ఇతిహాసములు భారతము ఆదిపర్వము - ప్రథమాశ్వాసము
ఉదంకుండు పౌష్యుమహాదేవికుండలంబులం దేఁబోవుట (సం. 1-3-86)
క. పంకజభవసన్నిభుఁ డఘ | పంకక్షాళన మహాతపస్సలిలుఁ డనా
తంకమతి పైలశిష్యుఁ డు | దంకుం డను మునివరుండు దద్దయు భక్తిన్‌.
91
క. గురుకులమునందు గురులకుఁ | బరిచర్య లొనర్చి తా నపరిమిత నిష్ఠా
పరుఁ డై జ్ఞానము వడసెను | గురుదయ నణిమాదికాష్టగుణములతోడన్‌.
92
వ. అయ్యుదంకుండు గురుహిత కార్యధురంధరుం డయి గురుపత్నీనియోగంబునం బౌష్యుం డను రాజుదేవి కుండలంబులం బ్రతిగ్రహించి తేరంబూని, వనంబులో నొక్కరుండ చనువాఁ డెదుర నొక్క మహోక్షంబు నెక్కి చనుదెంచువాని నొక్క దివ్యపురుషుం గని, వాని పన్నిన వృషభగోమయ భక్షణంబు సేసి, యమ్మహాత్ము ననుగ్రహంబు వడసి, యతిత్వరితగతిం జని, పౌష్యమహారాజుం గాంచి, దీవించి, గృహీతసత్కారుం డై యి ట్లనియె. 93
తే. ఏను గుర్వర్థ మర్థి నై మానవేశ! | కడఁగి వచ్చితి నిపుడు నీకడకు వేడ్క;
దండితారాతి! నీ దేవికుండలమ్ము | లిమ్ము నా పూన్కి యిది సఫలమ్ము గాఁగ.
94
వ. అనినం బౌష్యుం డిట్టి మహాత్మున కీఁ గాంచితిఁ గృతార్థుండ నైతి నని సంతసిల్లి యుదంకున కి ట్లనియె: ‘నయ్యా! మదీయ ధర్మపత్ని యక్కుండలంబులు దొడిగి యున్నయది; మద్వచనంబున వాని నిప్పించుకొ’ మ్మనిన నుదంకుం డంతఃపురమునకుఁ జని పౌష్యుమహాదేవిం గానక క్రమ్మఱి పౌష్యుపాలికి వచ్చి. ‘నీదేవి నందులం గాన నీవ ‘యక్కుండలంబులు దెప్పించి యి’ మ్మనినఁ బౌష్యుం డి ట్లనియె. 95
క. భూవినుత! నిన్నుఁ ద్రిభువన | పావను నశుచి వని యెట్లు పలుకఁగ నగు? న
ద్దేవి పవిత్ర, పతివ్రత | గావున నశుచులకుఁ గానఁగా దనవద్యా!
96
వ. అనిన విని యుదంకుం డప్పుడు దలంచి ‘యావృషభగోమయభక్షణానంతరంబున నాచమింపమి నైన నా యశుచిభావంబునఁ గా కేమి యప్పరమ పతివ్రత మదీయదృష్టిగోచర గాకున్నదయ్యె’ నని పూర్వాభిముఖుం డయి శుద్ధోదకంబులంబ్రక్షాళితపాణిపాద వదనుండయి యాచమించి పౌష్యానుమతంబున నద్దేవియొద్దకుం జనిన, నదియును నమ్మహామునికి నమస్కరించి కుండలమ్ము లిచ్చి యి ట్లనియె. 97
క. తక్షకుఁ డీ కుండలము ల | పేక్షించుచు నుండు వాఁ డభేద్యుఁడు మాయా
దక్షుండు వానివలన సు | రక్షితముగఁ జేసి చనుము రవినిభతేజా!
98
వ. అనిన నుదంకుం ‘డట్ల చేయుదు’ నని యద్దేవి వీడ్కొని పౌష్యుపాలికిం బోయిన, నతం ‘డయ్యా! నీ వతిథివి మాయింటఁ గృతభోజనుండవై పొ’ మ్మని క్షణియించిన, నొడంబడి యుదంకుండు గుడుచుచో నన్నంబు కేశదుష్టం బైన రోసి, కరం బలిగి ‘యి ట్ల పరీక్షితం బైన యశుద్ధాన్నంబు పెట్టినవాఁడ వంధుండ వగు’ మని శాపం బిచ్చిన, నల్గి ‘యల్పదోషంబున నాకు శాపం బిచ్చినవాఁడవు నీ వనపత్యుండ వగు’ మని ప్రతిశాపం బిచ్చిన, నుదంకుండు ‘నే ననపత్యుండఁ గా నోప, దీనిఁ గ్రమ్మఱింపు’ మనినఁ బౌష్యుం డి ట్లనియె. 99
ఉ. నిండుమనంబు నవ్యనవనీతసమానము, పల్కు దారుణా
ఖండలశస్త్రతుల్యము జగన్నుత! విప్రులయందు; నిక్క మీ
రెండును రాజులందు విపరీతము; గావున విప్రుఁ డోపు, నో
పం డతిశాంతుఁ డయ్యు నరపాలుఁడు శాపము గ్రమ్మఱింపఁగన్‌.
100
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )