ఇతిహాసములు భాగవతము ప్రథమస్కంధము
శా. శ్రీకైవల్యపదంబుఁ జేరుటకునై చింతించెద\న్‌ లోకర
క్షైకారంభకు భక్తపాలన కళాసంరంభకు\న్‌ దానవో
ద్రేక స్తంభకుఁ గేళిలోలవిలసద్దృగ్జాల సంభూతనా
నాకంజాత భవాండకుంభకు మహానందాంగనా డింభకు\న్‌.
1
ఉ. వాలిన భక్తి మ్రొక్కెద నవారిత తాండవ కేళికి\న్‌ దయా
శాలికి శూలికి\న్‌ శిఖరిజాముఖపద్మ మయూఖమాలికి\న్‌
బాలశశాంకమౌళికిఁ గపాలికి మన్మథ గర్వపర్వతో
న్మూలికి నారదాది మునిముఖ్యమనస్సరసీరుహహాళికి\న్‌
2
ఉ. ఆతతసేవ సేసెద సమస్తచరాచర భూతసృష్టివి
జ్ఞాతకు భారతీహృదయసౌఖ్యవిధాతకు వేదరాశి ని
ర్ణేతకు దేవతానికరనేతకుఁ గల్మషజేతకు\న్‌ నత
త్రాతకు ధాతకు\న్‌ నిఖిలతాపసలోక శుభప్రదాతకు\న్‌.
3
వ. అని నిఖిలప్రధానదేవతావందనంబు సేసి 4
ఉ. ఆదరమొప్ప మ్రొక్కిడుదు నద్రిసుతాహృదయానురాగసం
పాదికి దోషభేదికిఁ బ్రసన్నవినోదికి విఘ్నవల్లికా
చ్ఛేదికి మంజువాదికి నశేషజగజ్జననందవేదికి\న్‌
మోదకఖాదికి\న్‌ సమదమూషకసాదికి సుప్రసాదికి\న్‌.
5
ఉ. క్షోణితలంబు నెన్నుదురు సోఁకఁగ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికిఁ జంచరీకచయసుందరవేణికి రక్షితానత
శ్రేణికిఁ దోయజాతభవ చిత్తవశీకరణైక వాణికి\న్‌
వాణికి నక్షదామ శుక వారిజ పుస్తక రమ్యపాణికి\న్‌.
6
శా. పుట్టం బుట్ట శరంబున\న్‌ మొలవ నంభోయానపాత్రంబున\న్‌
నెట్టం గల్గను గాళిఁ గొల్వను బురాణింప\న్‌ దొరంకొంటి మీఁ
దెట్టే వెంటఁ జరింతుఁ దత్సరణి నాకీవమ్మ యో యమ్మ మేల్‌
పట్టు న్మానకుమమ్మ నమ్మితిఁ జుమీ బ్రాహ్మీ దయాంభోనిధీ.
7
ఉ. అమ్మలఁగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె
ద్దమ్మ సురారులమ్మ కడు పాఱడిపుచ్చినయమ్మ తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ధి యీవుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్‌.
8
మ. హరికి\న్‌ బట్టపుదేవి పున్నెములప్రో వర్థంబు పెన్నిక్క చం
దురు తోఁబుట్టువు భారతీగిరిసుతల్‌ తోనాడు పూఁబోణి తా
మరలం దుండెడి ముద్దరాలు జగముల్‌ మన్నించు నిల్లాలు భా
సురత\న్‌ లేములు వాపు తల్లి సిరియిచ్చున్‌ నిత్యకల్యాణముల్‌.
9
వ. అని యిష్టదేవతలం జింతించి దినకర కుమార ప్రముఖులం దలంచి ప్రథమ
కవితా విరచన విద్యావిలాసాతిరేకి వాల్మీకి నుతియించి హయగ్రీవ దనుజకర
పరిమళిత నిగమనివహ విభాగనిర్ణయ నిపుణతాసముల్లాసుండగు వ్యాసునకు మ్రొక్కి
శ్రీమహాభాగవతకథా సుధారసప్రయోగికి శుకయోగికి నమస్కరించి
మృదుమధుర వచనరచన పల్లవిత స్థాణునకున్‌ బాణునకుం బ్రణమిల్లి కతిపయశ్లోక
సమ్మోదితసూరు మయూరు నభినందించి మహాకావ్య కరణకళావిలాసుం గాళిదాసుం
గొనియాడి కవికమల విసరరవిం భారవిం బొగడి విదళితాఘు మాఘుస్తుతియించి
యాంధ్రకవితాగౌరవజనమనోహారి నన్నయసూరిం గైవారంబుసేసి హరిహర
చరణారవింద వందనాభిలాషిఁ దిక్కన మనీషి\న్‌ భూషించి భక్తివిశేషితపరమేశ్వ
రుండగు ప్రబంధపరమేశ్వరుం బ్రణుతించి మఱియు నితర పూర్వకవి జనసంభావ
నంబు గావించి వర్తమాన కవులకుం బ్రియంబు వలికి భావికవుల బహూకరించి యుభయకావ్యకరణదక్షుండనై.
10
ఉ. ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహనంబులున్‌
సొమ్ములుఁ గొన్ని పుచ్చుకొని సొక్కి శరీరముఁ బాసి కాలుచే
సమ్మెట వాటులంబడక సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె నీ
బమ్మెర పోతరాజొకఁడు భాగవతంబు జగద్ధితంబుగన్‌.
11
తే. చేతులారంగ శివునిఁ బూజింపడేని
నోరునొవ్వంగ హరికీర్తి నుడువఁడేని
దయయు సత్యంబులోనుగాఁ దలపఁడేనిఁ
గలుగనేటికిఁ దల్లులకడుపుచేటు.
12
వ. అని మదీయ పూర్వజన్మసహస్రసంచిత తపఃఫలంబున శ్రీమన్నారాయణ కథా
ప్రపంచ విరచనాకుతూహలుండనై యొక్క రాకానిశాకాలంబున సోమోప
రాగంబురాకఁ గని సజ్జనానుమతంబున నభ్రంకషశుభ్ర సముత్తుంగ భంగయగు
గంగకుం జని క్రుంకులిడి వెడలి మహనీయమంజుల పులినతలమండప
మధ్యంబున మహేశ్వర ధ్యానంబు సేయుచుఁ గించిదున్మీలిత లోచనుండనై యున్నయెడ.
13
సీ. మెఱుఁగు చెంగట నున్న మేఘంబు కైవడి నువిద చెంగట నుండ నొప్పువాఁడు
చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమునఁ జిఱునవ్వు మొలచువాఁడు
వల్లీయుతతమాల వసుమతీజము భంగి బలు విల్లు మూఁపున బరఁగువాఁడు
నీలనగాగ్ర సన్నిహితభానుని భంగి ఘనకిరీటము దలఁ గల్గువాఁడు
 
ఆ. పుండరీక యుగముఁబోలు కన్నులవాఁడు వెడఁద యురమువాఁడు విపులభద్ర
మూర్తి వాఁడు రాజముఖ్యుఁడొక్కరుఁడు నా కన్నుఁగవకు నెదురఁగానఁబడియె.
14
వ. ఏ నా రాజశేఖరునిం దేఱిచూచి భాషింప యత్నంబు సేయునెడ నతండు దా రామ
భద్రుండ మన్నామాంకితంబుగా శ్రీమహాభాగవతంబుఁ దెనుంగు సేయుము నీకు
భవబంధంబులు దెగునని యానతిచ్చి తిరోహితుండయ్యె. అంత నే సమున్మీలిత
నయనుండనై వెఱఁగు పడి చిత్తంబున.
15
క. పలికెడిది భాగవతమఁట
పలికించు విభుండు రామభద్రుండఁట నేఁ
బలికిన భవహరమగునఁట
పలికెద వేఱొండుగాథఁ బలుకఁగ నేలా.
16
ఆ. భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు
శూలికైనఁ దమ్మిచూలికైన
విబుధ జనులవలన విన్నంత కన్నంత
తెలియ వచ్చినంత తేటపఱుతు.
17
క. కొందఱికిఁదెనుఁగు గుణమగు
గొందఱికిని సంస్కృతంబు గుణమగు రెండున్‌
గొందఱికి గుణములగు నే
నందఱి మెప్పింతుఁ గృతుల నయ్యైయెడలన్‌.
18
మ. ఒనరన్‌ నన్నయ తిక్కనాదికవులీ యుర్విం బురాణావళుల్‌
తెనుఁగుల్‌ సేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు దానెట్టిదో
తెనుఁగుం జేయరు మున్ను భాగవతమున్‌ దీనిన్‌ దెనింగించి నా
జననంబు\న్‌ సఫలంబు చేసెదఁ బునర్జన్మంబు లేకుండఁగన్‌.
19
మ. లలితస్కంధము గృష్ణమూలము శుకాలాపాభిరామంబు మం
జులతా శోభితమున్‌ సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్‌ సుందరో
జ్జ్వలవృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవాలంబునై
వెలయున్‌ భాగవతాఖ్య కల్పతరు వుర్విన్‌ సద్ద్విజశ్రేయమై.
20
వ. ఇట్లు భాసిల్లెడు శ్రీమహాభాగవతపురాణ పారిజాతపాదప సమాశ్రయంబున
హరి కరుణావిశేషంబునఁ గృతార్థత్వంబు సిద్ధించెనని బుద్ధినెఱింగి లేచి మరలి
కొన్ని దినంబులకు నేకశిలానగరంబునకుం జనుదెంచి యందు గురువృద్ధబుధ బంధుజనానుజ్ఞాతుండనై.
21
గ్రంథకర్తృ వంశవర్ణనము
సీ. కౌండిన్యగోత్ర సంకలితుఁ డాపస్తంబసూత్రుండు పుణ్యుండు సుభగుఁడైన
భీమన మంత్రికిఁ బ్రియపుత్రుఁడన్నయ కలకంఠి తద్భార్య గౌరమాంబ
కమలాప్తు వరమునఁ గనిన సోమనమంత్రి వల్లభ మల్లమ వారి తనయుఁ
డెల్లన యతనికి నిల్లాలు మాచమ వారి పుత్రుఁడు వంశ వర్ధనుండు
 
ఆ. లలితమూర్తి బహుకళానిధి కేసన దానమాననీతిధనుఁడు ఘనుఁడు
తనకు లక్కమాంబ ధర్మగేహిని గాఁగ మనియె శైవశాస్త్రమతము గనియె.
22
క. నడవదు నిలయము వెలువడి
తడవదు పరపురుషు గుణము దనపతి నొడువున్‌
గడవదు వితరణ కరుణలు
విడువదు లక్కాంబ విబుధ విసరము వొగడన్‌.
23
ఉ. మానిను లీడుగారు బహుమాన నివారిత దీనమానస
గ్లానికి దానధర్మ మతిగౌరవ మంజులతాగభీరతా
స్థానికి ముద్దసానికి సదాశివపాదయుగార్చనానుకం
పానయ వాగ్భవానికిని బమ్మెర కేసయ లక్కసానికిన్‌.
24
క. ఆమానిని కుదయించితి
మేమిరువుర మగ్రజాతుఁ డీశ్వరసేవా
కాముఁడు తిప్పయ పోతయ
నామవ్యక్తుండ సాధునయయుక్తుండన్‌.
25
వ. అయిన నేను నా చిత్తంబునఁ బెన్నిధానంబునుం బోని శ్రీరామచంద్రు
సన్నిధానంబుఁ గల్పించుకొని.
26
షష్ఠ్యంతములు
ఉ. హారికి నందగోకుల విహారికిఁ జక్రసమీరదైత్య సం
హారికి భక్త దుఃఖపరిహారికి గోపనితంబినీ మనో
హారికి దుష్టసంపదపహారికి ఘోషకుటీపయోఘృతా
హారికి బాలకగ్రహమహాసురదుర్వనితా ప్రహారికిన్‌.
27
ఉ. శీలికి నీతిశాలికి వశీకృతశూలికి బాణహస్తని
ర్మూలికి ఘోరనీరదవిముక్తశిలాహత గోపగోపికా
పాలికి వర్ణధర్మ పరిపాలికి నర్జునభూజయుగ్మ సం
చాలికి మాలికిన్‌ విపుల చక్రనిరుద్ధ మరీచిమాలికిన్‌.
28
ఉ. క్షంతకుఁ గాళియోరగ విశాలఫణోపరి నర్తనక్రియా
రంతకు నుల్లసన్మగధరాజ చతుర్విధఘోర వాహినీ
హంతకు నింద్రనందననియంతకు సర్వచరాచరావళీ
మంతకు నిర్జితేంద్రియసమంచిత భక్తజనానుగంతకున్‌.
29
ఉ. న్యాయికి భూసురేంద్రమృతనందనదాయికి రుక్మిణీ మనః
స్థాయికి భూతసమ్మదవిధాయికి సాధుజనానురాగ సం
ధాయికిఁ బీతవస్త్ర పరిధాయికిఁ బద్మభవాండభాండ ని
ర్మాయికి గోపికానివహమందిరయాయికి శేషశాయికిన్‌.
30
వ. సమర్పితంబుగా నే నంధ్రభాషను రచియింపంబూనిన శ్రీమహాభాగవతంబునకుం
బ్రారంభం బెట్టిదనిన.
31
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - prathamaskaMdhamu ( telugu andhra )