ఇతిహాసములు భారతము ఆదిపర్వము - ప్రథమాశ్వాసము
పర్వానుక్రమణిక - (సం. 1-2-34)
వ. అదియునుంబౌష్యంబు, పౌలోమం, బాస్తీకం, బాదివంశావతారంబు, సంభవపర్వంబు, జతుగృహదాహంబు, హైడింబంబు, బకవధ, చైత్రరథంబు, ద్రౌపదీస్వయంవరంబు, వైవాహికంబు, విదురాగమనంబు, రాజ్యార్ధలాభం, బర్జునతీర్థయాత్ర, సుభద్రాకల్యాణంబు, హరణహారిక, ఖాండవదహనంబు, మయదర్శనంబు, సభాపర్వంబు, మంత్రపర్వంబు, జరాసంధవధ, దిగ్విజయంబు, రాజసూయం, బర్ఘ్యాభిహరణంబు, శిశుపాలవధ, ద్యూతం, బనుద్యూతం, బారణ్యంబు, కిమ్మీరవధ, కైరాతం, బింద్రలోకాభిగమనంబు, ధర్మజతీర్థయాత్ర, జటాసురవధ, యక్షయుద్ధం, బాజగరంబు, మార్కండేయోపాఖ్యానంబు, సత్యాద్రౌపదీసంవాదంబు, ఘోషయాత్ర, ప్రాయోపవేశంబు, వ్రీహిద్రోణకాఖ్యానంబు, ద్రౌపదీహరణంబు, కుండలాహరణం, బారణేయంబు, వైరాటంబు, కీచకవధ, గోగ్రహణం, బభిమన్యువివాహం, బుద్యోగంబు, సంజయయానంబు, ధృతరాష్ట్రప్రజాగరణంబు, సానత్సుజాతంబు, యానసంధి, భగవద్ధ్యానంబు, సేనానిర్యాత్ర, యులూకదూతాభిగమనంబు సమరథాతిరథసంఖ్యానంబు, కర్ణభీష్మవివాదం, బంబోపాఖ్యానంబు, జంబూఖండవినిర్మాణంబు, భూమిపర్వంబు, భీష్మాభిషేకంబు, భగవద్గీత, భీష్మవధ, ద్రోణాభిషేకంబు, సంశప్తకవధ, అభిమన్యువధ, ప్రతిజ్ఞాపర్వంబు, జయద్రథవధ, ఘటోత్కచవధ, ద్రోణవధ, నారాయణాస్త్రప్రయోగంబు, కర్ణపర్వంబు, శల్యపర్వంబు, హ్రదప్రవేశంబు, గదాయుద్ధంబు, సారస్వతంబు, సౌప్తికపర్వం, బైషీకంబు, జలప్రదానంబు, స్త్రీపర్వంబు, శ్రాద్ధపర్వంబు, రాజ్యాభిషేకంబు, చార్వాకనిగ్రహంబు, గృహప్రవిభాగంబు, శాంతిపర్వంబు, రాజధర్మానుకీర్తనం, బాపద్ధర్మంబు, మోక్షధర్మం, బానుశాసనికంబు, భీష్మస్వర్గారోహణం, బాశ్వమేధికం, బనుగీత, యాశ్రమవాసంబు, పుత్త్రసందర్శనంబు, నారదాగమనంబు, మౌసలంబు, మహాప్రస్థానికంబు, స్వర్గారోహణంబు, హరివంశంబు, భవిష్యత్పర్వంబు నను శతపర్వంబులు గలిగి. 33
సీ. ఆయురర్థులకు దీర్ఘాయు రవాప్తియు | నర్థార్థులకు విపులార్థములును
ధర్మార్థులకు నిత్యధర్మసంప్రాప్తియు | వినయార్థులకు మహావినయమతియుఁ
బుత్త్రార్థులకు బహుపుత్త్రసమృద్ధియు | సంపదర్థుల కిష్టసంపదలును
గావించు నెప్పుడు భావించి వినుచుండు | వారికి నిమ్మహాభారతంబు
 
ఆ. భక్తియుక్తులైన భాగవతులకు శ్రీ | వల్లభుండు భక్తవత్సలుండు
భవభయంబు లెల్లఁ బాచి యిష్టార్థసం | సిద్ధిఁ గరుణతోడఁ జేయునట్లు.
34
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )