ఇతిహాసములు భారతము ఆదిపర్వము - ప్రథమాశ్వాసము
శమంతపంచ కాక్షౌహిణీ సంఖ్యా కథనము (సం. 1-2-1)
మ. అనఘా! మున్ను శమంతపంచకము నయ్యక్షౌహిణీ సంఖ్యయున్‌
వినఁగా మా కెఱిఁగించి భారత కథావిర్భూతికిం గారణం
బును దద్భారత విస్తరోక్తి విభవంబుం బాండవాడంబరం
బును భీష్మాదికురు ప్రవీర చరితంబుం జెప్పు ముద్యన్మతిన్‌.
74
క. అనిన విని రోమహర్షణ | తనయుం డమ్మునుల కతిముదంబున వినయా
వనతుఁ డయి గురులఁ దనహృ | ద్వనజంబున నిలిపి కొలిచి వాగ్గణపతులన్‌.
75
ఉ. ఇంబుగ సర్వలోకజను లెవ్వనియేని ముఖ్యామృతాంశుబిం
బంబున నుద్భవం బయిన భారతవాగమృతంబు కర్ణరం
ధ్రం బను నంజలిం దవిలి త్రావుదు రట్టి మునీంద్రలోకవం
ద్యుం బరముం బరాశరసుతుం బ్రణమిల్లి కరంబు భక్తితోన్‌.
76
వ. అమ్మును లడిగిన కథ యథాక్రమంబున సవిస్తరంబుగాఁ జెప్పందొడంగె. 77
శా. త్రేతాద్వాపర సంధి నుద్ధత మదాంధీభూత విద్వేషిజీ
మూతోగ్రశ్వసనుండు రాముఁ డలుకన్‌ ముయ్యేడుమాఱుల్‌ రణ
ప్రీతిన్‌ వైరిధరాతలేశ్వరులఁ జంపెం బల్వురన్‌ దీర్ఘని
ర్ఘాత క్రూరకుఠారలూన నిఖిలక్షత్త్రోరుకాంతారుఁ డై.
78
వ. అప్పరశురాముండు నిజనిశిత కుఠారధారా విదళిత సకల క్షత్త్రరుధిరాపూర్ణంబులుగా నేను మడుంగులు గావించి తద్రుధిరజలంబులఁ బితృతర్పణంబు సేసి తత్పితృగణప్రార్థన నుపశమితక్రోధుం డయ్యె; దాననచేసి తత్సమీప ప్రదేశంబు శమంత పంచకంబునాఁ బరఁగె; మఱి యక్షౌహిణీసంఖ్య వినుండు. 79
సీ. వరరథ మొక్కండు వారణ మొక్కండు | తురగముల్‌ మూఁడు కాల్వురును నేవు
రను సంఖ్య గల యది యగుఁ బత్తి, యది త్రిగు | ణం బైన సేనాముఖంబు, దీని
త్రిగుణంబు గుల్మంబు, దీని ముమ్మడుఁ గగు | గణము, తద్గణము త్రిగుణిత మైన
వాహిని యగు, దాని వడి మూఁట గుణియింపఁ | బృతన నాఁ బరఁగుఁ, దత్‌పృతన మూఁట
 
ఆ. గుణిత మైనఁ జము వగున్‌, మఱి దాని ము | మ్మడుఁ గనీకినీ సమాఖ్య నొనరు,
నదియుఁ బదిమడుంగు లైన నక్షౌహిణి | యౌ నిరంతర ప్రమాను సంఖ్య.
80
వ. ఇరువది యొక్కవేయు నెనమన్నూట డెబ్బది రథంబులు, నన్ని యేనుంగులు, నఱువదేనువేలు నాఱునూటపది గుఱ్ఱంబులు, లక్షయుం దొమ్మిదివేలున్‌ మున్నూట యేఁబండ్రు వీరభటులును గలయది యొక్క యక్షౌహిణి యయ్యె; నట్టి యక్షౌహిణులు పదునెనిమిదింట సన్నద్ధులై కురుపాండవులు యుద్ధంబు సేయుటం జేసి యా శమంతపంచకంబు కురుక్షేత్రంబు నాఁబరఁగె; నట్టి కురుక్షేత్రంబునందు. 81
చ. ప్రతిహతశత్రువిక్రముఁడు పాండవవంశ వివర్ధనుండు సు
వ్రతుఁడు పరీక్షిదాత్మజుఁ డవద్యవిదూరుఁ డుదారకీర్తిని
ర్మిత వివిధాధ్వరుండు జనమేజయుఁ డన్‌ జనపాలుఁ డుత్తమ
స్తుతమతి దీర్ఘసత్త్ర మజితుం డొనరించె శుభాభికాంక్షి యై.
82
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )