ఇతిహాసములు భారతము ఆదిపర్వము - ప్రథమాశ్వాసము
భారతకథాప్రస్తావన (సం. 1-1-8)
వ. తత్కథాప్రారంభం బెట్టి దనిన. 27
సీ. నైమిశారణ్యపుణ్యక్షేత్రమునఁ గుల | పతి శౌనకుం డను పరమమౌని,
బ్రహ్మర్షిగణసముపాసితుం డై సర్వ | లోకహితార్థంబు లోకనుతుఁడు
ద్వాదశవార్షికోత్తమసత్రయాగంబు | మొగిఁ జేయుచున్న నమ్మునులకడకు
వచ్చి, తా నుగ్రశ్రవసుఁ డను సూతుఁడు | రౌమహర్షణి సుపౌరాణికుండు
 
ఆ. పరమభక్తితోడఁ బ్రణమిల్లియున్న న | క్కథకువలన మునినికాయ మెల్ల
వివిధపుణ్యకథలు వినువేడ్క నతనిఁ బూ | జించి రపరిమితవిశేషవిధుల.
28
వ. అక్కథకుండ వెండియు నమ్మునిసంఘంబునకు నమస్కారంబు సేసి, ‘యే ననేకపురాణపుణ్యకథా కథనదక్షుండ, వ్యాస శిష్యుండైన రోమహర్షణునకుఁబుత్త్రుండ; నావలన నెక్కథ విన వలతు?’ రనిన, నమ్మును లతని కి ట్లనిరి. 29
క. ఏయది హృద్య, మపూర్వం | బేయది, యెద్దాని వినిన నెఱుక సమగ్రం
బై యుండు, నఘనిబర్హణ | మే యది? యక్కథయ వినఁగ నిష్టము మాకున్‌.
30
వ. అనిన నుగ్రశ్రవసుం డట్లేని ‘మీకు నభిమతం బైన పుణ్యకథఁ జెప్పెద, దత్తావధానుల రై వినుం’ డని శౌనకాదిమహామునుల కిట్లని చెప్పందొడంగె: ‘కృష్ణద్వైపాయనుండను బ్రహ్మర్షి తొల్లి వేదంబు లేకీభూతంబు లై యేర్పడకున్న ఋగ్యజుస్సామాథర్వంబులుగా విభాగించి, తన శిష్యులయిన పైలవైశం పాయన సుమంతు జైమినులం బంచి క్రమంబునఁ జతుర్వేదసూత్రంబులఁ జేయించి, వేదవ్యాసుండై నిజతపోమహత్త్వంబునం జేసి బ్రహ్మచేత ననుజ్ఞాతుం డై యష్టాదశ పురాణంబులును, నీతిధర్మ శాస్త్రార్థతత్త్వంబులును జతుర్వేద వేదాంతాభిప్రాయంబులును, జతుర్వర్గవర్గాను బంధబంధుర కథేతిహాసంబులును, జతుర్యుగ మహర్షి రాజవంశచరితంబు లును, జతుర్వర్ణాశ్రమధర్మక్రమంబులును, జతుర్ముఖప్రముఖనిఖిలసురముని గణపూజితుం డైన శ్రీకృష్ణునిమాహాత్త్వంబును, బాండవాది భారతవీరుల మహాగుణంబులును దనవిమల జ్ఞానమయం బైన వాగ్దర్పణంబునం దేర్పడి వెలుంగుచుండ. 31
సీ. ధర్మతత్త్వజ్ఞులు ధర్మశాస్త్రం బని, | యధ్యాత్మవిదులు వేదాంత మనియు
నీతివిచక్షణుల్‌ నీతిశాస్త్రం బని, | కవివృషభులు మహాకావ్య మనియు,
లాక్షణికులు సర్వలక్ష్యసంగ్రహ మని, | యైతిహాసికు లితిహాస మనియుఁ,
బరమపౌరాణికుల్‌ బహుపురాణసముచ్చ | యం బని, మహిఁ గొనియాడుచుండ.
 
ఆ. వివిధవేదతత్త్వవేది వేదవ్యాసుఁ | డాదిముని పరాశరాత్మజుండు
విష్ణుసన్నిభుండు విశ్వజనీన మై | పరఁగుచుండఁ జేసె భారతంబు.
32
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )