ఇతిహాసములు భారతము ఆదిపర్వము - ప్రథమాశ్వాసము
సహస్రపాదుని వృత్తాంతము (సం. 1-10-6)
వ. ‘ఏను సహస్రపాదుం డను మునిముఖ్యుండ; నా సహాధ్యాయుండు ఖగముం డను మునిముఖ్యుం డగ్నిహోత్ర గృహంబున నున్న నే నపహాసార్థంబు తృణమయసర్పం బమ్మునిపై వైచిన, నతం డులికిపడి నా కలిగి. ‘నీవు నిర్వీర్యంబైన యురగంబ వగు’ మని శాపం బిచ్చిన. నేనును ‘మేలంబు సేసిన నింత యలుగ నేల? క్షమియింపు’ మనినం, బ్రసన్నుం డై ఖగముండు నావచనం బమోఘంబు గావునఁ గొండొకకాలంబు డుండుభంబ వై యుండి, భార్గవకులవర్ధనుం డైన రురుం గనిన యప్పుడు శాపవిముక్తుండ వగుదు వనె’ నని సహస్ర పాదుండు రురునకుఁ దనవృత్తాంతం బంతయుం జెప్పి వెండియు ని ట్లనియె. 156
ఉ. భూనుతకీర్తి బ్రాహ్మణుఁడు పుట్టుడుఁ దోడన పుట్టు నుత్తమ
జ్ఞానము, సర్వభూతహిత సంహిత బుద్ధియుఁ జిత్తశాంతియున్‌,
మానమద ప్రహాణము, సమత్వము, సంతతవేదవిధ్యను
ష్ఠానము, సత్యవాక్యము, దృఢవ్రతముం, గరుణాపరత్వమున్‌.
157
వ. ‘అయ్యా! నీవు బ్రాహ్మణుండవు, భృగువంశ సముత్పన్నుండవు, సర్వగుణ సంపన్నుండ; విది యేమి దొడంగి? తిట్టి దారుణ క్రియారంభంబు క్షత్త్రియులకుం గాక బ్రాహ్మణులకుం జనునే? బ్రాహ్మణు లహింసాపరు; లొరులు సేయు హింసలు వారించు పరమకారుణ్య పుణ్యమూర్తులు: జనమేజయుం డను జనపతి చేయు సర్పయాగంబునందుఁగద్రూశాపంబున నయ్యెడు సర్పకుల ప్రళయంబును, భవత్పితృశిష్యుం డయిన యాస్తీకుండను బ్రాహ్మణుండ కాఁడె యుడిగించె’ నని చెప్పి సహస్రపాదుండు రురునకు సర్పఘాతంబునం దుపశమన బుద్ధి పుట్టించె ననిన విని శౌనకాదిమహామును లక్కథకున కి ట్లనిరి. 158
ఆ. ఒరులవలనఁ బుట్టు నోటమియును నెగ్గుఁ | బొరయకుండ నరసి పుత్త్రవరులఁ
దగిలి కాచునట్టి తల్లి సర్పములకు | నేల యలిగి శాప మిచ్చె నయ్య!
159
వ. అని సౌపర్ణాఖ్యాన శ్రవణ కుతూహలపరు లై యడిగిన. 160
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )