ఇతిహాసములు భారతము ఆదిపర్వము - ప్రథమాశ్వాసము
తక్షకుండు కుండలంబు లపహరించుట (సం. 1-3-136)
వ. ‘కావున నా కశక్యంబు నీ యిచ్చిన శాపంబు గ్రమ్మఱింపు’ మనిన నుదంకుం ‘డట్లేని నీకు నల్పకాలంబున శాపమోక్షం బగు’ నని పౌష్యునకు ననుగ్రహించి, ‘మగుడి నేఁడ పోయి గురుపత్నికిఁ గుండలంబు లీఁగంటి’ నని సంతోషించి చనువాఁ డెదుర నొక్క జలాశయంబు గని శుచిప్రదేశంబునఁ దనచేతి కుండలంబులు పెట్టి యాచమించుచున్నంతఁ దనతోడన వచ్చి తక్షకుండు నగ్నవేషధరుండై యక్కుండలంబులు గొని పాఱిన, నుదంకుండును వాని పిఱుందన పాఱి పట్టికొనుడు. 101
క. విడిచి దిగంబరవేషము | విడువక మణికుండలములు విషధరపతి యే
ర్పడ నిజరూపముతో న | ప్పుడ యహిలోకమున కరిగె భూవివరమునన్‌.
102
వ. ఉదంకుండును వానితోడన తగిలి యవ్వివరంబున నురగలోకంబున కరిగి నాగపతుల నెల్ల నిట్లని స్తుతియించె. 103
చ. బహువన పాదపాబ్ధి కులపర్వత పూర్ణ సరస్సరస్వతీ
సహిత మహామహీభర మజస్ర సహస్ర ఫణాళిఁ దాల్చి దు
స్సహతర మూర్తికిన్‌ జలధిశాయికిఁ బాయక శయ్య యైన య
య్యహిపతి దుష్కృతాంతకుఁ డనంతుఁడు మాకుఁ బ్రసన్నుఁ డయ్యెడున్‌.
104
చ. అరిది తపోవిభూతి నమరారులబాధలు వొందకుండఁగా
నురగుల నెల్లఁ గాచిన మహోరగనాయకుఁ డానమత్సురా
సురమకుటాగ్రరత్నరుచిశోభితపాదున కద్రినందనే
శ్వరునకు భూషణం బయిన వాసుకి మాకుఁ బ్రసన్నుఁ డయ్యెడున్‌.
105
ఉ. దేవమనుష్యలోకములఁ ద్రిమ్మరుచున్‌ విపులప్రతాపసం
భావితశక్తిశౌర్యులు నపారవిషోత్కటకోపవిస్ఫుర
త్పావకతాపితాఖిలవిపక్షులు నైన మహానుభావు లై
రావతకోటి ఘోరఫణిరాజులు మాకుఁ బ్రసన్ను లయ్యెడున్‌.
106
ఉ. గోత్రమహామహీధర నికుంజములన్‌ విపినంబులం గురు
క్షేత్రమునం బ్రకామగతి ఖేలన నొప్పి, సహాశ్వసేనుఁ డై
ధాత్రిఁ బరిభ్రమించు బలదర్ప పరాక్రమదక్షుఁ డీక్షణ
శ్రోత్రవిభుండు తక్షకుఁడు శూరుఁడు మాకుఁ బ్రసన్నుఁ డయ్యెడున్‌.
107
వ. అనియి ట్లురగపతుల నెల్ల స్తుతియించి ‘యందు సితాసితతంతు సంతానపటంబు ననువయించుచున్నవారి నిద్దఱ స్త్రీలను, ద్వాదశారచక్రంబుం బరివర్తించుచున్న వారి నార్వురఁ గుమారుల, నతిప్రమాణ తురంగంబు నెక్కినవాని మహాతేజస్వి నొక్క దివ్యపురుషుం గని విపులార్థవంతంబు లైన మంత్రంబుల నతిభక్తియుక్తుం డై స్తుతియించినం బ్రసన్నుం డై యద్దివ్యపురుషుం డయ్యుదంకున కి ట్లనియె. 108
క. మితవచన! నీయథార్థ | స్తుతుల కతిప్రీతమానసుఁడ నైతి ననిం
దిత చరిత! నీకు నభివాం | ఛిత మెయ్యది దానిఁ జెపుమ చేయుదు ననినన్‌.
109
వ. ఉదంకుండు గరంబు సంతసిల్లి ‘యిన్నాగకులం బెల్ల నాకు వశం బగునట్టులుగ ననుగ్రహింపు’ మనిన నప్పురుషుం ‘డట్లేని నీయశ్వకర్ణరంధ్రాధ్మానంబు సేయు’ మనిన వల్లె యని తద్వచనానురూపంబు సేయుడుఁ దత్‌క్షణంబ. 110
శా. పాతాళైకనికేతనాంతరమునం బర్వెం దదశ్వాఖిల
స్రోతోమార్గ వినిర్గతోగ్ర దహనార్చుల్‌, పన్నగవ్రాతముల్‌
భీతిల్లెన్‌, భుజగాధినాథు మనమున్‌ భేదిల్లెఁ గల్పాంత సం
జాతప్రోద్ధత బాడబానల శిఖాశంకాధికాతంక మై.
111
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )