ఇతిహాసములు భాగవతము ప్రథమస్కంధము
అధ్యాయము - ౧౩
వ. అంతకు మున్ను విదురుండు తీర్థయాత్రకుఁ జని, మైత్రేయు ముందటఁ గర్మ
యోగ వ్రతాది విషయంబులైన ప్రశ్నలు గొన్ని చేసి, యతని వలన నాత్మ
విజ్ఞానంబు దెలిసి, కృతార్థుండై హస్తిపురంబునకు వచ్చిన.
296
క. బంధుఁడు వచ్చె నటంచును
గాంధారీవిభుఁడు మొదలుగా నందఱు సం
బంధములు నెఱపి ప్రీతి న
మంథరగతిఁ జేసి రపుడు మన్నన లనఘా!
297
వ. అంత ధర్మనందనుండు విదురునికి మజ్జన భోజనాది సత్కారంబులు సేయించి
సుఖాసీనుండై తనవార లందఱు విన నిట్లనియె.
298
సీ. ఏ వర్తనంబున నింత కాలము మీరు సంచరించితిరయ్య? జగతిలోన
నే తీర్థములు గంటి రెక్కడ నుంటిరి? భావింప మీవంటి భాగవతులు
దీర్థసంఘంబుల ధిక్కరింతురుగదా! మీయందు విష్ణుండు మెఱయుకతన
మీరె తీర్థంబులు మీకంటె మిక్కిలి తీర్థంబు లున్నవే? తెలిసిచూడ
 
తే. వేరె తీర్థంబు లవనిపై వెదకనేల మిమ్ముఁ బొడగని భాషించు మేలె చాలు
వార్త లేమండ్రు? లోకులు వసుధలోన మీకు సర్వంబు నెఱిఁగెడి మేరగలదు.
299
మత్తకోకిల. తండ్రి సచ్చిన మీఁద మా పెదతండ్రి బిడ్డలు దొల్లి పె
క్కండ్రు సర్పవిషాగ్ని బాధల గాసిపెట్టఁగ మమ్ము ని
ల్లాండ్ర నంతముఁ బొందకుండఁగ లాలనంబున మీరు మా
తండ్రిభంగి సముద్ధరింతురు తద్విధంబు దలంతురే?
300
క. పక్షులు తమ ఱెక్కలలోఁ
బక్షంబులురాని పిల్లపదువుల మమతన్‌
రక్షించినక్రియ మీరలు
పక్షీకరణంబు సేయ బ్రతికితిమి గదే!
301
క. మన్నారా? ద్వారకలో
నున్నారా? యదువు లంబుజోదరు కరుణన్‌
గన్నారా? లోకులచే
విన్నారా? మీరు వారి విధ మెట్టిదియో.
302
చ. అన విని ధర్మరాజునకు నా విదురుండు సమస్త లోకవ
ర్తనముఁ గ్రమంబుతోడ విశదంబుగఁ జెప్పి యదుక్షయంబు సె
ప్పిన నతఁడుగ్రశోకమున బెగ్గిలుచుండెడి నంచు నేమియున్‌
విను మని చెప్పఁ డయ్యె యదువీరుల నాశము భార్గవోత్తమా!
303
ఆ. మేలు చెప్పెనేని మేలండ్రు లోకులు
చేటుచెప్పెనేని చెట్టయండ్రు
అంతమీఁద శూద్రుఁడైన కతంబున
శిష్టమరణ మతఁడు సెప్పఁడయ్యె.
304
వ. అది యెట్లనిన మాండవ్యమహాముని శాపంబునం దొల్లి యముండు శూద్రయోని
యందు విదురుండై జన్మించియున్న నూఱుసంవత్సరంబు లర్యముండు యథా
క్రమంబునం బాపకర్ముల దండించె. ఇట యుధిష్ఠిరుండు రాజ్యంబుఁ గైకొని
లోకపాల సంకాశులైన తమ్ములుం దానును కులదీపకుండైన మనుమని ముద్దు
సేయుచుఁ బెద్దకాలంబు మహావైభవంబున సుఖియై యుండె.
305
క. బాలాజన శాలా ధన
లీలా వనముఖ్య విభవ లీన మనీషా
లాలసులగుచు మానవులను
గాలము వంచించు దురవగాహము సుమతీ!
306
వ. అది నిమిత్తంబునం గాలగతి యెఱింగి విదురుండు ధృతరాష్ట్రున కిట్లనియె. 307
--: గాంధారీ ధృతరాష్ట్రులు దేహత్యాగము చేయుట :--
మ. కనకాగార కళత్ర మిత్ర సుత సంఘాతంబులన్‌ ముందటం
గని ప్రాణేచ్ఛల నుండు జంతువుల నేకాలంబు దుర్లంఘ్యమై
యనివార్యస్థితిఁ జంపునట్టి నిరుపాయంబైన కాలంబు వ
చ్చె నుపాంతంబున మాఱు దీనికి మదిన్‌ జింతింపు ధాత్రీశ్వరా!
308
శా. పుట్టంధుడవు, పెద్దవాఁడవు, మహాభోగంబులా లేవు, నీ
పట్టెల్లంజెడిపోయె, దుస్సహ జరాభారంబు పైఁ గప్పె, నీ
చుట్టా లెల్లను బోయి రాలుమగఁడున్‌ శోకంబున\న్‌ మగ్నులై
కట్టా! దాయలపంచ నుండఁ దగవే, కౌరవ్యవంశాగ్రణీ!
309
క. పెట్టితిరి చిచ్చు గృహమునఁ
బట్టితిరి తదీయభార్యఁ బాడడవులకుం
గొట్టితిరి, వారు మనుపఁగ
నెట్టైన భరింపవలెనె? యీ ప్రాణముల\న్‌.
310
క. బిడ్డలకు బుద్ధిసెప్పని
గ్రుడ్డికిఁ బిండంబు వండికొని పొండిదె పైఁ
బడ్డాఁ దని భీముం డొఱ
గొడ్డెము లాడంగఁ గూడుఁ గుడిచెద వధిపా!
311
క. కనియెదవో బిడ్డల నిఁక
మనియెదవో తొంటికంటె మనుమలమాటల్‌
వినియెదవో యిచ్చెద ర
మ్మనియెదవో దానములకు నవనీసురుల\న్‌.
312
క. దేహము నిత్యము గాదని
మోహముఁ దెగఁ గోసి సిద్ధమునివర్తనుఁడై
గేహము వెలువడు నరుఁడు
త్సాహముతోఁ జెందు ముక్తిసంపద ననఘా!
313
వ. అని విదురుండు ధృతరాష్ట్రునకు విరక్తిమార్గం బుపదేశించిన నతండు, ప్రజ్ఞాచ
క్షుండై సంసారంబు దిగనాడి, మోహపాశంబులవలన నూడి, విజ్ఞానమార్గంబునం
గూడి, దుర్గమంబగు హిమవన్నగంబునకు నిర్గమించిన.
314
శా. అంధుడైన పతి\న్‌ వరించి పతిభావాసక్తి నేత్రద్వయీ
బంధాచ్ఛాదనము\న్‌ ధరించి నియమ ప్రఖ్యాతయై యున్న త
ద్గాంధార క్షితినాథు కూఁతురును యోగప్రీతి చిత్తంబులో
సంధిల్లం బతివెంట నేఁగె నుదయ త్సాధ్వీగుణారూఢియై.
315
చ. వెనుకకు రాక చొచ్చు రణవీరునికైవడి రాజదండనం
బునకు భయంబులేక వడిఁ బోయెడు ధీరునిభంగి నప్పుడా
వనిత దురంతమైన హిమవంతముపొంత వనాంతభూమికిం
బెనిమిటితోడ నించుకయు భీతివహింపక నేఁగెఁ బ్రీతితో\న్‌.
316
వ. ఇట్లు విదురసహితులై గాంధారీధృతరాష్ట్రులు వనంబునకుం జనిన, మఱుఁనాడు
ధర్మనందనుండు ప్రభాతంబున సంధ్యావందనంబు చేసి, నిత్యహోమంబులు
గావించి, బ్రాహ్మణోత్తములకు గో హిరణ్య తిల వస్త్రాది దానంబు లిచ్చి,
నమస్కరించి, గురువందనంబు కొఱకుఁ బూర్వప్రకారంబునం దండ్రి మందిరంబు
నకుం జని, యందు విదురసహితులైన తల్లిదండ్రులం గానక మంజుపీఠంబునం
గూర్చున్న సంజయున కిట్లనియె.
317
సీ. మా తల్లిదండ్రులు మందిరంబున లేరు సంజయ! వా రెందుఁ జనిరొ నేఁడు
ముందఱ గానఁడు ముసలి మా పెదతండ్రి, పుత్రశోకంబున\న్‌ బొగులుఁ దల్లి
సౌజన్యనిధి ప్రాణసఖుఁడు మా పినతండ్రి మందబుద్ధులమైన మమ్ము విడిచి
యెందుఁబోయిరొ? మువ్వురెఱిఁగింపు గంగలోఁ దన యపరాధంబుఁ దడవికొనుచు
 
ఆ. భార్యతోడఁ దండ్రి పరితాపమునఁ బడుఁ గపట మింత లేదు, కరుణ గలదు
పాండు భూవిభుండు పరలోకగతుఁడైన మమ్ముఁ బిన్నవాండ్ర మనిచె నతఁడు.
318
వ. అనిన సంజయుండు దయాస్నేహంబుల నతికర్శితుండగుచు తన ప్రభువు
పోయిన తెఱం గెఱుంగక కొంత దడవూరకుండి తద్వియోగదుఃఖంబునఁ
గన్నీరు కరతలంబునఁ దుడిచికొనుచు, బుద్ధిబలంబునం జిత్తంబు ధైర్యాయత్తంబు
సేసి తన భర్తృపాదంబుల మనంబున నెన్నుచు ధర్మజున కిట్లనియె.
319
తే. అఖిలవార్తలు మున్ను నన్నడుగుచుండు
నడుగఁడీ రేయి మీతండ్రి యవనినాథ!
మందిరములోన విదురుతో మంతనంబు
నిన్న యాడుచునుండెను నేఁడు లేఁడు.
320
వ. విదుర గాంధారీ ధృతరాష్ట్రులు నన్ను వంచించి యెందుఁ బోయిరో? వారల
నిశ్చయంబు లెట్టివో? యెఱుంగ నని సంజయుండు దుఃఖించు సమయంబునఁ
దుంబురుసహితుండై నారదుండు వచ్చిన లేచి, నమస్కరించి, తమ్ములుం దానును
నారదుం బూజించి కౌంతేయాగ్రజుండిట్లనియె.
321
ఉ. అక్కట! తల్లిదండ్రులు గృహంబున లేరు, మహాత్మ! వారు నేఁ
డెక్కడఁ బోయిరో యెఱుఁగ, నెప్పుడు బిడ్డలపేరు గ్రుచ్చి తాఁ
బొక్కుచునుండుఁ దల్లి యెటువోయె నొకో! విపదంబురాశికిన్‌
నిక్కము గర్ణధారుఁడవు నీవు జగజ్జన పారదర్శనా!
322
వ. అనిన విని సర్వజ్ఞుండైన నారదుండు ధర్మజున కిట్లనియె. ఈశ్వరవశంబు
విశ్వంబు. ఈశ్వరుండె భూతంబుల నొకటితో నొకటిఁ జేర్చు, నెడఁబాపు.
సూచీభిన్న నాసికలందు రజ్జుప్రోతంబు లగుచుఁ గంఠరజ్జువులఁ గట్టంబడిన బలీ
వర్దంబులంబోలెఁ గర్తవ్యాకర్తవ్య విధాయక వేదలక్షణ యగు వాక్తంత్రియందు
వర్ణాశ్రమలక్షణంబులు గల నామంబులచే బద్ధులైన లోకపాల సహితంబులై
లోకంబు లీశ్వరాదేశంబు వహించు. క్రీడాసాధనంబులగు నక్షకందుకాదుల
కెట్లు సంయోగ వియోగంబులట్లు క్రీడించు నీశ్వరునికిం గ్రీడాసాధనంబులైన
జంతువులకు సంయోగవియోగంబులు గలుగుచుండు. సమస్తజనంబును జీవ
రూపంబున ధ్రువంబును, దేహరూపంబున నధ్రువంబునై యుండు. మఱియు
నొక్కపక్షంబున ధ్రువంబు నధ్రువంబుం గాకయుండు. శుద్ధబ్రహ్మరూపంబున
ననిర్వచనీయంబుగ రెండునై యుండు. అజగరంబుచేత మ్రింగబడిన పురుషుఁ
డన్యుల రక్షింపలేని తెఱంగునఁ బంచభూతమయంబై కాలకర్మ గుణాధీనంబైన
దేహంబు పరులరక్షింప సమర్థంబుగాదు. కరంబులుగల జంతువులకుఁ గరంబులులేని
చతుష్పదాదు లాహారంబులగు. చరణంబులు గల ప్రాణులకుఁ చరణంబులు లేని
తృణాదులు భక్షణీయంబులగు. అధికజన్మంబులుగల వ్యాఘ్రాదులకు నల్ప
జన్మంబుగల మృగాదులు భోజ్యంబులగు. అహస్త సహస్తాది రూపంబైన విశ్వ
మంతయు నీశ్వరుండుగాఁ దెలియుము. అతనికి వేఱు లేదు. నిజ మాయా
విశేషంబున మాయావియై జాతి భేద రహితుండైన యీశ్వరుండు బహుప్రకా
రంబుల భోగిభోగ్య రూపంబుల నంతరంగ బహిరంగంబుల దీపించు. కాన
యనాథులు దీనులు నగు నాదు తలిదండ్రులు ననుం బాసి యే మయ్యెదరో?
యెట్లు వర్తించుదురో? యని వగవంబనిలేదు. అజ్ఞానమూలం బగు స్నేహం
బున నైన మనోవ్యాకులత్వంబు పరిహరింపు మని మఱియు నిట్లనియె.
323
ఆ. అట్టి కాలరూపుఁ డఖిలాత్ముఁడగు విష్ణుఁ
డసురనాశమునకు నవతరించి
దేవకృత్యమెల్లఁ దీర్చి చిక్కినపని
కెదురు సూచుచుండు నిప్పు డధిప!
324
మత్తకోకిల. ఎంతకాలము గృష్ణుఁడీశ్వరుఁ డిద్ధరిత్రిఁ జరించు మీ
రంతకాలము నుండుఁ డందఱు నవ్వలం బనిలేదు వి
భ్రాంతి మానుము కాలముం గడవంగ నెవ్వరు నోప రీ
చింతయేల? నరేంద్రసత్తమ! చెప్పెద\న్‌ విని యంతయున్‌.
325
వ. ధృతరాష్ట్రుండు గాంధారీ విదుర సహితుండై హిమవత్పర్వత దక్షిణ భాగంబున
నొక్క మునివనంబునకుం జని, తొల్లి సప్తఋషులకు సంతోషంబు
సేయు కొఱకు, నాకాశగంగ యేడు ప్రవాహంబులై పాఱిన పుణ్యతీర్థంబునం
గృతస్నానుండై, యథావిధి హోమ మొనరించి, జలభక్షణంబు గావించి, సకల
కర్మంబులు విసర్జించి, విఘ్నంబులఁ జెందక, నిరాహారుండై, యుపశాంతాత్ముఁ
డగుచు, పుత్రార్థదారైషణంబులు వర్జించి, విన్యస్తాసనుండై, ప్రాణంబులు
నియమించి, మనస్సహితంబులైన చక్షురాదీంద్రియంబుల నాఱింటిని విషయం
బులం బ్రవర్తింపనీక నివర్తించి, హరిభావనారూపంబగు ధారణ యోగంబుచే
రజ స్సత్త్వతమో రూపంబులగు మలంబుల మూఁటిని హరించి, మనంబు నహంకా
రాస్పదంబైన స్థూలదేహంబువలన బాపి, బుద్ధియందుఁ నేకీకరణంబు చేసి, యట్టి
విజ్ఞానాత్మను దృశ్యాంశంబు వలన వియోగించి, క్షేత్రజ్ఞుని యందుఁ బొందించి,
ద్రష్ట్రంశంబు వలన క్షేత్రజ్ఞునింబాపి, మహాకాశంబుతోడ ఘటాకాశముం
గలుపు కైవడి నాధారభూతంబైన బ్రహ్మమందుఁ గలిపి, లోపలి గుణక్షోభంబును,
వెలుపలి యింద్రియవిక్షేపంబును లేక నిర్మూలిత మాయాగుణ వాసనుండగుచు,
నిరుద్ధంబులగు మనశ్చక్షురాదింద్రియంబులు గలిగి, యఖిలాహారంబులను
వర్జించి, కొఱడు చందంబున.
326
మ. ఉటజాంతస్థల వేదికన్‌ నియతుఁడై యున్నాఁడు నేఁ దాదిగా
నిటపై నేనవనాఁడు మేన్‌ విడువఁగా నిజ్యాగ్ని యోగాగ్ని త
త్పటు దేహంబు దహింపఁ జూచి నియమ ప్రఖ్యాత గాంధారి యి
ట్టటు వో నొల్లక ప్రాణవల్లభునితో నగ్నిం బడుం భూవరా!
327
క. అంతట వారల మరణము
వింతయగుచుఁ జూడఁబడిన విదురుఁడు చింతా
సంతాప మొదవఁ బ్రీత
స్వాంతుండై తీర్థములకుఁ జనియెడు నధిపా!
328
వ. అని విదురాదుల వృత్తాంతం బంతయు ధర్మనందనున కెఱిగించి తుంబురు
సహితుండై నారదుండు స్వర్గంబునకు నిర్గమించిన వెనుక, ధర్మజుండు
భీమునిం జూచి యిట్లనియె.
329
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - prathamaskaMdhamu ( telugu andhra )