాజి కెంతటి వాఁడుగావలె నసురవర్యా!"
వ. అనిన విని ధైర్య గుణావంధ్యంబగు వింధ్యంబు కడకేగి తన సత్త్వంబు చూపె'నట యెటువలెను.
అర్ధచంద్రికలు. (పాడి)
'శ్రుంగములఁ బడ బొడిచె నగ్గిరి శృంగములను
పాదములఁ బడదన్నె నగ్గిరిపాదములను
గండములఁ బడఁద్రోచె నగ్గిరి గండములను'
ద్విపద. 'అపుడు చిత్తంబులో నతిభీతి నొంది
విపుల సంభ్రమముతో వింధ్యాద్రివిభుఁడు
దనుజవల్లభునకుఁ దనయందు గల్గు
ఘనతరవస్తువు ల్కానుక లిచ్చి
"దానవాధీశ! నా తరమె నీ తోడఁ
బూని కయ్యము సేయఁ బోయి వేగంబె
అసమాన బలశాలియగు వాలితోడఁ
గసితీర యుద్ధంబు గావింపు మతఁడు
నీకు మార్పడి పోరనేర్చు" నటన్నఁ
జేకొని వాఁడు కిష్కింధకు వచ్చి
గుహలెల్ల ఘూర్ణిల్ల కొండలు డుల్ల
మహి తల్లడిల్ల సామజములు డిల్ల
నని సేయఁ బిలిచిన నసురేంద్రుమీద
వనచరమండలేశ్వరుఁడు కోపించి.'
త్రిపుట. (ఆటతాళము) (ఆహిరి)
'రోషమున గుహ వెడలి శైలవిరోధిసుతుఁడు, మహిష
వేషమునఁ బొలుపొందు దానవవిభునిఁ జూచి
రెండు కొమ్ములు పట్టుకొని పోకుండ నాఁగి, కపినా
థుండు మాయాదైత్యు మహిఁ బడఁద్రోచి చంపెన్‌
లీల మీఱఁగ జంపి వాని కళేబరంబున్‌ దన్నెన్‌
జాల పౌరుష మొప్ప నొక యోజనము పోవన్‌
తన్నినపుడు దానవుని రక్తంబు వచ్చి మెండుగ
నిన్నగేంద్రము మీఁదఁ బడిన సహింపలేక
బల్లిదుండు మతంగముని శాపంబొసంగెన్‌, వాలికి
నెల్లకాలం బిమ్మహీధర మెక్కకుండన్‌
ఆ కళేబర మంతదూరం బరుగఁ జిమ్మన్‌, వాలికి
గాక, చెల్లునె యన్యులకు రాఘవ నృపాలా!'
వ. అని పలికి యాకళేబరంబు దగ్గఱకు రామచంద్రుం దోడ్కొనిబోయి సుగ్రీవుం డేమనుచున్నాఁడు.
జంపె. 'ఇదియొక్క యోజనము హెచ్చుగాఁ జిమ్ము నీ
పద పద్మ యుగమునకు బలిమి గలదేనిన్‌
వాలి కంటెను నిన్ను వరబలాధికుఁ డనుచు
జాల నమ్మఁగ వచ్చు జనపాలతిలక!
చెలువొంద నిటుసేయఁ జేరు ధైర్యము నాకు
బలకాంక్ష చేకూరు భక్తిచే నిపుడు.'
గీ. అనిన విని రాఘవేశ్వరు డలఁతి నవ్వు
నెమ్మొగంబునఁ జిగురొత్త నిలిచి పాద
వనరుహాంగుష్ఠమున జిమ్మె దనుజవరుని
సముదితాంగంబు పదియోజనములఁ బడగ.
వ. ఇవ్విధంబునం దుంధుభి కళేబరంబు తనబొట్టనవ్రేలఁ బదియోజనంబుల పొడవుఁ బడజిమ్మి నిలిచిన రామచంద్రునితో సుగ్రీవుం డేమనుచున్నాఁడు.
త్రిపుట. (ఆహిరి)
'నరవరోత్తమ! వాలి చిమ్మెడు నాఁడు దైత్యకళేబరంబున
నరయ నున్నవి రక్తమాంసము లధికముగను
చిమ్మితివి నేఁడస్థిమాత్రము చిక్కియున్నది గాన మిక్కిలి
నమ్మలేనే నధిక బలుఁడని నరవరేణ్యా!
ఇట్టి సంశయ మడఁగుటకు నాయిచ్చ నొక్క విధంబు దోచెను
గట్టిగా వినిపింతు నది విను ఘనత మీఱన్‌.'
ఆటతాళము. 'జోడుగూడక వక్రగతులగు నేడు తాళ్లన్‌, సరిగాఁ
గూడఁ గౌఁగిటబట్టి యాకులఁ గోయు వాలి
తరువులేడును గాఁడనొక యస్త్రంబు దొడిగి, యేసిన
వర బలాధికుఁ డనఁగవచ్చును, వాలి కంటెన్‌'
అనుచు బలికిన నవ్వి రాఘవుఁ డమ్ముదొడిగి, యేసెను
ఘనతరంబగు నేడు తాళ్లను గాఁడి పాఱన్‌
తరువు లేడును గాఁడి యా భూధరముగాఁడి, శేషుని
పురము గనుఁగొని శరము గ్రమ్మఱఁ బొదికి వచ్చెన్‌.
వ. అప్పుడు రామచంద్రునకు సుగ్రీవుండు సాష్టాంగ దండప్రణామంబు సమర్పించి యేమని కొనియాడుచున్నాఁడు.
జంపె. (రామప్రియ)
'భుజ నిర్జిత తాల బుధవిహంగ రసాల
రజనీచరాభీల రామభూపాల!
దివిజనార్చనలోల తేజోబలాభీల
రవివంశసంశీల రామభూపాల!
సమరాగ్రజయశీల శత్రుజనవాతూల
రమణీయగుణజాల రామభూపాల!'
వ. అని మఱియు సుగ్రీవుఁ డేమనుచున్నాఁడు.
త్రిపుట. 'దేవ! నీ మహిమంబు తెలిసియు దెలియనైతి మనంబులోఁ బ్ర
జ్ఞా విహీనుఁడనైతి మిక్కిలి జడుఁడనైతిన్‌
నీకె యీశరలాఘవము దగు నీకె తగు నీ చిత్రమహిమము
లోకులకు లేదఱయగా నేలోకములను
కరుణతో నానేరమంతయుఁ గాచి యాపదలెల్ల దీర్చియుఁ
బరమపావన! యేలు నను నీబంటుగాను
శరణు జొచ్చిన వానిఁ గాచుట జానకీపతి! యుత్తమంబయి
వఱలుఁ గావున నన్నుఁ గావుము వాలి యెదురన్‌
నిన్ను నమ్మితి నన్నుఁ గావుము నిక్కమిల నాదైవమైతివి
సన్నుతింపగ నెంతవాఁడను సరసిజాక్షా!'
వ. అని సన్నుతించిన సుగ్రీవునింజూచి శ్రీరామచంద్రుండు దయారససమన్వితుండగుచు నేమనుచున్నాఁడు.
గీ. 'పొమ్ము సుగ్రీవ! కిష్కింధ పురమునకును
వాలితోఁగూడ యుద్ధంబు లీలఁజేయు
నాదు శరముల నాతని నమర ద్రుంచి
నిఖిల వానరరాజ్యంబు నీకునిత్తు.'
వ. అని పంపి తానును వెంబడి లక్ష్మణసహితంబుగా వచ్చి యొక్క వృక్షంబు చాటున నుండె నప్పు డెటువలెనుండెను.
ద్విపద. దినకర తనయుండు దేవేంద్రతనయు
నని సేయఁ బిలిచిన నాయింద్రసుతుఁడు
కినుకతోవచ్చి సుగ్రీవుని ఱొమ్ము
తనముష్టిఁ బొడిచినఁ దపననందనుఁడు
జడియక యొక మహాశైలశృంగంబు
వడి మీఱగొని వచ్చి వాలిపై వైవ
బలభేదిసుతుఁ డది పగులంగఁ దన్ని
జలజాప్తసూను మస్తక మఱచేత
మొత్తిన నొక్కింత మూర్ఛిల్లి తెలిసి
యత్తఱి సుగ్రీవుఁ డచలేంద్ర మొకటి
పెకలించుకొని వచ్చి భీకర ధ్వనులు
ప్రకటించి దేవతాపతిపుత్రు నేయ
దానిచేఁ గడునొచ్చి దశకంఠువైరి
భానుజుఁ జొరఁబడి పట్టుక పొడువ
బలమఱి రఘురాముపై దృష్టినతఁడు
సొలవక దిక్కులు చూచుచునుండె.
వ. అయ్యవసరంబున వృక్షంబు చాటుననుండి రామచంద్రుండేమని వితర్కించుచున్నాఁడు.
ఏకతాళము. (సౌరాష్ట)
'ముక్కులు చెక్కులు మూఁపులు వీపుల్‌
పక్కలు పిక్కలు బరులును దరులున్‌
స్వరములు శిరములు జానులు వీనుల్‌
కరములు నురములు కాళ్ళును వ్రేళ్లున్‌
ఎక్కువ తక్కువ లింతయు లేకన్‌
ఒక్క రూపమున నున్నవి చూడన్‌.'
గీ. 'ఏర్పరింపఁగ రాకున్న నితఁడు వాలి
యితఁడు సుగ్రీవుఁడని యెట్టు లెఱుఁగవచ్చు;
నెవ్వఁ డీల్గునో తొడిఁబడ నీ యమోఘ
సాయకం బేయ'నని రాముఁడేయకుండె.
వ. అంత నొక్క విధంబున వాలిచేత విడిపించుకొని వచ్చి ఋష్యమూక పర్వతంబెక్కి తన్నుఁ జేరవచ్చిన రామచంద్రునితోఁ దలవంచుకొని సుగ్రీవుండేమనుచున్నాఁడు.
త్రిపుట. (ఆహిరి)
'దేవ! నమ్మితి నిన్ను గరుణాదృష్టిఁ జూచెదవనుచు నయ్యో
కావవైతివి వాలిచేతను గాసి పడగాన్‌
నిజము పలికితి వాలిఁ జంపెద నిన్నుఁ గాచెదునంచు నయ్యో
భుజబలోన్నత! యింతలోనె బొంకదగునే?
యినకులుండవు సత్యసంధుఁడ వీవు బొంకితి వనఁగ వచ్చునె
యనఘ! యిటువలె నగుట నాపుణ్యంబుగాక.'
ద్విపద. అనిన సుగ్రీవున కనియె రాఘవుండు
'వనచరోత్తమ! యేల వగచెద వింక
వారక చూడగా వాలి రూపంబు
నీరూప మొక్కటై నియతితోనుండ
నేయకుండితి నింతె యిమ్మహాఘోర
సాయకం బెవ్వని జంపునో యంచుఁ
గర మొప్పునట్టి యీగజపుష్పమాల
ధరియించిపోయి యుద్ధము సేయుచుండు
మిప్పుడేమియుఁ జెప్పనేల సుగ్రీవ!
యప్పుడు చూడు నాయంతరంగంబు'
నావుడు రఘురామునకు జాగిలిమ్రొక్కి
భూవిభుఁ డిచ్చిన పుష్పదామంబు
గళమున నిడిపోయి కమలాప్తసుతుఁడు
బలభేదినందను బవరమ్మునకును
బిలిచిన విని రోషభీషణాకార
కలితాత్ముఁడై వాలి కడు నవ్వి బలికె.
ఆటతాళము. 'చంపఁజాలక విడిచిపెట్టిన సరకు గొనక, వీఁడొక
తెంపుగల మగవానివలెనే తిరిగి వచ్చెన్‌
వీని నిఁక మఱి ప్రాణములతో విడిచిపెట్టం జెల్లదు
పూని చంపెద' నంచు నంతఃపురము వెడలెన్‌
తార యడ్డము వచ్చి నయమరుదారఁ బలికెన్‌, 'విజయో
దార! యేటికిఁ బోయెదవు రవితనయు మీఁదన్‌?
నిన్న నీచే భంగపడి చెడి నేఁడు వచ్చునె పోరికిన్‌, తిరిగియు
పన్నతనమున నొక్క బలియుని ప్రాపులేక
అనఘ! యంగదుచేత నొక కార్యంబు వింటిన్‌, దశరథు
పనుపునను రాఘవుఁడు కాననమునకు వచ్చెన్‌
వనితఁ గోల్పడి పోయి యల దశవదనుచేతను, దినకర
తనయుఁ గైకొని బాస లిడెనట నిను వధింపన్‌
ఆ మహాత్ముఁడు మనుజమాత్రుం డనఁగరాదు, త్రిభువన
ధాముఁ డచ్యుతుఁ డతని గెలువఁగఁ దరముఁగాదు
రమణతో సుగ్రీవునకుఁ గపిరాజ్యమిచ్చి, గొబ్బున
సమరభీకరుఁడైన రాఘవు శరణుసొరుము.'
వ. అని పలికిన చిఱునవ్వు నవ్వి యవ్వీరాగ్రగణ్యుండు తారతో నేమనుచున్నాఁడు.
జంపె. (సౌరాష్ట్ర)
'గతి లేకపోయి రాఘవు మఱుఁగు జొచ్చె రవి
సుతుఁడు నాకేమిటికి సుదతి! యీరోఁత
ననువంటి బలసమేతుని విడిచి చేపట్టె
నినతనూజుని రాముఁడే నీతిపరుఁడు?
దశకంధరుని చేతఁ దరుణి గోల్పడి నపుడె
దశరథాత్మజు లావు తలఁప నేమిటికి?
చాలు నీ పనిలేని జోలి యేమిటికి? రణ
కేళి జంపెదను సుగ్రీవునిదె పట్టి.'
ద్విపద. అని తార మది లోని యడలు వారించి
ఘనగతి కిష్కింధ కదలి యేతెంచి,
యుగ్ర నిశ్వాసముల్‌ హుమ్మని వెడల
సుగ్రీవు ముందఱ శూరతఁ బలికె
'నోరి! నాతో నిన్న యుద్ధంబుసేసి
పారియు నిపుడేల పఱతెంచితీవు?
నీతియు సిగ్గును నెఱయంగ విడిచి
యేతెంచితివి శిరమిదె త్రుంచువాఁడ.
నిలు నిలు' మని గర్వ నిర్వాహ మహిమ
తలపడి ఘోర యుద్ధము సేయు తరిని
వాలి శౌర్యమునకు వడి నిర్వహింపఁ
జాలక భీతుఁడై జలజాప్తసుతుఁడు
వడి చెడి పాఱిపోవను గాళ్ళురాక
తడఁబడగా నింక తడయ రాదంచు
మెల్లన చేరి సౌమిత్రి చేనున్న
విల్లందుకొని రామవిభుఁ డెక్కు పెట్టి
యురగేంద్రనిభమైన యొక దివ్యశరము
తిరమొప్ప సంధించి తెగనిండఁ దిగిచి
వానరాధీశ్వరు వక్షఃస్థలంబుఁ
బూనిక గుఱిసేసి పొంచి యేయుటయు
ననల కీలల గ్రమ్ము నమ్మహాశరము
చని వాలి ఱొమ్ము వెచ్చని నెత్తురొలుక
సరి కట్టె నప్పుడా శక్రనందనుఁడు
శరముతోడను గూడ జగతిపై వ్రాలె.
గీ. తరువులేడు గాఁడి డగ్గరి గిరి డుల్చి
జగతి గాఁడి యురగ జగతిగాఁడి
దొనకు వచ్చునట్టి మనుజేశు బాణంబు
ప్లవగనాథుఁ దూఱి పాఱదయ్యె.
వ. అంతం దన్నుం జేరవచ్చిన రామచంద్రు వంకంజూచి వాలి యేమనుచున్నాఁడు.
త్రిపుట. (జంపె)
'నాయమెఱుఁగక చంపితివి నరనాథ! పాపముఁ గట్టుకొంటివి
బోయ వింతియె గాక నీవొక భూమిపతివా?
బ్రాఁతి యయ్యెనె సకల ధరణీభార నిర్వహణైకభుజునకుఁ
గ్రోఁతి మాంసంబేల తలఁచితి క్రూరబుద్ధిన్‌?
అన్నదమ్ములు మేము మాలో నలిగి చిత్తములోనఁ బోరుచు
నున్న నీకుఁ బ్రసక్తి గలదే యొకని దునుమన్‌?
ఏవగింపక మౌనివయ్యును హింసఁజేసితి వదియు దొంగిలి
భూవిభుండవు గావు, తపసివిగావు నీవు
తప్పుగలిగిన నాజ్ఞవెట్టను తగును భరతేంద్రునకు న్యాయము
తప్పి నీకు వధింపఁజెల్లునె తపసివర్యా!'
వ. అని మఱియు నేమనుచున్నాఁడు.
జంపె. 'కరుణాపయోధి రాఘవుఁడు ధర్మాత్ముఁడని
నరులెంచఁగాఁ గాక నమ్ముదునె నిన్ను
బలిమిగా నీవింత పాపకర్మంబునకు
తలఁచు టేనెఱుఁగ కెంతయు మోసపోతి
ననుఁ బేరుకొని పిల్చి నాముఖాముఖి నిల్చి
జననాథ! పోరాడి చంపలేవైతి
పొంచి యేసితి రామభూపాల! కులధర్మ
మెంచుకోలేవైతి వెంత జేసితివి
శ్రీరామ! నీరామఁ జెఱఁగొన్న రావణుని
వారధుల ముంచితిని వాలమునఁజుట్టి
ఒకమాట నాకుఁ జెప్పకపోయితివి గాక
సకలదైత్యుల దున్మి జానకిని దేనె.'
వ. అనిన రామచంద్రుండు వాలితో నేమనుచున్నాఁడు.
జంపె. 'ఏల కపివర్య! యీపాలుమాలిన మాట
లోలినాడెదు శౌర్యశాలివైయుండి?
రోసమున నిజ సోదరుని యాలిగైకొన్న
దోసకారివి నిన్ను ద్రుంపనే తగవు
పరమ ధార్మికుఁడైన భరతవిభు పంపునను
జరియించుచును దోషకరుఁ జూడగలమె?
పొంచి యేసితివంటి భువిలోన మృగములను
పొంచి యేయకయున్నఁ బోవె దవ్వులకు?
ధర్మమే జయమనుచుఁ దలఁపనేరని ఘోర
దుర్మార్గులకు బ్రతుకు దూరమై చనదె?'
వ. అని పల్కు సమయంబున వాలి మూర్ఛాగతుండయ్యె నట యెటువలెను.
ద్విపద. అంత నావృత్తాంత మగచరు ల్గొంద
ఱంతఃపురంబున కరిగి వేగంబె
తారతో వినిపింప ధైర్యంబు వదిలి
దారుణంబగు మూర్ఛ దద్దయు మునిఁగి
మెల్లనఁ దెలిసి యా మీనాక్షిహస్త
పల్లవంబులు సాఁచి పాపట చెదర
వడి మోదుకొనుచును వాలుఁగన్నులను
వడియు భాష్పజలంబు వఱదలై పాఱ
నడుగులు తడఁబడ నఱు పేదనడుము
గడగడ వడంక ముక్తామణుల్‌ రాల
పెనఁగొన్న పెన్నెరు ల్పిఱుఁదుపైఁ దూలఁ
జనుదెంచి జీవితేశ్వరు మీఁద వ్రాలి
ఎలుఁగెత్తి బెట్టుగా నేడ్చి ప్రాణేశు
తలయెత్తి మెల్లనె తన తొడఁ జేర్చి
పయ్యెద కొంగునఁ బతి ముఖాంభోజ
మొయ్యనఁ దుడుచుచు నువిద ఇట్లనియె.
ఆటతాళము. (త్రిపుట, జంపె, ఆహిరి)
'కపికులోత్తమ! కపిశిఖామణి! కపివతంసా! నిర్మల
కపికులాంబుధి పూర్ణహిమకర! కపివరేణ్యా!
ఎల్లలోకము లేలునట్టి సురేంద్రునకున్‌ బుట్టిన
బల్లిదుండవు నీవు మనుజుని బారిఁ బడితె!
అలుక మీరఁగ రావణాసురు నబ్ధులందున్‌ ముంచిన
బలసమున్నతి నేఁడు తొలఁగెనె ప్రాణనాథ!
అమృత వారిధిఁ ద్రచ్చి దివిజుల నాదుకొన్న మగఁటిమి
సమసి పోయెనె నేఁడు కపికులచక్రవర్తి!
రామచంద్రుఁడు నరుఁడుగాడు పురాణపురుషుండనుచు
వేమఱును బలవించి చెప్పిన వినకపోతి!
ఏమి సేయుదు? శోకవారిధి నెట్లు గడతు? మాయదైవము
నేమియని పలవించి దూఱుదు? నెందుఁ జొత్తున్‌?
క్రాలు గన్నులనీరు వఱదలుగాఁగ నేడ్చు నంగదు
నేల మాన్పవు? సుతునిపైదయ యెందుఁబోయెన్‌?'
వ. అని మఱియు నేమనుచున్నది.
జంపె. 'ప్రాణేశ! నీ వంటి పతి జన్మజన్మములకు
నేణాంకబింబాస్య కిల గలుగఁగలఁడె
కపికులోత్తమ! రాయి గాఁబోలు నాగుండె
యిపుడు తుమురైపోవ దేమి సేయుదును?
నాపాలి దేవుఁడవు నా ప్రాణనాథుఁడవు
నీ పొందు లేకున్న నేనెట్టులోర్తు?
పలుమాఱు నావంటి పాపాత్మురాలికిని
నెలమి నీ సంసర్గమేల సిద్ధించు?
వనచరోత్తమ! నీవు చనిన లోకంబునకు
నెనయ వచ్చెదఁగాక యికనుండఁ గలనే.'
వ. అని పలికి తన యెదురనున్న సుగ్రీవునిం జూచి తార యేమనుచున్నది.
జంపె. 'భానువంశజుఁడు నీపాలింటి దైవమై
వానరేశ్వరుఁ జంపె వర్ధిల్లుమిఁకను;
ఏపాటి పౌరుషము హెచ్చె నిందుల నీకుఁ?
బాపమని మదిలోనఁ బరికింపవైతి;
నీ కోరినట్లయ్యె నీ తపంబీడేఱెఁ
గైకొని యేలుమీ కపిరాజ్యమెల్లన్‌.'
వ. అని సుగ్రీవునిం దూఱి రామచంద్రుఁ గనుంగొని యేమనుచున్నది.
త్రిపుట. 'ఆలి చెఱఁగొని పోయినట్టి దశాస్యుఁడుండగ నిర్నిమిత్తము
వాలినేటికిఁ జంపితివి రఘువంశ తిలకా!
ఇట్టి సాహస కర్మ మెచటికి నేఁగె భరతుఁడు సీమవెడలఁగఁ
గొట్టి రాజ్యము పుచ్చుకొన్నెడఁ గువలయేశా!
నాయమేటికిఁ దప్పితివి రఘునాథ! జానకితోడనే చెఱఁ
బోయెనే నీ రాజనీతియు భూరిమతియున్‌?
పుణ్యపాపము లెఱుఁగ వెక్కడి భూవరుండువు నీవు తలఁపఁగ
గణ్యుఁడవె గుణహీనుఁడవు నీ ఘనత యెంత?
ఎన్న నెటువలెఁ బుట్టినాడవొ యినకులంబున నకట! నిను రా
జన్న దోషము వచ్చు హరిహరి యనఁగ విన్నన్‌.'
వ. అని పలుకు సమయంబున వాలి మూర్ఛం దెలిసె; నప్పుడు తన సమీపంబున శోకబాష్పకలితనేత్రుండయి తలవంచుకొని యున్న సుగ్రీవునిం జూచి యేమనుచున్నాఁడు.
జంపె. 'వగపేల సుగ్రీవ! వైర మెల్లను దీఱె
జగమెఱుంగగ రామచంద్రుచే నిపుడు.
రమ్ము సూర్యతనూజ! రాజులను మదిలోన
నమ్మకుము; వారి మన్నన లస్థిరములు;
రామవిభుతోడ మునుపేమి చేసెదనంటి
వామాట చెల్లించి యతని కృప నొందు.
దినకరాత్మజ! నాకు దేవేంద్రుఁడిచ్చె నీ
కనకమాలికఁ దొల్లి కడు సంతసిల్లి;
ఇది గళంబునఁ దాల్చి యెల్ల కపిరాజ్యము
పదిలుండవై యేలు బహువత్సరములు.
అంగదుఁడు బాలకుం డరయఁడేమియు నంత
రంగమున దయయుంచి రక్షింపు మితని;
మా నేరములఁ దలచి మదిలోన గోపింప
కీ నిసువు నీడేర్పు మితఁడె నీసుతుఁడు.'
వ. అని పలికి సుగ్రీవునకుఁ దన మెడనున్న కంఠమాలిక నిచ్చి వెక్కసంబుగా శోకభరంబున వెక్కి వెక్కి యేడ్చుచుం దన మొగంబు చూచుచున్న యంగదుని జూచి వాలి యేమనుచున్నాఁడు.
జంపె. 'ఓ తనయ! శోకించుచుండ నీకేమిటికిఁ
బ్రీతి సుగ్రీవుండు పినతండ్రిగాఁడే;
నీమీఁదఁ గడు ప్రేమ నినుఁజాల మన్నించు
నామాఱు గాఁడె యీ నలినాప్తసుతుఁడు;
ఏమఱక సుగ్రీవుఁడేమి కార్యముఁజెప్పఁ
దామసింపక చేసి తండ్రి కృపఁ బొందు;
అన్న! యిన్నాళ్లవలె నాగడంబులు సేయ
కెన్న నెవ్వరి కైన హిత మాచరింపు;
ప్రతిలేని కపిరాజ్య పట్టంబు నినుఁ గట్టి
సుతుఁడ! నీవిభవంబు సూడలేనైతి.'
ద్విపద. అని కుమారుని దేర్చి యవనీశమౌళిఁ
గనుగొని పలికె నా కపిచక్రవర్తి -
'యో మహాత్మ! దయపయోనిధి రామ!
భూమీతలేశ! నా పుణ్యమెట్టిదియో
నీ చేత మృతిఁ బొంద నేఁడు నాకబ్బె;
నాచారపరులకు నందగరాని
వైకుంఠ మెదురుగా వచ్చె నిచ్చటికిఁ
గైకొంటి నా పాతకము లెల్లఁబాసె
నేను ధన్యుఁడనైతి నిహపరంబులకు;
భానువంశాధీశ! భవనాశ! రామ!
ప్రాణముల్‌ నిర్వహింపవు మేన నింక
బాణంబు తీయవే పార్థివోత్తంస!'
నావుడు రామభూనాథుండు చేరఁ
గా వచ్చి నిజ భుజాగర్వంబు మెఱసి
కపికులాధీశు వక్షము గాఁడి యున్న
విపులసాయక ముద్దవిడి పెల్లగించె;
నప్పుడు రఘురాము నాత్మలో నిల్పి
యొప్పుగా నింద్రజుఁ డూర్ధ్వలోకమున
కరిగె; నావేళఁ దారాది కామినులు
గురుతర ధ్వనులతో గుంపుగా నేడ్వ
నంగదుఁ డధిక శోకాంధకారమున
బ్రుంగుడై నేలపైఁ బొరలంగఁ జొచ్చె.
వ. అప్పుఁ డయ్యంగదుని శోకంబు భరింపలేక సుగ్రీవాది వానరులు రోదనంబుచేసి రక్కోలాహలంబు మందర మధిత మహార్ణవంబు ఘోషంబు ననుకరించె; తదనంతరంబ.
క. తారాది సుతుల శోకము
వారించి కుమారుఁ దేర్చి వాలికిఁ బరలో
కారోహణాది సత్క్రియ
లా రవితనయుండు రామునానతిఁ జేసెన్‌.
వ. అంత నా రామచంద్రుండు కపివీరులం బిలిపించి 'సుగ్రీవుని దోడ్కొనిపోయి కిష్కింధలో రాజ్యపట్టంబు గట్టుం; డంగదు యువరాజ్య పట్టంబు గట్టుం'డని యానతిచ్చి పంపిన కపివరులు రవిసుతుని పురంబునకు దోడ్కొనిపోయి రప్పుడు పురజనులేమనుచున్నారు.
జంపె. 'కటకటా! యేల నిష్కారణము జంపె నీ
కుటిలునకుఁగా వాలిఁ గువలయేశ్వరుఁడు?'
'చెవినిల్లుగట్టుకొని చెప్పి చంపించె నీ
రవిసుతుండే ద్రోహి; రాముఁడే మెఱుఁగు?'
'ఎవ్వరును జంపింప రీ పాపకర్ముఁడే
క్రొవ్వి చచ్చెను తార, కొడుకు వద్దనగన్‌'
'దశరథాత్మజుతోడ తగునె వైరము హస్తి
మశకాంతరము వెఱ్ఱి మర్కటముగాక'
'మన కేమిటికి వాలి యినతనూజుఁడు మేలు
జనుల పాలిఁటివాఁడు శాంతవర్తనుఁడు'
వ. అని పలుకు సమయమున సకలవానరులు కిష్కింధలో పట్టంబు గట్టిరట యెటువలెను.
అర్ధచంద్రికలు. (త్రిభంగులు)
స్వర్ణ కుంభములందు గంగాజలము దెచ్చి
అంబుజాప్తతనూజు నభిషేకంబు సేసి
ఫాలదేశంబునందు బంగరు పట్టము గట్టి
యునిచి రర్కతనూజు సింహాసనము నందు.
వ. తదనంతరంబ యంగదునకు యువరాజ్య పట్టంబుగట్టి రప్పుడు పుణ్యాంగనలు ధవళంబులు పాడిరట యెటువలెను.
ధవళములు. శ్రీరాముఁడు గుణధాముఁడు వారిజదళలోచనుఁడు
శూరత రావణుఁ గూలిచి నారీమణి దేవలయున్‌. శోభానామే
రాముని కృప కపిరాజ్యము క్షేమంబునఁ బాలించి
శ్రీమంతుఁడు సుగ్రీవుఁడు భూమండలి పొగడొందున్‌. శోభనామే
సంగర విజయముతో నుప్పొంగెడు సుగ్రీవునకు
సంగతిగా యువరాజై యంగదుఁడిల బెంపొందున్‌. శోభనామే
వ. అప్పుడు సుగ్రీవుండు సకలవానరసమేతంబుగాఁ గానుకలుగొంచు రామచంద్రుని సేవించవచ్చు నప్పు డగ్గిరి ప్రాంత్యంబున నున్న చెంచెతలు ఏలలు పాడిరట యెటువలెను.
ఏలలు. భానువంశమునఁ బుట్టి
దానవ కామినిఁ గొట్టి
పూని మఖము నిర్వహింపవా, ఓరామచంద్ర!
మౌనివరులు సన్నుతింపంగాన్‌
రాతినాతిఁజేసి పురా
రాతి చేతి విల్లు విఱిచి
భూతలేంద్రులెల్ల మెచ్చగా, ఓరామచంద్ర!
సీతను వివాహమాడవా!
పరశురాము భంగపఱిచి
భరతునకు రాజ్యమిచ్చి
గురుఁడు పనుప నడవి కేఁగవా, ఓరామచంద్ర!
సురలు భూసురులు మెచ్చగా
పాప జాతి సుప్పనాతి
కోపగించి ముక్కు చెక్కి
యేపునను ఖరుని ద్రుంచవా, ఓరామచంద్ర!
చూపు నిల్పి మృగము నేయవా,
దేవుఁడని తెలియలేక
కావరమున వాలి సచ్చె
దేవ! నీతో నిగ్రహించిన ఓరామచంద్ర!
రావణునికి నిదే పాటుగా!
వ. అంత సుగ్రీవుండు రామచంద్రుని జేరవచ్చి కానుకలొసంగి సాష్టాంగ దండ ప్రణామంబు చేసి యేమని వినుతించుచున్నాఁడు.
సీ. 'దండంబు, శార్ఙ్గకోదండమండిత హస్త!
దండంబు, వైకుంఠధామ నిత్య!
దండంబు, కుండలీంద్ర సుమౌక్తికచ్ఛత్ర!
దండంబు, దుర్జనఖండ దేవ!
దండంబు, వారాశి దర్పసాహస జైత్ర!
దండంబు, దశరథతనయ వీర!
దండంబు, మౌనీంద్రతతి నిత్యపోషక!
దండంబు, యిందిరాధామ వక్ష!'
గీ. 'దండ మినవంశజలనిధి తారకేశ!
దండ మఘహార! యాతత ధవళకీర్తి!
దండమౌ నీకు లోకేశ! ధవళనయన!
దండ' మని కేలు మొగిచె నాతపనసుతుఁడు.
జంపె. (రచ్చతాళం)
'అరిభయంకర రామ! అమితగుణసంసీమ!
కరుణాభిరామ! శ్రీకాకుత్స్థ రామ!
రవికులాంబుధిసోమ! రాజకులసుత్రామ!
రవికోటి సమధామ! రామాభిరామా!'
రేకులు. 'రమణీయ లోకాభిరామా, రామా!
రామ, రవికులజలధి సోమా!
విమల పూజితనామా, రామా!
సమరమున రౌద్రాభిరామా!
శ్యామసుందర కీర్తిదామా, రామా!
శరణయ్య, లోకాభిరామా!'
వ. అని సన్నుతించి 'రాఘవేశ్వరా! మీరిచ్చోట నుండ నేమిటికి కిష్కింధకు వేంచేయుఁ'డని పలికిన రాఘవేంద్రుఁడు సుగ్రీవునితో నేమనుచున్నాఁడు.
ద్విపద. 'వనజాప్తనందన! వనవాసమునకుఁ
జనుదెంచి మునివృత్తిఁ జరియించుచుండి
పట్టణంబులకు భూపతుల చందమున
నెట్టు రావచ్చు, నీ వెఱుఁగవే నీతి?
వానకాలము వచ్చె; వైరుల మీఁద
బూని కయ్యము సేయఁ బోఁగూడ దిపుడు;
మా తమ్ముఁడును మేము మాల్యవంతమున
ప్రీతి నుండెదము సుగ్రీవ! నీవేఁగి
యీ నాల్గు నెలలును నెలమిఁ గిష్కింధ
లోనుండి వర్షంబు లోఁబడునపుడు
సనుదెమ్ము వానరసైన్యంబుతోడ'
నని భానుసుతుఁ బంపి యనుజుండుఁ దాను
మనుజేశ్వరుఁడు పోయె మాల్యవంతమున;
కినతనూజుఁడు కిష్కింధ కేతెంచి
తారా సమేతుఁడై తరుణీకృతోప
చారుఁడై వేడ్కలు సలుపుచు నుండె.
మంగళం. (త్రిభంగులు)
'ఇందిరావరునకు నిభభయ హరునకు
కందర్పగురునకు కల్యాణం!
సుందర బాహునకు సురుచిర దేహునకు
కందర్ప గురునకు కల్యాణం!
దినకరకులునకు దీన మందారునకు
ఘననిభగాత్రునకు కల్యాణం!'
ద్విపద. అని సమస్త సురారాతి కదంబ
వినమిత నిజభుజా విక్రముపేర
సురుచిర ప్రార్థనా సుభగంభవిష్ణు
వరహావతార శ్రీనివాసునిపేర
నాతతార్చన లాలనాతిశయాళు
భీతరక్షణుపేర స్పృహయాళుపేర
నిగమగోచరుపేర నిఖిలలోకేశుఁ
డగు కందుకూరి జనార్దనుపేర
నంకితంబుగఁ గాళికాంబాప్రసాద
సంకలిత కవిత్వ చాతుర్య ధుర్య
తావర్య పెదలింగనార్యతనూజ
కోవిద స్తవనీయగుణ రుద్రధీర
విరచిత సుగ్రీవవిజయాభిధాన
కరుణభాసుర యక్షగానప్రబంధ
మాచక్రవాళ శైలావని యందు
నాచంద్ర తారార్కమై యొప్పుఁగాత
సుగ్రీవ విజయము - యక్షగానము - సంపూర్ణము.శ్రీ చింతా మధుసూదన్‌ (అనంతపురం), వారి విలువైన సమయమును వెచ్చించి ఈ కృతిని Transliterate చేసి మాకు యిచ్చారు. వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు.


AndhraBharati AMdhra bhArati - dESi sAhityamu - sugriiva vijayamu - kaMdukuuri rudrakavi - Sugriva vijayamu Sugreeva vijayamu yakshaganamu yaksha ganamu Kamdukuri Rudrakavi Kandukuri rudrakavi andhra telugu tenugu (telugu andhra literature)