ఇతిహాసములు భాగవతము ప్రథమస్కంధము
అధ్యాయము - ౧౪
--: ధర్మరాజు దుర్నిమిత్తంబులం గని చింతించుట :--
సీ. ఒక కాలమునఁ బండు నోషధీచయము వేఱొకకాలమున బండకుండు నండ్రు
క్రోధంబు లోభంబుఁ గ్రూరత బొంకును దీపింప నరులు వర్తింతు రండ్రు
వ్యవహారములు మహావ్యాజయుక్తము లండ్రు సఖ్యంబు వంచనా సహిత మండ్రు
మగలతో నిల్లాండ్రు మచ్చరించెద రండ్రు సుతులు దండ్రులఁ దెగఁజూతు రండ్రు
 
తే. గురుల శిష్యులు దూషించి కూడ రండ్రు శాస్త్రమార్గము లెవ్వియు జరుగ వండ్రు
న్యాయ పద్ధతి బుధులైన నడవ రండ్రు కాలగతి వింతయై వచ్చెఁగంటె నేఁడు.
330
మ. హరిఁ జూడన్‌ నరుఁ డేఁగినాఁడు నెల లే డయ్యెంగదా! రారు కా
లరు లెవ్వారును, యాదవుల్‌ సమద లోలస్వాంతు లేవేళ సు
స్థిరులై యుండుదురా? మురారి సుఖియై సేమంబుతో నుండునా?
యెరవై యున్నది చిత్త మీశ్వరకృతంబెట్లో కదే? మారుతీ!
331
క. మానసము గలఁగుచున్నది
మానవు బహు దుర్నిమిత్త మర్యాదలు, స
న్మానవ దేహక్రీడలు మాన
విచారింపనోపు మాధవుఁడనుజా!
332
క. మనవులు చెప్పక ముందఱ
మన దారప్రాణరాజ్యమాన శ్రీలన్‌
మనుపుదునని యా దేవుఁడు
మనమునఁ దలపోసి మనిచె మనలం గరుణన్‌.
333
క. నారదుఁ డాడిన కైవడిఁ
గ్రూరపుఁ గాలంబు వచ్చెఁ గుంభిని మీఁదన్‌
ఘోరములగు నుత్పాతము
లారభటిం జూడఁ బడియె ననిలజ! కంటే.
334
సీ. ఓడక నాముందు నొక సారమేయంబు మొఱుఁగుచు నున్నది మోర యెత్తి
యాదిత్యుఁడుదయింప నభిముఖియై నక్క వాపోయె మంతలు వాతఁ గలుగ
మిక్కిలు చున్నవి మెఱసి గవాదులు గర్దభాదులు దీర్చి క్రందుకొనియె
నుత్తమాశ్వములకు నుదయించెఁ గన్నీరు మత్తగజంబుల మదము లుడిగెఁ
 
ఆ. గాలుదూత భంగి గవిసెఁ గపోతము మండ దగ్ని హోమమందిరములఁ
జుట్టుఁ బొగలు దిశల సొరిది నాచ్ఛాదించెఁ దరణి మాసెఁ జూడు ధరణి గలదె.
335
క. వాతములు విసరె రేణు
వ్రాతము లాకసముఁ గప్పె వడి సుడిగొని ని
ర్ఘాతములు వడియె ఘనసం
ఘాతములు రక్త వర్ష కలితము లయ్యె\న్‌.
336
క. గ్రహములు పోరాడెడి నా
గ్రహములు వినఁబడియె భూతకలకలముల, దు
స్సహములగుచు శిఖికీలా
వహములక్రియఁ దోఁచె గగన వసుధాంతరముల్‌ఁ.
337
క. దూడలు గుడువవు చన్నులు
దూడలకును గోవు లీవు దుగ్ధము, లొడలం
బీడలు మానవు, పశువులఁ
గూడవు వృషభములు దఱిపికుఱ్ఱల నెక్కు\న్‌.
338
క. కదలెడు వేల్పుల రూపులు
వదలెడుఁ గన్నీరు వానివలనం జెమటల్‌
వొదలెడిఁ బ్రతిమలు వెలిఁజని
మెదలెడి నొక్కొక్క గుడిని మేదిని యందున్‌.
339
క. కాకంబులు వాపోయెడి
ఘూకంబులు నగరఁ బగలు గుండ్రలు గొలిపె\న్‌
లోకంబులు విభ్రష్ట
శ్రీకంబుల గతి నశించి శిథిలము లయ్యెన్‌.
340
మ. యవ పద్మాంకుశ చాప చక్ర ఝష రేఖాలంకృతం బైన మా
ధవు పాదద్వయ మింక ముట్టెడు పవిత్రత్వంబు నేఁడాదిగా
నవనీకాంతకు లేదువో! పలుమఱు న్నందంద వామాక్షి బా
హువు లాకంపము నొందుచుండు, నిల కే యుగ్రస్థితు ల్వచ్చునో!
341
వ. మఱియు మహోత్పాతంబులు పెక్కులు పుట్టుచున్నయవి. మురాంతకుని
వృత్తాంతంబు వినరాదు. అని కుంతీసుతాగ్రజుండు భీమునితో విచారించు సమయంబున.
342
--: అర్జునుండు ద్వారకనుండి వచ్చి కృష్ణ నిర్యాణమును దెలియఁ జెప్పుట :--
క. ఖేదమున నింద్రసూనుఁడు
యాదవపురినుండి వచ్చి, యగ్రజుఁగని, త
త్పాదముల నయన సలిలో
త్పాదకుఁడై పడియె దీనుభంగి నరేంద్రా!
343
క. పల్లటిలిన యుల్లముతోఁ
దల్లడపడుచున్న పిన్న తమ్మునిఁ గని వె
ల్వెల్లనగు మొగముతో జను
లెల్లను విన ధర్మపుత్రుఁ డిట్లని పలికె\న్‌.
344
సీ. మాతామహుండైన మన శూరుఁడున్నాఁడె? మంగళమే మన మాతులునకు?
మోదమే నలుగురు ముగురు మేనత్తల? కానందమే వారి యాత్మజులకు?
నక్రూర కృతవర్మ లాయుస్సమేతులే జీవితుఁడే యుగ్రసేన విభుఁడు?
గల్యాణ యుక్తులే గద సారణాదులు మాధవు తమ్ములు మానధనులు?
 
తే. నందమే? మన సత్యక నందనునకు భద్రమే? శంబరాసుర భంజకునకుఁ
గుశలమే? బాణదనుజేంద్రు కూఁతు పతికి హర్షమే? పార్థ! ముసలికి హలికి బలికి.
345
వ. మఱియును నంధక మధు యదు భోజ దాశార్హ వృష్ణి సాత్వతు లనియెడి
వంశంబుల వీరులును, హరి కుమారులైన సాంబ సుషేణ ప్రముఖులును, నారా
యణానుచరులైన యుద్ధవాదులును, కృష్ణసహచరులైన సునందనందాదులును
సుఖానందులే? యని యందఱ నడిగి, ధర్మజుండు గ్రమ్మఱ నిట్లనియె.
346
సీ. వైకుంఠ వాసుల వడువున నెవ్వని బలమున నానంద భరితులగుచు
వెఱవక యాదవ వీరులు వర్తింతు, రమరులు గొలువుండు నట్టి కొలువు
చవికె నాకర్షించి చరణసేవకులైన బంధు మిత్రాదుల పదయుగమున
నెవ్వఁడు ద్రొక్కించె నింద్రపీఠము మీఁద, వజ్రంబు జళిపించి వ్రాలువాని
 
తే. ప్రాణవల్లభ కెంగేలఁ బాదుచేసి యమృతజలములఁ బోషింప నలరు పారి
జాత మెవ్వఁడు కొనివచ్చి సత్యభామ కిచ్చె నట్టి మహాత్మున కిపుడు శుభమే?
347
శా. అన్నా! ఫల్గున! భక్తవత్సలుఁడు బ్రహ్మణ్యుండు గోవిందుఁడా
పన్నానీక శరణ్యుఁడీశుఁడు జగద్భద్రానుసంధాయి శ్రీ
మ న్నవ్యాజంబుపత్రనేత్రుఁడు సుధర్మామధ్య పీఠంబునం
దున్నాఁడా? బలభద్రుఁగూడి, సుఖియై, యుత్సాహియై, ద్వారకన్‌.
348
క. ఆ రామకేశవులకును
సారామలభక్తి నీవు సలుపుదువు గదా?
గారాములు సేయుదురా?
పోరాముల బంధు లెల్లప్రొద్దు జితారీ!
349
శా. మున్నుగ్రాటవిలో వరాహమునకై ముక్కంటితోఁ బోరుచో,
సన్నాహంబునఁ గాలకేయుల వడిం జక్కాడుచోఁ, బ్రాభవ
స్కన్నుండై చను కౌరవేంద్రు పనికై గంధర్వులం ద్రోలుచోఁ,
గన్నీ రెన్నఁడుఁ దేవు తండ్రి! చెపుమా! కల్యాణమే? చక్రికిన్‌.
350
వ. అదియునుం గాక. 351
క. ఓడితివో? శత్రువులకు
నాడితివో? సాధు దూషణాలాపంబుల్‌
గూడితివో? పరసతులను
వీడితివో? మానధనము వీరుల నడుమన్‌.
352
క. తప్పితివో? యిచ్చెద నని
చెప్పితివో? కపటసాక్షి; చేసిన మేలుం
దెప్పితివో? శరణార్థుల
రొప్పితివో? ద్విజులఁ బసుల రోగుల సతులన్‌.
353
క. అడిగితివో? భూసురులను
గుడిచితివో? బాల వృద్ధ గురువులు వెలిగా,
విడిచితివో? యాశ్రితులను
ముడిచితివో? పరుల విత్తములు లోభమునన్‌.
354
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - prathamaskaMdhamu ( telugu andhra )