ఇతిహాసములు భారతము ఆదిపర్వము - ప్రథమాశ్వాసము
భారతసంహితా నిర్మాణ ప్రశంస (సం. 1-1-63)
మ. అమితాఖ్యానకశాఖలం బొలిచి, వేదార్థామలచ్ఛాయ మై,
సుమహద్వర్గచతుష్కపుష్పవితతిన్‌ శోభిల్లి, కృష్ణార్జునో
త్తమనానాగుణకీర్తనార్థఫల మై, ద్వైపాయనోద్యానజా
త మహాభారత పారిజాత మమరున్‌ ధాత్రీసురప్రార్థ్య మై.
66
వ. ఇట్టి మహాభారతంబు ననేకవిధపదార్థప్రపంచసంచితంబు నుపపర్వమహాపర్వోపశోభితంబు నుపద్వీపసంభృతం బయిన భువనం బజుండు నిర్మించినట్లు కృష్ణద్వైపాయనుండు నిఖిలలోకహితార్థంబు దత్తావధానుం డై సంవత్సరత్రయంబు నిర్మించి, దాని దేవలోకంబునందు వక్కాణింప నారదుం బనిచెఁ; బితృలోకంబున వక్కాణింప నసితుం డైన దేవలుం బనిచె; గరుడ గంధర్వయక్ష రాక్షసలోకంబులందు వక్కాణింప శుకుం బనిచె; నాగలోకంబునందు వక్కాణింప సుమంతుం బనిచె; మనుష్యలోకంబున జనమేజయునకు వక్కాణింప వైశంపాయనునిం బనిచె; నే నా వైశంపాయన మహామునివలన విని వచ్చితిఁ; దొల్లి కృతత్రేతావసాన సమయంబుల దేవాసుర రామరావణ యుద్ధంబులునుంబోలె ద్వాపరాంతంబునం బాండవధార్తరాష్ట్రులకు మహాఘోరయుద్ధం బయ్యె; నందు. 67
తరలము. పదిదినంబులు భీష్ముఁ డాహవభారకుండు, గురుండు పం
చదివసంబులు, గర్ణుఁడున్‌ దివసద్వయంబు, దినార్ధమం
దుదితతేజుఁడు శల్యుఁ, డత్యధికోగ్రవీరగదారణం
బది దినార్ధము గాఁగ నిట్లు మహాభయంకరవృత్తితోన్‌.
68
శా. ఏడక్షౌహిణు లెన్నఁ బాండవబలం; బేకాదశాక్షౌహిణుల్‌
రూఢిం గౌరవసైన్య; మీ యుభయమున్‌ రోషాహతాన్యోన్య మై
యీడంబోవక వీఁక మైఁ బొడువఁగా నేపారు ఘోరాజి న
ల్లాడెన్‌ ధాత్రి శమంతపంచకమునం దష్టాదశాహంబులున్‌.
69
వ. ఇట్టి మహాభారతంబు కృష్ణద్వైపాయనమహాముని విరచితం బై ప్రవర్తిల్లుచుండు. 70
సీ. ఇమ్మహాభారతం బిమ్ములఁ బాయక | విహితావధాను లై వినుచునుండు
వారికి విపుల ధర్మారంభసంసిద్ధి | యగుఁ బరమార్థంబ యశ్రమమున
వేదముల్‌ నాలుగు నాదిపురాణముల్‌ | పదునెనిమిదియుఁ దత్ప్రమితధర్మ
శాస్త్రంబులును మోక్షశాస్త్రతత్త్వంబులు | నెఱిఁగిన ఫల మగు, నెల్లప్రొద్దు
 
ఆ. దానములను బహువిధక్రతుహుతజప | బ్రహ్మచర్యములను బడయఁబడిన
పుణ్యఫలముఁ బడయఁబోలు, నశేషపా | పక్షయంబు నగు, శుభంబుఁ బెరుఁగు.
71
ఉ. సాత్యవతేయ విష్ణుపద సంభవ మై, విబుధేశ్వరాబ్ధి సం
గత్యుపశోభితం బయి, జగద్విదితం బగు భారతీయ భా
రత్యమరాపగౌఘము నిరంతర సంతత పుణ్యసంపదు
న్నత్యభివృద్ధి సేయు వినినం గొనియాడిన నెల్లవారికిన్‌.
72
వ. అనిన విని శౌనకాది మహామునులుశ్రీమహాభారత కథా శ్రవణ కుతూహల పరు లయి యక్కథకున కిట్లనిరి. 73
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )