ఇతిహాసములు భారతము ఆదిపర్వము - ప్రథమాశ్వాసము
చ్యవనునివలనఁ బులోముఁడను రాక్షసుండు చచ్చుట
క. సముదిత సూర్య సహస్రో | పమ దుస్సహతేజు జగదుపప్లవ సమయా
సమదీప్తి తీవ్ర పావక | సముఁ జూచుచు నసుర భస్మసాత్కృతుఁ డయ్యెన్‌.
131
వ. పులోమయు నక్కొడుకు భృగుకులవర్ధను నెత్తికొని నిజాశ్రమంబునకు వచ్చె; నంతకు ముందఱ నా రక్కసునకు వెఱచి యక్కోమలి యేడ్చుచుం బోయినఁ దద్బాష్పధారాప్రవాహంబు మహానది యై తదాశ్రమసమీపంబునం బాఱిన దానికి వధూసర యను నామంబు లోకపితామహుండు సేసె; నంతఁ గృతస్నానుం డై భృగుండు సనుదెంచి బాలార్కుండునుంబోని బాలకు నెత్తికొనియున్న నిజపత్నిం జూచి యసుర సేసిన యపకారంబున కలిగి, ‘యయ్యసుర ని న్నె ట్లెఱింగె? నెవ్వరు సెప్పి’ రనినఁ బులోమ యి ట్లనియె. 132
క. ఈ యగ్నిదేవుఁ డసురకు | నో యన చెప్పుటయు విని మహోగ్రాకృతితో
నాయసుర నన్ను సూకర | మై యప్పుడ యెత్తుకొని రయంబునఁ జనుచోన్‌.
133
క. ‘కుక్షిచ్యుతుఁడై సుతుఁ డా | రాక్షసు భస్మంబు సేసి రాజితశక్తిన్‌
రక్షించె నన్ను’ ననవుడు | నక్షణమ మునీంద్రుఁ డగ్ని కతిరోషమునన్‌.
134
వ. ‘నీ వతిక్రూరుండవు సర్వభక్షకుండవు గ’ మ్మని శాపం బిచ్చిన నగ్నిదేవుం డి ట్లనియె. 135
క. తన యెఱిఁగిన యర్థం బొరుఁ | డనఘా! యిది యెట్లు సెప్పు మని యడిగినఁ జె
ప్పనివాఁడును సత్యము సె | ప్పనివాఁడును ఘోరనరకపంకమునఁ బడున్‌.
136
వ. కావున నే నసత్యంబునకు వెఱచి యక్కోమలి భృగుపత్ని యని కల రూపుఁ జెప్పితి; నఖిల జగత్కర్మసాక్షినై యుండి యసత్యం బెట్లు పలుక నేర్తు? నది నిమిత్తంబుగా నీవు నాకు శాపం బిచ్చిన, నే నలిగి నీకుఁ బ్రతిశాపం బీనోపనివాఁడను గాను; వినుము. 137
చ. అడిచినఁ, దిట్టినన్‌, మఱి మహాపరుషంబులు పల్కి యల్కతోఁ
బొడిచిన నుత్తమద్విజులు పూజ్యులు; వారల కెగ్గు సేసినం
జెడు నిహముం బరంబు, నిది సిద్ధము గావు టెఱింగి, భక్తి నె
ప్పుడు ధరణీసురోత్తములఁ బూజలఁ దన్పుదు, నల్గ నోడుదున్‌.
138
వ. ‘నీవు బ్రాహ్మణుండవు నీ వెద్ది సేసిన నీక చను; లోకహితుండ నయిన నాకు శాపం బిచ్చి లోకంబుల కెల్లఁజెట్ట సేసితి; వ దెట్లనిన వేదోక్తంబు లయిన నిత్యనైమిత్తిక బలివిధానంబులందు మహాద్విజులచేత నాయందు వేల్వంబడిన హవ్య కవ్యంబులు నాముఖంబునన దేవపితృగణంబు లుపయోగింతు; రట్టి యేను సర్వభక్షకుండ నై యశుచి నైనఁ గ్రియానివృత్తి యగుఁ; గ్రియానివృత్తి యైన లోకయాత్ర లేకుండు’ నని యగ్నిభట్టారకుండు నిఖిలలోకవ్యాప్తం బైన తనతేజోమూర్తి నుపసంహరించిన. 139
సీ. త్రేతాగ్ను లెల్లను దేజరిల్లమిఁ జేసి | క్రతుకృత్యములు వినిర్గతము లయ్యె;
నగ్ని హోత్రములందు నౌపాసనాది సా | యంప్రాతరాహుతు లంత నుడిగె;
దేవతార్చనలందు దీపధూపాది స | ద్విధులు వర్తిల్లక విరతిఁ బొందెఁ;
బితృకార్యములఁ బితృపిండయజ్ఞక్రియ | లడఁగె విచ్ఛిన్నంబు లై ధరిత్రి;
 
ఆ. నంత జనులు సంభ్రమాక్రాంతు లై మహా | మునులకడకుఁ జనిరి, మునులు నమర
వరులకడకుఁ జనిరి, వారును వారును | బ్రహ్మకడకుఁ జనిరి భయము నొంది.
140
వ. బ్రహ్మయు భృగుశాప నిమిత్తంబున నగ్నిభట్టారకు నుపసంహారంబును, సకలలోక వ్యవహార విచ్ఛేదంబును నెఱింగి, యగ్నిదేవు రావించి యి ట్లనియె. 141
చ. ప్రకటిత భూత సంతతికి భర్తవు నీవ, చరాచర ప్రవృ
త్తికి మఱి హేతుభూతుఁడవు, దేవముఖుండవు నీవ, లోకపా
వకుఁడవు నీవ; యిట్టి యనవద్య గుణుండవు నీకు విశ్వభా
రక! భువనప్రవర్తనపరాఙ్ముఖభావముఁ బొందఁ బాడియే?
142
వ. ‘అమ్మహాముని వచనం బమోఘంబు గావున నీవు సర్వభక్షకుండ వయ్యును శుచులయం దెల్ల నత్యంతశుచి వై, పాత్రులయం దెల్లఁ బరమపాత్రుండ వై, పూజ్యులయం దెల్ల నగ్రపూజ్యుండ వై, వేదచోదిత విధానంబుల యందు విప్రసహాయుండ వై భువనంబుల నడుపు’ మని, విశ్వగురుండు వైశ్వానరుం బ్రార్థించి నియోగించి భృగువచనంబు ప్రతిష్ఠాపించె; నట్టి భృగునకుఁ బుత్త్రుం డై పుట్టి పరఁగిన. 143
క. చ్యవనునకు సుకన్యకు ను | ద్భవ మయ్యె ఘనుండు ప్రమతి; ప్రమతికి నమృతో
ద్భవ యగు ఘృతాచికిని భా | ర్గవ ముఖ్యుఁడు రురుఁడు పుట్టెఁ గాంతియుతుం డై.
144
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )