ఇతిహాసములు భాగవతము ప్రథమస్కంధము
అధ్యాయము - ౧౭
--: కలిపురుషుండు ధర్మదేవతను దన్నుట :--
శా. కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గోరాజమున్‌
గాలక్రోధుఁడు దండహస్తుఁడు నృపాకారుండు క్రూరుండు జం
ఘాలుం డొక్కఁడు శూద్రుఁ డాసురగతిం గారుణ్య నిర్ముక్తుఁడై
నేలం గూలఁగఁదన్నెఁ బంచితిలఁగా నిర్ఘాతపాదాహతిన్‌.
409
శా. ఆ లోలాంగక, నశ్రుతోయకణ జాలాక్షిన్‌, మహాంభారవన్‌
బాలారూఢ తృణావళీకబళ లోభవ్యాప్త, నాం
దోళస్వాంత, సజీవవత్స, నుదయ ద్దుఃఖాన్వితన్‌, ఘర్మ కీ
లాలాపూర్ణశరీర, నా మొదవు నుల్లంఘించి తన్నెన్‌ఁవడిన్‌.
410
వ. ఇట్లా ధేనువృషభంబుల రెంటినిం గంటకుండై తన్నుచున్న రాజలక్షణ ముద్రి
తుండైన శూద్రునిం జూచి, సువర్ణపరికర స్యందనారూఢుఁ డగు నభిమన్యునందనుండు
గోదండంబు సగుణంబుసేసి మేఘగంభీర వచనంబుల నిట్లనియె.
411
శా. నిన్నుం గొమ్ములఁ జిమ్మెనో? కదిసెనో? నిర్భీతివై గోవులం
దన్నం గారణమేమి? మద్భుజ సనాధ క్షోణి నే వేళలం
దు న్నేరంబులుసేయరా దెఱుఁగవా? ధూర్తత్వము\న్‌ భూమిభృ
త్సన్నాహంబు నొనర్చె దెవ్వఁడవు? నిన్‌ శాసించెదన్‌ దుర్మతీ!
412
క. గాండీవియుఁ జక్రియు భూ
మండలి నెడఁబాసి చనిన మదమత్తుఁడవై
దండింపఁ దగనివారల
దండించెదు నీవ తగుదు దండనమునకున్‌.
413
వ. అని వృషభంబు నుద్దేశించి యిట్లనియె. 414
మ. కురుధాత్రీశ్వర బాహు వప్రయుగళీ గుప్త క్షమామండలిన్‌
బరికింపన్‌ భవదీయ నేత్రజనితాంభఃశ్రేణి దక్కన్‌ జనుల్‌
దొరుఁగం జూడ రధర్మసంజనిత జంతుశ్రేణి బాష్పంబులన్‌
గురుశక్తిన్‌ విదళింతుఁ జూడు మితనిన్‌ గోమూర్తి దేవోత్తమా!
415
క. జాలిఁ బడనేల? నా శర
జాలంబులపాలి సేసి చంపెద వీనిం
భూలోకంబున నిను నే
నాలుగుపాదముల నిపుడ నడిపింతుఁ జుమీ!
416
ఉ. వాచవియైన గడ్డి దిని వాహినులందు జలంబుఁద్రావఁగా
నీ చరణంబు లెవ్వఁ డిటు నిర్దళితంబుగఁజేసె, వాఁడు దా
ఖేచరుఁడైన వాని మణికీలిత భూషణయుక్త బాహులన్‌
వే చని త్రుంచివైతు వినువీథికి నేఁగిన నేల డాఁగినన్‌.
417
వ. అని మఱియు గో రూపయైన భూదేవితో నిట్లనియె. 418
చ. అగణిత వైభవుండగు మురాంతకుఁ డెక్కడఁబోయె? నంచు నె
వ్వగల నశించి నేత్రముల వారికణంబులు దేకుమమ్మ! లో
బెగడకుమమ్మ! మద్విశిఖబృందములన్‌ వృషలున్‌ వధింతు నా
మగటిమిఁ జూడు నీ వెరవు మానఁగదమ్మ! శుభప్రదాయినీ!
419
క. సాధువులగు జంతువులకు
బాధలుగావించు ఖలుల భంజింపని రా
జాధము నాయుస్స్వర్గ
శ్రీధనములు వీటివోవు సిద్ధము తల్లీ!
420
క. దుష్టజన నిగ్రహంబును
శిష్టజనానుగ్రహంబుఁ జేయఁగ నృపులన్‌
స్రష్ట విధించెఁ బురాణ
ద్రష్టలు సెప్పుదురు పరమధర్మము సాధ్వీ!
421
వ. అనిన ధర్మనందనపౌత్రునకు వృషభమూర్తి నున్న ధర్మదేవుండిట్లనియె. 422
ఉ. క్రూరులఁ జంపి సాధువులకున్‌ విజయం బొనరించునట్టి యా
పౌరవ వంశ జాతుఁడవు భాగ్యసమేతుఁడ వౌదు తొల్లి మీ
వా రిటువంటివా రవుట వారిజనేత్రుఁడు మెచ్చి దౌత్య సం
చారము సేసెఁ గాదె! నృపసత్తమ! భక్తి లతానుబద్ధుఁడై.
423
వ. నరేంద్రా! మేము ప్రాణులకు దుఃఖహేతువులము గాము. మావలన దుఃఖంబు
నొందెడు పురుషుండు లేఁడు. వాదివాక్యభేదంబుల యోగీర్వులు మోహితులై,
భేదంబు నాచ్ఛాదించి, తమకు నాత్మ సుఖదుఃఖంబుల నిచ్చుప్రభువని చెప్పుదురు.
దైవజ్ఞులు గ్రహ దేవతాదులకుఁ బ్రభుత్వంబు సంపాదింతురు. మీమాంసకులు
గర్మంబునకుం బ్రాభవంబు ప్రకటింతురు. లోకాయతికులు స్వభావంబునకుఁ
బ్రభుత్వంబు సంపాదింతురు. ఇందెవ్వరికిని సుఖదుఃఖప్రదానంబు సేయ
విభుత్వంబు లేదు. పరులవలన దుఃఖంబువచ్చిన నధర్మంబు పరులు చేసిరని విచా
రింపవలదు. తర్కింపను నిర్దేశింపను రాని పరమేశ్వరునివలన సర్వము నగుచుండు.
అనిన ధర్మదేవునికి ధర్మనందనపౌత్రుఁ డిట్లనియె.
424
ఆ. ధర్మమూర్తి వయ్య! ధర్మజ్ఞ! వృషరూప!
పరమధర్ము వీవు పలుకు త్రోవ
పాపకర్మిసేయు పాపంబు సూచింపఁ
బాపకర్ముఁ డేగు పథము వచ్చు.
425
వ. మఱియు దేవమాయవలన భూతంబుల వాఙ్మనంబులకు వధ్య ఘాతుక లక్షణ
వృత్తి సులభంబునం దెలియరాదు. నీవు ధర్మదేవతవు. కృతయుగమునం దప
శ్శౌచ దయా సత్యంబులు నాలుగును నీకుం బాదంబులని చెప్పుదురు.
త్రేతాయుగంబునఁ బూర్వోక్త పాదచతుష్కంబునఁ గ్రమంబునం దప శ్శౌచ
దయా సత్యంబులం దురీయపాదంబు క్షీణంబయ్యె. అవశిష్టంబగు భవదీయ
చతుర్థపాదంబున ద్వాపరంబునం బాదద్వయంబు నశించె. కలియుగంబునందు
నివ్వడువునన యిప్పుడు నీకుఁ బాదత్రయంబు భగ్నంబయ్యె. అవశిష్టంబగు
భవదీయ చతుర్థపాదంబు నధర్మంబు గల్యంతమున నిగ్రహింప గమనించుచున్నది.
విను మదియునుంగాక.
426
మ. భరముం బాపి రమా విభుండు గరుణం బాదంబులం ద్రొక్కఁగా
స్థిరమై వేడుక నింతకాలము సుఖశ్రీ నొంది భూదేవి త
చ్చరణస్పర్శము లేమి శూద్రకులజుల్‌ శాసింతు రంచు న్నిరం
తరశోకంబున నీరు గన్నుల నిడెన్‌ ధర్మజ్ఞ! వీక్షించితే?
427
--: పరీక్షిన్మహారాజు కలిని నిగ్రహించి ధర్మపరిపాలనంబు సేయుట :--
వ. అని యిట్లు ధర్మ భూదేవతల బుజ్జగించి మహారథుండైన విజయపౌత్రుండు
గ్రొక్కాఱు మెఱుంగు చక్కఁదనంబు ధిక్కరించి, దిక్కులకు వెక్కసంబైన
యడిదంబు బెడిదంబు ఝళిపించి, పాపహేతువైన కలి రూపుమాప నుద్యోగించిన,
వాఁడు రాజరూపం బుడిగి, వాడిన మొగంబుతోడ భయవిహ్వలుండై
హస్తంబులు సాఁచి తత్పాదమూల విన్యస్తమస్తకుండై ప్రణామంబు సేసి.
428
క. కంపించె దేహమెల్లం
జంపకు మో రాజతిలక! శరణాగతు ర
క్షింపు మని తనకు మ్రొక్కినఁ
జంపక కలిఁ జూచి నగుచు జనపతి వలికెన్‌.
429
క. అర్జునకీర్తి సమేతుం
డర్జునపౌత్రుండు భయరసావృతజనులన్‌
నిర్జితులఁ జంపనొల్లఁడు
దుర్జనభావంబు విడిచి తొలఁగు దురాత్మా!
430
వ. నీవు పాపబంధుడవు. మదీయ బాహుపాలితంబైన మహీమండలంబున నిలువ
వలవదు. రాజదేహంబునందు వర్తించు నిన్ను నసత్య లోభ చౌర్య దౌర్జన్య
దురాచార మాయా కలహ కపట కలుషాలక్ష్మ్యాదు లాశ్రయించు. సత్య
ధర్మంబులకు నివాసంబగు బ్రహ్మావర్తదేశంబున యజ్ఞవిస్తారనిపుణు లైనవారు
యజ్ఞేశ్వరుండైన హరిం గూర్చి యాగంబు సేయుచున్నవారు. యజించు
వారలకు సుఖప్రదానంబు సేయుచు, సకల భూతాంతర్యామియై, భగవంతుండైన
హరి జంగమస్థావరంబులకు నంతరంగ బహిరంగంబుల సంచరించు
వాయువు చందంబున, నాత్మరూపంబున మనోరథంబు నిచ్చుఁగావున నిందుండ
వలవ దనుచు దండహస్తుండైన జమునికైవడి మండలాగ్రంబు సాఁచిన రాజునకుం
గలి యిట్లనియె.
431
క. జగతీశ్వర! నీయడిదము
ధగధగితప్రభలతోడఁ దఱచుగ మెఱయన్‌
బెగడెం జిత్తము గుండెలు
వగిలెడి నిక నెందుఁ జొత్తు భావింపఁగదే!
432
వ. నరేంద్రా! నిను నారోపిత శరశరాసునిఁగ సర్వప్రదేశంబులందును విలోకింపుచు
నున్నవాఁడ. నే నెక్కడనుండుదు నానతిమ్మనిన రాజన్యశేఖరుండు ప్రాణివధ
స్త్రీ ద్యూత పానంబు లనియెడు నాలుగు స్థానంబుల నిచ్చి, మఱియు నడిగిన
సువర్ణమూలంబగు నసత్యమద కామ హింసా వైరంబు లనియెడు పంచప్రదే
శంబుల నొసంగి, యితరస్థలంబుల స్పృశియింపకుండ నియమించె. ఇట్లు కలి
నిగ్రహంబుచేసి, హీనంబులైన తపశ్శౌచ దయ లనియెడి మూఁడు పాదంబులు
వృషభమూర్తియైన ధర్మదేవుని కిచ్చి, విశ్వంభరకు నిర్భరంబైన సంతోషంబు
సంపాదించి.
433
క. గజనామధేయ పురమున
గజరిపుపీఠమున ఘనుఁడు గలిమర్దనుఁడున్‌
గజవైరి పరాక్రముఁడై
గజిబిజి లేకుండఁ దాల్చెఁ గౌరవలక్ష్మి\న్‌.
434
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - prathamaskaMdhamu ( telugu andhra )