ఇతిహాసములు భారతము ఆదిపర్వము - ప్రథమాశ్వాసము
సరమ వృత్తాంతము - జనమేజయుని పురోహిత వరణము (సం. 1-3-1)
వ. ఆ ప్రదేశంబునకు సరమ యను దేవశునికొడుకు సారమేయుం డను కుర్కురకుమారుండు క్రీడార్థంబు వచ్చి క్రుమ్మరుచున్న నలిగి జనమేజయు తమ్ములు శ్రుతసేనుండును భీమసేనుండును నుగ్రసేనుండును ననువార లా సారమేయు నడిచిన, నది యఱచుచుం బఱతెంచి తన తల్లికిం జెప్పిన, నా సరమయు నతికోపాన్విత యై జనమేజయునొద్దకు వచ్చి యి ట్లనియె. 83
క. క్షితినాథ! కడు నకరుణా | న్వితు లై నీతమ్ము లతివివేకవిదూరుల్‌
మతిఁ దలఁపక నా పుత్త్రకు | నతిబాలకు ననపరాధు నడిచిరి పెలుచన్‌.
84
క. తగు నిది తగ దని యెదలో | వగవక, సాధులకుఁ బేదవారల కెగ్గుల్‌
మొగిఁ జేయు దుర్వినీతుల | కగు ననిమిత్తాగమంబు లయిన భయంబుల్‌.
85
వ. అని సరమ యదృశ్యయైన, నతి విస్మితుండై జనమేజయుండు కొన్ని దినంబులకు దీర్ఘసత్త్రంబు సమాప్తంబుసేసి హస్తిపురంబునకుం జని, యందు సుఖం బుండి, యొక్కనాఁడు దేవశునీవచన ప్రతీకారార్థంబు శాంతిక పౌష్టిక క్రియలు నిర్వర్తింప ననురూపపురోహితు నన్వేషించుచు ననేక మునిగణాశ్రమంబులకుం జని యొక్కమునిపల్లెం గని, యందు శ్రుతశ్రవసుం డను మహామునిం గని నమస్కరించి యి ట్లనియె. 86
క. కరుణించి యిండు నాకుం | బురోహితుఁడు గాఁగ మీసుపుత్త్రుఁ బవిత్రుం
బరమతపోనైష్ఠికు భా | సురయమనియమాభిరాము సోమశ్రవసున్‌.
87
వ. అని యడిగి వాని యనుమతంబున సోమశ్రవసుం దనకుం బురోహితుం గావించుకొని వాని నభీష్ట సత్కా రంబుల సంతుష్టునిం జేసి తదుపదేశంబున. 88
ఉ. ఆయతకీర్తితో వివిధయాగములన్‌ సుర ధారుణీసురా
మ్నాయము నాహితాహుతి సమంచితదక్షిణ లిచ్చి తన్పుచుం
జేయుచునుండె రాజ్యము విశిష్ట జనస్తుత వర్ధమాన ల
క్ష్మీయుతుఁ డుత్తముండు జనమేజయుఁ డాదినరేంద్రమార్గుఁ డై.
89
వ. ఇట్లనవరత శాంతిక పౌష్టిక క్రియలు నిర్వర్తించుచు గురుదేవ మహీదేవతర్పణాభిరతుం డై యుండు నంత. 90
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )