ధార్మిక పండుగలు మహాశివరాత్రి

'హిందువుల పండుగలు'
కీ॥ శే॥ సురవరం ప్రతాపరెడ్డి

ప్రతి సంవత్సరము మాఘకృష్ణ చతుర్దశీ దివసమున నీ పండుగ చేయబడును. ఈ శివరాత్రి శైవులకు చాల ముఖ్యమైనది. ఆనాడు భక్తులందఱు పగలంతయు నుపవాసముండి రాత్రియంతయు మేల్కొని యుందురు. దీనినే జాగరమందురు.

శివరాత్రియందు పైనజెప్పిన రీతిగా నాచరించి శివపూజలు చేయువారి పాపము లన్నియు నాశనమై వారికి ముక్తి దొఱకునని చెప్పుదురు. అట్లాచరించనివారు ఘోరనరకముల ననుభవింతురు. శివరాత్రిని గుఱించి లింగ పురాణమం దిట్లున్నది:

ఒకనాడు కైలాస శిఖరముపై పార్వతీ పరమేశ్వరు లాసీనులైయుండ పార్వతీదేవి భర్త నిట్లు ప్రశ్నించెను: "లోకమందు సర్వ వ్రతములలో నుత్తమ వ్రతమేది? భుక్తి ముక్తి ప్రదాయకమగునట్టి వ్రతమును గుఱించి నాకు బోధింపవలయును." అంత శివు డిట్లు ప్రత్యుత్తర మిచ్చెను: "దేవీ! పరమ రహస్యమగు నీవ్రతమును గుఱించి వినుము. ఆ వ్రతమును శివరాత్రి వ్రతమందురు. మాఘకృష్ణ చతుర్దశీ దివసమున దాని నాచరింపవలయును. తెలిసికాని తెలియకకాని ఆ వ్రత మాచరించు వాడు మోక్షమును పొందును. ఎన్ని పాపములు చేసిన వాడైనను నీ వ్రతమును చేయు మనుజుడు యమ లోకమునుండి తప్పించుకొని శివలోకమును జెందును. దీనికి నిదర్శనముగా పూర్వము జరిగిన వృత్తాంతము నొకదానిని వినుము.

పూర్వ మొకప్పుడు జీవఘాతకుడై జంతు మాంసముచే కుటుంబ పరిపాలకుడైన ఒక నిషాదు డుండెను. వాడు నల్లని శరీరియు, సదా ధనుర్ధారియు నై యుండెడివాడు. వా డొక శివరాత్రినా డొక కోమటి కప్పుబడి శివాలయములో బంధింపబడెను. రాత్రియంతయు వాడు భక్తుల శివశివారావ పూర్వక స్తోత్రములను విని, యుపవసింపవలసిన వాడయ్యెను. ప్రాతఃకాలమున గొందఱు భక్తులు వాని ఋణమును గోమటికి జెల్లించి వానిని విముక్తునిగా నొనరించిరి. ఇట్లు ముక్తుడై యాబోయ మృగయార్థమై యరణ్యమున కరిగెను. అరణ్యమం దొంటరిగా బోవుచు దాను రాత్రి విని వేసారినట్టి శివ శివ శబ్దములను హేళనా పూర్వకముగా నుచ్చరించికొన దొడగెను. దినమంతయు నరణ్యమున మృగముల వెదకి వెదకి తుద కొక్కటియు గానడయ్యెను. సాయంకాల మగుడు వా డొక తటాకమును సమీపించి రాత్రి సంచరించు సింహ శార్దూలాదుల నుండి తప్పించుకొనుటకై యొక బిల్వ వృక్షము నెక్కెను. ఆ వృక్షము క్రింద నొక గుప్తలింగ ముండినది వాడెఱుగడు. వాడు చెట్టెక్కునప్పు డడ్డమువచ్చు కొమ్మలను విరిచి క్రింద బారవేయు చుండెను. ఆ బిల్వపత్రములు లింగమునకు దలపని పూజగా బరిణమించుచుండెను. రాత్రియంతయు జెట్టుపైనుండి పడుదునేమోయను భీతిచే వాడు నిద్రించలేదు. ఉబుసుపోనట్టి వేళల హేళనముగా శివశివ యని వదరుచుండెను. ఇట్లు మొదటి మూడు యామములు గడచువఱకు వాని పాపములలో నాల్గవభాగము నశించిపోయెను. ఇంతలో నొక లేడి జలపానార్థ మా చెరువుదగ్గఱకు వచ్చెను. బోయ దానిని జూచి యాకొన్న వాడగుట సంతసించి దానిని జంప వింటిపై బాణము సంధించెను. మృగము సహితము హఠాత్తుగా నాబోయను జూచి మనుష్యవాక్కుతో నిట్లు సంబోధించెను: 'ఓయీ! నన్నేల చంపెదవు?'

బోయ: 'నేను, నా తల్లియు, గుటుంబమును నొక దినమునుండి యాహారములేక యుపవాస మున్నారము. అయితే నేనెన్నియో జంతువుల జంపితి గాని నీవలె మాటలాడనేర్చిన జంతువును జూడలేదు. ఈ విపరీతమునకు గారణము ముందు జెప్పుము.'

లేడి: 'వ్యాధోత్తమా! నా యుదంతమును వినుము. నేను రంభను. హిరణ్యాక్షుడను దానవుని బ్రేమించి వాని వినోదములందే చిక్కి శివుని కొలువు మరచితిని. ఈశ్వరుడు నిజమెఱిగి, క్రోధారుణిత నేత్రుడై నన్నును, నా దానవుని పండ్రెండు సంవత్సరములు మృగీమృగములుగా నరణ్యమందు సంచరించి పిమ్మట ఒక్క వ్యాధుని దర్శనముచే ముక్తిపొందునటుల శపించెను. ఓయీ వ్యాధా! నేను పూర్ణగర్భవతిని. నాపై మాంసమేమియు లేదు. ఇంతలో నింకొక లేడి రాగలదు. దాని మాంసమును దినుము. లేక నన్నే చంపగోరిన నేను నా వసతికి బోయి ప్రసవించి యిచ్చటకు వచ్చెదను.'

బోయ: 'నీవు ప్రాణాపాయమునుండి తప్పించుకొనుట కిట్టి యుపాయమును వెదకినట్లున్నది.'

అప్పుడు జింక యనేక శపథములు సేసి వ్యాధుని యనుమతి బొంది నిజగృహమున కేగెను. మధ్యరాత్రి యయ్యెను. వ్యాధునికి నిదురలేదు. శివశివ యను మాటమాత్రము మఱవలేదు. ఇట్లనాలోచిత వ్రతము చేయ వాని పాతకములు సగమువరకు క్షాళితములయ్యెను. అంత మధ్యరాత్ర్యనంతర మింకొన పెంటిజింక యా కొలను జేరెను. అంత వ్యాధుడు తనబాణము వేయ సంసిద్ధుడయ్యెను. ఆ జింకయు వానిని జూచి ఇట్లనెను: 'నేను నా భర్తను వెదకుచు నిటువచ్చితిని. నీవేమైన జూచితివా?'

లుబ్ధుడు స్తబ్ధుడై దీని భాషణము జూచి, 'నీకన్న పూర్వము మొక జింక వచ్చి యుండెను. అదేమైన నిన్ను బంపెనా? అట్లయిన నీవు చచ్చుటకు సంసిద్ధురాలవై యుండుము' అని యనెను.

జింక యిట్లనెను: 'నేను లేబ్రాయముదానను. నేను విరహవ్యథచే నార్తి నొందుచున్నాను. నన్ను జంపి నీవేమి లాభము పొందుదువు? ఇంతలో నీ మార్గమున నొక బలిసిన జింక రాగలదు. దాని మాంసము నీకు దృప్తి గలిగించును. అట్లు కాదేని నేను మరల తప్పక వత్తును.'

బోయ దానిని శపథము చేయుమనెను. జింక యటులే చేసి యింటికి బోయెను. కొంతసేపటి కొక కృష్ణమృగ మాచక్కి వచ్చెను. బోయ పూర్వమువలెనే దానిని జంపనుద్యుక్తు డయ్యెను. కృష్ణమృగ మా బోయను జూచి వాడు తనపెంటినిగూడ జంపియుండునని యూహించి యిట్లు విలపింప దొడగెను:

(దాంపత్య లాభమును గుఱించి చెప్పిన యీ భావములు చాల సుందరముగా నుండుటచే మూలము నిచ్చట నుదాహరింతును.)
శ్లో॥ తయా విరహితస్యాస్య నూనం మృత్యు ర్భవిష్యతి।
మహాకాలకృతం పాపం యద్భార్యాదుఃఖ మాగతం॥
  భార్యయా న సమం సౌఖ్యం గృహేపిచ వనేపిచ।
తయావినా న ధర్మోస్తి నార్థకామో విశేషతః॥
  వృక్షమూలేపి దయితా యత్ర తిష్ఠతి తద్గృహం।
ప్రాసాదోపి తయా హీనః కాంతారా దతిరిచ్యతే॥
  ధర్మకామార్థకార్యేషు భార్యా పుంస స్సహాయినీ।
విదేశేచ గతస్యాపి సైవ విశ్వాసకారిణీ॥
  నాస్తి భార్యాసమో బంధు ర్నాస్తి భార్యాసమం సుఖం।
నాస్తి భార్యాసమం లోకే నర స్యార్తస్య భేషజం॥
  యస్య భార్యా గృహే నాస్తి సాపి చేత్‌ ప్రియవాదినీ।
అరణ్యం తేన గంతవ్యం యథారణ్యం తథా గృహం॥


'భార్యావియోగ మనునది మహాపాపఫలము. భార్యావిరహము చావుదెచ్చును. గృహమందుండినను, నరణ్యమందుండినను భార్యగల వాని సౌఖ్యమే సౌఖ్యము. ఆమె లేనిది ధర్మములేదు, కామములేదు, అర్థములేదు. చెట్టు క్రింద సంసారము చేసినను భార్యగల వానికదే గృహము. కాని భార్యలేనివాడు ప్రాసాదములనుండినను వాని కవి యరణ్యతుల్యములే! పురుషుడు భార్యా సహాయుడై సకల పురుషార్థములను సాధించును. విదేశములందు భార్యయే విశ్వాసకారిణి. భార్యతో సాటియగు బంధువులులేరు. ఆర్తుడైన నరునికి భార్యవంటి యుత్తమ భేషజ మింకొకటిలేదు. ప్రియవాదినియగు భార్య యెవనికి లేదో వాడు వనమున కేగవలసినదే! ఏలయన, వా డింట నుండినను నది యరణ్య తుల్యమే.'

ఇట్లు దుఃఖించి, వ్యాధునితో, 'ఓయీ! నీవు రెండు పెంటి జింకల జూచితివా? వాని నేమైన జంపితివా?' యని ప్రశ్నించెను.

వ్యాధు డవి తనతో మరల వత్తుమని మాటయిచ్చి పోయినట్లు చెప్పెను. అంత కృష్ణమృగ మిట్లనెను: 'నేను గృహమునకు బోయి వానితో విహరించి మరల నీ దగ్గఱకు వచ్చెదను. పిమ్మట చంపవచ్చును.' అని నచ్చబలికి సెలవు తీసికొనిపోయెను. మృగము గృహమునకు బోవువఱ కొక పెంటిజింక శిశువును గనియుండెను. ఇంకొకదానితో క్రీడించి పిమ్మట తన కుటుంబమును జూచి, దుఃఖముతో, దాను వ్యాధునికి శరీరము సమర్పింప బోవుచున్నానని తెలిపెను. పెంటిజింకలు భర్త వియోగమును భరింపజాలక భర్తతోబాటి లోకమే తమది కూడనని తామును భర్తను వెంబడించి చత్తుమని పట్టుపట్టెను. తుదకు నా మూడు జింకలును తెల్లవాఱువఱకు బోయ దగ్గరకు వచ్చి తమను జంపుమని కోరెను. వ్యాధుని హృదయములో నొక గొప్ప మార్పు కలిగెను. జింకల యొక్క సత్యనిష్ఠను జూచి యాశ్చర్యమంది వానిని జంపుట కియ్య కొనక తన విల్లును తునియలుగా జేసి బాణముల బాఱవైచి నాటినుండి యికముందు జీవహింస చేయనని వాని వలగొని శపథము చేసెను.

అంత నాకాశమునుండి పుష్పవర్షము గురిసెను. దివ్యయానము వచ్చి జింకలను, లుబ్ధుని సశరీరముగా దీసికొని శివలోకమున కేగెను. కృష్ణమృగము నేటికిని నాకాశమందొక గొప్ప నక్షత్రమై వెలయుచున్నది. దానినే మృగశీర్షయని యందురు. దాని వెనుకనుండు నక్షత్రమునే లుబ్ధక(బోయ) నక్షత్ర మందురు.

ఇట్లు తెలియకయే శివరాత్రి జాగరణముచేసి యుపవసించిన వారికే శాశ్వత పదవులు దొఱకినపుడు, తెలిసి భక్తిపూర్వకముగా శివుని భజించు నరులకు ముక్తిగలుగు ననుటలో నేమియు సందేహము లే" దని శివుడు శివరాత్రిమాహాత్మ్యమును గుఱించి పార్వతీదేవితో జెప్పెను.

శ్రీనాథమహాకవి శివరాత్రి మాహాత్మ్యము అను పద్యకావ్యమును రచించెను. అందు వారు సుకుమార చరిత్రమును వ్రాసినారు. అందలి కథ యిట్లున్నది. ఒక మంత్రికి సంతానము లేక, లేక లేక బహుతపః ఫలితముగా నొక కుమారుడు, సుకుమారు డనువాడు పుట్టెను. వాడు యౌవన దశలో వ్యభిచరించెను. వాని రాజు వానిని దేశభ్రష్టునిగా చేసెను. నానా దేశములు తిరుగుచు ఒకచోట ఒక చండాల స్త్రీని పొంది, దానితోనేయుండి సంతానము గనెను. అగ్ని ప్రమాదముచే ఆ చండాలియు, దాని సంతానమును మడిసిరి. సుకుమారుడు కల్లుత్రాగుట, మాంసము తినుట బాగుగా అలవాటు చేసుకొన్నాడు. అవసానకాలమునాడు ఒక శివరాత్రి దినమున ఆ సుకుమారుడు శివభక్తుల పూజలను చూచుచు, వారి భజనల వినుచు మరణించెను. తత్ఫలితముగా వానికి కైలాస ప్రాప్తి కలిగెను. ఇది శివరాత్రి మాహాత్మ్యములోని కథాసారము. ఈకథ సంస్కృతములో 'ఈశానసంహిత' యనుదానిలో సంక్షిప్తముగా నున్నదట.

విమర్శ

ఈ శివరాత్రి శైవులకే ప్రధానమైనది. శ్రీరామనవమి, లేక కృష్ణాష్టమి వలె నీశ్వరు డవతార పురుషుడుగా బరిగణింపబడినవాడు కాడు. కావున నిది శివజయంతిగా భావింప వలనుపడదు. ఈ శివరాత్రి మాహాత్మ్యమును గుఱించి చెప్పు పురాణములు లింగపురాణ, స్కాందపురాణములు.

వైష్ణవులు అనంతచతుర్దశి నెట్లు పవిత్రముగా భావింతురో యట్లే శైవులీ శివరాత్రి చతుర్దశిని భావింతురు.

దక్షిణమున నాంధ్రదేశమున నీశివరాత్రి చాల ప్రాముఖ్యముగా జూడబడుచున్నది. రాత్రియంతయు జాగరము చేయుట దేవుని భజించు నిమిత్తమై యేర్పాటు చేసియుండ ఆ ప్రధాన విషయమును మాటుపఱచి రాత్రియంతయు నెటులో యొకరీతి మేల్కొని యుండుటయే ప్రధాన మని యెంచు కొందరు జూదముతో కాలము వెళ్లబుచ్చుచుందురు.

ఈ శివరాత్రిని గుఱించి గుప్తేపండితు డొక నూతన సిద్ధాంతమును లేవదీసినాడు. ఇంతకు బూర్వము వ్రాయబడిన లుబ్ధక మృగముల కథను జూడ నీ కథ కేవలము మృగశీర్షా నక్షత్రము యొక్క సంబంధమైనదిగా దోచుచున్నదని వారు వ్రాసియున్నారు. సిద్ధాంతులు లుబ్ధక నక్షత్రమును యోగతారక యని పిలుతురనియు, నీ మృగశీర్షారాశి చంద్రుని నైదవ నక్షత్రమనియు చెప్పుదురట. 'రత్నమాల' యను గ్రంథములో మృగశీర్షను జింకతలగా వర్ణించినారట. ఛాల్డియాదేశము బహుపురాతన దేశము. వేదకాలమందు ఛాల్డియాదేశమునకు, మన భారతదేశమునకు వ్యాపారము విశేషముగా జరుగుచుండెను. అట్టి ఛాల్డియాదేశపు జ్యోతిశ్శాస్త్రమందు నక్షత్రకూటమం దీ తొమ్మిదవ నక్షత్రమండలిని 'ధనుస్సు' అని యందురట. ఈ ధనుస్సు మన కథలోని ధనుర్జీవియగు లుబ్ధకునితో సరిపోలును. ఛాల్డియా శాస్త్రమందు ధనుస్సు తర్వాతి నక్షత్రమును మేక(మేషము) యందురు. ఈ మేక బహుశః మన జింకకు మారుగా నుండి యుండును.

అయితే యీ నక్షత్రములకును, శివరాత్రికి నేమి సంబంధమని యాలోచించిన శివరాత్రినాటి రాత్రి చాల దీర్ఘమైనదియు, దట్టమగు చీకటితో నిండినదియు నగుటచే నా రాత్రి నక్షత్రములను బరీక్షించుట కనువగునని యీ దిన మేర్పాటు చేసియుందురేమో చెప్పజాలను అని యీ గుప్తే పండితుడు వ్రాసి యున్నాడు.

ఈ విమర్శన యందు యుక్తి హెచ్చుగా నున్నను యుక్తముగా దోపదు. మనవారు నక్షత్రముల కొరకు జనులనందఱను మేల్కొనుమని చెప్పియుండరు. శివరాత్రి మాహాత్మ్యమునకై యొక కథను గల్పించి యా కథనుండి యొక నీతిని బోధించుటకై యీ నక్షత్రములను భక్తికి నిదర్శనముగా జూపియుందురు. ఇది మన పౌరాణికులకు గ్రొత్తదికాదు. బాలభక్తాగ్రేసరుడగు ధ్రువుడు ధ్రువ నక్షత్రమై నిలిచినాడు. సప్తర్షులు నక్షత్రమండలియై నిలచినారు. పతివ్రతాగ్రగణ్యయగు నరుంధతియు నిజనాథుని బాయక యాకాశమందు భర్తచెంత నిలిచి నూతన వధూవరుల కందఱకును దర్శనీయమై యున్నది. కావున మన శైవులకు గూడ శివభక్తులైన లుబ్ధక మృగములు నక్షత్రములైనవని బోధించియున్నారు.

భవిష్యత్పురాణమందు నీ పండుగను 'శివ చతుర్దశి' యను పేరున వర్ణించినారు. అందు లైంగ్యమగు మృగలుబ్ధక కథ లేదు. మరియు లింగపురాణమందు మాఘ కృష్ణచతుర్దశి దినమును మహాశివరాత్రిగా చెప్పియుండ నిందు మార్గశీర్ష శుక్లత్రయోదశి ముఖ్యదినముగా బేర్కొనబడియున్నది. ఇది యే శివరాత్రియో తెలియదు. కాని జనులందఱు లింగపురాణరీత్యా యాచరించుటచేత నదియే ప్రమాణముగా గొనవలసి యున్నది. ఇంతియకాక శివపురాణమందును మాఘకృష్ణ చతుర్దశినాడే జాగరణ యుక్తముగా వ్రతమాచరించుట యాదేశితము. ఇదే పురాణమందు ప్రతిమాసమందును కృష్ణ చతుర్దశీ దినమున శివరాత్రిగా భావించి చేయవలెనని వ్రాయబడియున్నది.

మృగలుబ్ధకులను గుఱించి యించుక విశేషము చెప్పవలసి యున్నది. అలంపురీమాహాత్మ్య మను గ్రంథములో పూర్వ మొకప్పుడు అలంపురీ దేవాలయమును నాశనము చేసిన 'విలసత్‌' అను రాజు చాల దుర్మార్గుడై, మృగయా వినోదియై యుండ, నొకనాడు వాని సేవకు డొక మృగమును తనస్వామి కాహారార్థమై చంప నా మృగము మనుష్యోక్తులతో వానిని, వాని యేలికను నిందించినట్లును, వా డది విని యాశ్చర్యమగ్న మానసుడై విలసత్తుతో నివేదించుకొనగా నా విలసత్తు ఆ జింకను ప్రార్థించి కారణ మడుగగా నా మృగ మిట్లనెనట: "నీవు దేవాలయమును నాశనము చేసినందున మహాపాతకివైతివి. మరల పాప విముక్తి పొందదలచిన దేవాలయమును గట్టించి, యందు నీ విగ్రహమును, దానియెదుట నా విగ్రహమును జెక్కించుము. భక్తులందఱు చూచుచుండ బహుకాలమునకు నీపాపము శమించి నీ వుత్తమలోకములను బొందుదువు." విలసత్తు అట్లేచేసెను. ఇది పురాణము. దీనికి నిదర్శనముగా నేటికిని అలంపురీ దేవాలయములో నొక వ్యాధుని యొక్కయు, జింక యొక్కయు విగ్రహములు స్తంభములపై చెక్కబడి యున్నవి కాననగును.

శివునికి లింగాకారముండు విషయములో ప్రాచీప్రతీచిలోని పరిశోధకులు కొంద ఱొక నూతన తత్త్వమును లేవదీసినారు. లింగము పురుష చిహ్నమని వారి యభిప్రాయము. బహుపురాతన కాలమం దొక నాడు ప్రపంచమందంతటను స్త్రీపురుష చిహ్నముల పూజలుండెనని వారి సిద్ధాంతము. ఈజిప్టులోను, బాబిలోనియాలోను, అసిరియాలోను, కొంతకొంత రోము, గ్రీసుదేశములందును నీయాచార ముండెనని వాదింతురు. అదే తత్త్వము మన యార్యావర్తమున లింగపూజ యనబడెనని యందురు.

వివేకానందస్వామిగా రీ సిద్ధాంతము నొప్పుకొనలేదు. గస్టవ్‌ ఆపర్ట్‌(Gustav Oppert) అను జర్మను పండితుడు సాలగ్రామములు స్త్రీలింగ చిహ్నములనియు, శివలింగములు పురుషలింగచిహ్నములనియు వాదింపగా దానికిట్లు వివేకానందస్వామిగారు ప్రత్యుత్తర మిచ్చిరి:

"ఈ సిద్ధాంతములు నిరాధారములు, శివలింగ పూజగుఱించి అథర్వవేదమందలి యూపస్తంభమును స్తోత్రము జేయు మంత్రము నుండి ప్రారంభమైనది. ఈ మంత్రములో నీ యూపస్తంభమును 'స్కంభ'మని వర్ణించినారు. ఈ స్కంభము ఆద్యంత రహితమై పరబ్రహ్మకు ప్రత్యామ్నాయ మైనట్లుగా వర్ణింపబడినది. తర్వాతి కాలములో యజ్ఞమందలి అగ్ని, ధూమము, బూడిద, సోమలత, యజ్ఞార్థము కట్టెలమోయునెద్దును శివుని ప్రకాశమానమగు శరీరముగా, నీలకంఠముగా, జటాజాలములుగా, శివవాహనముగా మార్పబడెను. అదేవిధముగా నీ యూపస్తంభము శివునికి బదులుగా బూజింపబడెను. లింగపురాణమం దిదే మంత్రమును కథా రూపముగా వివరించియున్నారు. సాలగ్రామములు లింగచిహ్నము లను కథ కేవలము కల్పితము. అవి బౌద్ధుల 'ధాతుగర్భముల' బోలినవగుటచే బౌద్ధులు మొదట వానిని బూజించుచుండిరి. తర్వాత వైష్ణవులు వానిని స్వీకరించిరి."

పై యంశములయొక్క మూలములోని కొంతభాగమిం దుదాహరించుచున్నాను.

"The Swami said that Worship of the Siva Lingam originated from the famous hymn in the Atharva Veda Samhita sung in praise of the Yupsstambha, the sacrificial post. In that hymn, a description is found of the beginningless and endless Stambha or Skambha, and it is shown that the said Skambha is put in place of Eternal Brahman. As afterwards, the Yajna fire, its smake, ashes and flames, the Soma plant, and the Ox that used to carry on its back the wood for the Vedic sacrifice, gave place to the Vedic conceptions of the brightness of Siva's body, his tawny matted hair, his blue throat, and the riding on the bull of Siva, and so on - just so, the Yupa Skambha gave place in time to the Siva Lingam and was deified to the high Devahood of Sri Sankara. In the Linga Purana, the same hymn is expanded in the shape of stories meant to establish the glory of the great Stambha and the superiority of Mahadeva."

-Swami Vivekananda's works
(1923 edition, vol. IV, pages 357 & 358)

త్రిమూర్తి సిద్ధాంతము వేదకాలమందు లేదనియు, క్రమేణ యేర్పడెననియు పండితుల యభిప్రాయము. క్రీ. పూ. ౨వ శతాబ్దమందుండిన పతంజలి తనభాష్యములో శివ, స్కంద, విశాఖుల విగ్రహములు తనకాలములో వీథులం దమ్మబడుచుండెనని యుదాహరించుటచే శైవ సిద్ధాంతము అప్పటికే ప్రబలి యుండెనని విశద మగుచున్నది.

పాణినీయ సిద్ధాంతకౌముదిలో ౫-౩-౯౬ సూత్రములో నిట్లున్నది:
సూ. "జీవికార్థే చాపణ్యే."
దీనిపై భాష్యమిట్లున్నది:
"జీవికార్థం యదవిక్రీయమాణం తస్మి\న్‌ వాచ్యే కనో లుప్స్యాత్‌. వాసుదేవః, శివః, స్కందః, దేవలకానాం జీవికార్థాసు దేవప్రతికృతిష్విదం అపణ్యేకిం. హస్తికా న్విక్రీణీతే."

ఇందు సూచితమేమన, అమ్మదగనట్టి దేవతావిగ్రహములు ఆ కాలమందు 'దేవలకులు' అమ్ముచుండిరి. అట్టి విగ్రహములలో ముఖ్యమైనవి వాసుదేవునియొక్కయు, శివునియొక్కయు, స్కందునియొక్కయు విగ్రహములు ముఖ్యమైనవి. దీనివలన శివస్కందులు 2500 యేండ్లకు పూర్వము జనసామాన్యమందు ఎన్నికకెక్కిన దేవతలని స్పష్టము.

శైవమత మాదియందు కులభేదములను పాటింపక గొప్ప సంఘ సంస్కారమును జేసెను. కాని తర్వాతి కాలములో నీశైవము సహితము వైష్ణవమతమువలె శూద్రాది భేదములను పాటింపజొచ్చెను.

పార్థివ లింగ పూజావిధానమును వర్ణించుచు నొక ప్రమాణ గ్రంథ మిట్లు శాసించినది: "స్త్రీ శూద్రులకు వైదికమంత్రపూర్వక పూజావిధి కూడదు. పురాణాను సారమ్ముగనే లింగపూజ చేయవలెను. స్త్రీ శూద్రులు ఓంకార శబ్ద విరహితమైన 'నమశ్శివాయ' యను మంత్రము నుచ్చరింపవలెను."

మరియు శివ కేశవ విగ్రహములను స్త్రీ శూద్రులు స్పృశించిన నరకమును బొందుదురట!

శూద్రులచే పూజింపబడిన లింగము దూష్యమట!

బసవేశ్వరుని యనంతర కాలమునుండి యెవరి మూలముననో యేమో శైవ వైష్ణవులకు బద్ధవైర మేర్పడి యనేక గ్రంథములలో నుభయులును పరస్పర దూషణమును జేసికొనిరి. తైత్తిరీయోపనిషత్తు చాల ప్రాచీనమైనది. అందు కొన్ని మంత్రము లిట్లున్నవి:
మం: తత్పురుషాయ విద్మహే, మహాదేవాయ ధీమహి, తన్నో రుద్రః ప్రచోదయాత్‌.
ఈ మంత్రము గణేశుని గుఱించిన మంత్రమువంటిదే. ఈ విషయమున అచ్చటి విమర్శను జూడనగును.

హిందూస్థానమందు శైవమత వ్యాపనము బహు ప్రాచీనమునుండి వృద్ధిపొందినట్టిది. కాశీవిశ్వనాథుడు శైవ సాంప్రదాయ ప్రాచీనతను, ప్రాముఖ్యతను నిరూపించుచున్నాడు. దక్షిణ హిందూస్థానమందు నిది ఆంధ్రకర్ణాటకులలో బిజ్జలుని కాలమునుండి బసవేశ్వర, పండితారాధ్యులచేత విశేష ప్రచారము చేయబడెను.

ఏది యెట్లున్నను నీ శివరాత్రి శైవులయిన వారికిని, స్త్రీ శూద్రులకును, స్మార్త బ్రాహ్మణులకును చాల ప్రధానమై యున్నదనుటలో నేమియు సందేహము లేదు.
AndhraBharati AMdhra bhArati - dhArmika - paMDugalu - mahAshivarAtri ( telugu andhra )