ఇతిహాసములు భారతము ఆదిపర్వము - ప్రథమాశ్వాసము
తక్షకుండు కుండలంబులం దెచ్చి యుదంకున కిచ్చుట (సం. 1-3-158)
క. శంకరనిభుఁ డగు విప్రుభ | యంకరకోపాగ్ని యొక్కొ! యనుచును జాతా
తంకుఁ డయి కుండలంబు లు | దంకునకును దెచ్చి యిచ్చెఁ దక్షకుఁ డంతన్‌.
112
వ. ఇట్లు నాగలోకంబున కెల్ల మహాక్షోభంబు గావించి తక్షకుచేతఁ గుండలంబులు గొని యుదంకుఁ డాత్మగతంబున. 113
సీ. ‘కుండలమ్ములు వేగ కొనిరమ్ము నాలవ | నాఁటికి నని పూని నన్నుఁ బనిచె
గురుపత్ని; నేఁడ యక్కుండలంబులు దొడ్గు | దివస; మీ దివస మతిక్రమింప
కుండంగఁబోక యె ట్లొడఁగూడు? ని న్నాగ | భవన మెప్పాట వెల్వడఁగఁ బోలు?
నేఁడు పోవనినాఁడు నిప్ఫలం బిమ్మహా | యత్నమంతయు’ నని యధికచింతఁ
 
ఆ. దవిలియున్న నయ్యుదంకు నభిప్రాయ | మెఱిఁగి దివ్యపురుషుఁ డిట్టు లనియె:
‘నీహయంబు నెక్కి యేఁగుమ; యిది వడి | గలదు మనముకంటె గాడ్పుకంటె’.
114
వ. అనవుడు నద్దివ్యపురుషువచనంబున నత్తురంగంబు నెక్కితత్‌క్షణంబ యయ్యుదంకుండు గురుగృహంబునకు వచ్చె; నిట గురుపత్నియు శుచిస్నాత యై నూతనపరిధానశోభిత యై యక్కుండలంబులు దొడువ నవసరం బైనఁ దదాగ మనంబు గోరుచున్నయది యప్పు డయ్యుదంకుం గని తద్దయు సంతసిల్లి, తదానీతరత్నకుండల భూషిత యై, బ్రాహ్మణులం బూజించి నిజసంకల్పిత మహోత్సవం బొనరించె; నట్లు గురుకార్యంబు నిర్వర్తించియున్న యుదంకుం జూచి గురుం డి ట్లనియె. 115
క. ఈయున్న పౌష్యుపాలికిఁ | బోయి కడుంబెద్దదవ్వు పోయిన య ట్ల
త్యాయత విమల తపోమహి | మా! యిన్ని దినంబు లేల మసలితి చెపుమా!
116
వ. అనిన నుదంకుం డి ట్లనియెః ‘నయ్యా! మీ యానతిచ్చినట్ల మసల వలవదు; తక్షకుం డను దుష్టోరగంబు సేసిన విఘ్నంబున నింత మసలవలసె; వినుఁడు: మిమ్ము వీడ్కొని చనువాఁడ నెదుర నొక్క మహోక్షంబు నెక్కి చనుదెంచువాని నొక్కదివ్యపురుషుం గని, వాని పన్నిన వృషభగోమయ భక్షణంబు సేసి చని పౌష్యుమహాదేవి కుండలంబులు ప్రతిగ్రహించి వచ్చుచోఁ దక్షకుచేత నపహృతకుండలుండ నై వాని పిఱుందన పాతాళలోకంబునకుం బోయి నాగపతుల నెల్ల స్తుతియించి, యందు సితాసితతంతు సంతానపటంబు ననువయించుచున్నవారి నిద్దఱ స్త్రీలను, ద్వాదశారచక్రంబుఁ బరివర్తించుచున్నవారి నార్వురఁ గుమారుల, నతిప్రమాణతురగారూఢుండైన యొక్క దివ్యపురుషుం గని, తత్ప్రసాదంబునఁ గుండలంబులు వడసి, తదాదేశంబున నత్తురంగంబు నెక్కివచ్చితి; నిది యంతయు నేమి? నా కెఱింగింపుఁ’ డనిన గురుం డిట్లనియె. 117
సీ. అప్పురుషుం డింద్రుఁ, డయ్యుక్ష మైరావ | తంబు, గోమయ మమృతంబు, నాగ
భువనంబులోఁ గన్న పొలఁతు లిద్దఱు ధాత | యును విధాతయు, వారి యనువయించు
సితకృష్ణతంతురాజిత తంత్ర మది యహో | రాత్రంబు, ద్వాదశారములు గలుగు
చక్రంబు మాసాత్మ సంవత్సరంబు, కు | మారు లయ్యార్వురు మహితఋతువు,
 
ఆ. లత్తురంగ మగ్ని, యప్పురుషుండు ప | ర్జన్యుఁ డింద్రసఖుఁడు సన్మునీంద్ర
యాది నింద్రుఁ గాంచి యమృతాశి వగుట నీ | కభిమతార్థ సిద్ధి యయ్యెనయ్య!
118
క. కర మిష్టము సేసితి మా | కరిసూదన! దీన నీకు నగు సత్ఫలముల్‌;
గురుకార్యనిరతు లగు స | త్పురుషుల కగు టరుదె? యధికపుణ్యఫలంబుల్‌.
119
వ. ‘నీవలనం బరమ సంప్రీత హృదయుండ నయితి; నీవును గుర్వర్థంబునందు ఋణవిముక్తుండ వయితివి; నిజేచ్ఛనుండు’ మనినఁ, దదనుజ్ఞ వడసి యుదంకుం డనేకకాలంబు దపంబు సేసె; నట్టి యుదంకుండు తక్షకు చేసిన యపకారంబునకుం బ్రతీకారంబు సేయం జింతించి యొక్కనాఁడు జనమేజయ మహీపాలుపాలికిం బోయి యి ట్లనియె. 120
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )