ఇతిహాసములు భాగవతము ప్రథమస్కంధము
అధ్యాయము - ౧౯
వ. అంత శమీక ప్రేషితుండగు శిష్యుని వలన నా మునికుమారకు శాపంబు విని
యా యభిమన్యు పుత్రుండు కామ క్రోధాది విషయాసక్తుండగు తనకు
తక్షక విషాగ్ని విరక్తిబీజం బగు ననుఁచు గరినగరంబునకుం జని యేకాంతంబున.
485
--: పరీక్షిన్మహారాజు విప్రశాపంబు నెఱింగి ప్రాయోపవిష్టుండగుట :--
ఉ. యేటికి వేఁటఁ బోయితి? మునీంద్రుఁడు గాఢసమాధి నుండఁగా
నేటికిఁ దద్భుజాగ్రమున నేసితి సర్పశవంబుఁ దెచ్చి? నేఁ
డేటికిఁ బాప సాహసము లీక్రియఁ జేసితి? దైవయోగము\న్‌
దాఁటఁగ రాదు వేగిరమ తథ్యము గీడు జనించు ఘోరమై.
486
ఉ. పాము విషాగ్ని కీలలను బ్రాణము లేఁగిన నేఁగుఁ గాక యీ
భూమియు రాజ్యము\న్‌ సతులు భోగముఁ బోయినఁ బోవుఁ గాక సౌ
దామినిఁ బోలు జీవనముఁ దథ్యముగాఁ దలపోసి యింక నే
నేమని మాఱు దిట్టుదు? మునీంద్రకుమారకు దుర్నివారకున్‌.
487
ఆ. రాజ ననుచుఁ బోయి రాజ్యగర్వంబున
వనము కొఱకు వారి వనము సొచ్చి
దందశూక శవముఁ దండ్రిపై వైచినఁ
బొలియఁ దిట్ట కేల పోవు? సుతుఁడు.
488
క. గోవులకున్‌ బ్రాహ్మణులకు
దేవతలకు నెల్లప్రొద్దుఁ దెంపునఁ గీడుం
గావించు పాప మానస
మే విధమునఁ బుట్టకుండ నే వారింతున్‌.
489
వ. అని వితర్కించె. 490
క. దామోదర పదభక్తిం
గామాదుల గెల్చినాఁడు గావునఁ గరుణన్‌
భూమీశుఁ డలుగఁ డయ్యెను
సామర్థ్యము గలిగి దోష సంగిన్‌ శృంగిన్‌.
491
వ. అంత మునికుమారుండు శపించిన వృత్తాంత మంతయు నిట్లు వితర్కించి, తక్షక
వ్యాళ విషానల జ్వాలాజాలంబునం దనకు సప్తమ దినంబున మరణం బని
యెఱింగి, భూలోక స్వర్గలోక భోగంబులు హేయంబులని తలంచి, రాజ్యంబు
విసర్జించి, నిరశన దీక్షాకరణంబు సంకల్పించికొని.
492
మ. తులసీ సంయుత దైత్యజిత్పదరజస్తోమంబు కంటె\న్‌ మహో
జ్జ్వలమై దిక్పతిసంఘ సంయుత జగత్సౌభాగ్య సంధాయియై
కలిదోషావళి నెల్లఁ బాపు దివిషద్గంగా ప్రవాహంబులో
పలికిం బోయి మరిష్యమాణుఁ డగుచుం బ్రాయోపవేశంబునన్‌.
493
క. చిత్తము గోవింద పదా
యత్తముఁ గావించి మౌనియై తనలో నే
తత్తఱము లేక భూవర
సత్తముఁడు వసించె ముక్త సంగత్వమునన్‌.
494
వ. ఇట్లు పాండవ పౌత్రుండు ముకుంద చరణారవింద వందనానంద కందాయమాన
మానసుండై, విష్ణుపదీ తీరంబునం బ్రాయోపవేశంబున నుండుట విని సకల
లోక పావన మూర్తులు మహానుభావులు నగుచుఁ దీర్థంబునకుం దీర్థత్వంబు
లొసంగ సమర్థులైన యత్రి, విశ్వామిత్ర, భృగు, వసిష్ఠ, పరాశర, వ్యాస,
భరద్వాజ, పరశురామ, దేవల, గౌతమ, మైత్రేయ, కణ్వ, కలశసంభవ, నారద,
పర్వతాదులైన బ్రహ్మర్షి, దేవర్షి, రాజర్షి పుంగవులు, కాండఋషులైన యరు
ణాదులు, మఱియు, నానాగోత్ర సంజాతులైన ఋషులును శిష్య ప్రశిష్య సమేతులై
యేతెంచిన వారలకు దండ ప్రణామంబులు సేసి కూర్చుండ నియోగించి.
495
క. క్రమ్మఱ నమ్ముని వరులకు
నమ్మనుజేంద్రుండు మ్రొక్కి హర్షాశ్రుతతుల్‌
గ్రమ్మఁగ ముకుళిత కరుఁడై
సమ్మతముగఁ జెప్పె నాత్మ సంచారంబున్‌.
496
ఉ. ఓపిక లేక చచ్చిన మహోరగముం గొనివచ్చి కోపినై
తాపసు మూఁపుపై నిడిన దారుణ చిత్తుఁడ మత్తుఁడన్‌ మహా
పాపుఁడ మీరు పాపతృణ పావకు లుత్తమ లయ్యలార! నా
పాపము వాయు మార్గముఁ గృపాపరులార! విధించి చెప్పరే!
497
ఉ. భూసురపాద రేణువులు పుణ్యులఁజేయు నరేంద్రులన్‌ ధరి
త్రీసురులార! మీచరణరేణు కణంబులు మేనుసోక నా
చేసిన పాప మంతయు నశించెఁ గృతార్థుఁడనైతి నెద్ది నేఁ
జేసిన ముక్తి పద్ధతికిఁ జెచ్చెరఁ బోవఁగవచ్చుఁ జెప్పరే.
498
క. భీకరతర సంసార
వ్యాకులతన్‌ విసిగి దేహవర్జనగతి నా
లోకించు నాకుఁ దక్షక
కాకోదర విషము ముక్తికారణ మయ్యెన్‌.
499
క. ఏపారు నహంకార
వ్యాపారమునందు మునిఁగి వర్తింపంగా
నాపాలిటి హరి భూసుర
శాప వ్యాజమున ముక్తసంగునిఁ జేసెన్‌.
500
మ. ఉరగాధీశ విషానలంబునకు మే నొప్పింతు శంకింప నీ
శ్వర సంకల్పము నేఁడు మానదు భవిష్యజ్జన్మ జన్మంబులన్‌
హరి చింతా రతియున్‌ హరిప్రణుతి భాషాకర్ణనాసక్తియున్‌
హరి పాదాంబుజ సేవయున్‌ గలుగ మీ రర్థిన్‌ బ్రసాదింపరే.
501
క. చూడుఁడు నా కల్యాణము
పాడుఁడు గోవిందు మీఁది పాటలు నా మీది దయతో
నాడుఁడు హరి భక్తుల కథ
లే డహములలోన ముక్తి కేగఁగ నిచటన్‌.
502
క. అమ్మా! నినుఁ జూచిన నరుఁ
బొమ్మా యని ముక్తికడకుఁ బుత్తువఁట కృపన్‌
లెమ్మా నీ రూపముతో
రమ్మా నా కెదుర గంగ! రమ్యతరంగా!
503
వ. అని తనకు మీఁద నయ్యెడి జన్మాంతరంబులందైన సర్వజంతు సౌజన్యంబు సంధిల్లుం
గాక యని, గంగా తరంగిణీ దక్షిణ కూలంబునన్‌ బూర్వాగ్ర దర్భాసనంబున నుత్త
రాభిముఖుండై యుపవేశించి, జనమేజయు రప్పించి రాజ్యభారంబు సమర్పించి
యత్నంబు సంసారబంధంబునకుఁ దప్పించి, చిత్తంబు హరికి నొప్పించి, పరమ భాగ
వతుండైన పాండవ పౌత్రుండు ప్రాయోపవిష్టుండై యున్న సమయంబున.
504
క. ఒత్తిలి పొగడుచు సురలు వి
యత్తలమున నుండి మెచ్చి యలరుల వానల్‌
మొత్తములై కురిసిరి నృప
సత్తముపై భూరి భేరి శబ్దంబులతోన్‌.
505
వ. ఆ సమయంబున సభాసీనులైన ఋషు లిట్లనిరి. 506
మ. క్షితినాథోత్తమ! నీ చరిత్రము మహాచిత్రంబు మీ తాత లు
గ్ర తపోధన్యులు విష్ణుపార్శ్వ పదవి\న్‌ గామించి రాజన్య శో
భిత కోటీర మణిప్రభాన్విత మహాపీఠంబు వర్జించిరు
న్నతులై నీవు మహోన్నతుండవు గదా! నారాయణ ధ్యాయివై.
507
మ. వసుధాధీశ్వర! నీవు మర్త్యతనువుల్‌ వర్జించి నిశ్శోకమై
వ్యసన చ్ఛేదకమై రజోరహితమై వర్తించు లోకంబు స
ర్వసమత్వంబునఁ జేరు నంతకు భవద్వాక్యంబుల\న్‌ వించు నే
దెసకుం బోవక చూచుచుండెదము నీ దివ్యప్రభావంబులన్‌.
508
వ. అని ఇట్లు పక్షపాత శూన్యంబులును మహనీయ మాధుర్య గాంభీర్య సౌజన్య
ధుర్యంబులును నైన భాషణంబు లాడుచు మూఁడులోకంబులకు నవ్వలి దైన
సత్యలోకంబునందు మూర్తిమంతంబులై నెగడుచున్న నిగమంబుల చందంబునన్‌
దేజరిల్లుచున్న ఋషులం జూచి భూవరుండు నారాయణ కథాశ్రవణ కుతూ
హలుండై నమస్కరించి ఇట్లనియె.
509
క. ఏడు దినంబుల ముక్తిం
గూడఁగ నేరీతి వచ్చు గురు సంసార
క్రీడన మేక్రియ నెడతెగుఁ
జూడుఁడు మా తండ్రులార! శ్రుతివచనములన్‌.
510
శా. ప్రాప్తానందులు బ్రహ్మబోధన కళాపారీణు లాత్మప్రభా
లుప్తాజ్ఞానులు మీర లార్యులు దయాళుత్వాభిరాముల్‌ మనో
గుప్తంబుల్‌ సకలార్థజాలములు మీకుం గానవచ్చుంగదా!
సప్తాహంబుల ముక్తి కేగెడు గతిన్‌ జర్చించి భాషింపరే.
511
వ. అని యుత్తరానందనుం డాడిన వచనంబులకు మునులందఱుఁ బ్రత్యుత్తరంబు
విమర్శించు నెడ దైవయోగంబున.
512
--: శుక మహర్షి పరీక్షిన్మహారాజునొద్ద కేతెంచుట :--
సీ. ప్రతినిమేషము పరబ్రహ్మంబు వీక్షించి మదిఁ జొక్కి వెలుపల మఱచువాఁడు
కమలంబు మీఁది భృంగముల కైవడి మోముపై నెఱసిన కేశపటలివాఁడు
గిఱివ్రాసి మాయ నంగీకరించని భంగి వసనంబు గట్టక వచ్చువాఁడు
సంగి గాఁడని వెంటఁ జాటు భూతములు నా బాలుర హాసశబ్దముల వాఁడు
 
తే. మహిత పద జాను జంఘోరు మధ్య హస్తబాహు వక్షోగళానన ఫాల కర్ణ
నాసికా గండమస్తక నయనయుగళుఁడైన యవధూతమూర్తి వాఁడరుగుదెంచె.
513
ఉ. ఈరని లోకులం గినిసి యొగ్గులు వల్కనివాఁడు గోరికల్‌
గోరనివాఁడు గూటువలఁ గూడనివాఁడు వృథాప్రపంచమున్‌
జేరనివాఁడు దైవగతిఁ జేరిన లాభము సూచి తుష్టుఁడై
నేరనివాఁని చందమున నేర్పులు సూపెడువాఁడు వెండియున్‌.
514
ఆ. అమ్మహాత్ము షోడశాబ్ద వయో రూప
గమన గుణ విలాస కౌశలములు
ముక్తికాంత సూచి మోహిత యగు నన
నితర కాంతలెల్ల నేమి చెప్ప!
515
ఆ. వెఱ్ఱితనము మాని విజ్ఞానమూర్తియై
బ్రహ్మభావమునను బర్యటింప
వెఱ్ఱియనుచు శుకుని వెంట నేతెంతురు
వెలఁదు లర్భకులును వెఱ్ఱు లగుచు.
516
వ. ఇట్లు వ్యాసనందనుండైన శుకుం డరుగుదెంచిన నందలి మునీంద్రులా మహాను
భావుని ప్రభావంబు తెఱంగెఱుంగుదురు గావున నిజాసనంబులు విడిచి ప్రత్యు
త్థానంబు సేసిరి. పాండవ పౌత్రుండు నా యోగిజన శిఖామణికి నతిథిసత్కారంబు
గావించి దండప్రణామంబు సేసి పూజించె. మఱియు గ్రహ నక్షత్రతారకా
మధ్యంబునం దేజరిల్లు రాకాసుధాకరుండును బోలె బ్రహ్మర్షి, దేవర్షి, రాజర్షి
మధ్యంబునం గూర్చుండి విరాజమానుండైన శుకయోగీంద్రుం గనుంగొని.
517
ఉ. ఫాలము నేలమోపి భయభక్తులతోడ నమస్కరించి భూ
పాలకులోత్తముండు కరపద్మములన్‌ ముకుళించి నేఁడు నా
పాలిటి భాగ్య మెట్టిదియొ! పావనమూర్తివి పుణ్యకీర్తి వీ
వేళకు నీవు వచ్చితి వివేక విభూషణ! దివ్యభాషణా!
518
మ. అవధూతోత్తమ! మంటి నేఁడు నిను డాయం గంటి నీవంటి వి
ప్రవరున్‌ బేర్కొను నంతటన్‌ భసితమౌ పాపంబు నా బోఁటికిన్‌
భవ దాలోకన భాషణార్చన పద ప్రక్షాళన స్పర్శనా
ది విధానంబుల ముక్తి చేపడుట చింతింపంగ నాశ్చర్యమే?
519
క. హరిచేతను దనుజేంద్రులు
ధర మ్రగ్గెడు భంగి నీ పదస్పర్శముచే
గురు పాతకసంఘంబులు
పొరిమాలుఁ గదయ్య యోగిభూషణ! వింటే.
520
మ. ఎలమిన్‌ మేనమఱందియై సచివుఁడై యే మేటి మా తాతలన్‌
బలిమిన్‌ గాచి సముద్రముద్రిత ధరం బట్టంబు గట్టించె న
య్యలఘుం డీశుఁడు చక్రి రక్షకుఁడు నా కన్యుల్‌ విపద్రక్షకుల్‌
గలరే? వేఁడెద భక్తి నా గుణనిధిం గారుణ్య వారానిధిన్‌.
521
సీ. అవ్యక్త మార్గుఁడ వైన నీ దర్శన మాఱడిఁ బోనేర దభిమతార్థ
సిద్ధి గావించుట సిద్ధంబు నేఁడెల్లి దేహంబు వర్జించు దేహధారి
కేమి చింతించిన నేమి జపించిన నేమి గావించిన నేమి వినిన
నేమి సేవించిన నెన్నఁడు సంసార పద్ధతిఁ బాసిన పదవి గలుగు
 
తే. నుండుమనరాదు గురుఁడవు యోగివిభుఁడ వరయ మొదవును బిదికిన యంతతడవు
గాని యొక దెస నుండవు కరుణతోడఁ జెప్పవే తండ్రి ముక్తికిఁ జేరు తెరువు.
522
వ. అని పరీక్షిన్నరేంద్రుండు బాదరాయణి నడిగె నని చెప్పి. 523
క. రాజీవపత్ర లోచన!
రాజేంద్ర కిరీటఘటిత రత్నమరీచి
భ్రాజిత పాదాంభోరుహ!
భూజనమందార! నిత్య పుణ్యవిచారా!
524
మాలిని. అనుమప గుణహారా! హన్యమా నారివీరా!
జన వినుత విహారా! జానకీ చిత్తచోరా!
దనుజ ఘనసమీరా! దానవశ్రీ విదారా!
ఘన కలుష కఠోరా! కంధి గర్వాపహారా!
525
గద్య. ఇది శ్రీపరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర, కేసనమంత్రి పుత్త్ర, సహజ
పాండిత్య, పోతనామాత్య ప్రణీతంబైన, శ్రీమహాభాగవతం బను మహాపురాణంబునందు,
నైమిశారణ్య వర్ణనంబును, శౌనకాదుల ప్రశ్నంబును, సూతుండు నారాయణావతార
సూచనంబు సేయుటయు, వ్యాసచింతయు, నారదాగమనంబును, నారదుని
పూర్వకల్ప వృత్తాంతంబును, పుత్రశోకాతురయైన ద్రుపద రాజనందన కర్జునుం
డశ్వత్థామను దెచ్చి యొప్పగించి విడిపించుటయు, భీష్మ నిర్యాణంబును,
ధర్మనందను రాజ్యాభిషేకంబును, గోవిందుని ద్వారకాగమనంబును,
విరాటకన్యకా గర్భ పీడ్యమానుండైన యర్భకు నశ్వత్థామ బాణానలంబువలనం
బాపి విష్ణుండు రక్షించుటయు, పరీక్షిజ్జన్మంబును, గాంధారీ ధృతరాష్ట్ర విదుర
నిర్గమంబును, నారదుండు ధర్మజునికిఁ గాలసూచనంబు సేయుటయు,
కృష్ణావతార విసర్జనంబు విని పాండవులు మహాపథంబునం జనుటయు,
దిగ్విజయంబు సేయుచు నభిమన్యు పుత్త్రుండు శూద్రరాజ లక్షణుండగు కలి
గర్వంబు సర్వంబు మాపి గో వృషాకారంబుల నున్న ధరణీ ధర్మదేవతల
నుద్ధరించుటయు, శృంగిశాప భీతుండై యుత్తరానందనుండు గంగాతీరంబునం
బ్రాయోపవేశంబున నుండి శుకదర్శనంబు సేసి మోక్షోపాయం బడుగుటయు,
నను కథలుగల ప్రథమ స్కంధము సంపూర్ణము.
526
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - prathamaskaMdhamu ( telugu andhra )