ఇతిహాసములు భారతము ఆదిపర్వము - ప్రథమాశ్వాసము
పర్వసంగ్రహము (సం. 1-2-71)
వ. మఱియుఁ బౌష్యోదంకమాహాత్మ్యంబును, భృగువంశకీర్తనంబును, నాగగరుడసంభవంబును, సముద్రమథనంబు, నుచ్చైశ్శ్రవోజన్మంబును, సౌపర్ణోపాఖ్యానంబును, నాస్తీకచరితంబును, జనమేజయ సర్పయాగంబును, శ్రీమహాభారతకథాశ్రవణప్రవృత్తియు, వ్యాసజన్మంబును, దేవదైత్యదానవముని యక్షపక్షిగంధర్వాది నానావిధభూతసంభవంబును, దదంశావతారంబును, రాజవంశానుకీర్తనంబును, యయాతిచరితంబును, భారతవంశానుకీర్తనంబును, గంగాశంతనుసమాగమంబును, వసూత్పత్తియు, స్వర్గగమనంబును, దదంశసంఘాతంబున గాంగేయజన్మంబును, దద్రాజ్యనివర్తనంబును, బ్రహ్మచర్యప్రతిజ్ఞాపరిపాలనంబును, సత్యవతీవివాహంబును, జిత్రాంగదావిచిత్రవీర్యజన్మంబును, జిత్రాంగదరాజ్యాభిషేకంబును, జిత్రాంగదమరణానంతరంబున భీష్ముండు విచిత్రవీర్యుం గౌరవరాజ్యంబున నభిషిక్తుం జేయుటయు, వానిపరోక్షంబునఁ గృష్ణద్వైపాయనమునివలన ధృతరాష్ట్రపాండురాజుల జన్మంబు, నాణిమాండవ్యో పాఖ్యానంబును, ధర్ముండు మాండవ్యశాపంబున శూద్రయోనియందు విదురుం డై పుట్టుటయును, ధృతరాష్ట్రపాండురాజుల వివాహంబును, బాండవధార్తరాష్ట్ర సంభవంబును, బాండునిర్యాణంబును, గృపద్రోణజన్మకథనంబును, గుమారాస్త్రవిద్యాగ్రహణంబును, గుమారాస్త్ర సందర్శనంబును, గర్ణార్జునుల పరస్పరక్రోధంబును, ద్రుపదగ్రహణమోక్షణంబును, యుధిష్ఠిరు యౌవరాజ్యాభిషిక్తుం జేయుటయు, దుర్యోధనుదుర్మంత్రంబును, వారణావత యాత్రయు, జతుగృహదాహంబును, విదురోపదిష్టద్వారంబునఁ బాండవాపక్రమణంబును, హిడింబాదర్శనంబును, హిడింబువధయును, ఘటోత్కచసంభవంబును, బాండవుల కేకచక్రపురంబున విప్రగృహంబున నజ్ఞాతచర్యయు, బకవధయు, ధృష్టద్యుమ్నద్రౌపదీ జన్మకథనంబును, గృష్ణద్వైపాయన సందర్శనంబును, గంగాతీరంబున నంగారపర్ణు నర్జునుండు జయించుటయుఁ, దాపత్యవసిష్ఠ్ఠౌర్వోపాఖ్యానంబును, బాండవులు పాంచాలదేశంబునకుం జనుటయు, ద్రౌపదీస్వయంవరంబును, బంచేంద్రోపాఖ్యానంబును, ద్రౌపదీవివాహంబును, విదురాగమనంబును, గృష్ణసందర్శనంబును, రాజ్యార్థలాభంబును, ఖాండవప్రస్థ నివాసంబును, సుందోపసుందోపాఖ్యానంబును, నారదువచనంబున, ద్రౌపదియందు సమయ క్రియయును నర్జునుతీర్థాభిగమనంబును, నులూపీసమాగమంబును, జిత్రాంగదయందు బభ్రువాహను జన్మంబును, ద్వారకాగమనంబును, వాసుదేవానుమతంబున నర్జునుఁడు సుభద్రను వివాహం బగుటయు, సుభద్రాహరణంబును, హరణహారికయు, నభిమన్యుసంభవంబును, గాండీవదేవదత్త దివ్యరథాశ్వ లాభంబును, ఖాండవదహనంబు, నగ్నిభయంబువలన మయభుజంగమోక్షణంబును, మందపాలోపాఖ్యానంబును నను వృత్తాంతంబుల నొప్పి తొమ్మిదివేలుం దొమ్మన్నూటయెనుబదినాలుగు శ్లోకంబులు గలిగి. 35
క. మదిఁ బౌష్యపర్వ మాదిగఁ| బదునెనిమిదిపర్వములను బర్వి మనఃప్రీ
తిద మగుచు నాదిపర్వం | బది వినఁగా నొప్పు భారతాద్యం బగుచున్‌.
36
వ. మఱియు ధర్మరాజునకు సభాప్రాప్తియుఁ, గింకరదర్శనంబును, నారదువలన లోకపాలసభాశ్రవణంబును, రాజసూయమహాధ్వరారంభంబును, జరాసంధవధయును, గిరివ్రజనిరుద్ధు లైన రాజులఁ గృష్ణుఁడు విడిపించుటయును, దిగ్విజయంబును, రాజసూయంబు, నర్ఘ్యాభిహరణంబును, శిశుపాలవధయును, రాజసూయవిభూతికి దుఃఖితుం డై సభాస్ఖలితుం డై యున్న దుర్యోధనుం జూచి ద్రౌపదీభీమసేనులు నగుటయును, దత్కారణంబున జూదం బాడుటయు, నందు శకునికైతవంబున ధర్మరాజపరాజయంబును, ద్యూతదుఃఖార్ణవమగ్ను లైన పాండవులం బాంచాలి యుద్ధరించుటయును, బునర్ద్యూతపరాజితు లై పాండవులు వనవాసగతు లగుటయు నను వృత్తాంతంబుల నొప్పి నాలుగువేలున్‌ మున్నూటపదునొకండు శ్లోకంబులు గలిగి. 37
క. పర్వి సభాప్రభృతిగ నవ | పర్వములను విస్తరిల్లి, పండితచేతో
నిర్వృతిఁ జేయుచు రెండవ | పర్వము నా రమ్య మగు సభాపర్వ మిలన్‌.
38
వ. మఱియు మహారణ్యంబునందుఁ గిమ్మీరవధయును, గృష్ణపాంచాలాగమనంబును, సౌభకాఖ్యానంబును, యుధిష్ఠిరభీమసేనసంవాదంబును, గురూపదేశంబున నర్జునుండు దివ్యాస్త్రంబులు వడయఁ దపశ్చరణంబు సేయుటయు, నీశ్వరుతోడియుద్ధంబును, లోకపాలసందర్శనంబును, దివ్యాస్త్రలాభంబును, స్వర్గగమనంబును, నిట బృహదశ్వుండను మహామునింగాంచుటయు, యుధిష్ఠిరాదులపరిదేవనంబును, నలోపాఖ్యానంబును, దమయంతీ పతివ్రతాస్తుతియు, యుధిష్ఠిరాదులకు నర్జునుకుశలవార్త రోమశుండు సెప్పుటయును, ధర్మజుతీర్థాభిగమనంబును, జటాసురవధయును, బాంచాలీనియుక్తుం డై భీముండు సౌగంధికపుష్పాహరణార్థంబుగంధమాదనంబునందలికొలనికిఁజని యందు మణిమంతుఁడు మొదలుగాఁగల యక్షరాక్షసులం జంపుటయు. నాజగరంబు, నగస్త్యోపాఖ్యానంబును, వాతాపిభక్షణంబు, నపత్యార్థం బగస్త్యమహాముని లోపాముద్ర నభిగమించుటయు. శ్యేనకపోతంబు లైన యింద్రాగ్నులు శిబిమాంసంబు గొనుటయు, ఋష్యశృంగుచరితంబును, బరశురామచరితంబును, గార్తవీర్యవధయును, మాంధాతృజన్మంబును, సౌకన్యాఖ్యానంబును, భార్గవుండయిన చ్యవనుండు శర్యాతియజ్ఞంబున నాశ్వినుల సోమపీథులం జేసి వారిచేత జవ్వనంబు వడయుటయు, జంతూపాఖ్యానంబును, యజ్ఞపుత్త్రుం డైన సోమకుండు బహుపుత్త్రార్థంబు యజ్ఞంబుసేసి పుత్త్రశతంబును బడయుటయు, వంద్యష్టావక్రుల వివాదంబును, సముద్రంబును జయించితిత్తిరియను మహర్షి తనతండ్రిం బడయుటయు, దివ్యాస్త్రంబులు వడసి యర్జునుండు హిరణ్యపురనివాసు లయిన పౌలోమ కాలకేయ నివాతకవచాదులం జంపుటయు, గంధమాదనంబున కందఱుం గూడవచ్చుటయు, మార్కండేయబహువిధోపాఖ్యానంబును, గృష్ణసందర్శనంబును, సత్యాద్రౌపదీసంవాదంబును, ఘోషయాత్రయుఁ, జిత్రసేనాదిగంధర్వులఁ బెక్కండ్ర జయించి దుర్యోధనుని విడిపించుటయు, దుర్యోధనుని ప్రాయోపవేశంబును, వ్రీహిద్రోణకాఖ్యానంబును, గలియుగధర్మంబును, వామ్యాశ్వహరణంబును, నింద్రద్యుమ్నోపాఖ్యానంబును, సరస్వతీగీతయు, ధుంధుమారుచరితంబును, జయద్రథుం డాశ్రమాంతరంబున ద్రౌపది నపహరించుటయు, భీముండు వానిం బరిభవించుటయు, నుద్దాలకోపాఖ్యానంబును, వైన్యోపాఖ్యానంబును, శ్రీరామాయణకథయును, సావిత్ర్యుపాఖ్యానంబును, బాండవులు క్రమ్మఱి ద్వైతవనంబునకు వచ్చుటయుఁ, గర్ణుకవచకుండలంబు లింద్రుండు గొనుటయు, నారణేయోపాఖ్యానంబును, యముండు ధర్మజు ననుశాసించుటయు, యమువలన వరంబులు వడసి పాండవులు పశ్చిమదిక్కునకుం జనుటయు ననువృత్తాంతంబుల నొప్పి పదుమూఁడువేలు నాఱునూటయఱువదినాల్గు శ్లోకంబులు గలిగి. 39
క. ఆరణ్యపర్వ మనఁగా | నారణ్యప్రముఖ షోడశాంతఃపర్వా
ధార మయి సకలసూరిస | భారమ్యం బగు తృతీయపర్వము వెలయున్‌.
40
వ. మఱియు విరాటనగరంబునకుం జనుచుండి తత్సమీపశమీవృక్షంబునఁ బాండవులు తమయాయుధంబులు నిక్షేపించి తమ్మెవ్వరు నెఱుంగకుండ విరాటుం గొలిచి యునికియు, నందు భీముండు సింహబలుం దొట్టి సకలకీచకుల వధించుటయు, గోగ్రహణంబునఁ గురుబలంబుల నెల్ల నొక్కరుండ జయించి ధనంజయుండు గోగణంబులఁగ్రమ్మఱించుటయు, విరాటరాజపుత్త్రియైన యుత్తర నభిమన్యుండు వివాహం బగుటయునను వృత్తాంతంబుల నొప్పి మూడువేలు నేనూఱుశ్లోకంబులు గలిగి. 41
క. పర్వుచు వైరాటాదిక | పర్వచతుష్టయమునను సభారంజన మై
సర్వమనోజ్ఞము నాలగు | పర్వమునాఁ దగి విరాటపర్వము వెలయున్‌.
42
వ. మఱియు భారతరణోద్యోగు లైన పాండవు లుపప్లావ్యంబున విడియుటయు, నర్జునదుర్యోధనులు ద్వారకానగరంబునకుం జని శ్రీకృష్ణునిం గని సహాయత్వంబునకుం బ్రార్థించుటయు, నారాయణుండు వారి నాశ్వాసించి నారాయణగోపాలబలంబుల నిరూపించి వారలం గోరికొం డనుటయు, నారాయణ గోపాల బలంబుల దుర్యోధనుండు గోరికొనుటయు. నారాయణుని నొక్కని నర్జునుండు గోరికొనుటయు, ధృతరాష్ట్రుండు వనుప నుపశమనార్థం బుపప్లావ్యంబున సంజయుండు పాండవులకడకుం బోవుటయు, వాసుదేవసహితులైన పాండవులరణప్రారంభంబు విని ధృతరాష్ట్రుండు నిద్రాహారంబులు విడిచి చింతా క్రాంతుండగుటయు, హితవచనుం డైన విదురుపల్కులు వినమియు, ధృతరాష్ట్రునకు మనస్తాపోప శమనంబుగా సనత్సుజాతుం డధ్యాత్మకథలు సెప్పుటయు, వాసుదేవార్జునుల యత్యంతసాంగత్యం బెఱింగి వచ్చిసంజయుండు సకలరాజసమక్షంబున విస్తరించుటయు, సర్వభూతహితుం డైన శ్రీకృష్ణుండు పాండవధార్తరాష్ట్రులకు సంధి గావింపం దలంచి హస్తిపురంబునకుం జని యందుఁ గర్ణాదిదుష్టశిక్షితుండైన దుర్యోధను దుర్మంత్రం బెఱింగి విశ్వరూపంబుఁ జూపుటయుఁ, గృష్ణుండు కర్ణునిం దనరథం బెక్కించుకొని యుపాయంబున ననునయించి యొడంబఱుపనేరక కర్ణుచేతం బ్రత్యాఖ్యాతుం డయి క్రమ్మఱి వచ్చుటయు, బలాతిబలసంఖ్యానంబు, నెల్లి యుద్ధంబు సేయవలయు నని కురుపతి పనుప నులూకుం డను దూత పాండవులపాలికి వచ్చి పరుసంబులు వలుకుటయు, సమరథాతిరథ సంఖ్యానంబు, నర్ధరథులలోనం గలయం ద న్నెన్నిన నలిగి కర్ణుండు భీష్ముపదిదినంబులు సమరపరాఙ్ముఖుం డగుటయు, రామభీష్ముల యుద్ధకీర్తనంబు, నంబోపాఖ్యానంబును, సంక్రందనోపాఖ్యానంబును, శ్వేతాభిషేకంబు నను వృత్తాంతంబుల నొప్పి యాఱువేలుం దొమ్మన్నూట తొంబదియెనిమిది శ్లోకంబులు గలిగి. 43
క. విదితం బై యుద్యోగము | మొదలుగఁ బదునొకఁడు పర్వముల నెంతయు నొ
ప్పిద మై యేనగు పర్వం | బిది నా నుద్యోగపర్వ మిమ్మగు సభలన్‌.
44
వ. మఱియు జంబూఖండవినిర్మాణంబు సంజయుండు ధృతరాష్ట్రునకుం జెప్పుటయు, భూవిస్తారంబును, భీష్మాభిషేకంబును, బాండవమధ్యమవిషాదంబును, వాసుదేవుండు మోక్షదర్శనహేతువులం జెప్పి యర్జును మోహభ్రాంతిఁ జెఱుచుటయు, శిఖండిం బురస్కరించుకొని యర్జునుండు భీష్ముని వధించుటయు నను వృత్తాంతంబుల నొప్పి యైదువేలునెనమన్నూటయెనుబదినాలుగు శ్లోకంబులు గలిగి. 45
క. జంబూఖండవినిర్మా | ణం బాదిగ హృదయరోచనము లగు నేన్ప
ర్వంబులను భీష్మపర్వము | పంబి వినం బొలుచు షష్ఠపర్వం బగుచున్‌.
46
వ. మఱియు ద్రోణాభిషేకంబును, సంశప్తకు లర్జునుం బాపికొనిపోయి యేకతంబు యుద్ధంబు సేయుటయు, నర్జునుచేత సుప్రతీకగజంబుతోడన భగదత్తుచావును. ద్రోణకర్ణాదులు పెక్కండ్రు గూడుకొని యధర్మయుద్ధంబున నభిమన్యుం జంపుటయు, నర్జునుప్రతిజ్ఞయు, నభిమన్యు వధకుం గ్రుద్ధుండై యర్జునుం డే డక్షౌహిణులబలంబుల నొక్కరుండ చంపి సైంధవుం దునుముటయును, దొమ్మిదికోట్లు సంశప్తకుల నర్జునుండు నిశ్శేషంబు సేయుటయు, నలంబస శ్రుతాయు జలసంధ సోమదత్త భూరిశ్రవో బాహ్లిక విరాట ద్రుపద ఘటోత్కచ ధార్తరాష్ట్ర నారాయణగోపాలాదివధయును, ద్రోణవధయు, నశ్వత్థామ నారాయణాగ్నేయాస్త్రకీర్తనంబును, గృష్ణార్జునులమాహాత్మ్యంబును నను వృత్తాంతంబుల నొప్పి పదివేలుందొమ్మన్నూట పందొమ్మిది శ్లోకంబులు గలిగి. 47
క. విన నే డగుపర్వము మే | లనఁగా ద్రోణాభిషేక మాదిగఁ గల య
య్యెనిమిదిపర్వములను న | త్యనుపమ మై ద్రోణపర్వ మమరున్‌ సభలన్‌.
48
వ. మఱియుఁగర్ణాభిషేకంబును, గర్ణునకు రథంబు గడప శల్యుం బూన్చుటయుఁ, ద్రిపురదహనోపాఖ్యానంబును, గర్ణశల్యుల పరస్పరవివాదంబును, హంసకాకీయోపాఖ్యానంబును, యుధిష్ఠిరార్జునుల పరస్పర క్రోధవచనంబులు, నర్జునానునయంబును, వృషసేనువధయును, దుశ్శాసనుం జంపిభీముండు తద్వక్షోరక్తం బాస్వాదించుటయు, విప్రశాపనిమిత్తంబునఁ గర్ణురథచక్రంబు భూమియందుఁ గ్రుంగుటయు, నాగాస్త్రభయంబును, నర్జునురథంబు శ్రీకృష్ణుండు భూమియందుఁ జొనుపుటయు, నింద్రాదిత్యుల పరస్పరసంవాదంబును,గర్ణువధయును నను వృత్తాంతంబుల నొప్పినాలుగువేలుందొమ్మన్నూఱుశ్లోకంబులు గలిగి. 49
క. అనుపమబలు లగు కర్ణా | ర్జునవీరుల శౌర్యమహిమ శోభిల్లంగా
నెనిమిది యగు పర్వం బిది | యనఁ బరఁగుం గర్ణపర్వ మతిహృద్యం బై.
50
వ. మఱియుభారతవీరు లెల్లఁబరలోకగతులైన శల్యుండు రణభారంబుపూనుటయుఁ, గురుకుమారవధయును, ధర్మజురోషంబున శల్యుమరణంబును, గురుముఖ్యులవధయును, సహదేవునిచేత సపుత్త్రకుం డైన శకునిచావును, సంజయగ్రహణమోక్షణంబును, హ్రదప్రవేశంబును, భీమదుర్యోధనుల గదాయుద్ధంబును సరస్వత్యాదిపుణ్యతీర్థకీర్తనంబు నను వృత్తాంతంబుల నొప్పి మూఁడువేలు నిన్నూటయిరువది శ్లోకంబులు గలిగి. 51
ఆ. సభల విస్తరిల్లి శల్యాదికము లైన | నాల్గుపర్వముల వినంగఁ జాలి
నవమపర్వ మనఁగ నవ్యార్థరమణీయ | మగుచు శల్యపర్వ మతిశయిల్లు.
52
వ. మఱియు భీముగదాభిఘాతంబున దుర్యోధనుండు తొడలు విఱిగి పడినఁ, బాండవులు రణం బుపసంహరించి చనిన నాఁటిరాత్రి కృపకృతవర్మాశ్వత్థామలు పాండవశిబరంబుపయింజనుటయు, నం దశ్వత్థామ కోపోద్దీపితుండైతనప్రతిజ్ఞదీఱ ధృష్టద్యుమ్నపురోగములైన సర్వపాంచాలురను బ్రతివింధ్యాదిద్రౌపదేయులను బాండవామాత్యులను సుఖసుప్తులయినవారి వధించుటయు, నందు శ్రీకృష్ణప్రసాదంబునఁ బాండవులేవురు సాత్యకియుం దప్పుటయుఁ, బుత్త్రభ్రాతృవధ దుఃఖిత యై పాంచాలి యనశనంబు సంకల్పించుకొనుటయుఁ, దద్వచనంబున భీముం డశ్వత్థామపిఱుందం జనుటయు, భీమసేనభయార్తుండయి యశ్వత్థామ యపాండవం బయ్యెడుమని శరమోక్షణంబుసేయుటయు, నట్లుగాకుండెడు మని శ్రీకృష్ణుండు దానింబరిహరించుటయు, దానిం దునియ నర్జునుండు తనదివ్యబాణంబున నేయుటయు, వ్యాసాశ్వత్థామల యన్యోన్యశాపంబులు, నశ్వత్థామశిరోరత్నంబుఁబాండవులుగొనుటయు నను వృత్తాంతంబుల నొప్పి రెండువేలునెనమన్నూటడెబ్బది శ్లోకంబులు గలిగి. 53
క. నుతసౌప్తికాదిపర్వ | త్రితయంబునఁ దనరి వసుమతీసురవరస
మ్మత మై సౌప్తికపర్వము | ప్రతిభ వినం బొలుచు దశమపర్వం బగుచున్‌.
54
వ. మఱియు వీరపత్నీవిలాపంబును, గాంధారీధృతరాష్ట్రుల కోపప్రసాదంబులును, ధర్మజుండు రణనిహతు లైన పితృపితామహభ్రాతృ పుత్త్రభృత్యామాత్యమాతులాచార్యమిత్రాదులం బరీక్షించి యథావిధి సంస్కరింపందగు వారలం బంచుటయు, భారతవీరుల కుదకదానంబు సేయుటయుఁ, దత్సమయంబునఁ గుంతీదేవి పాండవులకుఁ గర్ణుండు గూఢోత్పన్నుం డని యెఱింగించుటయు, ధర్మజువిలాపంబును, ధర్మజురాజ్యాభిషేకంబును, చార్వాకనిగ్రహంబును, గృహప్రవిభాగంబును నను వృత్తాంతంబుల నొప్పి వేయునేడునూటడెబ్బదియైదు శ్లోకంబులు గలిగి. 55
క. పర్వుచు స్త్రీపర్వాదిక | పర్వంబుల నే నిటం గృపాయుత మై స్త్రీ
పర్వంబు పదునొకం డగు | పర్వము నా వెలయు సుకవిపండితసభలన్‌.
56
వ. మఱియు బంధువర్గంబు నెల్ల వధియించి పరమనిర్వేదనపరుం డై కృష్ణువచనంబుల శాంతుం డై యున్న ధర్మజునకు శరతల్పగతుం డైన భీష్ముండు ధర్మవిదు లయిన రాజులకెల్ల హితంబుగా రాజధర్మంబులు, నాపద్ధర్మంబులు, నేవాని నెఱింగిన సర్వజ్ఞానసంపన్ను లగుదు రట్టి మోక్షధర్మంబులుఁ జెప్పుటయు నను వృత్తాంతంబుల నొప్పి పదునాలుగువేలునేనూటయిరువది యైదుశ్లోకంబులు గలిగి. 57
క. సకలహితం బై శాంత్యా | దికపర్వచతుష్కమున విదిత మై సమబు
ద్ధికిఁ బండ్రెం డగు పర్వం | బ కడున్‌ మే లనఁగ శాంతిపర్వము వెలయున్‌.
58
వ. మఱియుఁ బితామహుం డగు గాంగేయువలన సర్వధర్మనిశ్చయంబును, దానివిధులును, నాచారవిధులును ధర్మరా జెఱుంగుటయుఁ, బుత్త్రానుశాసనంబును, భీష్మస్వర్గారోహణంబు నను వృత్తాంతంబుల నొప్పి పండ్రెండువేలశ్లోకంబులు గలిగి. 59
క. ఒనరుఁ ద్రయోదశపర్వం | బనఁగా ననుశాసనాద్య మగు పర్వయుగం
బున మే లై విబుధశ్రే | ణినుతం బై యానుశాసనిక పర్వ మిలన్‌.
60
వ. మఱియు నశ్వమేధారంభంబును, సంవర్తమరుత్తీయోపాఖ్యానంబును, స్వర్ణకోశసంప్రాప్తియు, నుత్తరగర్భంబున నశ్వత్థామాస్త్రదగ్ధుం డై శ్రీకృష్ణుచేత సంజీవితుం డయిన పరీక్షితుని జన్మంబు, నర్జును నశ్వానుసరణంబు, నెడనెడరాజులతోడి యుద్ధంబును, జిత్రాంగదపుత్త్రుండైన బభ్రువాహనుం డాహవంబున నర్జునుం బరిభవించుటయు, నశ్వమేధమహాయజ్ఞంబునందు నకులోపాఖ్యానంబును, ననుగీతయు, బ్రాహ్మణగీతయు, గురుశిష్యసంవాదంబును నను వృత్తాంతంబుల నొప్పి నాల్గవేలునన్నూటయిరువది శ్లోకంబులు గలిగి. 61
తే. అభిమతం బగు నశ్వమేధాదికద్వి | పర్వయుత మై చతుర్దశపర్వ మనఁగ
నాశ్వమేధికపర్వ మత్యంత నిబిడ | వస్తువిస్తార మై బుధవరుల సభల.
62
వ. మఱియు ధృతరాష్ట్రుండును గాంధారియు రాజ్యంబు విడిచి విదురసంజయసహితంబుగా నాశ్రమవాసంబునకుఁజనుటయు, సకలరాజ్యభారధౌరేయులైనకొడుకులవిడిచి కుంతీదేవి గురుశుశ్రూషాపరయయి వారిపిఱుందన పోవుటయు, సమరనిహతు లైన పుత్త్రపౌత్త్రుల నెల్ల ధృతరాష్ట్రుండు వ్యాసవరప్రసాదంబునఁ గాంచి విగతశోకుం డయి గాంధారీకుంతీవిదుర సంజయులతోఁ బరమసిద్ధికింజనుటయుఁ, బాండవులు నారదువలన నిఖిలయాదవవ్యసనం బెఱుంగుటయు నను వృత్తాంతంబుల నొప్పి వేయునూటయాఱుశ్లోకంబులు గలిగి. 63
క. అమితార్థయుక్తితో నా | శ్రమవాసాదిత్రిపర్వసహితం బయి యా
శ్రమవాసపర్వ మత్యు | త్తమ కథలను వెలయుఁ బంచదశపర్వం బై.
64
వ. మఱియు యాదవు లెల్ల మదిరాపానపరవశు లయి శాపనిమిత్తంబున సముద్రతీరంబునఁ దమలోఁ బోరి పొడిచికొని పరలోక గతు లగుటయు, దాని నెఱింగి రామకృష్ణాదియాదవ విరహితం బయిన ద్వారవతి కర్జునుం డరిగి విషణ్ణచిత్తుం డయి వసుదేవాదియాదవుల నెల్ల సంస్కరించి, యాదవకళత్రంబుల నెల్లఁదోడ్కొని వచ్చుచో గాండీవదివ్యబాణంబులశక్తి దఱిఁగిన వనచరభయంబువలనఁ దత్కళత్రంబుల రక్షింపనోపమియు, నర్జునుండు ధర్మరాజుకడకు వచ్చి వ్యాసవాక్యప్రబోధితుం డై సన్న్యసించుటయు నను వృత్తాంతంబుల నొప్పి మున్నూరుశ్లోకంబులు గలిగి పదియాఱవపర్వం బై మౌసలపర్వంబునాఁ బరఁగె; మఱియుఁ బరీక్షిద్రాజ్యాభిషేకంబును, రాజ్యపరిత్యాగము సేసి పాండవు లేవురు ద్రౌపదీసహితు లై పరమసిద్ధికిం జనుటయు నను వృత్తాంతంబుల నొప్పి నూటయిరువదిశ్లోకంబులు గలిగి పదియేడవపర్వం బై మహాప్రస్థానికంబునాఁ బరఁగె; మఱియుఁ గర్ణునరకప్రాప్తియుఁ దన్మోక్షణంబును, స్వర్గంబున భారతవీరులసంగమంబును, గర్మపరిపాకోపభోగంబు నను వృత్తాంతంబుల నొప్పి యిన్నూఱుశ్లోకంబులు గలిగి పదునెనిమిదవపర్వం బై స్వర్గారోహణంబు నాఁ బరఁగె; ని ట్లష్టాదశపర్వంబులు గలిగి. 65
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )