ఇతిహాసములు భారతము ఆదిపర్వము - ప్రథమాశ్వాసము
ప్రమద్వర సర్పదష్ట యై చచ్చి మరల బ్రదుకుట (సం. 1-8-1)
వ. అట్టి రురుం డను మునివరుండు విశ్వావసుం డను గంధర్వరాజునకు మేనకకుం బుట్టినదాని, స్థూలకేశుం డను మునివరునాశ్రమంబునఁ బెరుఁగుచున్న దాని, రూపలావణ్య గుణంబులఁ బ్రమదాజనంబులయం దెల్ల నుత్కృష్ట యగుటం జేసి ప్రమద్వర యన నొప్పుచున్న కన్యక నతిస్నేహంబున వివాహంబుగా నిశ్చయించి యున్నంత. 145
తే. కన్నియలతోడ నాడుచు నున్నదానిఁ | బాదమర్దిత మై యొక్క పన్నగంబు
గఱచెఁ గన్నియ లందఱు వెఱచి పఱచి | యఱచుచుండఁ బ్రమద్వర యవనిఁ ద్రెళ్ళె.
146
వ. దాని నెఱింగి కరుణాకలిత హృదయు లై గౌతమ కణ్వ కుత్స కౌశిక శంఖ మేఖల భరద్వాజ వాలఖిల్యోద్దాలక శ్వేతకేతు మైత్రేయ ప్రముఖులు ప్రమతియు రురుండును స్థూలకేశాశ్రమంబునకు వచ్చి విషవ్యపగతప్రాణ యై పడియున్న యక్కన్యం జూచి దుఃఖితు లై యుండ, నచ్చోట నుండనోపక రురుండు శోకవ్యాకుల హృదయుం డై యేకతంబ వనంబునకుం జని. 147
చ. అలయక యేన దేవయజనాధ్యయన వ్రత పుణ్యకర్మముల్‌
సలుపుదునేని, యేన గురుసద్ద్విజభక్తుఁడనేని, యేన య
త్యలఘుతపస్వినేని దివిజాధిప భూసురులార! మన్మనో
నిలయకు నీ ప్రమద్వరకు నిర్విష మయ్యెడు నేఁడు మీదయన్‌.
148
చ. అపరిమితాజ్ఞఁ జేసియు మహాపురుషుల్‌ విషతత్త్వసంహితా
నిపుణులు మంత్రతంత్రములు నేర్చి విధించియు దీనికిన్‌ విష
వ్యపగత మైన జీవ మిది వచ్చునుపాయము సేయరొక్కొ! నా
తపముఫలంబు నధ్యయనదానఫలంబులు నిత్తు వారికిన్‌.
149
వ. అని దీనవదనుం డై యాక్రోశించు వానికి నాకాశంబుననుండి యొక్కదేవదూత యిట్లనియె: ‘నయ్యా! కాలవశంబయిన నెవ్వరికిం దీర్పఁ దరంబుగా; దొక్కయుపాయంబు గలదు; చేయనోపుదేనిఁ జెప్పెద వినుము; నీ యాయుష్యంబునం దర్ధం బిక్కన్య కి’ మ్మనిన రురుం డట్ల చేయుదు నని తన యాయుష్యంబునం దర్ధం బక్కన్య కిచ్చిన నక్కోమలి దొల్లింటికంటె నధికశృంగారసమన్విత యై విషనిర్ముక్త యయ్యె; నట్లు దేవదూత ధర్మరాజానుమతంబునఁ దనచెప్పిన యుపాయంబునం బ్రమద్వరను బంచత్వంబువలనం బాపె; రురుండును దాని వివాహం బై యిష్టోపభోగంబుల ననుభవించుచు నుండి. 150
క. తనసతి కపకారము సే | సిన పాముల కలిగి బాధ సేయుదు నని చి
క్కని దండము గొని పాములఁ | గనినప్పుడు యడువఁ దొడఁగె గహనములోనన్‌.
151
చ. తిరుగుచుఁ బుట్టలం బొదలఁ ద్రిమ్మరు పాముల రోసి రోసి ని
ష్ఠురతర దీర్ఘ దండమున డొల్లఁగ వ్రేయుచు, వచ్చి వచ్చి య
య్యిరవున డుండుభం బను నహిం గని వ్రేయఁగ దండ మెత్తుడున్‌
‘హరి హరి’ యంచు డుండుభమహాహి భయంపడి పల్కు భార్గవున్‌.
152
మత్తకోకిల. ‘ఏమి కారణ మయ్య పాముల కింత యల్గితి? వీవు తే
జోమయుండవు బ్రాహ్మణుండవు సువ్రతుండవు’ నావుడుం
‘బాము లెగ్గొనరించె మత్ప్రియభామ; కేను రురుండ ను
ద్దామసత్త్వుఁడ’ నిన్ను నిప్పుడు దండతాడితుఁ జేసెదన్‌.
153
వ. అని రురుం డలిగి కృతాంతకర దండంబుం బోని తనదండం బెత్తికొనుడుఁ దత్‌క్షణంబ డుండుభంబు ముని యై యెదుర నిలిచినం జూచి రురుం డి ట్లనియె. 154
క. ‘ఉరగమ వై యుండి మునీ | శ్వరవేషము దాల్చి యున్నవడు వెంతయు న
చ్చెరు; విది యెట్టులు?’ నావుడు | రురునకు ని ట్లనియె మునివరుం డనురక్తిన్‌.
155
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )