ఇతిహాసములు భాగవతము ప్రథమస్కంధము
అధ్యాయము - ౭
వ. అని నారదుం గొనియాడిన సూతునిం జూచి నారదుమాటలు విన్నవెనుక భగవంతుండైన
బాదరాయణుం డేమిసేసెనని శౌనకుండడిగిన సూతుండిట్లనియె. బ్రహ్మనదియైన సరస్వతి
పశ్చిమతీరంబున ఋషులకు సత్రకర్మవర్ధనంబై బదరీతరుషండమండితంబై
శమ్యాప్రాసంబని ప్రసిద్ధంబగు నాశ్రమంబు గలదు. అందు జలంబులువార్చి కూర్చుండి
వ్యాసుండు తనమదిం దిరంబుచేసికొని భక్తియుక్తంబైన చిత్తంబునం బరిపూర్ణుండైన
యీశ్వరుం గాంచి యీశ్వరాధీన మాయావృతంబైన జీవుని సంసారంబు గని జీవుండు
మాయచేత మోహితుండై గుణవ్యతిరిక్తుండయ్యు మాయాసంగతిం దాను ద్రిగుణాత్మకుం డని
యభిమానించుచుం ద్రిగుణత్వాభిమానంబునం గర్తయు భోక్తయు నను ననర్థంబు నొందుననియు
నయ్యనర్థంబునకు నారాయణ భక్తియోగంబు గాని యుపశమనంబు వేఱొకటి లేదనియును నిశ్చయించి.
134
మ. అవనీచక్రములోన నే పురుషుఁడే యామ్నాయమున్‌ విన్న మా
ధవుపై లోకశరణ్యుపై భవములం దప్పించఁగాఁ జాలు భ
క్తివిశేషంబు జనించు నట్టి భువన క్షేమంకరంబైన భా
గవతామ్నాయము బాదరాయణుఁడు దాఁ గల్పించె నేర్పొప్పఁగన్‌.
135
వ. యిట్లు భాగవతంబు నిర్మించి మోక్షార్థియైన శుకునిచేఁ జదివించె నని
చెప్పిన విని శౌనకుండు నిర్వాణతత్పరుండును సర్వోపేక్షకుండునైన శుకయోగి
యేమిటికి భాగవతం బభ్యసించె ననవుడు సూతుం డిట్లనియె.
136
క. ధీరులు నిరపేక్షులు నా
త్మారాములు నైన మునులు హరిభజనము ని
ష్కారణమ చేయుచుందురు
నారాయణుఁడట్టివాఁడు నవ్యచరిత్రా!
137
క. హరిగుణవర్ణన రతుఁడై
హరితత్పరుఁడైన బాదరాయణి శుభ త
త్పరతం బఠించెఁ ద్రిజగ
ద్వరమంగళమైన భాగవత నిగమంబున్‌.
138
క. నిగమములు వేయిఁ జదివిన
సుగమంబులు గావు ముక్తి సుభగత్వంబుల్‌
సుగమంబు భాగవత మను
నిగమంబుఁ బఠింప ముక్తినివసనము బుధా!
139
--: అర్జునుండు పుత్రఘాతియగు నశ్వత్థామను అవమానించుట :--
వ. అని పలికి రాజర్షియైన పరీక్షిన్మహారాజు జన్మకర్మ ముక్తులును పాండవుల మహాప్రస్థానంబును
కృష్ణకథోదయంబును జెప్పెద. కౌరవధృష్టద్యుమ్నాదుల యుద్ధంబున వీరులయినవారలు
స్వర్గంబునకుం జనిన వెనుక, భీము గదాఘాతంబున దుర్యోధనుండు దొడలువిఱిగి కూలిన
నశ్వత్థామ దుర్యోధనునకుం బ్రియంబు సేయువాఁడై నిదురవోవు ద్రౌపదీపుత్రుల శిరంబులు
ఖండించి తెచ్చి సమర్పించె. అది క్రూరకర్మం బని లోకులు నిందింతురు.
140
ఉ. బాలురచావు కర్ణములఁ బడ్డఁ గలంగి యలంగి యోరువం
జాలక బాష్పతోయ కణజాలము చెక్కుల రాల నేడ్చి పాం
చాలతనూజ నేలఁబడి జాలిఁబడం గని యెత్తి మంజువా
చాలతఁ జూపుచుం జికురజాలము దువ్వుచుఁ గ్రీడి యిట్లనెన్‌.
141
మ. ధరణీశాత్మజ వీవు నీకు వగవన్‌ఁ ధర్మంబె? తద్ద్రౌణి ని
ష్కరుణుండై విదళించె బాలకుల మద్గాండీవ నిర్ముక్త భీ
కర బాణంబుల నేఁడు వాని శిరమున్‌ఁ ఖండించి నేఁ దెత్తుఁ ద
చ్ఛిరమున్‌ ద్రొక్కి జలంబులాడు మిచటన్‌ శీతాంశుబింబాననా.
142
వ. అని యొడంబఱిచి తనకు మిత్రుండును సారథియు నైన హరి మేలనుచుండం గవచంబు దొడిగి
గాండీవంబు ధరియించి కపిధ్వజుండై గురుసుతునివెంట రథంబు దోలించిన.
143
శా. తన్నుం జంపెదనంచు వచ్చు విజయుం దర్శించి తద్ద్రౌణి యా
పన్నుండై శిశుహంత గావున నిజప్రాణేచ్ఛఁ బాఱెన్‌ వడిన్‌
మున్నా బ్రహ్మ మృగాకృతిం దనయకున్‌ మోహించి క్రీడింప నా
సన్నుండౌ హరుఁజూచి పాఱు పగిదిన్‌ సర్వేంద్రియ భ్రాంతితోన్‌.
144
వ. ఇట్లోపినంత దూరంబునుం బరువిడి వెనుకఁజూచి రథతురంగంబు లలయుట దెలిసి నిలిచి
ప్రాణరక్షణంబునకు నొండుపాయంబు లేదని నిశ్చయించి, జలంబుల వార్చి, ద్రోణనందనుండు
సమాహితచిత్తుండై ప్రయోగంబ కాని యుపసంహారంబు నేరకయుం బ్రాణ సంరక్షణార్థంబునకై
పార్థునిమీఁద బ్రహ్మశిరోనామకాస్త్రంబు ప్రయోగించిన నది ప్రచండతేజంబున
దిగంతరాళంబులు నిండి ప్రాణభయంకరంబై తోఁచిన హరికి నర్జునుం డిట్లనియె.
145
ఆ. మాయయందు మునిఁగి మనువారలకుఁ గృపఁ
జేసి ధర్మముఖ్యచిహ్నమైన
శుభము సేయుచుందు సుజనుల నవనిలోఁ
గావఁ బుట్టుదువు జగన్నివాస!
146
క. ఇది యొక తేజము భూమియుఁ
జదలును దిక్కులును నిండి సర్వంకషమై
యెదురై వచ్చుచు నున్నది
విదితముగా నెఱుఁగఁ జెప్పవే దేవేశా!
147
వ. అనిన హరి యిట్లనియె. 148
శా. జిహ్మత్వంబునఁ బాఱి ద్రోణజుఁడు దుశ్శీలుండు ప్రాణేచ్ఛువై
బ్రహ్మాస్త్రంబదె యేయ వచ్చె నిదె తద్బాణాగ్ని బీభత్స! నీ
బ్రహ్మాస్త్రంబునఁ గాని దీని మరలింప\న్‌ రాదు సంహార మీ
బ్రహ్మాపత్య మెఱుంగఁ డేయుము వడి\న్‌ బ్రహ్మాస్త్రమున్‌ దీనిపై.
149
వ. అనిన నర్జునుండు జలంబులు వార్చి హరికిం బ్రదక్షిణంబు వచ్చి ద్రోణనందనుండేసిన
బ్రహ్మాస్త్రంబుమీఁదఁ దన బ్రహ్మాస్త్రంబు ప్రయోగించిన.
150
మ. అవని వ్యోమములందు నిండి తమలో నా రెండు బ్రహ్మాస్త్రముల్‌
రవి వహ్ని ద్యుతిఁ బోరుచుం ద్రిభువన త్రాసంబు గావింపఁగా
వివశభ్రాంతి యుగాంతమో యని ప్రజల్‌ వీక్షింప నావేళ మా
ధవు నాజ్ఞ\న్‌ విజయుండు సేసె విశిఖ ద్వంద్వోపసంహారము\న్‌.
151
వ. ఇట్లస్త్రద్వయంబు నుపసంహరించి ధనంజయుండు, ద్రోణనందనుం గూడ నరిగి
తఱిమి పట్టుకొని రోషారుణిత లోచనుండై యాజ్ఞికుండు రజ్జువునం బశువుం
గట్టినచందంబున బంధించి శిబిరంబుకడకుం గొని చని హింసింతు నని
తిగిచినం జూచి హరి యిట్లనియె.
152
ఉ. మాఱు పడంగలేని యసమర్థుల సుప్తుల నస్త్రవిద్యలం
దేఱని పిన్నపాపల వధించె నిశీధమునందుఁ గ్రూరుఁడై
పాఱుఁడె వీఁడు పాతకుఁడు ప్రాణభయంబున వెచ్చ నూర్చుచుం
బాఱెడి వీనిఁ గావకు కృపామతి నర్జున! పాపవర్జనా!
153
చ. వెఱచిన వాని, దైన్యమున వేఁదుఱు నొందినవాని, నిద్ర మై
మఱచినవాని, సౌఖ్యముగ మద్యము ద్రావినవాని, భగ్నుఁడై
పఱచినవాని, సాధు జడభావమువానిని, గావుమంచు వా
చఱచినవానిఁ, గామినులఁ జంపుట ధర్మముగాదు ఫల్గునా.
154
శా. స్వప్రాణంబుల నెవ్వఁడేనిఁ గరుణాసంగంబు చాలించి య
న్య ప్రాణంబులచేత రక్షణము సేయ\న్‌ వాఁ డధోలోక దుః
ఖప్రాప్తుం డగు రాజదండమున సత్కల్యాణుఁడౌ నైన నీ
విప్రుం దండితుఁజేయు మేటికి మహావిభ్రాంతితో నుండఁగ\న్‌.
155
వ. అని యివ్విధంబునఁ గృష్ణుఁ డానతిచ్చిన బ్రాహ్మణుండు గృతాపరాధుండయిన
వధ్యుండు గాఁడని ధర్మంబు దలంచి చంపక ద్రుపదరాజ పుత్రికిం
దనచేసిన ప్రతిజ్ఞం దలంచి బద్ధుండైన గురునందనుం దోడ్కొని కృష్ణుండు
సారథ్యంబుసేయ శిబిరంబుకడకు వచ్చి.
156
క. సురరాజసుతుఁడు సూపెను
దురవధి సుతశోకయుతకు ద్రుపదుని సుతకు\న్‌
బరిచలితాంగశ్రేణిం
బరుష మహాపాశబద్ధపాణి\న్‌ ద్రౌణి\న్‌.
157
వ. ఇట్లర్జునుండు దెచ్చి చూపిన బాలవధ జనిత లజ్జా పరాఙ్ముఖుండైన గురుని
కొడుకుం జూచి మ్రొక్కి సుస్వభావయగు ద్రౌపది యిట్లనియె.
158
మ. పరఁగన్‌ మా మగవార లందఱును మున్‌ బాణప్రయోగోపసం
హరణా ద్యాయుధవిద్య లన్నియును ద్రోణాచార్యుచే నభ్యసిం
చిరి పుత్రాకృతి నున్న ద్రోణుఁడవు నీ చిత్తంబులో లేశమున్‌
గరుణాసంగము లేక శిష్యసుతులన్‌ ఖండింపఁగా బాడియే!
159
క. భూసురుఁడవు బుద్ధి దయా
భాసురుఁడవు శుద్ధవీర భటసందోహా
గ్రేసరుఁడవు శిశుమారణ
మాసురకృత్యంబు ధర్మమగునే తండ్రీ!
160
శా. ఉద్రేకంబున రారు శస్త్రధరులై యుద్ధావనిన్‌ లేరు కిం
చిత్‌ద్రోహంబును నీకుఁ జేయరు బలోత్సేకంబుతోఁ జీఁకటిన్‌
భద్రాకారులఁ బిన్నపాపల రణ ప్రౌఢక్రియా హీనులన్‌
నిద్రాసక్తుల సంహరింప నకటా! నీ చేతులెట్లాడెనో!
161
ఉ. అక్కట! పుత్రశోకజనితాకులభావ విషణ్ణచిత్తనై
పొక్కుచు నున్నభంగి నినుఁ బోరఁ గిరీటి నిబద్ధుఁజేసి నేఁ
డిక్కడి కీడ్చితెచ్చుట సహింపనిదై భవదీయమాత నే
డెక్కడ నిట్టిశోకమున నేక్రియ నేడ్చుచుఁ బొక్కుచున్నదో!
162
వ. అని కృష్ణార్జునులం జూచి యిట్లనియె. 163
ఉ. ద్రోణునితో శిఖింబడక ద్రోణకుటుంబిని యున్నదింట న
క్షీణతనూజ శోకవివశీకృతనై విలపించు భంగి నీ
ద్రౌణిఁ దెరల్చి తెచ్చుటకు దైన్యము నొందుచు నెంత పొక్కునో!
ప్రాణ వియుక్తుఁడైన నతిపాపము బ్రాహ్మణహింస మానరే.
164
క. భూపాలకులకు విప్రులఁ
గోపింపఁగఁ జేయఁదగదు కోపించినఁ ద
త్కోపానలంబు మొదలికి
భూపాలాటవులఁ గాల్చు భూకంపముగ\న్‌.
165
వ. అని యిట్లు ధర్మ్యంబును సకరుణంబును నిర్వ్యళీకంబును సమంజసంబును
శ్లాఘ్యంబునుంగా ద్రౌపది పలుకు పలుకులకు ధర్మనందనుండు సంతసిల్లె. నకుల
సహదేవ సాత్యకి ధనంజయ కృష్ణులు సమ్మతించిరి. సమ్మతింపక భీముండిట్లనియె.
166
చ. కొడుకులఁ బట్టి చంపెనని కోపము నొందదు బాలఘాతకున్‌
విడువు మటంచుఁ జెప్పెడిని వెఱ్ఱిది ద్రౌపది వీఁడు విప్రుఁడే?
విడువఁగనేల? చంపుఁ డిటు వీనిని మీరలు చంపరేని నా
పిడికిటి పోటునన్‌ శిరము భిన్నము సేసెదఁ జూడుఁ డిందఱున్‌.
167
వ. అని పలికిన నశ్వత్థామకు ద్రౌపది యడ్డంబు వచ్చె. భీముని సంరంభంబు సూచి
హరి చతుర్భుజుండై రెండుచేతుల భీముని వారించి కడమ రెండుచేతుల
ద్రుపద పుత్రికను దలంగం ద్రొబ్బి నగచు భీమున కిట్లనియె.
168
ఉ. అవ్యుఁడు గాఁడు వీఁడు శిశుహంత దురాత్మకుఁ డాతతాయి హం
తవ్యుఁడు బ్రహ్మబంధుఁ డగు దప్పదు నిక్కము 'బ్రాహ్మణో న హం
తవ్య' యటంచు వేదవిదితంబగుఁ గావున ధర్మదృష్టిఁ గ
ర్తవ్యము వీనిఁ గాచుట యథాస్థితిఁ జూడుము పాండవోత్తమా!
169
వ. అని సరసాలాపంబు లాడి పవననందను నొడంబఱిచి యర్జునుం జూచి ద్రౌపదికి
నాకు భీమసేనునకును సమ్మతంబుగ మున్ను నీ చేసిన ప్రతిజ్ఞయు సిద్ధించునట్లు నా
పంపు సేయుమని నారాయణుం డానతిచ్చిన నర్జునుండు తదనుమతంబున.
170
శా. విశ్వస్తుత్యుఁడు శక్రసూనుఁడు మహావీరుండు ఘోరాసిచే
నశ్వత్థామ శిరోజముల్‌ దఱిఁగి చూడాంతర్మహారత్నమున్‌
శశ్వత్కీర్తి వెలుంగఁ బుచ్చుకొని పాశవ్రాత బంధంబుల\న్‌
విశ్వాసంబున నూడ్చి ద్రొబ్బె శిబిరోర్వీభాగముం బాసిపోన్‌.
171
క. నిబ్బరపు బాలహంతయు
గొబ్బునఁ దేజంబు మణియుఁ గోల్పడి నతుఁడై
ప్రబ్బిన చింతన్‌ విప్రుఁడు
సిబ్బితితో నొడలి గబ్బు సెడి వడిఁ జనియెన్‌.
172
ఆ. ధనముగొనుటయొండెఁ దలగొఱుగుటయొండె
నాలయంబు వెడలనడుచుటొండెఁ
గాని చంపఁదగిన కర్మంబు సేసినఁ
జంపఁదగదు విప్రజాతిఁ బతికి.
173
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - prathamaskaMdhamu ( telugu andhra )