ఇతిహాసములు భారతము ఆదిపర్వము - ప్రథమాశ్వాసము
ఉదంకుండు జనమేజయునకు సర్పయాగబుద్ధిఁ గలిగించుట (సం. 1-3-177)
చ. మితహితసత్యవాక్య! జనమేజయ! భూజనవంద్య! యేను సు
స్థితి గురుదేవకార్యములు సేయఁగఁబూను టెఱింగి, వంచనో
న్నతమతి యై యకారణమ నా కపకారము సేసెఁ దక్షకుం
డతికుటిలస్వభావుఁడు పరాత్మవిశేషవివేకశూన్యుఁ డై.
121
వ. అదియునుం గాక. 122
చ. అనవరతార్థ దాన యజనాభిరతున్‌, భరతాన్వయాభివ
ర్ధను, సకల ప్రజాహిత విధాను, ధనంజయ సన్నిభున్‌, భవ
జ్జనకుఁ బరీక్షితున్‌ భుజగజాల్ముఁ డసహ్య విషోగ్రధూమకే
తనహతిఁ జేసి చేసె నతిదాంతుఁ గృతాంతనికేతనాతిథిన్‌.
123
ఉ. కాదన కిట్టిపాటి యపకారముఁ దక్షకుఁ డేకవిప్రసం
బోధనఁ జేసి చేసె నృపపుంగవ! నీవు ననేకభూసురా
పాదిత సర్పయాగమున భస్మము సేయుము తక్షకాదికా
కోదరసంహతిన్‌ హుతవహోగ్ర సమగ్ర శిఖాచయంబులన్‌.
124
ఉ. ప్రల్లదుఁ డైన యొక్కకులపాంసను చేసినదానఁ దత్కులం
బెల్లను దూషితం బగుట యేమి యపూర్వము? గావునన్‌ మహీ
వల్లభ! తక్షకాధము నెపంబున సర్పము లెల్ల నగ్నిలోఁ
ద్రెళ్ళఁగ సర్పయాగ మతిధీయుత! చేయుము విప్రసమ్మతిన్‌.
125
వ. అని యి ట్లయ్యుదంకుండు జనమేజయునకు సర్పయాగంబునందు బుద్ధి పుట్టించె ననిన విని శౌనకాది మహామును లక్కథకున కి ట్లనిరి. 126
చ. అమితజగద్భయంకరవిషాగ్నియు నప్రతిహన్యమాన వీ
ర్యముఁ గలయట్టి సర్పముల కా జనమేజయు చేయు సర్పయా
గమున నుదగ్రపావకశిఖాతతులం దొరఁగంగఁ గారణం
బమలచరిత్ర! యేమి చెపుమయ్య వినం గడు వేడ్క యయ్యెడున్‌.
127
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )