ఇతిహాసములు భాగవతము ప్రథమస్కంధము
అధ్యాయము - ౧౮
వ. ఇట్లు కృష్ణుని యనుగ్రహంబున నశ్వత్థామ బాణపావకంబువలన బ్రతికి, పరీక్షిన్న
రేంద్రుడు బ్రాహ్మణశాపప్రాప్త తక్షకభయంబువలనఁ బ్రాణంబులు వోవునని యెఱింగి,
సర్వసంగంబులు వర్జించి, శుకునకు శిష్యుండై, విజ్ఞానంబు గలిగి
గంగాతరంగిణీ తీరంబునం గళేబరము విడిచె. వినుఁడు.
435
క. హరి వార్త లెఱుఁగు వారికి
హరిపదములు దలఁచువారి కనవరతంబు\న్‌
హరికథలు వినెడివారికి
మరణాగత మోహసంభ్రమము లే దనఘా!
436
క. శుభచరితుఁడు హరి యరిగినఁ
బ్రభవించి ధరిత్రినెల్లఁ బ్రబ్బియుఁ గలి దా
నభిమన్యుసుతుని వేళను
బ్రభవింపక యణఁగియుండె భార్గవముఖ్యా!
437
వ. ఇవ్విధంబునఁ జతుస్సముద్ర ముద్రితాఖిల మహీమండల సామ్రాజ్యంబు పూజ్యంబుగాఁ
జేయుచు నభిమన్యుపుత్రుండు.
438
ఉ. చేసినఁగాని పాపములు సెందవు చేయఁదలంచి నంతటన్‌
జేసెద నన్నమాత్రమునఁ జెందుఁగదా! కలివేళ పుణ్యముల్‌
మోసము లేదటంచు నృపముఖ్యుఁడు గాఁచె గలిన్‌ మరంద ము
ల్లాసముతోడఁ గ్రోలి విరులం దెగఁజూడని తేఁటికైవడి\న్‌.
439
వ. మఱియుం బ్రమత్తులై యధీరులగువారలయందు వృకంబుచందంబున నొదిగి
లాచుకొనియుండి చేష్టించుఁ గాని, ధీరులైన వారికిం గలివలని భయంబులే దని
కలి నంతంబు నొందింపఁడయ్యె. అనిన విని ఋషులు సూతున కిట్లనిరి.
440
సీ. పౌరాణికోత్తమ! బ్రతుకుము పెక్కేండ్లు తామరసాక్షుని ధవళయశము
మరణశీలురమైన మా కెరింగించితి కల్పితంబగు క్రతుకర్మమందుఁ
బొగలచేఁ బొగిలి యబుద్ధచిత్తులమైన మము హరిపదపద్మ మధురసంబుఁ
ద్రావించితివి నీవు ధన్యుల మైతిమి స్వర్గమేనియు నపవర్గమేని
 
తే. భాగవతసంగ లవభాగ్య ఫలముకీడె? ప్రకృతిగుణహీనుఁ డగు చక్రి భద్రగుణము
లీశ కమలాసనాదులు నెఱుఁగలేరు; వినియు వినఁజాల ననియెడి వెఱ్ఱిగలఁడె?
441
క. శ్రీపంబులు ఖండిత సం
తాపంబులు గల్మషాంధతమస మహోద్య
ద్దీపంబులు పాషండ దు
రాపంబులు విష్ణువంద నాలాపంబుల్‌.
442
క. పావనములు దురితలతా
లావనములు నిత్యమంగళ ప్రాభవ సం
జీవనములు లక్ష్మీసం
భావనములు వాసుదేవ పదసేవనముల్‌.
443
ఆ. పరమ భాగవతుఁడు పాండవపౌత్రుండు
శుకుని భాషణముల శుద్ధబుద్ధి
యై విరాజమానుఁడై ముక్తియగు విష్ణు
పాదమూలమెట్లుపడసె? ననఘ!
444
వ. మహాత్మా! విశిష్ట యోగనిష్ఠాకలితంబు, విష్ణుచరిత లలితంబు, పరమపుణ్యంబు,
సకలకల్యాణగుణ గణ్యంబు, భాగవతజనాపేక్షితంబు నైన పారీక్షితంబగు భాగ
వతాఖ్యానంబు వినిపింపు మనిన సూతుం డిట్లనియె.
445
క. మిముబోఁటి పెద్దవారలు
కమలాక్షుని చరిత మడుగఁగాఁ జెప్పెడి భా
గ్యము గలిగె నేఁడు మా జ
న్మము సఫలంబయ్యె వృద్ధమాన్యుల మగుట\న్‌.
446
క. కులహీనుఁడు నారాయణ
విలసత్కథనములు దగిలి వినిపించినఁ ద
త్కులహీనతఁ బాసి మహో
జ్జ్వల కులజత్వమును బొందు సన్మునులారా!
447
సీ. ఎవ్వని గుణజాల మెన్న జిహ్వలులేక నళినగర్భాదు లనంతుఁ డండ్రు
కోరెడు విబుధేంద్రకోటి నొల్లక లక్ష్మి ప్రార్థించె నెవ్వని పాదరజము
బ్రహ్మ యెవ్వని పాదపద్మంబు గడిగిన జలము ధన్యత నిచ్చె జనులకెల్ల
భగవంతుఁడనియెడి భద్రశబ్దమునకు నెవ్వఁడర్థాకృతి నేపుమిగులు
 
ఆ. నే మహాత్ము నాశ్రయించి శరీరాది సంగకోటినెల్ల సంహరించి
ప్రాభవమున మునులు పారమహంస్యంబు నొంది తిరిగి రాకయుందు రెలమి.
448
చ. క్రమమున మింటికై యెగయుఁ గాక విహంగము మింటిదైన పా
రము గననేర్చునే? హరిపరాక్రమ మోపినయంత గాక స
ర్వము వివరింప నెవ్వఁడు ప్రవర్తకుఁ డర్యములార! నాదు చి
త్తమునకు నెంత గానఁబడెఁ దప్పక చెప్పెద మీకు నంతయున్‌.
449
--: పరీక్షిన్మహారాజు శృంగివలన శాపంబు నొందుట :--
క. వేదండ పురాధీశుఁడు
కోదండము చేతఁబట్టికొని గహనములో
వేదండాదుల నొకనాఁ
డే దండలఁ బోవనీక యెగచెన్‌ బలిమి\న్‌.
450
క. ఒగ్గములు ద్రవ్వి పడుమని
యొగ్గెడు పెనుదెరల వలల నుగ్రమృగమ్ముల్‌
డగ్గఱినఁ జంపువేడుక
వెగ్గలమై చిత్తమందు వేఁటాడింపన్‌.
451
క. కోలముల గవయ వృక శా
ర్దూలములఁ దరక్షు ఖడ్గ రోహిష హరి శుం
డాలముల శరభ చమర
వ్యాలముల వధించె విభుఁడు వడి నోలములన్‌.
452
క. మృగయులు మెచ్చ నరేంద్రుఁడు
మృగరాజపరాక్రమమున మెఱసి హరించెన్‌ఁ
మృగధరమండలమునఁ గల
మృగ మొక్కటిఁ దక్క నన్యమృగముల నెల్లన్‌.
453
వ. ఇట్లు వాటంబైన వేఁట తమకంబున మృగంబుల వెంటం దగిలి బుభుక్షాపిపాసలఁ
బరిశ్రాంతుండై ధరణీకాంతుడు చల్లని నీటికొలంకులు గానక కలంగెడు
చిత్తంబుతోఁ జని చని యొక్క తపోవనంబు గని యందు.
454
సీ. మెలఁగుటఁ గాలించి మీలితనేత్రుఁడై శాంతుఁడై కూర్చుండి జడతలేక
ప్రాణ మనో బుద్ధి పంచేంద్రియంబుల, బహిరంగవీథులఁ బాఱనీక
జాగరణాదిక స్థానత్రయము దాఁటి పరమమై యుండెడి పదము దెలిసి
బ్రహ్మభూతత్వ సంప్రాప్త్యవిక్రియుఁడయి యతిదీర్ఘజటలు దన్నావరింప
 
తే. నలఘు రురుచర్మధారియై యలరుచున్న తపసిఁ బొడగని శోషిత తాలుఁడగుచు
నెండి తడిలేని కుత్తుక నెలుఁగు డింద మందభాషల డగ్గఱి మనుజవిభుఁడు.
455
క. తోయములు దెమ్ము మా కీ
తోయము వేఁటాడువేళఁ దొల్లి బొడమ దీ
తోయముక్రియ జలదాహము
తోయమువారలును లేరు దుస్సహ మనఘా!
456
వ. అని భూవరుండు శమీకమహాముని సమాధినిష్ఠుండును హరిచింతాపరుండునై
యుండుట విచారింపక.
457
ఉ. కన్నులుమూసి బ్రాహ్మణుఁడు గర్వముతోడుత నున్నవాఁడు చే
సన్నలనైన రమ్మనఁడు సారజలంబులు దెచ్చి పోయఁడే
మన్ననలైనఁ జేయఁడు సమగ్రఫలంబులు వెట్టఁ డింత సం
పన్నత నొందెనే? తన తపశ్చరణాప్రతిమ ప్రభావముల్‌.
458
ఆ. వారిఁ గోరుచున్నవారికి శీతల
వారి నిడుట యెట్టివారికైన
వారితంబు గాని వలసినధర్మంబు
వారి యిడఁడు దాహవారి గాఁడు.
459
చ. అని మనుజేశ్వరుండు మృగయా వసరాయత తోయదాహ సం
జనిత దురంతరోషమున సంయమి దన్నుఁ దిరస్కరించి పూ
జనములు సేయఁ డంచు మృతసర్పము నొక్కటి వింటికోపునన్‌
బనివడి తెచ్చి వైచె నటు బ్రహ్మమునీంద్రుని యంసవేదికన్‌.
460
వ. ఇట్లు వృథా రోషదర్పంబున మునిమూఁపున గతాసువైన సర్పంబు నిడి,
నరేశ్వరుండు దన పురంబునకుం జనియె. అంత సమీపవర్తులైన మునికుమారులు
సూచి శమీకనందనుండైన శృంగికడకుం జని.
461
క. నర గంధగజ స్యందన
తురంగంబుల నేలు రాజు తోయాతురుఁడై
పరగ న్నీ జనకునిమెడ
నురగముఁ దగిలించి పోయె నోడక తండ్రీ!
462
వ. అని పలికిన సమాన వయో రూప మునికుమార లీలాసంగియైన శృంగి శృంగం
బులతోడి మూర్తి ధరియించినట్లు విజృంభించి రోషసంరంభంబున నదరిపడి
బల్యన్నంబుల భుజించి పుష్టంబులగు నరిష్టంబులం బోలె బలిసియు, ద్వారంబులం
గాచికొనియుండు సారమేయంబుల పగిది దాసభూతులగు క్షత్రియాభాసు లెట్లు
బ్రాహ్మణోత్తములచే స్వరక్షకులుగ నిరూపితులైరి? అట్టివార లెట్లు తద్గృహంబుల
భాండసహితంబగు నన్నంబు భుజింప నర్హులగుదురు? తత్కృతంబులైన
ద్రోహంబు లెట్లు నిజస్వామింజెందు నని మఱియు నిట్లనియె.
463
ఉ. ఆడఁడు దన్ను దూషణము, లాశ్రమవాసులఁగాని వైరులం
గూడఁడు, కందమూలములు కూడుగఁ దించు సమాధిచిత్తుఁడై
వీడఁడు లోనిచూడ్కులను, విష్ణునిఁ దక్కఁ బరప్రపంచముం
జూడఁడు మద్గురుండు ఫణిఁ జుట్టఁగనేటికి? రాచవానికిన్‌.
464
ఉ. పోము హిరణ్యదానములు పుచ్చుకొనంగ ధనంబు లేమియుం
దేము, సవంచనంబులుగ దీవెన లిచ్చుచు వేసరింపఁగా
రాము వనంబులన్‌ గృహవిరాములమై నివసింపఁ జెల్లరే!
పామును వైవఁగాఁదగునె? బ్రహ్మమునీంద్రు భుజార్గళంబునన్‌.
465
క. పుడమిఁగల జనులు వొగడఁగఁ
గుడుతురు గట్టుదురుకాక కువలయపతులై
యడవులనిడుమలఁ బడియెడి
బడుగుల మెడ నిడఁగ దగునె పన్నగశవమున్‌?
466
క. భగవంతుఁడు గోవిందుఁడు
జగతిం బెడఁబాసి చనిన శాసింపంగాఁ
దగు వరులు లేమి దుర్జను
లెగసి మహాసాధుజనుల నేఁచెద రకటా!
467
క. బాలకులార! ధరిత్రీ
పాలకు శపియింతు ననుచు బలువిడిని విలో
లాలకుఁడగు మునికుంజర
బాలకుఁడరిగెఁ ద్రిలోకపాలకు లదరన్‌.
468
వ. ఇట్లు రోషించి కౌశకీనదికిం జని జలోపస్పర్శనంబు సేసి. 469
ఉ. ఓడక వింటికోపున మృతోరగముం గొనివచ్చి మాఱు మా
టాడకయున్న మజ్జనకు నంసతలంబునఁ బెట్టి దుర్మద
క్రీడఁ జరించు రాజు హరకేశవు లడ్డిననైనఁ జచ్చుఁ బో
యేడవఁనాఁడు తక్షకఫణీంద్ర విషానల హేతిసంహతిన్‌.
470
వ. అని శమీకమహాముని కుమారుండైన శృంగి పరీక్షిన్నరేంద్రుని శపియించి, నిజా
శ్రయంబునకుం జనుదెంచి, కంఠలగ్న కాకోదర కళేబరుండైన తండ్రిం జూచి.
471
క. ఇయ్యెడ నీ కంఠమునకు
నియ్యురగశవంబు దెచ్చి యిటు చేర్చిన యా
యయ్య నిఁక నేమి సేయుదు?
నెయ్యంబులు లేవు సుమ్ము నృపులకుఁ దండ్రీ!
472
శా. ప్రారంభంబున వేఁటవచ్చి ధరణీపాలుండు మాతండ్రిపై
నేరం బేమియు లేదు సర్పశవము న్నేఁ డుగ్రుఁడై వైచినాఁ
డీరీతిన్‌, ఫణి క్రమ్మఱన్‌ బ్రతుకునో! హింసించునో! కోఱలన్‌
రారే! తాపసులార! దీనిఁ దివరే! రక్షింపరే! మ్రొక్కెదన్‌.
473
వ. అని సర్పంబుఁ దిగుచు నేర్పులేక యెలుంగెత్తి విలపించుచున్న కుమారకు
రోదనధ్వని విని, యాంగిరసుండైన శమీకుండు సమాధిఁ జాలించి, మెల్లన
గన్నులు దెఱచి, మూఁపున వ్రేలుచున్న మృతోరగంబు వీక్షించి తీసి పాఱవైచి
కుమారకుంజూచి.
474
క. ఏ కీడు నాచరింపము
లోకులకున్‌ మనము సర్వలోక సములమున్‌
శోకింపనేల? పుత్రక!
కాకోదర మేలవచ్చెఁ? కంఠంబునకున్‌.
475
వ. అని యడిగిన తండ్రికిఁ గొడుకు రాజువచ్చి సర్పంబు వైచుటయుం దాను
శపించుటయును వినిపించినఁ, దండ్రి కొడుకువలన సంతసింపక యిట్లనియె.
476
క. బెట్టిదమగు శాపమునకు
దట్టపు ద్రోహంబు గాదు ధరణీకాంతుం
గట్టా! యేలశపించితి?
పట్టీ! తక్షక విషాగ్ని పాలగు మనుచున్‌.
477
ఆ. తల్లికడుపులోన దగ్ధుఁడై క్రమ్మఱ
గమలనాభు కరుణఁ గలిగినాఁడు
బలిమి గలిగి ప్రజలఁ బాలింపుచున్నాఁడు
దిట్టవడుగ! రాజుఁ దిట్టఁ దగునె?
478
ఉ. కాపరిలేని గొఱ్ఱియలకైవడిఁ గంటక చోరకోటిచే
నేపఱియున్న దీ భువన మీశుఁడు కృష్ణుఁడు లేమి నిట్టిచో
భూ పరిపాలనంబు సమబుద్ధి నితం డొనరింపఁ జెల్లరే!
యీ పరిపాటి ద్రోహమున కిట్లు శపింపఁగ నేల? బాలకా!
479
సీ. పాపంబు నీ చేతఁ బ్రాపించె మన కింక రాజు నశించిన రాజ్యమందు
బలవంతుఁ డగువాఁడు బలహీను పశు దార హయ సువర్ణాదుల నపహరించు
జార చోరాదులు సంచరింతురు ప్రజ కన్యోన్య కలహంబు లతిశయిల్లు
వైదికంబై యున్న వర్ణాశ్రమాచార ధర్మ మించుక లేక తప్పిపోవు
 
ఆ. నంతమీఁద లోకు లర్థ కామంబులఁ దగిలి సంచరింప ధరణి నెల్ల
వర్ణసంకరములు వచ్చును మర్కట సారమేయ కులము మేరఁ బుత్ర!
480
ఉ. భారతవంశజుం బరమభాగవతున్‌ హయమేధయాజి నా
చారపరున్‌ మహానయ విశారదు రాజకులైక భూషణున్‌
నీరము గోరి నేఁడు మన నేలకు వచ్చిన భక్తి నర్థి స
త్కారము సేసి పంపఁ జనుఁ గాక! శపింపఁగ నీకు ధర్మమే?
481
క. భూపతికి నిరపరాధమ
శాపము దా నిచ్చె బుద్ధిచాపలమున మా
పాపఁడు వీఁ డొనరించిన
పాపము దొలఁగించు కృష్ణ! పరమేశ! హరీ!
482
క. పొడిచినఁ దిట్టినఁ గొట్టినఁ
బడుచుందురు గాని పరమ భాగవతులు దా
రొడఁ బడరు మాఱు సేయఁగఁ
గొడుకా! విభుఁ డెగ్గుసేయఁ గోరఁడు నీకున్‌.
483
క. చెలఁగరు కలఁగరు సాధులు
మిళితములై పరులవలన మేలుం గీడు\న్‌
నెలకొనిన నైన, నాత్మకు
నొలయవు సుఖ దుఃఖ చయములుగ్రము లగుచు\న్‌.
484
వ. అని ఇట్లు శమీక మహామునీంద్రుండు కొడుకు సేసిన
ఆపంబునకు సంతాపంబు నొందుచుండె.
485
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - prathamaskaMdhamu ( telugu andhra )