ఇతిహాసములు భారతము ఆదిపర్వము - ప్రథమాశ్వాసము
భృగువంశ కీర్తనము - భృగు వగ్నికి శాప మొసంగుట (సం. 1-5-3)
వ. అని యడిగిన వారికి నక్కథకుం డి ట్లని చెప్పెఁ ‘దొల్లి సర్పకుల జనని యైన కద్రువ శాపంబు కారణంబునం జేసి జనమేజయు సర్పయాగంబున సర్వభక్షకుం డైన యగ్నియందు సర్పంబుల కెల్ల నకాండప్రళయం బైన, దాని భృగువంశజుండైన రురుండు గావించు సర్పఘాతంబు సహస్రపాదుండుడిగించినట్లు జరత్కారుసుతుం డైన యాస్తీకుండుడిగించె; దీని సవిస్తరంబుగాఁ జెప్పెదవినుం’ డని భృగువంశకీర్తనంబు నాస్తీకు చరితంబును జెప్పం దొడంగె. 128
సీ. భృగుఁ డను విప్రుండు మగువఁ బులోమ యన్‌ | దాని గర్భిణిఁ దన ధర్మపత్ని
నగ్నిహోత్రమునకు నగ్నులు విహరింపు | మని పంచి యభిషేచనార్థ మరుగ,
నంతఁ బులోముఁ డన్‌ వింతరక్కసుఁ డగ్ని | హోత్రగృహంబున కొయ్య వచ్చి,
యత్తన్విఁ జూచి, యున్మత్తుఁడై ‘యెవ్వరి | సతి యిది సెప్పుమా జాతవేద!’
 
ఆ. యనఁగ, నగ్నిదేవుఁ డనృతంబునకు విప్ర | శాపమునకు వెఱచి‘శాపభయము
దీర్చుకొనఁగఁ బోలుఁ, దీర్పరా దనృతాభి | భాషణమున నైన పాపభయము.’
129
వ. అని విచారించి యప్పరమపతివ్రత భృగుపత్ని యని కలరూపుఁ జెప్పిన, నప్పులోముండు ‘నిది నాకుఁ దొల్లి వరియింపంబడిన భార్య, పదంపడి భృగుండుపెండ్లియయ్యె’ నని వరాహరూపంబున నాసాధ్వినతిసాధ్వసచిత్త నెత్తికొని పర్వం బర్వం, దద్గర్భంబున నున్న యర్భకుండు గరం బలిగి కుక్షిచ్యుతుం డై చ్యవనుండు నాఁ బరఁగె నమ్మునికుమారుని. 130
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )