ఇతిహాసములు భారతము ఆదిపర్వము - ప్రథమాశ్వాసము
అవతారిక
వ. అని సకలభువనరక్షణప్రభువు లై యాద్యు లైన హరిహరహిరణ్యగర్భ పద్మోమావాణీపతుల స్తుతియించి, తత్ప్రసాదసమాసాదిత నిత్యప్రవర్ధమాన మహామహీరాజ్యవిభవుండును, నిజభుజవిక్రమ విజితారాతి రాజనివహుండును, నిఖిలజగజ్జేగీయమాన నానాగుణరత్న రత్నాకరుండును నై పరఁగుచున్న రాజరాజ నరేంద్రుండు 2
ఉ. రాజకులైకభూషణుఁడు, రాజమనోహరుఁ, డన్యరాజతే
జోజయశాలిశౌర్యుఁడు, విశుద్ధయశశ్శరదిందుచంద్రికా
రాజితసర్వలోకుఁ, డపరాజితభూరిభుజాకృపాణధా
రాజలశాంతశాత్రవపరాగుఁడు రాజమహేంద్రుఁ డున్నతిన్‌.
3
క. విమలాదిత్యతనూజుఁడు, | విమలవిచారుఁడు, కుమారవిద్యాధరుఁ, డు
త్తమచాళుక్యుఁడు, వివిధా | గమవిహితశ్రముఁడు, తుహినకరుఁ డురుకాంతిన్‌.
4
చ. ఘనదురితానుబంధకలికాలజదోషతుషారసంహతిం
దన యుదయప్రభావమున దవ్వుగఁ జోపి జగజ్జనానురం
జన మగు రాజ్యసంతతవసంతనితాంతవిభూతి నెంతయుం
దనరుఁ జళుక్యమన్మథుఁడు ధర్మనిబద్ధదయార్ద్రబుద్ధి యై.
5
ఉ. ఆశ్రితపోషణంబున, ననంతవిలాసమునన్‌, మనీషివి
ద్యాశ్రమతత్త్వవిత్త్వమున, దానగుణాభిరతిన్‌, సమస్తవ
ర్ణాశ్రమధర్మరక్షణమహామహిమన్‌, మహి నొప్పు సర్వలో
కాశ్రయుఁ, డాదిరాజనిభుఁ, డత్యకలంకచరిత్రసంపదన్‌.
6
సీ. నిజమహీమండలప్రజఁబ్రీతిఁ బెంచుచుఁ, | బరమండలంబుల ధరణిపతుల
నదిమి కప్పంబుల ముదముతోఁ గొనుచును, | బలిమి నీయని భూమివలయపతుల
నుక్కడఁగించుచు, దిక్కులఁ దనయాజ్ఞ | వెలిఁగించుచును, విప్రకులము నెల్లఁ
బ్రోచుచు, శర ణన్నఁ గాచుచు భీతుల, | నగ్రజన్ములకు ననుగ్రహమునఁ
 
ఆ. జారుతరమహాగ్రహారంబు లిచ్చుచు, | దేవభోగముల మహావిభూతిఁ
దనరఁజేయు, చిట్లు మనుమార్గుఁ డగు విష్ణు | వర్ధనుండు వంశవర్ధనుండు.
7
వ. అఖిలజలధివేలావలయవలయితవసుమతీవనితావిభూషణం బైన వేంగీదేశంబునకు నాయక రత్నంబునుం బోని రాజమహేంద్రపురంబునందు మహేంద్రమహిమతోఁ బరమానందంబున ననవరత మహామహీ రాజ్యసుఖంబు లనుభవించుచు, సకలభువనలక్ష్మీవిలాసనివాసం బయిన రమ్యహర్మ్యతలంబున మంత్రి పురోహిత సేనాపతి దండనాయక దౌవారిక మహాప్రధాన సామంత విలాసినీపరివృతుం డయి యపారశబ్దశాస్త్రపారగులైన వైయాకరణులును, భారత రామాయణాద్యనేక పురాణప్రవీణులైన పౌరాణికులును, మృదుమధుర రసభావభాసుర నవార్థవచనరచనా విశారదు లయిన మహాకవులును, వివిధతర్కవిగాహిత సమస్త శాస్త్రసాగరగరీయఃప్రతిభు లైన తార్కికులును నాదిగాఁ గలుగు విద్వజ్జనంబులు పరివేష్టించి కొలుచుచుండ విద్యావిలాసగోష్ఠీసుఖోపవిష్టుం డయి యిష్టకథావినోదంబుల నుండి యొక్కనాఁడు. 8
సీ. తనకులబ్రాహ్మణు, ననురక్తు, నవిరళ | జపహోమతత్పరు, విపులశబ్ద
శాసను, సంహితాభ్యాసు, బ్రహ్మాండాది | నానాపురాణవిజ్ఞాననిరతుఁ,
బాత్రు, నాపస్తంబసూత్రు, ముద్గలగోత్ర | జాతు, సద్వినుతావదాతచరితు
లోకజ్ఞు, నుభయభాషాకావ్యరచనాభి | శోభితు, సత్ప్రతిభాభియోగ్యు,
 
ఆ. నిత్యసత్యవచను, మత్యమరాధిపా | చార్యు, సుజను నన్నపార్యుఁ జూచి
పరమధర్మవిదుఁడు, వరచళుక్యాన్వయా | భరణుఁ డిట్టు లనియెఁ గరుణతోడ.
9
చ. విమలమతిం బురాణములు వింటి ననేకము, లర్థధర్మశా
స్త్రములతెఱం గెఱింగితి, నుదాత్తరసాన్వితకావ్యనాటక
క్రమములు పెక్కుసూచితి, జగత్పరిపూజ్యము లైన యీశ్వరా
గమములయందు నిల్పితిఁ బ్రకాశముగా హృదయంబు భక్తితోన్‌.
10
వ. అయినను నాకు ననవరతంబును శ్రీమహాభారతంబునందలి యభిప్రాయంబు పెద్ద యై యుండు. 11
మ. ఇవి యేనున్‌ సతతంబు నాయెడఁ గరం బిష్టంబు లై యుండుఁ బా
యవు భూదేవకులాభితర్పణమహీయఃప్రీతియున్‌. భారత
శ్రవణాసక్తియుఁ, బార్వతీపతిపదాబ్జధ్యానపూజామహో
త్సవమున్‌, సంతతదానశీలతయు, శశ్వత్సాధుసాంగత్యమున్‌.
12
వ. మఱి యదియునుంగాక. 13
చ. హిమకరుఁ దొట్టి పూరుభరతేశకురుప్రభుపాండుభూపతుల్‌
క్రమమున వంశకర్త లనఁగా మహి నొప్పిన యస్మదీయవం
శమునఁ బ్రసిద్ధులై, విమలసద్గుణశోభితు లైన పాండవో
త్తములచరిత్ర నాకు సతతంబు వినంగ నభీష్ట మెంతయున్‌.
14
చ. అమలసువర్ణశృంగఖుర మై కపిలం బగు గోశతంబు ను
త్తమబహువేదవిప్రులకు దానము సేసిన తత్ఫలంబు త
థ్యమ సమకూరు భారతకథాశ్రవణాభిరతిన్‌, మదీయచి
త్తము ననిశంబు భారతకథాశ్రవణప్రవణంబ కావునన్‌.
15
క. జననుత కృష్ణద్వైపా | యనమునివృషభాభిహిత మహాభారతబ
ద్ధనిరూపితార్థ మేర్పడఁ, | దెనుఁగున రచియింపు మధికధీయుక్తిమెయిన్‌.
16
క. బహుభాషల బహువిధముల | బహుజనములవలన వినుచు భారతబద్ధ
స్పృహు లగు వారికి నెప్పుడు | బహుయాగంబులఫలంబు పరమార్థ మిలన్‌.
17
వ. అని యానతిచ్చిన విని యక్కవివరుం డి ట్లనియె. 18
చ. అమలినతారకాసముదయంబుల నెన్నను, సర్వవేదశా
స్త్రముల యశేషసారము ముదంబునఁ బొందను, బుద్ధిబాహువి
క్రమమున దుర్గమార్థజలగౌరవభారతభారతీసము
ద్రముఁ దఱియంగ నీఁదను, విధాతృన కైనను నేరఁబోలునే.
19
వ. అయినను దేవా! నీయనుమతంబున విద్వజ్జనంబుల యనుగ్రహంబునంజేసి నానేర్చువిధంబున నిక్కావ్యంబు రచియించెద నని. 20
తరలము. హరిహరాజగజాననార్కషడాస్యమాతృసరస్వతీ
గిరిసుతాదిక దేవతాతతికిన్‌ నమస్కృతి సేసి దు
ర్భరతపోవిభవాధికున్‌, గురుఁ బద్యవిద్యకు నాద్యు, నం
బురుహగర్భనిభుం, బ్రచేతసుపుత్త్రు భక్తిఁ దలంచుచున్‌.
21
ఉ. భారతభారతీశుభగభస్తిచయంబులఁ జేసి, ఘోరసం
సారవికారసంతమసజాలవిజృంభముఁ బాచి, సూరిచే
తోరుచిరాబ్జబోధనరతుం డగు దివ్యుఁ బరాశరాత్మజాం
భోరుహమిత్రుఁ గొల్చి మునిపూజితు భూరియశోవిరాజితున్‌.
22
వ. మఱియును. 23
చ. పరమవివేకసౌరభవిభాసిత సద్గుణపుంజవారిజో
త్కరరుచిరంబు లై, సకలగమ్యసుతీర్థము లై, మహామనో
హరసుచరిత్రపావనపయఃపరిపూర్ణము లైన సత్సభాం
తరసరసీవనంబుల, ముదం బొనరం గొనియాడి వేడుకన్‌.
24
ఉ. పాయక పాకశాసనికి భారతఘోరరణంబునందు నా
రాయణునట్లు, వానసధరామరవంశవిభూషణుండు నా
రాయణభట్టు, వాఙ్మయధురంధరుఁడుం, దన కిష్టుఁడున్‌, సహా
ధ్యాయుఁడు నైనవాఁ డభిమతంబుగఁ దోడయి నిర్వహింపఁగన్‌.
25
ఉ. సారమతిం గవీంద్రులు ప్రసన్నకథాకవితార్థయుక్తి లో
నారసి మేలునా, నితరు లక్షరరమ్యత నాదరింప, నా
నారుచిరార్థసూక్తినిధి నన్నయభట్టు తెనుంగునన్‌ మహా
భారతసంహితారచనబంధురుఁ డయ్యె జగద్ధితంబుగన్‌.
26
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )