ఇతిహాసములు భాగవతము ప్రథమస్కంధము
అధ్యాయము - ౧౫
వ. అని పలికినం గన్నీరు కరతలమునం దుడుచుకొనుచు, గద్గదస్వరంబున మహానిధిఁ
గోలుపోయిన పేదచందంబున నిట్టూర్పులు నిగుడింపుచు, నర్జునుం డన్న కిట్లనియె.
355
క. మన సారథి, మన సచివుఁడు
మన వియ్యము, మన సఖుండు, మన బాంధవుఁడు\న్‌
మన విభుఁడు, గురువు, దేవర
మనలను దిగనాడి చనియె, మనుజాధీశా!
356
క. కంటకపు నృపులు సూడఁగ
మింటం గంపించు యంత్రమీనముఁ గోలన్‌
గెంటించి మనము వాలుం
గంటిం జేకొంటి మతని కరుణన కాదే?
357
క. దండి ననేకులతో నా
ఖండలుఁ డెదురైన గెలిచి ఖాండవ వనముం
జండార్చికి నర్పించిన
గాండీవము నిచ్చెఁ జక్రి గలుగుటఁ గాదే?
358
క. దిక్కుల రాజుల నెల్లను
మక్కించి ధనంబు గొనుట, మయకృతసభ ము
న్నెక్కుట, జన్నము సేయుట
నిక్కము హరి మనకు దండ నిలిచినఁ గాదే?
359
మ. ఇభజిద్వీర్య! మఖాభిషిక్తమగు నీ యిల్లాలి ధమ్మిల్లమున్‌
సభలో శాత్రవు లీడ్చినన్‌ ముడువ కా చంద్రాస్య దుఃఖింపఁగా
నభయంబిచ్చి ప్రతిజ్ఞచేసి భవదీ యారాతికాంతా శిరో
జ భరశ్రీలు హరింపఁడే? విధవలై సౌభాగ్యముల్‌ వీడఁగన్‌.
360
శా. వైరుల్‌ గట్టిన పుట్టముల్‌ విడువఁగా వారింప "నా వల్లభుల్‌
రారీవేళ, నుపేక్షసేయఁ దగవే? రావే? నివారింపవే?
లేరే త్రాతలు? కృష్ణ!" యంచు సభలో లీనాంగియై కుయ్యిడ\న్‌
గారుణ్యంబున భూరి వస్త్రకలితంగాఁ జేయఁడే? ద్రౌపదిన్‌.
361
సీ. దూర్వాసుఁడొకనాఁడు దుర్యోధనుఁడు వంప పదివేల శిష్యులు భక్తిఁ గొలువఁ
జనుదెంచి మనము పాంచాలియుఁ గుడిచిన వెనుక నాహారంబు వేఁడుకొనినఁ
బెట్టెద ననవుడుఁ బెట్టకున్న శపింతు ననుచుఁ దోయావగాహమున కేఁగఁ
గడవల నన్న శాకములు దీఱుట చూచి పాంచాల పుత్రిక పర్ణశాల
 
తే. లోనఁ వెఱచిన, విచ్చేసి లోవిలోని శిష్ట శాకాన్న లవము ప్రాశించి, తపసి
కోప ముడిగించి, పరిపూర్ణ కుక్షిఁ జేసె నిట్టి త్రైలోక్య సంతర్పి యెందుఁగలఁడు?
362
సీ. పందికై పోరాడ ఫాలాక్షుఁ డెవ్వని బలమున నా కిచ్చెఁ బాశుపతము!
నెవ్వని లావున నీ మేన దేవేంద్రు పీఠార్ధమున నుండు పెంపుఁ గంటిఁ!
గాలకేయ నివాతకవచాది దైత్యులఁ జంపితి నెవ్వని సంస్మరించి!
గోగ్రహణమునాఁడు కురుకులాంభోనిధిఁ గడచితి! నెవ్వని కరుణఁ జేసి
 
ఆ. కర్ణ సింధురాజ కౌరవేంద్రాదుల తలల పాగలెల్లఁ దడవి తెచ్చి
యే మహాత్ము బలిమి నిచ్చితి! విరటుని పుత్రి యడుగ బొమ్మపొత్తికలకు.
363
మ. గురు భీష్మాదులు గూడి పన్నిన కురుక్షోణీశ చక్రంబులో
గురుశక్తి\న్‌ రథయంతయై, నొగలపైఁ గూర్చుండి, యా మేటి నా
శరముల్‌ వాఱకమున్న వారల బలోత్సాహాయ రుద్యోగ త
త్పరతత్‌ చూడ్కుల సంహరించె నమితోత్సాహంబు నాకిచ్చుచున్‌.
364
మ. అసురేంద్రుండొనరించు కృత్యములు ప్రహ్లాదుం బ్రవేశించి గె
ల్వ సమర్థంబులు గానికైవడిఁ గృపాశ్వత్థామ గాంగేయ సూ
ర్యసుత ద్రోణ ధనుర్విముక్త బహు దివ్యాస్త్ర ప్రపంచంబు నా
దెసకున్‌ రాక తొలంగు మాధవు దయాదృష్టిన్‌ నరేంద్రోత్తమా!
365
చ. వసుమతి, దివ్యబాణముల వ్రక్కలువాపి, కొలంకుసేసి, నా
రసముల మాటుఁగా బఱపి, రథ్యముల\న్‌ రిపులెల్లఁ జూడ, సా
హసమున నీటఁ బెట్టితి రణావని సైంధవుఁ జంపునాఁడు నా
కసురవిరోధి భద్రగతి నండయి వచ్చినఁ గాదె? భూవరా!
366
సీ. చెలికాఁడ! రమ్మని చీరు నన్నొకవేళ మన్నించు నొకవేళ మఱఁది! యనుచు
బంధుభావంబునఁ బాటించు నొకవేళ దాతయై యొకవేళ ధనము లిచ్చు
మంత్రియై యొకవేళ మంత్ర మాదేశించు బోద్ధయై యొకవేళ బుద్ధిసెప్పు
సారథ్య మొనరించుఁ, జనవిచ్చు నొకవేళఁ గ్రీడించు నొకవేళ గేలిసేయు
 
తే. నొక్క శయ్యాసనంబున నుండుఁ గన్న తండ్రికైవడిఁ జేసినతప్పుఁ గాఁచు
హస్తములువట్టి పొత్తున నారగించు మనుజవల్లభ! మాధవు మఱవరాదు.
367
క. విజయ! ధనంజయ! హనుమ
ద్ధ్వజ! ఫల్గున! పాండుతనయ! నర! మహేం
ద్రజ! మిత్రార్జన! యంచును
భుజములు తలకడవ రాకపోకలఁ జీరు\న్‌.
368
క. వారిజగంధులు దమలో
వారింపఁగరాని ప్రేమ వాదముసేయన్‌
వారిజనేత్రుఁడు ననుఁ దగ
వారిండ్లకుఁ బనుపు నలుక వారింప నృపా!
369
క. నిచ్చలు లోపలి కాంతలు
మచ్చికఁ దనతోడ నాడు మాటలు నాకు\న్‌
ముచ్చటలు సెప్పుమెల్లన
విచ్చలవిడిఁ దొడలమీఁద విచ్చేసి నృపా!
370
చ. అటమటమయ్యె నా భజన మంతయు భూవర! నేఁడుఁ జూడుమా
యిటువలె గారవించు జగదీశుఁడు గృష్ణుఁడు లేని పిమ్మటన్‌
బటుతర దేహలోభమునఁ బ్రాణము లున్నవి వెంటఁ బోక, నేఁ
గటకట! పూర్వజన్మమునఁ గర్మము లెట్టివి చేసినాఁడనో!
371
శా. కాంతారంబున నొంటిఁ దోడుకొని రాఁగాఁ జూచి, గోవింద శు
ద్ధాంతస్త్రీలఁ బదాఱువేల మద రాగాయత్తులై తాఁకి, నా
చెంతన్‌ బోయలు మూఁగి పట్టికొన, నా సీమంతినీసంఘము\న్‌
భ్రాంతిన్‌ భామిని భంగి నుంటి విడిపింప\న్‌ లేక, ధాత్రీశ్వరా!
372
శా. ఆ తేరా రథికుండు నా హయము లా యస్త్రాసనం బా శర
వ్రాతం బన్యులఁ దొల్లిఁ జంపును, దుదిన్‌ వ్యర్థంబు లై పోయె మ
చ్చేతోధీశుఁడు చక్రి లేమి, భసిత క్షిప్తాజ్య మాయావి మా
యాతంత్రోషరభూమి బీజముల మర్యాద న్నిమేషంబున\న్‌.
373
మ. యదువీరుల్‌ మునినాథు శాపమునఁ గాలాధీనులై, యందఱున్‌
మదిరాపాన వివర్ధమాన మద సమ్మర్దోగ్ర రోషాంధులై,
కదనంబుల్‌ దమలోన ముష్టిహతులం గావించి నీఱైరి, న
ష్టదశం జిక్కిరి నల్గు రేవు రచటన్‌ సర్వంసహావల్లభా!
374
క. భూతలముల వలన నెప్పుడు
భూతములకు జన్మ మరణ పోషణములు ని
ర్ణీతములు సేయుచుండును
భూతమయుం డీశ్వరుండు భూపవరేణ్యా!
375
క. బలములు గల మీనంబులు
బలవిరహిత మీనములను భక్షించుక్రియ\న్‌
బలవంతులైన యదువులు
బలరహితులఁ జంపి రహితభావముల నృపా!
376
మ. బలహీనాంగులకున్‌ బలాధికులకుం బ్రత్యర్థి భావోద్యమం
బులు గల్పించి, వినాశము న్నెఱపి, యీ భూభారముం బాపి, ని
శ్చలబుద్ధి\న్‌ గృతకార్యుఁడై చనియె నా సర్వేశ్వరుం డచ్యుతుం
డలఘుం డేమని చెప్పుదున్‌! భగవదీయాయత్త ముర్వీశ్వరా!
377
వ. మఱియు దేశ కాలార్థ యుక్తంబులు, నంతఃకరణ సంతాపశమనంబులు నైన
హరివచనంబులం దలచి, చిత్తంబు పరాయత్తంబై యున్నది. అని యన్నకుం
జెప్పి, నిరుత్తరుండై, గోవింద చరణారవింద చింతామలబుద్ధియై, శోకంబు
వర్జించి, సదా ధ్యాన భక్తివిశేషంబులం గామక్రోధాదుల జయించి, తొల్లి
తన కుభయసేనామధ్యంబున ననంతుం డానతిచ్చిన గీతలు దలంచి, కాలకర్మ
భోగాభినివేశంబులచేత నావృతంబైన విజ్ఞానంబు గ్రమ్మఱ నధిగమించి, శోక
హేతు వహంకార మమకారాత్మకంబైన ద్వైతభ్రమం బనియును, ద్వైత
భ్రమంబునకుఁ గారణంబు దేహంబనియును, దేహంబునకు బీజంబు లింగం
బనియును, లింగంబునకు మూలంబు గుణంబులనియును, గుణములకు నిదానము
ప్రకృతియనియును, బ్రహ్మాహ మనియెడు జ్ఞానంబున లీనమై ప్రకృతి లేకుండు
ననియు, ప్రకృతి యడంగుటయ నైర్గుణ్యం బనియును, నైర్గుణ్యంబువలనఁ
గార్యలింగ నాశంబనియును, గార్యలింగ నాశంబున నసంభవం బగుననియును,
ప్రకృతిం బాసి క్రమ్మఱ స్థూలశరీర ప్రాప్తుండుగాక పురుషుండు సమ్యగ్భోగంబున
నుండుననియును, నిశ్చయించి, యర్జునుండు విరక్తుండై యూరకుండె.
ధర్మజుండు భగవదీయ మార్గంబు దెలిసి, యాదవుల నాశంబు విని, నారదు
వచనంబు దలంచి, నిశ్చలచిత్తుండై స్వర్గగమనంబునకు యత్నంబు సేయుచుండె.
ఆ సమయంబున.
378
క. యదువుల నాశము మాధవు
పదవియు విని కుంతి విమలభక్తి\న్‌ భగవ
త్పదచింతా తత్పరతయై
ముదమున సంసార మార్గమునకుం బాసెన్‌.
379
వ. ఇట్లు కంటకంబునం గంటకోన్మూలనంబు సేసి కంటకంబులు రెంటినిం బరిహరించు
విన్నాణి తెఱంగున, యాదవరూప శరీరంబునంజేసి యీశ్వరుండు లోకకంటక
శరీరంబులు సంహరించి నిజశరీరంబు విడిచె. సంహారమునకు నిజశరీర పరశరీర
ములు రెండు నీశ్వరునకు సమంబులు. నిజరూపంబున నుండుచు, రూపాంతరంబుల
ధరించి క్రమ్మఱ నంతర్థానంబు నొందు నటునికైవడి లీలాపరాయణుండైన
నారాయణుండు మీన కూర్మాది రూపంబులు ధరియించుం బరిహరించు నని
చెప్పి మఱియు నిట్లనియె.
380
క. ఏ దినమున వైకుంఠుఁడు
మేదినిపైఁ దాల్చినట్టి మేను విడిచినాఁ
డా దినమున నశుభ ప్రతి
పాదకమగు కలియుగంబు ప్రాప్తంబయ్యెన్‌.
381
--: ధర్మరాజు పరీక్షన్మహారాజునకు పట్టముగట్టి మహాప్రస్థానంబున కరుగుట :--
సీ. కలివర్తనంబునఁ గ్రౌర్య హింసాసత్య దంభ కౌటిల్యాద్యధర్మచయము
పురముల గృహముల భూములఁ దనలోనఁ గలుగుట దలపోసి కరిపురమున
మనుమని 'రాజవై మను' మని దీవించి సింధుతోయ కణాభిషిక్తుఁ జేసి
యనిరుద్ధ నందనుండైన వజ్రునిఁ దెచ్చి మధురఁ బట్టముగట్టి మమతఁ బాసి
 
ఆ. కరులఁ దురగములను గంకణాదికముల మంత్రిజనుల బుధుల మానవతుల
నఖిలమైన ధనము నభిమన్యు సుతునకు నప్పగించి బుద్ధి నాశ్రయించి.
382
వ. విరక్తుండైన ధర్మనందనుండు ప్రాజాపత్య మనియెడి యిష్టి గావించి, యగ్నుల
నాత్మారోపణంబు సేసి, నిరహంకారుండును నిర్దళితాశేష బంధనుండునై,
సకలేంద్రియంబుల మానసంబున నణంచి, ప్రాణాధీన వృత్తియగు మానసంబును
బ్రాణమందుఁ, బ్రాణము నపానమునందు, నుత్సర్గ సహితంబైన యపానము
మృత్యువందును, మృత్యువును బంచభూతంబులకును నైక్యంబైన దేహంబునందును,
దేహము గుణత్రయము నందును, గుణత్రయంబు నవిద్యయందును, సర్వారోప
హేతువగు నవిద్యను జీవుని యందును, జీవుండైన తన్ను నవ్యయంబైన
బ్రహ్మమందును లయింపం జేసి, బహిరంతరంగ వ్యాపారంబులు విడిచి, నార
చీరలు ధరియించి, మౌనియు నిరాహారుండును ముక్తకేశుండునునై యున్మత్త
పిశాచ బధిర జడుల చందంబున నిరపేక్షకత్వంబున.
383
క. చిత్తంబున బ్రహ్మము నా
వృత్తము గావించుకొనుచు విజ్ఞాన ధనా
యత్తులు దొల్లి వెలింగెడి
యుత్తర దిశ కేగె నిర్మలోద్యోగమునన్‌.
384
సీ. అంత నాతని తమ్ము లనిల పుత్రాదులు గలిరాకచేఁ బాపకర్ము లగుచుఁ
జరియించు ప్రజల సంచారంబు లీక్షించి యఖిల ధర్మంబుల నాచరించి
వైకుంఠ చరణాబ్జ వర్తిత హృదయులై తద్భక్తి నిర్మలత్వమును జెంది
విషయ యుక్తులకుఁ బ్రవేశింపగా రాక నిర్ధూత కల్మష నిపుణ మతులు
 
తే. బహుళ విజ్ఞానదావాగ్ని భసిత కర్ము లైన యేకాంతులకు లక్ష్యమై వెలుంగు
ముఖ్య నారాయణ స్థానమునకుఁ జనిరి విగతరజ మైన యాత్మల విప్రవర్య!
385
వ. అంత విదురుండు ప్రభాసతీర్థంబున హరియందుఁ జిత్తంబు సేర్చి, శరీరంబు విడిచి,
పితృవర్గంబుతోడ దండధరుం డగుటంజేసి నిజాధికార స్థానంబునకుం జనియె.
ద్రుపదరాజ పుత్రియు పతులవలన ననపేక్షితయై వాసుదేవునందుఁ జిత్తంబు
సేర్చి తత్పదంబు సేరె, ఇట్లు.
386
క. పాండవ కృష్ణుల యానము
పాండురమతి నెవ్వఁడైనఁ బలికిన విన్నన్‌
ఖండిత భవుఁడై హరిదా
సుండై కైవల్యపదము సొచ్చు నరేంద్రా!
387
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - prathamaskaMdhamu ( telugu andhra )